భవితకు ఉపకరించే 'సమగ్ర' పరీక్ష

బీటెక్‌ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో మూడు సబ్జెక్టులతో పాటు సాంకేతిక సెమినార్‌, ఇంకా సమగ్ర మౌఖికపరీక్ష (కాంప్రహెన్సివ్‌ వైవా)లో ఉత్తీర్ణులవ్వవలసి ఉంటుంది. ఈ వైవా ప్రాముఖ్యాన్ని విద్యార్థులు గుర్తించాలి; తగిన విధంగా సంసిద్ధం కావాలి!
నిపుణుల కమిటీల నివేదికలు, పరిశ్రమలు కూడా బీటెక్‌ అభ్యర్థుల సామర్థ్యాల మీద, వారి ఉద్యోగ సంసిద్ధత మీద అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ లోపం సవరించేందుకు సమగ్ర మౌఖిక పరీక్షను ప్రవేశపెట్టారు. ఈ అంశానికి 100 మార్కుల మూల్యాంకనం ఉంది. ఈ పరీక్ష ముఖ్యోద్దేశం- కోర్సు ముగించిన పట్టభద్రులు ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలా చేయటమే!
ఈ పరీక్ష కోసం కొన్ని నియమనిబంధనలు రూపొందించారు. జె.ఎన్‌.టి.యు.హెచ్‌. పరిధిలోని కళాశాలలన్నీ ఈ సమగ్ర మౌఖిక పరీక్షను నిర్వహించడానికి సంబంధిత విభాగాల అధ్యాపకులతో కమిటీని నియమించాలి. ఈ కమిటీలో విభాగపు అధిపతి, ఇంకా ముగ్గురికి తక్కువ కాకుండా అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించాలి. బీటెక్‌లో చదివిన సబ్జెక్టుల్లో ప్రతి విద్యార్థికీ మౌఖిక పరీక్ష నిర్వహించాలి. ఈ కమిటీ అధ్వర్యంలో మూల్యాంకనం జరగాలి. మూల్యాంకన వివరాలు ఫలితాలు వెల్లడించేవరకు గోప్యంగా ఉంచాలి.
కొన్ని సందిగ్ధతలు
ఈ మౌఖిక పరీక్ష నిర్వహణ తీరుపై సందిగ్ధతలున్నాయి.
* ఒక విద్యార్థి బీటెక్‌లో 40కి పైగా సబ్జెక్టులు, ఇంకా దాదాపు 17 లేబొరేటరి సబ్జెక్టులను చదవాల్సివుంటుంది. వీటిలో ఎన్ని సబ్జెక్టుల్లో ఈ మౌఖిక పరీక్ష జరపాలనేది విశ్వవిద్యాలయం నిర్దేశించలేదు.
* ఎన్ని ప్రశ్నలు అడగాలనే విషయంలో సందిగ్ధత ఉంది.
* పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించాలనేదానిలోనూ స్పష్టత లేదు.
* ఇందులో భాగంగా లిఖిత పరీక్ష నిర్వహించొచ్చా లేదా అన్నది తెలియదు.
* 100 మార్కుల కేటాయింపు ఏ ప్రాతిపదికన జరగాలన్నదీ ప్రశ్నార్థకమే.
ఈ సందిగ్ధతలున్న నేపథ్యంలో కళాశాలలు కింది అంశాల మీద దృష్టి సారించటం సముచితం.
* ఈ మౌఖిక పరీక్ష ద్వారా విద్యార్థులను పరిశ్రమలు నిర్వహించే నియామకాల ఇంటర్వ్యూలకు సంసిద్ధులను చెయ్యాలి.
* విద్యార్థుల్లో ఈ పరీక్ష ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి.
* చదివిన అన్ని సబ్జెక్టులూ జ్ఞాపకం ఉంచుకునేందుకు దోహదపడేవిధంగా ఉండాలి.
* పరీక్ష నిర్వహించేది సంబంధిత విభాగానికి చెందిన అధ్యాపక బృందమే అయినా వృత్తితత్త్వం (ప్రొఫెషనలిజం) కనిపించాలి.
* ఒక విడతలో విద్యార్థి అంచనాల మేరకు ప్రతిభను ప్రదర్శించలేకపోతే రెండో విడత నిర్వహించాలి.
అనుసరించదగిన పద్ధతులు
ఈ వైవా నిర్వహణకు సంబంధించి కళాశాలలు అనుసరించే పద్ధతులు అంతిమంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించాల్సివుంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థులు తత్తరపడకుండా సాంకేతికపరమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగేటట్టు తర్ఫీదును అందించాలి. ఆ పైన ప్రశ్నావిధానం కూడా విద్యార్థులు ఏ మేరకు తాము చదివిన సబ్జెక్టులను అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్నారనే అంశాలపై దృష్టి సారించాలి. ఈ కింది మార్గదర్శకాలు ఉపయోగకరమైనవీ, అనుసరించదగినవీ.
* బీటెక్‌లో విద్యార్థి చదివే అన్ని సబ్జెక్టులనూ ఐదు లేక ఆరు ముఖ్య విభాగాలుగా చెయ్యాలి. ప్రతి విభాగంలోనూ ఐదు లేక ఆరు అంతర సంబంధిత సబ్జెక్టులను చేర్చాలి. ఉదాహరణకు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, డేటాబేసెస్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అనే ముఖ్య విభాగాలుగా చెయ్యవచ్చు. మొదటి విభాగమైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో సి, సి++, జావా, వెబ్‌ టెక్నాలజీస్‌, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అనే సబ్జెక్టులను చేర్చవచ్చు.
* అన్ని విభాగాల్లోని ప్రతి సబ్జెక్టుకూ 20- 25 ప్రశ్నలను ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల చేత తయారుచేయించాలి. ఇందులో చాలావరకు ఇంటర్వ్యూల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలను సేకరిస్తే ఇంకా ఉత్తమం. అన్నీ కలిసి దాదాపు 200 నుంచి 250 ప్రశ్నల వరకు ఉండవచ్చు.
* విద్యార్థిని ప్రతి విభాగంలోని ప్రతి సబ్జెక్టులోని ఐదు నుంచి పది ప్రశ్నలకు జవాబులు తయారుచేసి, రాసి దాఖలు చెయ్యమని చెప్పాలి. ఈ చర్యకు కొన్ని మార్కులు కేటాయించవచ్చు. ఈ మార్కుల కేటాయింపు విషయంలో కళాశాల అకడమిక్‌ కమిటీ సమష్టి నిర్ణయం చేసుకుంటే మంచిది. 20- 30 మార్కుల వరకు దీనికి కేటాయించవచ్చు. దీని వల్ల ప్రతి విద్యార్థీ తనకు సంబంధించిన ప్రతి సబ్జెక్టు గురించి ఎంతో కొంతమేరకు సమాధానాలు చెప్పగల ఆస్కారం ఉంటుంది.
* ఒక ప్రణాళికను అనుసరించి ప్రతి విద్యార్థికీ మౌఖిక పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్ష ఒక విడతలోనే కాకుండా రెండు/ మూడు విడతల్లో చేస్తే మంచిది. దీనివల్ల విద్యార్థి ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం లభించడమే కాక ఇంటర్వ్యూ అంటే బెరుకు, భయం వంటివి తగ్గుతాయి. ధైర్యంగా కంపెనీల ఇంటర్వ్యూలు ఎదుర్కునేందుకు కావలసిన ఆత్మస్త్థెర్యం కలుగవచ్చు. వీలుంటే రెండు మూడు ఇంటర్వ్యూ ప్యానళ్ళు చేస్తే మరింత మెరుగ్గా ఉంటుంది.
* ఒకవేళ వీలైతే ఇటువంటి ఇంటర్వ్యూలు రెండో సంవత్సరం నుంచే చేస్తూ అవకాశముంటే కొన్ని మార్కులు కూడా కేటాయిస్తే విద్యార్థులకు ఉపయోగకరం.
* చివరికి అన్ని ఇంటర్వ్యూలలోని ప్రతిభా ప్రదర్శనకు వచ్చిన మొత్తం మార్కులు విద్యార్థి తెచ్చుకున్న మార్కులుగా విశ్వవిద్యాలయానికి పంపించవచ్చు. విద్యార్థులు రాసిన ప్రతులను విభాగంలో భద్రపరిస్తే మున్ముందు తనిఖీ అధికారులకు చూపించడానికి అవకాశం ఉంటుంది.
* మూల్యాంకనం ఏవిధంగా చెయ్యాలి అనే విషయంలో ఒక పద్ధతిననుసరిస్తే మంచిది. 100 మార్కులు తక్కువేమీ కాదు. ఈ వంద మార్కులు దాదాపు 2.5 నుంచి మూడు శాతం వరకు బి.టెక్‌ పర్సెంటేజినీ ప్రభావితం చెయ్యవచ్చు. కాబట్టి ప్రతి ఒక మార్కుకూ సమ్మతమైన మూల్యాంకన పద్ధతి అనుసరించడం చాలా అవసరం.
ఈ సమగ్ర మౌఖిక పరీక్ష అన్నది విశ్వవిద్యాలయం నిర్వహించే ఇతర పరీక్షలాంటిదే. అందుకని దీన్ని కూడా ఇతర లాబొరేటరీ పరీక్షలమాదిరే పరిగణించవలసి ఉంటుంది. అంటే విద్యార్థులు తెచ్చుకున్న మార్కులు గోప్యంగా ఉంచాలి. ఈ పరీక్షను నిర్వహించి, మార్కులను విశ్వవిద్యాలయానికి సమర్పించి, ఫలితాల వెల్లడి అయ్యేంతవరకు ఉంచడం కళాశాల బాధ్యత. విద్యార్థికి రెండు లేక మూడు విడతల్లో ఈ వైవా నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునేవిధంగా ఉపయోగపడాలి!
ప్రయోజనాలు ఎన్నో...
ఇంజినీరింగ్‌ విద్యలో సమగ్ర మౌఖిక పరీక్షకు చాలా ప్రాముఖ్యం ఉంది.
* ఈ పరీక్ష మౌఖికం కావడం వల్ల విద్యార్థులకు గ్రాహ్యశక్తి పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.
* నాలుగేళ్ళకాలంలో చదివిన వివిధ సబ్జెక్టులను చక్కగా పునశ్చరణ చేసుకునే వీలుంటుంది.
* సాంకేతిక విషయ విజ్ఞానం పట్ల సమగ్ర అవగాహన కలుగుతుంది. *భావ వ్యక్తీకరణ అభివృద్ధికి ఆస్కారం ఉంది.
* ఇంటర్వ్యూలు సమర్థంగా ఎదుర్కునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
* బీటెక్‌లో మార్కుల నికర శాతం పెంచుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్నందున విద్యార్థులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా బాగా సిద్ధం అవ్వాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning