ఆన్‌లైన్‌లో జోరు.. అంగట్లో బేజారు

* చిన్నచిన్న పనులూ చక్కబెట్టుకోలేకపోతున్న యువత

* బ్యాంకుకి వెళ్లినా.. బజారుకెళ్లినా కంగారే

* ఉద్యోగ నియామకాల్లో సోషల్ స్కిల్స్‌పైనా దృష్టి

వాయు వేగంతో రేసింగ్ బైక్‌ని నడిపించేవాడికి సైకిల్ తొక్కడం తెలియకపోవచ్చు... ఆస్ట్రోనాట్‌గా చంద్ర మండలంలో విహరించి అక్కడి అనుభూతులన్నింటినీ సొంతం చేసుకోగలవాళ్లకి వెన్నెల రుచి తెలియకపోవచ్చు...
ఎందుకంటే యువత చంద్ర మండలానికి వెళ్లినా, రేసింగ్ బైక్ నడిపినా అంతా కంప్యూటర్ తెర మీదనో ఆండ్రాయిడ్ ఫోన్ మీదనో పని కానిచ్చేస్తోంది. చదువు పూర్తవుతుండగానే ఆకర్షణీయమైన జీతాలు అందుకొనేవాళ్లను ఏదైనా అవసరమై వంద రూపాయల డీడీ తీయమని పురమాయిస్తే తికమకపడిపోతారంటే అతిశయోక్తి కాదు. మాల్స్‌లో ప్యాక్ చేసిన కూరగాయలు కొనే కుర్రకారుని బజారుకెళ్లి మంచివి ఏరి బేరమాడి తీసుకురమ్మంటే కంగారే!
ఎందుకంటే వాళ్లంతా ఆన్‌లైన్ ప్రపంచంలో నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోగలరు. కానీ ప్రాక్టికల్‌గా క్షేత్రస్థాయిలో చేయాల్సి వస్తే అడుగు ముందుకుపడక కంగారుపడుతున్నారు. బ్యాంక్ డీడీ, బజారులో కూరగాయల బేరమనే కాదు.. సెలవు కావాలని తన బాస్‌కి ఒక ఫార్మాట్ ప్రకారం మెయిల్ రాయాలన్నా... కౌంటర్‌కి వెళ్లి రిజర్వేషన్లు చేయించుకోవాలన్నా... మున్సిపల్ ఆఫీసుకి వెళ్లి బిల్లులు చెల్లించాలన్నా కంగారుపడుతున్నారు. తోటివారిని అడిగి తమకున్న చిన్నపాటి సమస్యను అధిగమించడంలోనూ తగిన కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్‌ని చూపించలేకపోతున్నారు. దానికి తోడు నవతరంలో సామాజిక మర్యాదలు తగ్గుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ సంస్థలు ఉద్యోగాలిచ్చే ముందుకు సోషల్ స్కిల్స్, సోషల్ ఎటికెట్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొంటున్నాయి. 'ఆన్‌లైన్'.. వారిలోని జ్వలించే చైతన్యానికీ... అదే సమయంలో అచేతనమైన జడత్వానికీ కారణభూతమై నిలుస్తోంది.
ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ చదువుతుండగానే సువర్ణకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన తరవాత స్టడీ లీవ్ తీసుకొని ఎంటెక్ పూర్తి చేయాలనుకొంది. విషయాన్ని పై అధికారులకు చెబితే దరఖాస్తు ఇస్తే పరిశీలిస్తామన్నారు. ఎవరికి ఏమని రాయాలో తెలియక ఆమె గందరగోళపడిపోయింది. చివరకు రాసింది... అయితే ఆ దరఖాస్తు ఫార్మాట్ ప్రకారం లేదు. ఏ విధంగా రాయాలో అక్కడి కార్యాలయ సహాయకులు చెప్పాల్సి వచ్చింది. ఉన్నత విద్యావంతురాలైన సువర్ణకు ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వచ్చింది... అయితే ఎందుకామె దరఖాస్తును రాయలేకపోయింది? ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆమెకు మాత్రమే కాదు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులు చదివిన, చదువుతున్న యువతకు ఎదురవుతున్నవే. కళాశాల స్థాయిలోనూ ప్రిన్సిపాల్‌కి దరఖాస్తులు రాసే సమయంలోనూ, ఏవైనా పోటీ పరీక్షలకు దరఖాస్తు నింపే సందర్భంలోనూ విద్యార్థులు గందరగోళపడుతున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. జేబులో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉంచుకొనే యువతరం బ్యాంక్ కౌంటర్ దగ్గరకు వెళ్లేసరికి కంగారుపడుతున్నారు. డీడీ దరఖాస్తులో ఫేవర్ ఆఫ్ అనే చోట తమ పేరు రాయలనుకొనే యువతీయువకులు ఎక్కువగా కనిపిస్తుంటారని, అలాగే పేయబుల్ ఎట్ అంటే ఏమిటో తికమకపడేవాళ్లూ ఉన్నారని బ్యాంక్ ఉద్యోగులు చెబుతున్నారు.
తల్లితండ్రులే నేర్పాలి
తమ బిడ్డలు కాలేజీకి వెళ్లి వచ్చేసరికి అన్నీ సమకూర్చి ఉంచాలన్న కన్నవారి ప్రేమ... అన్ని సేవల్నీ ఆన్‌లైన్ ద్వారానే పొందవచ్చనే యువత ఆలోచనల వల్లే సోషల్ స్కిల్స్ దూరమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్ని మార్కెట్‌కి తీసుకువెళ్లి కుటుంబానికి అవసరమైనవి కొనే విధానాన్ని చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు. అలా చేసినప్పుడు ఏ వస్తువు విలువ ఎంత ఉంటుంది? బేరసారాలు ఆడేటప్పుడు మాట తీరు ఎలా ఉండాలి? లాంటి విషయాలు అవగాహనకొస్తాయని సూచిస్తున్నారు. గతంలో కన్నవారో, కుటుంబ పెద్దలో పనులు అప్పగించేవారని, ఇప్పుడు పిల్లలకు అలాంటి చిన్నచిన్న బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల పలు సామాజిక విషయాలు తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందే విషయంలోనూ యువతకు క్షేత్రస్థాయి పరిజ్ఞానం కొరవడుతోంది. సాంకేతికపరమైన ప్రగతిని ఆహ్వానించాలని, అంతా ఆన్‌లైన్ ద్వారానే పొందాలనుకోవడంలోనూ తప్పులేదని.. అయితే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు చేసుకోవల్సి వచ్చిన సందర్భంలో గందరగోళపడకుండా ఉండాలంటే బ్యాంక్, పోస్టాఫీసు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, విద్యుత్ కార్యాలయాల్లాంటి చోట్ల పని తీరును యువతకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లితండ్రులపైనా, ఉపాధ్యాయులపైనా ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థి దశలోనే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా ఇలాంటివి నేర్పాల్సిన అవసరం ఉందంటున్నారు. కొద్ది సంవత్సరాల కిందట ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులు ఓ సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. అన్ని కళాశాలల్లోనూ సిలబస్‌తోపాటు అదనంగా వీటిని నేర్పించాలని సూచించారు. అయితే కళాశాలల యాజమాన్యాలు వీటిపై దృష్టి సారించలేదు. ఏలూరులో బీడీఎస్ చదువుతున్న యూవీఎస్ నారాయణ అనే విద్యార్థి మాట్లాడుతూ ''అంతా ఫోన్‌లోనే చేసుకొనే వీలున్న కాలమిది. అలాంటప్పుడు బ్యాంక్ వైపో, ప్రభుత్వ కార్యాలయాలకో వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. కొన్ని పోటీ పరీక్షల ఫీజులు సైతం ఆన్‌లైన్‌లో చెల్లించే వీలు చిక్కింది. ప్రిన్సిపాల్‌కో, శాఖాధిపతికో దరఖాస్తు రాయాల్సిన సందర్భంలో ఆఫీసులోని సిబ్బంది మీద ఆధారపడుతున్నాం.'' అని చెప్పాడు.
టాపర్సేగానీ...
ఆంగ్లంలోగానీ, మాతృభాషలోగానీ సంభాషించే సమయంలో సామాజిక మర్యాదలు (సోషల్ ఎటికెట్) తగిన రీతిలో పాటించడం లేదని నిపుణులు గుర్తించారు. అలాగే ఆంగ్లంలో రాసే సమయంలోనూ తప్పులు దొర్లుతున్నాయని, వారిపై ఎస్సెమ్మెస్‌ల భాష ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. బహుళజాతి సంస్థలు ప్రాంగణ నియామకాలు నిర్వహించే సమయంలో సోషల్ స్కిల్స్, సామాజిక మర్యాదలని పరిశీలిస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థ ఇంజినీరింగ్ కాలేజీలో నియామకాలు చేపడుతూ వివిధ విభాగాల్లోని టాప్ 5 విద్యార్థులను ప్రత్యేకంగా ఎంచుకొని వారికి సాంకేతిక పరీక్ష నుంచి మినహాయింపునిచ్చింది. ఈ టాపర్స్‌కి ఒక అసైన్‌మెంట్ ఇచ్చారు. 'మీ ఇంట్లో శుభకార్యం ఉన్నందున రెండు రోజులపాటు సెలవు కోరుతూ మీ బృంద నాయకుడికి మెయిల్ ఇవ్వండి. 50 పదాలకు మించకూడదు' అన్నదే ఆ అసైన్‌మెంట్. సగంమంది విద్యార్థులు వ్యాకరణపరంగానూ, ఫార్మాట్‌పరంగానూ తప్పులు చేశారు. తమ పాఠశాలలకు బ్లాక్ టీచింగ్ తరగతులు చెప్పడానికి వచ్చే ఉపాధ్యాయ శిక్షణార్థుల్లోనూ ఇలాంటి లోపాలు గుర్తించామని ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పారు. హైదరాబాద్‌కి చెందిన లైఫ్ స్కిల్స్ కోచ్ సాయిప్రకాష్ భూపాలం మాట్లాడుతూ ''ఓ వాణిజ్య ప్రకటనలో విద్యుత్ బిల్లు కట్టలేదని, బ్యాంక్ పని చేయలేదని కుమారుడిని తండ్రి కోప్పడతాడు. అప్పుడా అబ్బాయి.. బద్ధకంగా ఫోన్‌లోనే అన్నింటినీ పూర్తి చేస్తాడు. నవతరం ఆలోచన ధోరణి అలాగే ఉంది. అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు అనుకొంటున్నారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పని చక్కబెట్టుకోవడం మూలంగా పది మందితో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో, వ్యవహారాలు ఎలా చక్కబెట్టుకోవాలో తెలుస్తాయి. యువతను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా జీవితానికి ఉపయోగపడే ఇలాంటి నైపుణ్యాలను ప్రత్యేకంగా నేర్పించాలి. వీటి అవసరం విదేశాల్లోనో, బహుళజాతి సంస్థల్లోనూ ఉద్యోగాలు చేసేటప్పుడు బోధపడుతుంది.''అని అన్నారు.

-ఈనాడు ప్రత్యేక విభాగం

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning