పట్టుదల + ప్రణాళిక = విజయం

* ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సివిల్స్ సాధ్యమే

* న్యూస్‌టుడే' ముఖాముఖిలో ట్రైనీ ఐఏఎస్ ఎల్.శివశంకర్

ధర్మవరం(శృంగవరపుకోట గ్రామీణం), న్యూస్‌టుడే :నిరాశ, నిస్పృహలకు గురికాకుండా ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో పయనిస్తే సివిల్స్‌లో ఎవరికైనా విజయం తథ్యమని శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో శిక్షణ పొందుతున్న ఆయన స్వగ్రామం వచ్చిన సందర్భంగా గురువారం ఆయన్ని 'న్యూస్‌టుడే' కలిసింది. సివిల్స్ రాయాలనుకునే వారు ఏ విధంగా సిద్ధం కావాలనే విషయమై ఆయనతో చేసిన ముఖాముఖి విశేషాలు ఇలా ఉన్నాయి.
న్యూస్‌టుడే: సివిల్స్‌కు అభ్యర్థులు ఏ దశ నుంచి సిద్ధం కావాలి?
శివశంకర్: పదోతరగతి నుంచి ఓ ప్రణాళికతో ముందడుగు వేయాలి. తర్వాత సివిల్స్ పరీక్ష విధానం, సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. గతంలో ఎంపికైన వారిని కలిసి తగిన సమాచారం సేకరించాలి. వారి వద్ద సూచనలు, సలహాలు తీసుకోవాలి. పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, అధ్యయన సామగ్రి సేకరించాలి. పూర్తి స్థాయిలో సబ్జెక్టులపై అవగాహన వచ్చేలా చదవాలి. సివిల్స్ పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ప్రతీరోజు కనీసం ఎనిమిది గంటలు చొప్పున ఏడాది పాటు చదవాలి.
ప్ర: ఆప్షన్ల విషయంలో ఎటువంటి సూచనలు పాటించాలి?
జవాబు: గతేడాది సిలబస్ మారింది. మారిన యూపీఎస్ఈ సిలబస్ మేరకు ఒక ఆప్షన్ ఎంచుకుంటే చాలు. డిగ్రీ స్థాయిలో తీసుకున్న సబ్జెక్టులపై పట్టు ఉంటే సరిపోతుంది. అయితే భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం, తెలుగుసాహిత్యం లాంటి గుర్తింపు పొందినవి ఆప్షన్ తీసుకుంటే మంచిది.
ప్ర: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపికవుతున్నారు కదా, వీరు ఏ ఆప్షన్ల ద్వారా విజయం సాధిస్తున్నారు? కారణమేమిటి?
జవాబు: తెలుగు సాహిత్యం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ,సైకాలజీ ఆప్షన్లు తీసుకున్నవారు ఆంధ్రా నుంచి ఎంపిక అవుతున్నారు.ఈ మధ్యకాలంలో సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. డాక్టర్లు, ఇంజినీర్లు కూడా సివిల్స్ రాస్తుండడంతో ఆంధ్రా నుంచి ఎక్కువ మంది ఎంపికవుతున్నారు.
ప్ర: తెలుగు మాధ్యమం వారికి మీ సూచన ఏమిటి?
జవాబు: తెలుగు మాధ్యమంలో పరీక్ష రాయాల్సి వస్తే చాలా కష్టపడాలి. ముఖ్యంగా తెలుగు మెటీరియల్ పూర్తి స్థాయిలో లభించడం లేదు. అందుకని ఆంగ్లంలో ఉన్న సమాచారమంతా తెలుగులోకి అనువదించుకుని కష్టపడి చదవాలి.
ప్ర: సివిల్స్‌కు ప్రత్యేక శిక్షణ అవసరమా?
జవాబు: కనీసం ఒక్కసారైనా కోచింగు తీసుకోవడం మంచిది. ఈ శిక్షణ పొందడం వల్ల ప్రాథమికంగా అవగాహన వస్తుంది. ఆ తరువాత సొంతంగా చదువుకోవచ్చు.
ప్ర: జనరల్ స్టడీస్‌పై పట్టు పెంచుకోవాలంటే..
జవాబు: హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, సంపాదకీయాలు విధిగా చదవాలి.ప్రతీరోజు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ అంశాలు పరిశీలించాలి. యోజన, వివేక్ వంటి మాస పత్రికలు చదవాలి. ఆలిండియా రేడియోలో 'స్పాట్‌లైట్' కార్యక్రమం ప్రతీరోజు వింటే వర్తమాన అంశాలపై అవగాహన వస్తుంది. మౌఖిక పరీక్ష సమయంలో బాగా ఉపయోగపడుతుంది.
ప్ర: తెలుగు విద్యార్థులకు ఆధార గ్రంథాలేమిటి?
జవాబు: బూదరాజు రాధాకృష్ణ పదకోశ రచనలు చదవాలి. ఆ పుస్తకాలలో ఆంగ్లంలో ఉన్న పదాలకు తెలుగులో పక్కాగా అర్థాలుంటాయి. వీటి సహాయంతో అనువాదం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చదవాలి. పాత ప్రశ్నపత్రాలు, పరీక్షా విధానం అమలు తెలుసుకోవాలి. ఎక్కువ సార్లు మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. ఒకటి రెండు సార్లు తప్పినంత మాత్రాన నిరాశ చెందక పట్టుదలతో, ప్రణాళికతో ముందడుగు వేస్తే విజయం తథ్యం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning