ఉద్యోగాభ్యాసం

* ఎంపికైన విద్యార్థులకు కళాశాల దశలోనే కొలువు శిక్షణ

* ఇతర ఉద్యోగులతో పాటు పనిచేసే అవకాశం

* సమయం, ఖర్చు తగ్గించుకునేందుకు సంస్థల కొత్త పంథా

* సహకరిస్తున్న కాలేజీలు.. లబ్దిపొందుతున్న విద్యార్థులు

రవితేజ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విద్యార్థి. ఇంజినీరింగ్‌ ఆఖరి ఏడాది మొదటి సెమిస్టర్‌లో ఉండగానే ప్రాంగణ నియామకాల్లో ఓ బహుళ జాతి సంస్థ అతణ్ని ఎంపిక చేసుకుంది. తుది పరీక్షలయ్యాక సంస్థలో చేరడానికి మానసికంగా సిద్ధమైన అతనికి ముందుగానే ఉద్యోగంలో చేరమని పిలొపొచ్చింది. సాధారణంగా ఇంజినీరింగ్‌ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సంస్థ.. ఆ విధానాన్ని పక్కకుబెట్టి ముందస్తు పని అనుభవాన్ని నేర్పించేందుకు చొరవ చూపింది. రవితేజ వెంటనే చేరిపోయాడు. సీనియర్లతో పాటూ పనిలో భాగం పంచుకుంటున్నాడు. శిక్షణ పొందుతూనే పని నేర్చుకుంటున్నాడు. చదువు పూర్తి కాకుండానే కొలువు చేస్తూ నెలకు రూ.12 వేలు వేతనం సంపాదిస్తున్నాడు. కళాశాల విద్య పూర్తికాగానే శిక్షణ అవసరం లేకుండా ఆయన నేరుగా ఉద్యోగంలో చేరిపోవచ్చు. 'ఆర్నెళ్ల ముందుగానే పరిశ్రమకు ఉపయోగపడేలా తయారవడం.. సంస్థలో ప్రధాన బృందంతో పాటూ పని చేసే అవకాశం దొరకడం వల్ల సంస్థ సంస్కృతి, విధివిధానాలపై అవగాహన వస్తుంది' అంటున్నారు రవితేజ.
నియామకాల్లో కొన్ని బహుళ జాతి సంస్థలు అనుసరిస్తున్న నయా ధోరణి ఇది. ఎంపిక చేసుకున్న విద్యార్థిని కళాశాల దశలోనే తమ అవసరాలకు తగ్గట్లుగా మలచుకుంటున్నాయి. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్ల పాటు శిక్షణ ఇవ్వడానికి బదులుగా చదువుతో పాటే పని అనుభవాన్నీ నేర్పించేస్తున్నాయి. తమ ఆవరణలోనే ఇతర ఉద్యోగులతో పాటు కలిసి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక సిలబస్‌ అందజేసి నిర్ణీత కాల వ్యవధిలో ఆ అసైన్‌మెంట్లు పూర్తిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఈ విషయంలో విద్యార్థులకు కళాశాలలూ సహకరిస్తున్నాయి. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నాయి.
ఏమిటీ ఆన్‌లైన్‌ శిక్షణ..?: ఎంపికైన విద్యార్థులకు శిక్షణకు సంబంధించిన వివరాలను సంస్థలు ఈమెయిల్‌లో పంపిస్తుంటాయి. ఉదాహరణకు జావా ప్రోగ్రామింగ్‌లో పని చేయాల్సి ఉన్నప్పుడు.. సంబంధిత సిలబస్‌ పంపించి ఏయే అంశాల్లో తర్ఫీదు పొందాలో నిర్దేశిస్తాయి. ఆన్‌లైన్‌లోనే విద్యార్థి ఆ పనిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దాదాపు పెద్ద కంపెనీలన్నీ ఈ విధానాన్ని 'కస్టమైజ్డ్‌్‌ వర్క్‌ ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌' అంటారు. 'ఇటీవల కాలంలో ఎంపికైన విద్యార్థులకు ముందస్తుగా శిక్షణ ఇచ్చే ధోరణి పెరుగుతోంది. వారి అవసరాలకు తగ్గట్లుగా ముందుగా కళాశాల అధ్యాపకులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులను ఏయే అంశాల్లో తీర్చిదిద్దాలో చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్లు పూర్తి చేసేందుకు విద్యార్థికి అవసరమైన ఇంటర్నెట్‌, ఇతర మౌలిక వసతులు, నిపుణుల సహకారాన్ని మేమే అందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయడం లేద'ని చెబుతున్నారు శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఇండస్ట్రీ రిలేషన్స్‌ డైరెక్టర్‌ సతీష్‌చంద్ర పరుచూరి.
ముందస్తు అనుభవం: సాధారణంగా విద్యార్ధులు నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లో ఉన్నప్పుడు అక్టోబరు-జనవరి మధ్య కాలంలో ప్రాంగణ నియామకాలు జరుగుతుంటాయి. అప్పుడు ఎంపికైన విద్యార్థికి ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవడం పాత పద్ధతి. ఉదాహరణకు అక్టోబరులో ఎంపికైన విద్యార్థికి మళ్లీ అక్టోబరు-డిసెంబరులోగానీ ఉద్యోగంలో చేరే అవకాశం రాదు. నైపుణ్యాన్ని బట్టి మూడు నెలల నుంచి ఆర్నెళ్ల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అయితే ఇప్పుడు కొన్ని సంస్థలు ఆ కాల పరిమితిని తగ్గించే క్రమంలో ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వెంటనే పని అనుభవాన్ని నేర్పించేందుకు ఇలా సిద్ధపడుతున్నాయి. 'నేను యాడ్‌ట్రాన్‌లో చేరా. ప్రాజెక్టులో సీనియర్లతో పాటూ కలిసి పనిచేస్తున్నా. ప్రత్యేకంగా క్యాబిన్‌, సిస్టమ్‌ ఇచ్చారు. 9 గంటలు పనిచేస్తున్నా. కాలేజీలో పరీక్షలు, సెమినార్లు జరుగుతున్నప్పుడు ఇక్కడ అనుమతి తీసుకొని వెళ్తున్నా. కాలేజీ యాజమాన్యం కూడా సహకరిస్తోంది' అని చెబుతోంది కేశవ్‌ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(కేఎంఐటీ)లో కంప్యూటర్‌ సైన్సు చదువుతున్న కావ్య.
ఉభయతారకంగా..: ఈ విధానంలో ఇటు సంస్థకు, అటు విద్యార్థికీ ఇద్దరికీ లాభమే. 'ఈ ముందస్తు శిక్షణ వల్ల దాదాపు 60-70 శాతం మేరకు ఖర్చు, సమయం ఆదా అవుతాయి' అని చెబుతున్నారు 'మహీంద్ర సత్యం' మానవ వనరుల విభాగం ప్రతినిధి సత్య.
సంస్థకు..: కళాశాల దశలోనే విద్యార్థికి శిక్షణ ఇవ్వడం వల్ల మళ్లీ ప్రత్యేకంగా ఇప్పించాల్సిన అవసరం ఉండదు.
* ఆర్నెళ్ల ముందుగానే అభ్యర్థి ఉద్యోగావసరాలకు సరిపడేలా తయారవుతారు.
* డబ్బూ, సమయమూ రెండూ ఆదా అవుతాయి.
* ఎంపిక చేసుకున్న విద్యార్థి సామర్థ్యాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.
విద్యార్థికి..
* ప్రాజెక్ట్‌ వర్క్‌ను చదువుతోపాటే ముగించొచ్చు.
* కళాశాల నుంచి బయటకు రాగానే నేరుగా విధుల్లో చేరిపోవచ్చు.
* బెంచీపై వేచిఉండాల్సిన అవసరం ఉండదు.
* సంస్థ సంస్కృతి, విధివిధానాలపై అవగాహన వస్తుంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning