అంతరిక్ష ఖ్యాతి ! అద్వితీయ స్ఫూర్తి !!

అమ్మ అందమైన ఆకాశాన్ని చూడమంది!
ఆ చిన్నారి మాత్రం అంతరిక్షంలోకి తొంగిచూసింది !!
డాక్టరై మాకు అండగా ఉండమ్మా అన్నారు బంధువులు !
అండగా ఉండాల్సింది మీక్కాదు, భారతమాతకు అని సమాధానం చెప్పిందా యువతి !!
లక్ష్యం గొప్పదైతే మార్గం కూడా గొప్పదే అవుతుందని నమ్మిందా చిన్నారి. చిన్ననాటి నుంచే ఆమెవి వైవిధ్య అడుగులు. సవాళ్లనే .. మెట్లుగా మలచుకుంటూ అనితర సాధ్యమైన 'అంతరిక్షశాస్త్రం'లోకి అడుగుపెట్టింది. అంచలంచెలుగా ఎదిగి ఔరా అనిపించిన శ్రీలేఖ స్ఫూర్తి పయనం మీకోసం ప్రత్యేకం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు నకిరేకల్‌కు చెందిన శ్రీలేఖ. చిన్న వయస్సులోనే అరుదైన విజయాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారామె. భారతదేశంలోని ప్రఖ్యాత స్పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీటు సాధించి చక్కని ప్రతిభతో రాణించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ కేంద్రంలో జీశాట్-11 ఉపగ్రహం కోసం పనిచేస్తున్నారు శ్రీలేఖ.
నాన్నే.. నడిపించారు...
నకిరేకల్‌కు చెందిన వ్యాపారి కోటగిరి శంకర్, పద్మావతిల కుమార్తె శ్రీలేఖ పది వరకు సూర్యాపేట, మిర్యాలగూడల్లో చదివారు. అంతరిక్షం పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తిని గమనించిన నాన్న ఆమెను ప్రోత్సహించి శాస్తవేత్తగా నడిపించారు. ఇంటర్ ఎంపీసీ చదువుతూ హైదరాబాద్‌లో రామయ్య ఐఐటీ కేంద్రంలో శిక్షణ తీసుకున్నారు. మొదటిసారి ఐఐటీ రాస్తే ర్యాంకు రాలేదని నిరాశ చెందకుండా పట్టుదలతో మళ్లీ కష్టపడి చదివి రెండోసారి విజయం సాధించారు.
అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని..
శ్రీలేఖ దృష్టి అంతా అంతరిక్షం వైపు ఉండటంతో ఐఐటీలో ర్యాంకు రాగానే తండ్రి శంకర్ తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) గురించి తెలుసుకున్నారు. తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు అమ్మాయిని డాక్టరో, ఇంజినీరో చేయించక ఇదేం చదువని పెదవి విరిచారు. అయితే ఆమె తిరువనంతపురం కళాశాల సీటు కోసం దరఖాస్తు చేశారు. ఈ యూనివర్సిటీకి ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఈ కళాశాలలో శ్రీలేఖకు ఉచితంగా సీటు వచ్చింది. నాలుగేళ్ల చదువు పూర్తయిన వెంటనే బెంగళూరు ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు శ్రీలేఖ.
జీతమా .. జీవితమా..
ఆకర్షణీయమైన జీతమా .. సంతృప్తికరమైన జీవితమా అనేది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయమని శ్రీలేఖ అంటారు. 'దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చానన్నదే' ముఖ్యమంటారామె. ఆమె ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం పనిచేస్తుండడం గర్వంగా ఉందన్నారు. కొడుకు పూర్ణవ్యాస్ ఎన్ఐటీ వరంగల్‌లో బీటెక్ పూర్తిచేసి ఐఐటీలో చేరాలనుకునే వారికి దిశానిర్దేశం చేస్తుంటారని .. ఇంతకంటే ఏం కావాలని తండ్రి శంకర్ సంతృప్తి వ్యక్తంచేస్తుంటారు.
స్పేస్ కళాశాలలో చదువు ఇలా.. : శ్రీలేఖ
స్పేస్ ఇంజినీరింగ్‌లో సీటు రావడంతో అంతదూరం వెళ్లి చదవడం కష్టమనిపించినా .. చిన్న నాటి నుంచి కన్న కలే నన్ను ఆ దిశగా నడిపించింది. రోజులో ఎక్కువ సమయం ల్యాబ్‌కే అంకితమయ్యేదాన్ని. ఉపగ్రహాల గురించి, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆసక్తిగా, ఆనందంగా అన్పించేంది. సినిమాలకు, షికార్లకు దూరంగా ఉంటూ ... పుస్తకాలు, ల్యాబే నా ప్రపంచంగా ఉండేది. ఫలితంగానే (7.8 పాయింట్లు) మెరిట్ సాధించా. నాలుగేళ్లు గిర్రున అయిపోయాయి. మూడు నెలల క్రితమే బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ కేంద్రంలో 'సైంటిస్ట్-కం-ఇంజినీరు'గా ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం జీ-శాట్ ఉపగ్రహం కోసం శాటిలైట్ డిజైనింగ్, టెస్టింగ్ విభాగంలో పనిచేస్తున్నా. చిన్న వయస్సులో దేశానికి సేవలందించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం ఆనందంగా ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులందరు ఐఐఎస్‌టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్‌సైన్స్ టెక్నాలజీ)కి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సంస్థలోని మూడు బ్రాంచీల్లో కలిపి కేవలం 156 సీట్లు మాత్రమే ఉంటాయి. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఉచిత వసతి సౌకర్యాలతోపాటు ఉచిత విద్యను అందిస్తారు. ఈ రంగంలోకి రావాలనుకునే వారు ఇంటర్ నుంచే 'త్రివేండ్రం స్పేస్ ఇంజనీరింగ్ కళాశాల వెబ్‌సైట్'ను చూస్తే నోటిఫికేషన్ వివరాలు అందుబాటులో ఉంటాయి.

-నల్గొండజిల్లా, నకిరేకల్

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning