తొలి మెట్టుతోనే భవితకు పునాది

 •      ఇంజినీరింగ్ అంటే నాలుగేళ్ల సమరం.. దీంట్లో ఎదురయ్యే ఆటుపోట్లను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటేనే సుర‌క్షితంగా తీరం చేర‌వచ్చు. ఇంజినీరింగ్ అంటే కేవ‌లం ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే అనే భావన చెరిపేసుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టాలి. బట్టీ సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఇంటర్ చదువుల‌కు ఇంజినీరింగ్ చదువుకు మధ్య ప్రధాన వ్యత్యాసమిదే. నాలుగేళ్ల పాఠాలతో తనకు తాను సానబెట్టుకుంటే తేలిగ్గా విజయ తీరాలను చేర‌వచ్చు.వేసే ప్రతి అడుగు లక్ష్యం వైపే ఉంటే నాలుగేళ్ల తర్వాత భవిత బంగారుమ‌యం అవుతుంది.

       కొన్ని కళాశాలల్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ఇప్పటికే ప్రారంభ‌మైనా.. జేఎన్‌టీయూ అనంత‌పురం, ఎస్కేయూ కళాశాలల్లో అక్టోబ‌రు 21 నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సద్దుమణ‌గ‌డంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు తరగతుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నిపుణుల స‌హ‌కారంతో కొన్ని సూచ‌న‌లు అందిస్తున్నాం.
  విశ్వమానవుడు కావాల్సిందే..!
       ఇంజినీరింగ్ విద్యార్థి నాలుగేళ్లలో విశ్వ మానవుడు (గ్లోబల్ సిటిజన్) కావాల్సిందే. ఇంట‌ర్నెట్‌, క‌ళాశాల లైబ్రరీని స‌మ‌ర్థంగా వినియోగించుకోవాలి. నాలుగేళ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లాలి. బ్రాంచి ఏదైనా దాంట్లో నైపుణ్యం సాధించ‌డంపైనే దృష్టి సారించాలి. దీని కోసం ప్రయోగాత్మకంగా చదువును కొనసాగించాలి. సైన్సులోని శాస్త్రీయ కాన్సెప్టుని దైనందిన జీవితంలో ఆధునిక మానవునికి ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ ముంద‌డుగేయాలి. మంచి అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవాలంటే సబ్టెక్టులో నైపుణ్యం సాధించ‌డంతోపాటు.. వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిగత నైపుణ్యాలు, జనరల్ నాలెడ్జిపై ప‌ట్టు సాధించాలి. ప్రశ్నించే తత్వంతో ముందుకు వెళ్లాలి. ఇతర విద్యార్థులతో కలిసి పోయే తత్వం అలవరచుకోవాలి. వీలైనంత మంది మంచి మిత్రులతో స్నేహం చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా కలిసి పోయే తత్వాన్ని పెంపొందించుకోవాలి. మొదటి, రెండో సంవత్సరాల్లోనే దిశా నిర్ధేశం ఉంటుంది. ద్వితీయ సంవత్సరం చాలా కీలకం. సబ్టెక్టులో నేర్చుకున్న అంశాలను నిత్యజీవిత విష‌యాల‌కు ఎలా అన్వయించాలో తెలుసుకోవాలి. ద్వితీయ సంవత్సరంలో ప్రయోగాల పట్ల, ఆధునిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. మూడో సంవత్సరంలో ఆధునిక అభివృద్ధిని అనుసంధానం చేసుకొని పరిశోధనా పత్రాలు, ఇండస్ట్రియల్ టూర్, సదస్సులు, సెమినార్లతో నైపుణ్యాలు పదునుపెట్టుకోవాలి. ఇంజినీరింగ్ విద్యలో నేర్చుకున్న అన్ని అంశాలను ఆకళింపు చేసుకొని నాలుగో సంవత్సరంలో మంచి ప్రాజెక్టును సిద్ధం చేయాలి.
  ఫేస్‌బుక్, ట్విట్టర్లకు అతుక్కుపోవద్దు
       అంతర్జాలాన్ని అవసరం మేరకే ఉపయోగించుకోవాలి. నిత్యం ఫేస్‌బుక్, ట్విట్టర్లతో కాలక్షేపం చేయవద్దు. తరగతి గదిలో అధ్యాపకుడు కేవలం 30 శాతం మాత్రమే సబ్జెక్టుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం అందిస్తాడు. వందశాతం కావాలంటే అంతర్జాలాన్ని వాడుకోవాల్సిందే. ఇంట‌ర్నెట్ ద్వారా ప్రపంచస్థాయి ఖ్యాతి పొందిన‌ స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్, బర్క్‌లీ, ఎంఐటీ, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఐఐటీలకు చెందిన నిష్ణాతులైన అధ్యాపకుల వీడియో లెక్చర్స్ వినొచ్చు. అనుమానాల‌నూ నివృత్తి చేసుకోవ‌చ్చు.

  ఆంగ్లంపై పట్టు తప్పనిసరి

       ఇంగ్లిష్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న భాష. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు భయం వీడి ఆంగ్లం నేర్చుకోవాలి. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలిగితేనే భవిష్యత్తులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

  ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం నుంచే మాట్లాడాలి. నిత్యం ప్రాక్టీసు చేయాలి. గట్టిగా చదవడం అలవరచుకోవాలి. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ సూత్రం ఆచరించాలి. ఎల్- వినడం (లిజనింగ్), ఎస్- మాట్లాడటం (స్పీకింగ్), ఆర్- చదవడం (రీడింగ్), డబ్ల్యూ- రాయడం (రైటింగ్).

  నిపుణులైన ఇంజినీర్ల కొరత

       ఉద్యోగ అవకాశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా యువ ఇంజినీర్ల కొరత ఉంది.మన దేశంలోనే యువ ఇంజినీర్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా...

  అవసరమైన నైపుణ్యాలు లేనందువ‌ల్ల అవకాశాలు పొందలేకపోతున్నారు. మ‌న‌దేశంలో యువత ఎక్కువ‌గా ఉండటంతో అవకాశాలు తక్కువగా కన్పించవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలున్నా యువత వాటిని అందిపుచ్చు కోలేక పోతున్నారు. ఎక్కువ‌మంది హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగావ‌కాశాల‌పై ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం మంది ఇంజినీరింగ్ నిపుణుల‌ కొరత ఉంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, మెటీరియల్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, ఏరోనాటికల్ పరిశ్రమల్లో మెండుగా అవకాశాలున్నాయి. నిర్మాణ రంగం శరవేగంగా సాగుతుండటంతో 25 శాతం ఉద్యోగావ‌కాశాలు పెరిగే అవకాశాలున్నాయని ఓ అంచనా. విద్యుత్తు ఉత్పాదక రంగంలో మన దేశంలోనే రాబోయే రోజుల్లో 30 వేల ఖాళీలు ఏర్పడుతాయని నిపుణుల అభిప్రాయం.

  అవకాశాలు అపారం

  * సాఫ్ట్‌వేర్‌తో పాటు ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సంస్థలైన ఏటీపీసీ, కోల్ ఇండియా, గ్యాస్, స్టీలు, బీహెచ్‌సీఎ, ఏరోనాటికల్, రక్షణరంగం, నౌకాదళం, పరిశోధనా పరంగా ఇస్రో, బార్క్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాలు రావాలంటే ఇంజినీరింగ్‌లో మంచి పట్టు సాధించాలి.
  * విదేశాల్లో ఎం.ఎస్. చేయడానికి జీఆర్ఈ, టోఫెల్‌లో మంచి స్కోరు తెచ్చుకోవాలి.
  * పరిశోధనా కేంద్రాల్లో పీజీ చేయాలంటే గేట్‌లో రాణించాలి.
  * ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్, టోఫెల్‌లో రాణించాలి.

  ప్రయోగాత్మక అధ్యయనం తప్పనిసరి

  - ఆచార్య లాల్‌కిశోర్, ఉపకులపతి, జేఎన్‌టీయూ, అనంత‌పురం
  కేవ‌లం డిగ్రీతో ప్రయోజనం ఉండదు. ఏవిధమైన ఉద్యోగం రాదు. ఇంజినీరింగ్‌లో ప్రయోగాత్మక అధ్యయనం తప్పనిసరి. తరగతులకు హాజరై పాఠ్యపుస్తకాలు చదివి ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన చేసుకోవాలి. పరీక్షల కోసం కాకుండా ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్లాలి. నాలుగేళ్లు కష్టపడితే జీవితం అంతా సుఖపడొచ్చు. అశ్రద్ధ చేస్తే జీవితంలో బాధపడాల్సి వ‌స్తుంది.

  నిరంతర సృజన ఉండాలి

  - ఆచార్య హేమచంద్రారెడ్డి, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ, అనంత‌పురం
  బట్టీ చదువులకు స్వస్తి పలికి నిరంతరం సృజనతో ముందుకు వెళ్లాలి. ప్రథమ సంవత్సరం నుంచే ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి కావాల్సిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. బలాలు బలహీనతలు బేరీజు వేసుకొని ముందుకు వెళ్లాలి. భయాన్ని పోగొట్టుకోవాలి. చదవడం, మాట్లాడటం, రాయడం లాంటివి ఎక్కువగా సాధన చేయాలి.

  ఏ శాఖ అయినా.. నైపుణ్యమే మార్గం

  - ఆచార్య నాగభూషణరాజు, ప్రిన్సిపల్, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల
  ఏ బ్రాంచిలో చేరినా అందులో నైపుణ్యం సాధిస్తే వృత్తిలో స్థిరపడ‌వ‌చ్చు. బ్రాంచిలో చేరిన తర్వాత మంచిదా, చెడ్డదా అన్న ఆలోచనలకు స్వస్తి పలకాలి. అందులో సరికొత్త అంశాలను దైనందిన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకెళ్లాలి. మార్పులకు అనుగుణంగా యువత పరుగులు తీయాలి.

  సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి

  - ఆచార్య ఆంజనేయులు, ప్రిన్సిపల్, జేఎన్‌టీయూ, అనంత‌పురం
  కోర్సులో చేరగానే ఇంజినీరు అయిపోయానన్న భ్రమ నుంచి బయటపడాలి. ఇంటర్‌లో కార్పొరేట్ కళాశాలల తరహాలో నోట్స్ ఇవ్వరు. ఉపాధ్యాయుడు చెప్పిన అంశాల వారీగా మరికొన్ని పుస్తకాలు తిరగేసి సిద్ధం చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరంలోనే ఏం కావాలో.. ఎటువైపు వెళ్లాలో విద్యార్థులు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగమా?.. ఇంజినీరా? .. శాస్త్రవేత్తా?.. గమ్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా అడుగేయాలి. కష్టపడే వాడు ఎప్పుడూ నష్టపోడు అని నానుడి. నాలుగేళ్లు కష్టపడితే జీవితాంతం సుఖపడ‌వ‌చ్చు.

  చదువుతో పాటుగా క్రీడలు

  - మక్కినేని దీపిక, తృతీయ సంవత్సరం
  నిత్యం చదువే అన్న భావన విడనాడాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. చదువుకు క్రీడలు అడ్డంకి కావు. షటిల్, బాస్కెట్‌బాల్ పోటీల్లో వర్సిటీ స్థాయిలో ఆడా. అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొన్నా. ఎన్‌సీసీలో 'సీ' సర్టిఫికెట్ సాధించా. తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, సీనియర్ల సహకారంతో రాణిస్తున్నా.

  ఒత్తిడికి లోనుకావద్దు

  - సుష్మ, ఈసీఈ టాపర్
  ఒత్తిడి లేకుండా చద‌వాలి. సబ్జెక్టుతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన వాటిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నా. 30 శాతం తరగతిగదిలో నేర్చుకుంటే 70 శాతం సొంతంగా మిత్రులు, ఇతర పుస్తకాలు, అంతర్జాలం ద్వారా నేర్చుకోవాలి. ప్రథమ సంవత్సరంలో కొంత‌వ‌ర‌కు ఇంటర్‌పై ఆధారపడి సిలబస్ ఉంటుంది.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning