స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న యువత

కరీంనగర్ జిల్లా, గణేశ్‌నగర్,న్యూస్‌టుడే : అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. లక్ష్యంతో కృషి చేసి ప్రాంగణ ఎంపికల్లో బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రేమ, ఆటపాటలతో సమయం వృథా చేయకుండా పట్టుదలతో చదివి చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడ్డారు ఈ యంత్ర విద్యార్థులు. డిగ్రీ పట్టాకు ముందే కొలువుల పత్రం అందుకున్న కొందరి పరిచయం, ఎంపికలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారందిస్తున్న సూచనల సమాహారమే 'న్యూస్‌టుడే' ఈ ప్రత్యేక కథనం..

సదస్సులు.. కార్యశాలలే కీలకం
- సీహెచ్.అనూష (విట్స్) ఇన్ఫోసిస్-హైదరాబాద్
కళాశాల స్థాయిలో సదస్సులు నిర్వహించడం సాధారణం. చూసి ఆనందించడంతో ఫలితం లేదు. ప్రతి కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను మెరుగు పరుచుకోవాలి. పేపర్ ప్రజంటేషన్, బృంద చర్చల్లో విరివిగా పాల్గొనడం నాకు కలిసి వచ్చింది.జేకేసి తరగతులు ఉపయోగపడ్డాయి. చదివే కళాశాలతో పాటు ఇతర కళాశాలల ఫెస్ట్‌ల్లో భాగస్వాములవ్వాలి. మనలోని లోపాలను సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. చక్కని భాష కీలకమని గుర్తించండి. అనుభవం ఉద్యోగ సాధనకు ఉపకరించింది.

ప్రేరణ.. నైపుణ్యం అవసరం
- వెంకటేశ్ (వాగేశ్వరి) సన్‌లైట్ - హైదరాబాద్
మనలో ప్రతిభ ఉన్నా తగినంత ప్రేరణ ఉంటేనే వెలుగులోకి వస్తుంది. అందుకే కళాశాలల్లో విద్యార్థులు పరస్పరం ప్రోత్సాహం అందించుకోవాలి. ఇంటర్వ్యూల్లో విజయానికి చక్కని ఇంగ్లిష్ ఉపయోగపడుతుంది. ఇది ఒక్క రోజులో రాదు. సాధన అవసరం. ప్రాంగణ నియామకాల్లో రాత పరీక్షతో పాటు వివిధ దశల్లోనూ పరీక్షిస్తారు. ఇందులో నెగ్గాలంటే వ్యక్తిత్వం, మంచి వైఖరి అవసరం. పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం. కళాశాలలో మనకు మనం పరీక్ష పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. ఒకవేళ వైఫల్యం చెందితే అది మరో అవకాశానికి నాంది అనుకోవాలి. నిరాశలో పడితే లేవలేము.

పుస్తక ప్రభావంతో విజయం
- హరిష్ (నిగమ) త్రిపుర - హైదరాబాద్
వ్యక్తిత్వ వికాసం, సమాచార నైపుణ్యం, మన వైఖరిలో మార్పులకు పుస్తకాలు ప్రభావితం చేస్తాయి. ఇందుకు ఉపయుక్తమయ్యే అనేక రచనలున్నాయి. ఇవి చదివి ప్రభావితం కావాలి. ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలతో పాటు మనకు మనం మెరుగ్గా ఉండేందుకు అవసరమైన పుస్తకాలు చదవండి. ఇంటర్వ్యూలలో మన మాట తీరును ఎక్కువగా గమనిస్తారు. అప్పటికప్పుడు మనం ఆకట్టుకునేలా మాట్లాడటం రాదని గుర్తించండి. పోటీ పడి పలు ప్రాజెక్టులను తయారు చేయడం, పేపర్ ప్రజంటేషన్‌తో మనలోని ప్రతిభకు సాన పెట్టంటి.

సమయం సద్వినియోగంతో ఫలితం
- అంజయ్య (ట్రినిటీ) విప్రో- హైదరాబాద్
ఇంజినీరింగ్ అంటే ఎంజాయ్ అనే మాటకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో చేరాకే అసలైన ఎంజాయ్ ఉంటుంది. అనవసరమైన విషయాలతో, ప్రేమ పేరిట కాలం వృథా చేయకుండా నియంత్రించుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అనుకున్నది సాధించి తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వడమే అసలైన విజయం. మొదటి సంవత్సరం నుంచి ప్రాంగణ నియామకాల వరకు ప్రతీ సంవత్సరం ఒక ప్రణాళిక ఉండాలి. ప్రధానంగా వ్యక్తిత్వ వికాసం, సబ్జెక్టుపై పట్టు సాధిస్తే విజయం వరిస్తుంది. రాత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే ఇంటర్వ్యూ ఉంటుంది.

నాయకత్వ లక్షణాలతో రాణింపు
- దివ్య (వాగేశ్వరి) సైబర్ ప్లేస్- హైదరాబాద్
ప్రాంగణ నియామకం తర్వాత ఉద్యోగం.. శిక్షణ. ఇప్పుడు హెచ్.ఆర్. మేనేజర్‌గా చేస్తున్నా. మనలో నాయకత్వ లక్షణాలను పెంచుకోవడం ప్రధానం. లేదంటే వెనకబడిపోతాం. కళాశాలల్లో నిర్వహించే విభిన్న కార్యక్రమాలను మన చేతిలోకి తీసుకుని నిర్వహిస్తే అనుభవం వస్తుంది. అలాగే ప్రతి అంశంలోనూ ప్రేరణ అవసరం. ఇందుకు యాజమాన్యం చక్కని ప్రణాళిక వేసింది. పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో పాటు ప్రపంచ పోకడను అనుసరిస్తూ మనం మారాల్సి ఉంటుంది. కనబరిచే హావభావాలు ఆకట్టుకోవాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning