కొంచెం కొత్తగా చేస్తే అద్భుతమే

హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా స్టార్టప్‌ల (చిరు కంపెనీ) పోకడ బాగా పెరిగింది. పట్టా పుచ్చుకోగానే సొంతంగా కంపెనీలను ప్రారంభించాలనే ఆలోచనలో కుర్రకారు వడివడిగా అడుగులు వేస్తున్నారు. కొన్ని సంస్థలు వారాంతాల్లో నిర్వహిస్తున్న స్టార్టప్ సమావేశాలకు హాజరవుతూ ఆలోచనలకు పదును పెట్టుకుంటున్నారు. కళాశాల యాజమాన్యాలూ ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి గత మూడేళ్లలో 1500 వరకు కొత్త కంపెనీలు ఆరంభం కావడమే ఇందుకు నిదర్శనం. ఆదిలోనే అద్భుతాలు ఆశించడం అత్యాశే అయినా... ఇతరులతో పోల్చిచూసినప్పుడు ఒకటి రెండు మినహా మిగిలినవి అంతగా పుంజుకోలేకపోతున్నాయి. అదే సమయంలో విదేశాల్లో ఈ తరహా కంపెనీలు లక్షల కోట్లకు పరుగులు తీస్తున్నాయి.కొత్తగా ఆలోచిస్తే మన కంపెనీలూ అందలం ఎక్కేందుకు ఎంతోదూరం లేదంటున్నారు నిపుణులు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన వాట్స్‌యాప్‌ను లక్ష కోట్లకు పైగా చెల్లించి ఫేస్‌బుక్ సొంతం చేసుకోబోతుందనే సమాచారం ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల రాకతో ఇటీవల బాగా వాడుకలోకి వచ్చిందే వాట్స్‌యాప్. ఉచితంగానే సందేశాలు, ఫొటోలు పంపించుకునే అవకాశం ఉండటంతో కోట్ల మందికి చేరువైంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఫేస్‌బుక్‌దీ ఇలాంటి నేపథ్యమే. పల్లె పట్నం తేడా లేకుండా తనచుట్టూ తిప్పుకుంటోంది. ఈ సంస్థలు లక్షల కోట్లకు ఎదగడానికి కారణం కొత్తగా, భిన్నంగా ఆలోచించడమే. అమెరికా వంటి దేశాల్లో ప్రారంభించిన స్టార్టప్‌ల్లో అనతికాలంలోనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న వాటి శాతం .. మనలాంటి నగరాలతో పోలిస్తే అధికంగా ఉంది.
సారథి మనమే కానీ...
గ్లోబల్-500 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వాళ్లలో మనవాళ్లు ఇతరులకు తీసిపోని విధంగా సత్తా చాటుతున్నారు. ఐటీ దిగ్గజం మెక్రోసాఫ్ట్‌కు హైదరాబాదీ సత్య నాదెళ్ల సీఈవోగా ఎంపికవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరెన్నో బహుళజాతి కంపెనీలను మనవాళ్లే విజయవంతంగా నడుపుతున్నారు. కానీ కొత్తగా ఒక కంపెనీ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో మాత్రం ఇప్పటికీ వెనకంజే. ఉత్పాదక రంగంలో ఎన్నో విదేశీ కంపెనీలను మనం టెకోవర్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి పలురకాల ఉత్పత్తులను వందల దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కాకుంటే ఇప్పుడంతా సేవల రంగానిదే హవా. కొత్త ఆలోచనకే అందలం. ఇక్కడే విదేశీ స్టార్టప్‌లు క్లిక్ అయినంతగా మనవారు కాకపోవడానికి పలు కారణాలను చెబుతున్నారు నిపుణులు. వాటిని సరిదిద్దుకోగల్గితే చిన్నగదిలో పుట్టిన కంపెనీ సైతం ప్రజల అవసరాలు తీరుస్తూ.. కోట్లు రాల్చగలదంటున్నారు.
విజయాలూ ఉన్నాయి...
ఆపజయాలే కాదు మన స్టార్టప్‌లలోనూ విజయాలు ఉన్నాయి. రెడ్‌బస్.ఇన్ ఈకోవకే చెందుతుంది. విమాన, రైల్వే మాదిరి బస్సుల్లో ముందస్తు బుకింగ్‌కు అవకాశం కల్పిస్తూ ప్రారంభించిన ఈ చిన్న సంస్థ అనంతరం రూ.500 కోట్ల విలువ పలికింది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటంతో స్వల్పకాలంలోనే మార్కెట్ లీడర్‌గా నిలబడింది. టికెట్ బుకింగ్ రంగంలో ఉన్న ఒక విదేశీ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. మొబైల్‌లో సందేశాలు పంపుకునేందుకు కాల్ ఛార్జీలు అధికంగా ఉన్న సమయంలో ఉచితంగా పంపుకునే సాంకేతికతను అభివృద్ధి చేసింది వే టూ ఎస్ఎంఎస్. ఇదీ ఈ గడ్డపై పురుడుపోసుకున్న ఆలోచనే. ఉచితంగా సేవలు అందిచటంతో బాగా క్లిక్ అయ్యింది. ఈ తరహాలోనే మేరా ఈవెంట్స్ వంటి మరికొన్ని స్టార్టప్‌లు కొత్త ఆలోచనలతో విజయాల బాట పట్టాయి.
ఇవి లోపాలు..
మొదటి నుంచీ డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగమే లక్ష్యంగా ఎదురుచూడటం స్టార్టప్‌లోనూ కొత్తది కాకుండా కాపీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం విదేశాల్లో ఇదివరకే ఉన్న వాటిని ఇక్కడ ఆచరణలో పెట్టడం ్ద గతంలో ఉన్న వాటికే కొంత అప్‌డేషన్ జోడించటం ఒక పక్క ఉద్యోగం..మరోవైపు వ్యాపార ప్రయత్నం చేయడం ఆలోచన బాగున్నా.. ప్రయత్నంలో అంకితభావం లేకపోవడం ఆరంభించిన వెంటనే విజయం దక్కాలని ఆరాట పడటం
ఇలా చేస్తే..
సరికొత్త, విశ్వజనీన ఆలోచనలతో కంపెనీలని ప్రారంభించాలి ్ద ఆధునిక జీవనశైలిలో జీవితం మరింత సరళతరం కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటికి పరిష్కారాలు లభించే ఆలోచనలు అవసరం.
ప్రయత్నిద్దాం...
ఉద్యోగం తప్పనిసరైన వారు కొలువులో చేరినా.. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్న వారు చదువు పూర్తి కాగానే చిన్న కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించడం కొత్త ఆలోచనలు ఉంటే అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ఉన్నారు.
మార్పు రావాలి...
- రమేశ్ లోగనాథన్, ఉపాధ్యక్షుడు, ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్
చదువు కాగానే ఉద్యోగం అనే ఆలోచన క్రమంగా దూరం అవడం స్టార్టప్‌లు పెరగడానికి దారి తీసింది. దేశంలోని పలు నగరాల్లో వారాంతాల్లో స్టార్ట్‌ప్ టాక్స్, పోటీలు జరుగుతున్నాయి. యువతరం బాగా ఆసక్తి చూపిస్తోంది. ఉద్యోగాలు వదులుకుని వారి పొదుపు సొమ్ముతో కొత్త కంపెనీలను ప్రారంభించిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. కొన్నాళ్లకు మూసేయడమో.. ఇతరులకు ఇచ్చేయడమో చేస్తున్నారు. మళ్లీ కొత్త ఆలోచనతో వచ్చేవారు కొందరైతే.. తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న వారు మరికొందరు. ఇందులో మార్పు రావాలి. మన చుట్టూ ఎన్నో సమస్యలు పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిపై దృష్టిపెట్టగల్గితే విజయం అసాధ్యమేమి కాదు.
అంకితభావం ఉండాలి....
- దీపాంకర్ బిశ్వాస్, కార్పొరేట్ ట్రైనర్
సొంతంగా కంపెనీని ప్రారంభించాలి.. వ్యాపారంలో ఎదగాలని చాలామందికి ఉంటుంది. అంకితభావం లేకపోవడం పరాజయాలకు ప్రధాన కారణం. కొత్త ఆలోచన కాకుండా ఇదివరకే విజయం సాధించిన ఆలోచనను కాపీ కొట్టడం ఎక్కువగా కన్పిస్తోంది. ఇందులో శ్రమ తక్కువ. నిరూపితమైన ఆలోచన కాబట్టి నష్టభయం ఉండదు. ఇక్కడ విజయమూ పరిమిత స్థాయిలో ఉంటుంది. అదే కొత్త ఆలోచన అయితే విజయమూ అనూహ్యంగా ఉంటుంది. కొత్త బాటలో వెళ్లేటప్పుడు తొలుత అందరూ నిరాశపరుస్తారు. ప్రోత్సాహం ఉండదు. పట్టించుకోకుండా ఓపికతో పనిచేసుకుంటూ పోవాలి. ఇక్కడ సమయపాలన అనేది కీలకం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిబద్ధతను కోల్పోవద్దు. సానుకూల దృక్పథం ఉండాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning