కలల కొలువుకు సోపానాలెలా?

రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్‌ సీట్లున్నాయి. ఇంటర్‌ పూర్తిచేసి, ఎంసెట్‌ రాసి సులువుగా ఈ వృత్తివిద్యలో ప్రవేశిస్తున్నారు. కానీ కోర్సు పూర్తిచేసేసరికి నైపుణ్యాల సాధన విషయంలో నిరాశ ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీటెక్‌/బీఈ విద్యార్థులు తమ కెరియర్‌ను తీర్చిదిద్దుకోవటానికి ఏమేం చేయాలో గ్రహించటం అత్యవసరం!
నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో చాలామందికి ఏ టెక్నాలజీ నేర్చుకోవాలో, ఏ ప్రాజెక్టు ఎంచుకోవాలో స్పష్టత ఉండదు. కోర్సు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేటపుడు ఏ సంస్థ ఏం అడుగుతుందో గ్రహించరు. రెజ్యూమె తయారుచేసుకోవటంపై కూడా చాలామందిలో తగిన అవగాహన కనపడదు. ఎవరో ఏదో చెప్పారని కోర్సులో శిక్షణ పొందడం, టెక్నాలజీ నేర్చుకోవడం చాలామంది చేస్తుంటారు. అదెక్కడ ఉపయోగపడుతుందో మాత్రం అందరూ చెప్పలేరు. ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు.
ఈ లోపాలు తొలగించుకోవాలంటే ఏ సంవత్సరం ఏది చదవాలో, దేనికి ఎంత ప్రాధాన్యం ఉందో గ్రహించాలి. నాలుగు సంవత్సరాల కోర్సు వ్యవధినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి.
ఇంజినీరింగ్‌ రోడ్‌మ్యాప్‌
తెలివితేటలు, ర్యాంకు, కుటుంబ ఆర్థిక స్థోమతలను బట్టి విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతుంటారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరితే చాలు; ఉద్యోగం దొరికినట్లే అన్న అపోహతో ఉంటారు. ఏ కళాశాలలో సీటు వచ్చింది, ఏ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేస్తున్నారన్నది ఒక స్థాయివరకే ఉపయోగకరం. మెరుగైన పద్ధతిలో చదవటం ఏ కళాశాలలో వారికైనా తప్పనిసరి అనేది మర్చిపోకూడదు.
అగ్రశ్రేణి కళాశాలల్లో చేరే అవకాశం రానివారు అంతగా నిరాశపడనక్కర్లేదు. ఎందుకంటే ఇటీవలికాలంలో ఏ కళాశాల/ ఏ విశ్వవిద్యాలయంలో చదివినా సరే, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు/ ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల ద్వారా కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి.
కోర్సు పూర్తవుతూనే మంచి కొలువు రావాలని ఆశించటంమంచిదే. దానికోసం ఉద్యోగానికి కావాల్సిన లక్షణాలు తమలో పెంపొందించుకుంటున్నానా అని విద్యార్థులు పరిశీలించుకోవాలి. దానికోసం కృషి చేయాలి. ఉద్యోగావకాశం కల్పించటం తాను చేరిన కళాశాల బాధ్యత అనే అపోహతో పూర్తిగా విద్యాసంస్థ ప్రతిష్ఠ మీదే ఆధారపడటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
ఉద్యోగాలు, అవకాశాలు లేకపోలేదు. కానీ విద్యార్థుల్లో ఉద్యోగార్హత నైపుణ్యాలు (ఎంప్లాయబిలిటీ) ఎంతవరకూ ఉన్నాయనేదే ముఖ్యమని కంపెనీలు చెపుతుంటాయి. వివిధ సంస్థలు ప్రతిభావంతుల కోసం, నైపుణ్యాలున్న విద్యార్థుల కోసం అన్వేషిస్తుంటాయి. ప్రాంగణ, ప్రాంగణేతర నియామక పద్ధతులు అనుసరిస్తుంటాయి.
ఏ సంవత్సరం ఎలా?
మొదటి సంవత్సరం: పరీక్ష విధానాలు, సీనియర్లతో కలిసిపోవడం, కళాశాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెడతారు. ఏ క్లబ్బులో చేరాలి, ఏ విద్యేతర కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఆలోచనలు చాలామందిని వెంటాడుతుంటాయి. ఈ సంవత్సరంలో సమయం బాగా దొరుకుతుంది.
రెండో సంవత్సరం: ఈ ఏడాది లక్ష్యానికి కావాల్సినవాటిని సాధించటంపై కొంత కృషి మొదలవుతుంది. ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోవటం, కెరియర్‌ పరిజ్ఞానం ఈ రెండో సంవత్సరం నుంచే గ్రహించటం ప్రారంభించాలి.
ఈ అవగాహన పెంపొందించుకోవటానికి వివిధ మార్గాలున్నాయి. చాలా కంపెనీలు వివిధ టెక్నికల్‌ పోటీలను ఏడాది పర్యంతం పెడుతుంటాయి. తమ వెబ్‌సైట్లలో కోడింగ్‌, టెస్టింగ్‌, గేమింగ్‌ వంటి పోటీలు నిర్వహిస్తుంటాయి. కొన్ని సంస్థలు సమస్యాపరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం వాస్తవిక ప్రాక్టికల్‌ సమస్యలను ఇచ్చి వాటి పరిష్కారాలను అడుగుతాయి. ఇలాంటివాటిలో పాల్గొనడం వల్ల పరిశ్రమ ఎలాంటిది, ఎలాంటి నైపుణ్యాలను సంస్థలు విద్యార్థుల్లో చూస్తుంటాయి- అనేవాటిపై స్పష్టత వస్తుంది.
ఈ రెండో సంవత్సరం సీనియర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరైన మెంటార్‌, కౌన్సెలింగ్‌ అవసరం. కొన్ని కళాశాలల్లో సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకత్వం చేస్తారు. ఒక్కోసారి సరైన మెంటార్‌ కళాశాలలో దొరకడం కష్టం అయినట్లయితే సరైన కౌన్సెలింగ్‌ తీసుకోవడం చాలా ముఖ్యం.
సాంకేతిక వర్క్‌షాపులను అనుభవజ్ఞులతో కళాశాలల్లో నిర్వహిస్తుంటారు. వేరొక కళాశాలలో ఇటువంటివి పెట్టినా పాల్గొనాలి. దీనివల్ల సాంకేతిక సామర్థ్యాలు/ నైపుణ్యాల మీద అవగాహన పెరుగుతుంది.
ఇలాంటివాటిపై దృష్టి కేంద్రీకరించి ఆచరించటం వల్ల అవగాహన పెరిగి విద్యార్థులకు ఒక రకమైన రోడ్‌మ్యాప్‌ ఏర్పడుతుంది. విద్యార్థి తనకు ఆసక్తి దేనిమీద ఉందో స్పష్టం కావటానికి కూడా ఇది దోహదపడుతుంది.
చాలామంది ఇంటర్వ్యూల్లో 'నీకు ఆసక్తి ఉన్న విభాగమేంటి?' అంటే చప్పున చెప్పలేకపోతారు. కొంతమంది తమ ఆసక్తి గురించి చెప్పినా అది నామమాత్రంగానే ఉంటుంది. దానిలో తగిన లక్ష్యం, చిత్తశుద్ధి కనపడవు. ఇలా జరగకుండా ఉండాలంటే రెండో సంవత్సరంలో చేయాల్సినవి శ్రద్ధగా పాటించాలి.
మూడో సంవత్సరం: ఈ సంవత్సరంలో విద్యార్థులు ఎలెక్టివ్స్‌ అనీ, స్పెషలైజేషన్‌ అనీ కొంత గ్రేడ్‌ మార్కులు సంపాదించే ధ్యాసలో ఉంటారు. ప్రాజెక్టువర్కును కూడా ఎక్కువ పట్టించుకుంటారు.
1. ప్రాజెక్టువర్క్‌: ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రశ్నలు ప్రాజెక్టువర్క్‌ మీదే ఉంటాయి. ఎలాంటి ప్రాజెక్టు చేయాలి, ఎలా చేయాలి అనేదానిపై అవగాహన ఉండాలి. ఆసక్తి ఉన్న అంశంపై రెండో సంవత్సరంలో అవగాహన వస్తే- దాన్నింకా పెంపొందించుకుని దానిపై ప్రాజెక్టు వర్క్‌ చేస్తే చాలా ఉపయోగం.
చాలామంది ప్రాజెక్టు చేయకుండా ప్రాజెక్టు కొనుక్కోవడం లాంటివి చేస్తుంటారు. అలాంటివి తమను తాము మోసం చేసుకున్నట్లే.
2. రెజ్యూమె తయారీ: చాలామంది రెజ్యూమే (బయోడేటా) తయారు చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ తయారుచేసినా ఇంకొకరిది అనుకరించటమో, సగం కూడా నింపకుండా ఉండటమో చేస్తారు. రెండో సంవత్సరం నుంచి చేసిన సాధన (ఆసక్తికర విభాగాన్ని ఎంచుకోవడం, సాంకేతిక వర్క్‌షాపులకు హాజరవడం) వల్ల ఏర్పడిన పరిజ్ఞానంతో అవగాహన వచ్చి ప్రాజెక్టు పూర్తయిన తరువాత నాణ్యమైన రెజ్యూమె స్వయంగా తయారుచేసుకోవచ్చు.
3. కంపెనీలపై అవగాహన: ఎలాంటి సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయి? ఎలాంటి వాటికి దరఖాస్తు చేయాలి? ఆయా సంస్థలు ప్రాంగణ నియామకాలకు రాకపోతే ఆఫ్‌ క్యాంపస్‌కు ఎలా దరఖాస్తు చేయాలి- వీటిని తెలుసుకుంటూ ఉండాలి. వివిధ కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు, పూల్డ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహిస్తారో అవగాహనతో ఉండాలి.
మూడో సంవత్సరం చివరలో చేసే ప్రాజెక్టు చాలా ముఖ్యం. కొన్ని కంపెనీలు ఈ రెండు నెలలు చేసే ప్రాజెక్టు మీద చూపే సామర్థ్యం బట్టి 'ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌' కూడా ఇస్తున్నాయి. అంటే ప్రాంగణ నియామకాలు మొదలవ్వకుండానే ఉద్యోగం సాధించవచ్చన్నమాట. కానీ మంచి కంపెనీ, మంచి ప్రాజెక్టు, చక్కని సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం.
4. ప్రాంగణ నియామకాలకు తయారీ: వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు సంస్థ సంస్థకూ మారుతుంటాయి. ఆయా కంపెనీలు నిర్వహించే రాత, సాంకేతిక పరీక్షలు, ఇంటర్వ్యూలు వేర్వేరుగా ఉంటాయి. ఏ కంపెనీకి దరఖాస్తు చేస్తుంటే ఆ పరీక్ష, ఇంటర్వ్యూ విధానాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
5. నైపుణ్యం ఉన్న అంశం/ విభాగం: 'ఏరియా ఆఫ్‌ ఇంటరెస్ట్‌' అంటే ఒక సబ్జెక్టులో/ టెక్నాలజీలో బాగా ఆసక్తి ప్రదర్శించటం. అదే ఒక సబ్జెక్టులో బాగా ప్రావీణ్యం పొందాలంటే ఒక ప్రాజెక్టు ద్వారానో, ఇంటర్న్‌షిప్‌ ద్వారానో సాధ్యమవుతుంది. దీన్ని 'ఏరియా ఆఫ్‌ ఎక్స్‌పర్టయిజ్‌' అంటారు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం పూర్తయ్యేనాటికి దీన్ని తప్పకుండా సాధించాలి.
'ఆసక్తి'ని కనుగొనడం ఎలా?
ఏ ఇంజినీరింగ్‌ విద్యార్థికి అయినా కచ్చితంగా ఏదో ఒక ఆసక్తికర అంశం/విభాగం (ఏరియా ఆఫ్‌ ఇంటరెస్ట్‌) ఉండితీరాలి. ఇది సబ్జెక్టు మీద కావొచ్చు. ఒక టాపిక్‌ మీదా, టెక్నాలజీ మీదా కూడా కావొచ్చు. ఈ ఆసక్తిదాయకమైన అంశాన్ని గ్రహించటం తప్పనిసరి.
రెండో సంవత్సరంలోనే దీన్ని గ్రహించటమంటే చాలామందికి జీర్ణం కాదు. వివిధ సాంకేతిక వర్క్‌షాపులకు హాజరవడం, పేపర్‌ ప్రజంటేషన్ల మీద ఆసక్తి చూపడం, ఏఏ సంస్థలు వేసవి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇస్తాయో కనుగొనడం అవసరం. కొన్ని సంస్థలు రెండో సంవత్సరం చివర్లో వేసవి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇస్తాయి. వాటిని వెతికి సద్వినియోగం చేసుకోవాలి.
ఇవి గమనించాలి
ప్రాంగణ నియామకాలకు సన్నద్ధమయ్యే ముందు కింది అంశాలను సరిచూసుకోవాలి
* నా లక్ష్యం, గమ్యాలేమిటి?
* నాకు ఆసక్తి కలిగించే ఇంజినీరింగ్‌ అంశం ఏది? దేనిలో నాకు నైపుణ్యం ఉంది?
* ఎన్ని సాంకేతిక వర్క్‌షాపుల్లో పాల్గొన్నాను? ఏమేం సర్టిఫికెట్లు వచ్చాయి?
* రియల్‌ టైం ప్రాజెక్టు చేశానా? ప్రాజెక్టు వివరించగలనా?
* రెజ్యూమెలో ఈ విషయాలన్నీ ప్రస్తావించానా?
సంస్థల్లో టెక్నికల్‌ రిక్రూటర్లు కేవలం అభ్యర్థుల నైపుణ్యాలతో సంతృప్తి చెందటం లేదు. పరిశ్రమపై, నైపుణ్యం ఉన్న అంశం/విభాగంపై, డొమైన్‌ నాలెడ్జ్‌పై అత్యధిక ఆసక్తి, తపన ఉన్నాయా లేదా అన్నది చూస్తున్నారు.
పైన చెప్పిన రీతిలో సన్నద్ధమైతే ఎలాంటి సంస్థలో అయినా ఉద్యోగం సాధించవచ్చు. సంస్థలు క్యాంపస్‌కు వస్తున్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు. ఎన్నో కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ల ద్వారా పరీక్షలు/ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభావంతుల కోసం ఏడాది పొడవునా వెతుకుతున్నాయి. కొన్ని సంస్థలయితే తాము నిర్వహించే పోటీల్లో నేరుగా పరీక్ష కూడా లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి.
కళాశాలలు ఏం చేస్తే మేలు?
సాధారణంగా ఇంజినీరింగ్‌ కళాశాల్లోని ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఎంతమందికి ప్లేస్‌మెంట్‌ వచ్చింది, ఇంకెంతమందికి రావాలి? అని ఆలోచిస్తుంటుంది. దానిలో పదోవంతు కూడా శిక్షణ- కౌన్సెలింగ్‌ మీద ధ్యాస ఉంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో సీఆర్‌టీ (క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రెయినింగ్‌) ప్రోగ్రాం బాగా వాడుకలో ఉంది. దీనిలో దాదాపు అందరూ సాఫ్ట్‌స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌ టెస్టులకు మాత్రమే పరిమితమవుతున్నారు. కానీ ఈ సీఆర్‌టీలో ఏయే కంపెనీలు ఎటువంటి వారిని తీసుకుంటాయో విద్యార్థులకు తెలియజేయడంలేదు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం లేదు.
సీఆర్‌టీల పేరుతో కాలాన్ని వృథా చేయకుండా ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం పూర్తయ్యేవరకు కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలపై దశలవారీగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థులు తాము ఆశించే కలల ఉద్యోగాలను పొందగలుగుతారు!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning