కొలువుకు కొత్త వేదిక

* సోషల్‌ మీడియా ద్వారా 20-25 శాతం నియామకాలు

* క్యాంపస్‌ నియామకాల్లో తప్పినా అవకాశాలు

*కన్సల్టెన్సీల కంటే వీటికే సంస్థల మొగ్గు

ఈనాడు ప్రత్యేక విభాగం : బహుళ జాతి సంస్థలు నియామక ప్రక్రియలో తమ పంథా మార్చుకుంటున్నాయి. గతంలో మాదిరిగా ప్రాంగణ నియామకాల్లో అవసరానికి మించి ఎంపిక చేసి.. ప్రాజెక్టులు వచ్చే వరకూ వారిని 'బెంచీ'పై ఉంచి.. ప్రాజెక్టులొచ్చాక పని చేయించుకునే విధానానికి ఇప్పుడు స్వస్తి పలికాయి. అవసరం మేరకు పరిమిత సంఖ్యలోనే ప్రాంగణ నియామకాలు జరుపుతున్నాయి. ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలకు సామాజిక అనుసంధాన వేదికల(సోషల్‌ మీడియా)ను ఉపయోగించుకుంటున్నాయి. కన్సల్టెన్సీలు, వ్యాపార ప్రకటనల కంటే సామాజిక వెబ్‌సైట్లపైనే ఇప్పుడు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. క్యాంపస్‌ నియామకాల్లో ఎంపికకాని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ కొత్త ధోరణి మరోసారి అవకాశాలు తెచ్చిపెడుతోంది.
ఎంపికల్లో సంస్థలు చాలా స్పష్టతతో వ్యవహరిస్తున్నాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా మానవ వనరులను నియంత్రించాలన్న లక్ష్యంతో అవసరమైనప్పుడే నియామకాలు చేపడుతున్నాయి. సాధారణంగా క్యాంపస్‌ నియామకాలు అక్టోబరు- ఫిబ్రవరి మధ్య జరుగుతుంటాయి. ఆ తర్వాత మానవ వనరుల అవసరాలు ఏర్పడితే క్యాంపస్‌ వెలుపల నియామకాలు జరపాల్సిందే. ఇంతకుముందు ఈ ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలకు ఎక్కువగా కన్సల్టెన్సీలు, ప్రకటనలపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. దీనికోసం ప్రస్తుతం ఎక్కువగా సోషల్‌ మీడియాపై సంస్థలు ఆధారపడుతున్నాయి. ''మా ఎంపిక ప్రక్రియలో 50-55 శాతం కొత్తవారిని ప్రాంగణ నియామకాల్లోనే తీసుకుంటాం. 15-20 శాతం వరకూ మా ఉద్యోగులు అంతర్గతంగా పంపించే ప్రొఫైల్స్‌ ద్వారా ఎంపిక చేసుకుంటాం. మిగిలినవారిని కన్సల్టెన్సీల ద్వారా గానీ, ప్రకటనల ద్వారా గానీ ఎంపిక చేస్తుంటాం. కన్సల్టెన్సీల ద్వారా సాధారణంగా అనుభవజ్ఞులను తీసుకుంటాం. అయితే ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియా ద్వారా అనుభజ్ఞులను, కొత్తవారినీ ఎంపిక చేస్తున్నాం. దాదాపు 20-25 శాతం నియామకాలు సామాజిక వెబ్‌సైట్ల ద్వారానే జరుపుతున్నాం. కొత్తవారిని తీసుకునేటప్పుడు సాంకేతిక నైపుణ్యాలు, కళాశాలలో చేసిన ప్రాజెక్టు వివరాలు పరిగణనలోకి తీసుకుంటాం. ఇంటర్న్‌షిప్‌ వంటి వాటికి నియామకాల్లో ప్రాధాన్యముంటుంద''ని చెబుతున్నారు 'టెక్‌ మహీంద్ర' పీపుల్‌ పాలసీస్‌ అండ్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ గ్లోబల్‌ హెడ్‌ సుచరితరావు పాలెపు.
ప్రత్యామ్నాయాలు ఎక్కువే..
సోషల్‌ మీడియా ద్వారా నియామకాల్లో ప్రత్యేకత ఏముంది? ఏ కంపెనీ కెరీర్‌ పేజీకి వెళ్లినా అక్కడ ఈ ఉద్యోగావకాశాలు కన్పిస్తాయి కదా.. అనే సందేహం రావొచ్చు. కానీ వాటికీ, సోషల్‌ మీడియా నియామకాలకు మధ్య వ్యత్యాసం ఉంది. కంపెనీల కెరీర్‌ పేజీల్లో ఆ సంస్థలో ఉద్యోగావకాశాలే కనిపిస్తాయి. అదే సోషల్‌ మీడియాలో అయితే.. అన్ని కంపెనీల ఉద్యోగావకాశాలు కళ్ల ముందుంటాయి. ఉదాహరణకు ఓ ప్రొఫైల్‌కు పది కంపెనీల్లో అవకాశాలున్నాయనుకోండి. ఆ సంస్థల వివరాలన్నీ ఇక్కడ సోషల్‌ మీడియాలో కనిపిస్తాయి. నచ్చినది ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీలతోనూ పోల్చుకోవచ్చు. సంస్థలు కూడా తమ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తున్నాయి.
సంస్థలకు ప్రయోజనమెలా?
కంపెనీలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకోవడానికి ఈ వేదిక దోహదపడుతోంది. సంస్థల తీరును సోషల్‌మీడియాలో ఎంతమంది ఇష్టపడుతున్నారన్నది(లైక్స్‌ వంటివి) ప్రాతిపదికగా చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ విలువ అంత పెరిగినట్లుగా భావిస్తున్నారు. పైగా తమకు కావాల్సిన ఉద్యోగార్థులంతా పెద్ద సంఖ్యలో ఒకేచోట దొరకడం కూడా అందివచ్చిన అవకాశమే. ఉదాహరణకు హెచ్‌ఆర్‌లో ఉద్యోగులు కావాలనుకుంటే.. ఆ గ్రూపులో నమోదైన అభ్యర్థుల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. కొన్ని వేల మంది అందుబాటులో ఉంటారు. ''సాంప్రదాయ పద్ధతిలో జరిపే నియామక ప్రక్రియకు ఇది విరుద్ధం. కన్సల్టెన్సీలను సంప్రదించాల్సిన అవసరం తప్పుతుంది. పత్రికల్లో, వెబ్‌సైట్లలో, పకటనలు ఇవ్వాల్సిన పని ఉండదు. ఖర్చు, శ్రమ తగ్గుతాయి. లింక్‌డ్‌ఇన్‌లో అయితే చాలా సులభంగా మాకు కావాల్సిన అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు. అందులో రిఫరెన్స్‌ కూడా ఇస్తారు. ఆ ఆధారాలతో అభ్యర్థి పూర్వాపరాలు తెలుసుకోవచ్చు'' అని చెబుతున్నారు ఐబీఎం గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(జీడీసీ) రిక్రూట్‌మెంట్‌ లీడర్‌ కిరణ్‌ రాగిరెడ్డి.
జోరు ఇలా..
* ప్రతి ఐదు నియామకాల్లో ఒకటి సోషల్‌ మీడియా ద్వారానే జరుగుతున్నాయన్నది పరిశ్రమ నిపుణుల అంచనా.
*సోషల్‌ మీడియా ద్వారా నియామకాలు పొందుతున్నవారిలో అనుభజ్ఞులు, కొత్తవారి నిష్పత్తి 60 : 40.
* మన దేశంలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే ముందు 57 శాతం మంది యువత సోషల్‌ మీడియాను పరిశోదిస్తోంది.
* ఉద్యోగార్థుల ఎంపికలో సంస్థలు ఎక్కువగా లింక్‌డ్‌ఇన్‌(87 శాతం)పై ఆధారపడుతుండగా.. ఫేస్‌బుక్‌(55 శాతం), ట్విట్టర్‌(47 శాతం) వంటివి దాంతో పోటీపడుతున్నాయి.
* సంస్థల సంస్కృతి తెలుసుకోవడానికి 85 శాతం మంది యువత సామాజిక అనుసంధాన వేదికలపై ఆధారపడుతున్నారు.
* ఉద్యోగార్థులు తమ కలలు సంస్థ కెరీర్‌ పేజీలో తమ అర్హతల తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చడానికి వీటినే మాధ్యమంగా వాడుకుంటున్నారు.ల్ఐటీ

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning