అగ్రరాజ్యంలో .. యువతేజం

* సమస్యలను అధిగమించి.. అమెరికాలో సంస్థపెట్టి

* సడలని యువ సంకల్పం

'ఈనాడు' ప్రత్యేకం (నల్గొండజిల్లా) : ఉన్నత భావాలున్నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి పూటగడవలేని దుస్థితి. అంతలోనే తండ్రి నిష్క్రమణ. కుటుంబంతోపాటు ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత. ఇన్ని ప్రతికూలతలు ఆ యువకుణ్ని విజయతీరం చేరకుండా ఆపలేకపోయాయి. అగ్రరాజ్యంలోనే ఓ సంస్థను స్థాపించి దానికి సీఈవోగా వ్యహరించే స్థాయి చేర్చాయి. నేడు పశ్చిమదేశంలో వందమందికిపైగా ఉపాధి కల్పిస్తూ రూ.63 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న సంస్థకు అధిపతిగా ఉన్న చిటిప్రోలు జగన్ ప్రస్థానం ఎందరికీ ఆదర్శప్రాయం.
ఒక్కో మెట్టు ఎక్కుతూ..
నకిరేకల్‌కు సమీపంలోని వల్లాల గ్రామానికి చెందిన చిటిప్రోలు నర్సయ్య - రాములమ్మల కుమారుడు జగన్. ఒకటి నుంచి 9 వరకు వల్లాల ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాల్లో చదివారు. నకిరేకల్ ఏవీఎంలో పదో తరగతి, మల్లిఖార్జున కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు.
మొక్కవోని దీక్షతో..
చదువుల్లో జగన్ అసాధారణ ప్రతిభావంతుడైన విద్యార్థేం కాదు ! ప్రథమశ్రేణిలో ఉండేవారు. అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు పోవడమే ఆయనకు తెలుసు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగిపోయారు. ఉపాధ్యాయుడైన తండ్రి మద్యానికి బానిసగా మారడంతో ఆ కుటుంబం ఛిద్రమైంది. ఆ అవమానాలు, తండ్రి చివరి కోరిక అతనిలో పట్టుదల పెంచాయి. హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో ఎమ్మెస్సీ గణితం, కంప్యూటర్స్ చదివారు. బీఎడ్ పూర్తిచేసినా 1998లో డీఎస్సీ రాస్తే ఉపాధ్యాయునిగానే స్థిరపడాల్సి వస్తుందని డీఎస్సీకి దరఖాస్తు కూడా చేయలేదు.
ఆంగ్లంలో నైపుణ్యం పెంచుకుంటూ..
హైదరాబాద్‌లో చదువుతునే ఎంసీఏ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఆంగ్లంలో నైపుణ్యం పెంచుకున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో వెరిజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేందుకు 2000 సంవత్సరంలో అందరిలానే పయనమయ్యారు. అక్కడ పనిచేస్తున్నా .. ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే తపనే వెంటాడుతుండేది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా చేరారు. అయినా .. సొంతంగా సంస్థను స్థాపించాలన్నదే ఆయన లక్ష్యం. లక్ష్యసాధన కోసం ఏడేళ్లు శ్రమించారు. మైక్రోసాఫ్ట్‌కు సర్వీస్ ప్రొవైడర్‌గా సొంతంగా సియాటిల్‌లో 'సీ2ఎస్ టెక్నాలజీస్' సంస్థను స్థాపించి 2007లో తొలిసారి వ్యాపార లావాదేవీలు మొదలుపెట్టారు. 2009లో రూ.30కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ నేడు రూ.63 కోట్లకు చేరుకుంది. ఇపుడు జగన్ సంస్థలో 110 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కెనడా, హైదరాబాద్, బెంగళూరుల్లో ఈయన సంస్థ టెక్నాలజీ కన్సల్టెంట్‌గా సేవలందిస్తోంది.
* వాషింగ్టన్ డీసీలో 2012లో వేగంగా పురోగమిస్తున్న చిన్న సంస్థల్లో జగన్ సంస్థ మూడోస్థానంలో ఉండడం విశేషం.
అవమానాలు దిగమింగి..
- సీ2సీ టెక్నాలజీస్ సీఈవో చిటిప్రోలు జగన్
తండ్రి పరిస్థితితో మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అర్థాంతరంగా తండ్రి కన్నుమూయడంతో కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాను. తండ్రి ఎపుడూ నా గురించే ఆలోచించేవారు. ఉన్నతంగా ఎదగడం చూడాలని కలలుగనేవారు. ఎలాంటి కష్టమొచ్చినా నిజాయితీని వీడకూడదని చెబుతుండేవారు.. ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయన కోరిక నెరవేర్చాలని సాధన చేశా. 2012లో ఫోస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వారి 'రైజింగ్ స్టార్' అవార్డును కూడా అందుకున్నానన్నారు. భవిష్యత్తులో మొబైల్ రంగంలో కొత్త అప్లికేషన్లను రూపొందించేందుకు కృషి ప్రారంభించానన్నారు. కన్న వారి నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చేర దీసి వారికోసం ఏదైనా చేయాలనే ఆశయంతో ఉన్నట్లు చిట్టిప్రోలు జగన్ వివరించారు. తన భవిష్యత్ కర్తవ్యం కూడా అదేనని చెబుతున్నారు. తమకు నకిరేకల్ తిప్పర్తి రోడ్డులో ఇల్లుఉందని, తల్లి హైదరాబాద్‌లో చెల్లి వద్ద ఉందన్నారు.
* నకిరేకల్ ఏవీఎం పూర్వ విద్యార్థుల సంఘం 89 నిర్వహించే సేవా కార్యక్రమాలకు జగన్ సహాయ సహకారాలందిస్తున్నారు. ప్రతి ఏటా ప్రతిభ గల విద్యార్థులకు ఈ సంఘం ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి పాపని శ్రీనివాస్ చెప్పారు.
విజయ రహస్యం ..
మాట మీద నిలబడడం, నిజాయితీగా ఉండటం, ఎక్కడా రాజీ పడకపోవడమే తనను ఈ స్థాయికి చేర్చాయని జగన్‌వివరించారు. అందరిలా కాకుండా .. విభిన్నంగా ఆలోచించిడం అలవాటు చేసుకున్నా. అందుకే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా అమెరికా వెళ్లి అక్కడే సంస్థను స్ధాపించి నేడు సీఈవో స్థాయికి ఎదిగానని వివరించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning