వింతర్జాలం!

* అవుటర్‌నెట్‌ పేరిట కొత్త నెట్‌వర్క్‌కి శ్రీకారం

* ఇది అమలైతే అందరికీ ఉచితంగా నెట్‌

ఇప్పుడు ఇంటర్నెట్‌ ఉంటే చాలు.. ఫోన్‌.. మెసేజింగ్‌.. వాయిస్‌ చాట్‌.. వీడియో చాట్‌.. ఇలా వందల సంఖ్యలో సేవలు ఉచితంగా పొందవచ్చు. కావాల్సినంత సమాచారాన్ని పొందవచ్చు. కాని ఆ ఇంటర్నెట్టే ప్రస్తుతం సమస్య. ఖరీదైన వ్యవహారం కావడం.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు సరిగ్గా లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది దీనికి దూరంగా ఉంటున్నారు. మరి ఆ ఇంటర్నెట్టే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఉచితంగా లభిస్తే.. అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికీ అందుబాటులోకి వస్తే! ఇది సాధ్యమా అని ఆలోచించ వద్దు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యం చేసి చూపిస్తానంటోంది ఎండీఐఎఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థ. ఏమిటీ సంస్థ.. ఏమిటీ ప్రాజెక్ట్‌.. తెలుసుకోండి మరి.

అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ మీడియా డెవెలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఎండీఐఎఫ్‌). ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్‌కి అవుటర్‌ నెట్‌. అవుటర్‌ నెట్‌ అంటే.. వెలుపలి నుంచి సమాచారం పొందడం. అంటే ఉపగ్రహాల నుంచి డాటా నేరుగా మొబైల్‌, లేదా కంప్యూటరు, ఇతర పరికరాలకు చేరుతుంది. ఇందుకోసం చిన్న తరహా ఉపగ్రహాలను కొన్ని వందల సంఖ్యలో ప్రయోగించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేస్తారు. ఈ నెట్‌వర్క్‌ నుంచి మనకు అంతర్జాలం వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఎఫ్‌ఎం వస్తున్నట్లు ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్‌ వస్తుంది. ఏదో ఒక ప్రాంతానికి కాకుండా భూమిపై ఉన్న అందరికీ ఈ సేవలు లభిస్తాయి. వీటిని ఎవరూ అడ్డుకోలేరు కూడా.

ఆంక్షల రహితం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలం ఉన్నా.. అది ఆయా దేశాల నిబంధనలకు లోబడి ఉంటుంది. అందువల్ల అన్నివేళలా ప్రంపచ వ్యాప్తంగా ఒకే తరహా సమాచారం లభ్యం కాదు. అయితే అవుర్‌నెట్‌ మాత్రం అలా కాదు. అందరికీ ఒకే విధమైన సమాచారం అందిస్తుంది. దీన్ని ఎవరూ సెన్సర్‌ చేయలేరు. పైగా సమాచారం కూడా కాస్త భద్రంగా ఉంటుందని ఎండీఐఎఫ్‌ అంటోంది.

భారీ మార్పులు..!

ఎండీఐఎఫ్‌ చెబుతున్నట్లు ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే మానవుల జీవనశైలిలో భారీ మార్పులు చోటు చేసుకొంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వసతుల లేమి, కాస్త ఖరీదైన వ్యవహారం కావడంతో 40 శాతం మంది ప్రజలకు అంతర్జాలం అందుబాటులో లేదు. వారికీ నెట్‌ సేవలు లభించడంతో పాటు.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (నెట్‌ ద్వారా గృహోపకరణాలు.. ఇతర పరికరాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మొబైల్‌ లేదా కంప్యూటరు ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించడం.) మరింత వూపందుకుంటుంది. ఆన్‌లైన్‌లో విద్య, వైద్యం, ఇతర కీలక సేవలు మెరుగవుతాయి.

మొదలైన ప్రాజెక్ట్‌

ఎండీఐఎఫ్‌ అవుటర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను గతేడాది డిసెంబరులో ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2015 జూన్‌కి ప్రాజెక్ట్‌ పూర్తికావొచ్చని ఈ సంస్థ చెబుతోంది. వచ్చే ఏడాది జనవరిలో కొన్ని క్యూబ్‌ శాటిలైట్లను ప్రయోగించి వాటిని పరీక్షించనుంది. ఈ పరీక్ష విజయవంతమైతే.. ఏప్రిల్‌ నుంచి వందల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. క్యూబ్‌ శాటిలైట్లను పంపాలంటే లక్ష నుంచి 30 లక్షల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

- ఈనాడు ప్రత్యేక విభాగం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning