ఆవిష్కరణలతో సత్తా చాటిన ఇంజనీరింగు విద్యార్థులు

ఇబ్రహీంపట్నం గ్రామీణం : ఒక ప్రాంతం... దేశం అభివృద్ధి చెందాలంటే అందుకు తగిన వనరులు, సౌకర్యాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అందులో ప్రధానమైనది విద్యుత్తు. ఆధునిక జీవనంలో విద్యుత్తు లేని జీవితాన్ని వూహించలేం. ఇటీవలి కాలంలో వేసవి వచ్చిందంటే చాలు తరచూ విద్యుత్తు సంక్షోభం తలెత్తుతోంది. గంటల కొద్ది కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పరిశ్రమలు వ్యాపారాలు సాగక తీవ్రంగా దెబ్బతింటున్నాయి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలా అని కొందరు విద్యార్థులు ఆలోచించారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్తు కోతలు లేకుండా చూస్తున్నారు. మన రాష్ట్రంలో సైతం ఇలా చేస్తే ఎలా ఉంటుందంటూ ఆలోచనలకు పదును పెట్టారు. సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు రూపకల్పన చేశారు. మండల పరిధిలోని పోచారం సమీపంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఆవిష్కరణ ఇది. పోచారం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజేష్, మౌనిక, హాసిని కాన్‌సన్‌ట్రేటెడ్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూపొందించారు. ఇటీవల కళాశాలలో సాంకేతిక ఉత్సవం సందర్భంగా ప్రాజెక్టు రాసివ్వమని అధ్యాపకులు కోరారు. వీరు ఇచ్చిన పేరు కొత్తగా ఉండడంతో హెచ్‌వోడీ వెంకటేశ్వర్లు, హిమబిందు, వినోద్‌కుమార్ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రోత్సహించారు. రూ. 2000 ఖర్చుతో విద్యార్థులు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా రూపొందించారు.
ఎలా పని చేస్తుందంటే...
సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కోసం ఉపయోగించే ప్యానెల్‌లను పీవీసీ(ఫోటో వోల్టానిక్ ఘటాలు) అంటారు. ఇవి సూర్యుని నుంచి 100 శాతం శక్తి విడుదలైతే అందులో కేవలం 10 శాతాన్ని విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించుకుంటాయి. ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ప్యానెల్‌లు అద్దాలతో తయారు చేసినవి. వీటిని హీలియోస్టాట్స్ అంటారు. ఇవి వృత్తాకారంలో(గుండ్రంగా) ఏర్పాటు చేసి మధ్యలో సోలార్ టవర్‌ను ఏర్పాటు చేస్తారు. సూర్యుని నుంచి పడిన కాంతి అద్దాల మీదుగా టవర్‌మీద ఉన్న ఛాంబర్‌లో పడుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన అమ్మోనియా నైట్రేట్ వేడెక్కి ఉష్ణశక్తి విడుదలై ఆవిరి వెలువడుతుంది. ఆ ఆవిరితో టర్బైన్ తిప్పి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. అక్కడ నుంచి వచ్చిన విద్యుత్తును నిల్వ చేసుకోవడం లేదా గ్రిడ్‌కు అనుసంధానించుకోవచ్చు. ఈ పద్ధతిలో సూర్యుని నుంచి వచ్చే కాంతి శక్తిలో 45 శాతం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలా విద్యార్థులు రూపొందించిన విద్యుత్తు శక్తితో బల్బును వెలిగించి చూపించారు. పూర్తి స్థాయిలో అధిక మొత్తంలో విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు తెలిపారు.
కొత్త యాప్ కనిపెట్టిన విద్యార్థులు
సాధించాలనే తపన ఉంటే ఎంతటి లక్ష్యానైన్నా చేరుకోవచ్చు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆకాష్-4 ట్యాబ్లెట్ పీసీలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపొందించి దేశంలోనే ద్వితీయ స్థానం సాధించారు శ్రీదత్త కళాశాల విద్యార్థులు. గ్రామీణ, పేద విద్యార్థులకు ట్యాబ్లెట్‌లను అందించేందుకు రూ.3999తో ప్రభుత్వం ఆకాష్ ట్యాబ్లెట్‌లను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని గతంలో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రారంభించారు. ఆకాష్ ట్యాబ్లెట్‌ను రుపొందించి, వాటిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర మానన వనరుల శాఖ బాధ్యతను ఐఐటీ ముంబయి వాళ్లకి అప్పగించింది. ఆకాష్ ట్యాబ్లెట్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు, యువ, నూతన ఇంజినీర్లను ప్రోత్సహించేందుకు వారు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి ప్రాజెక్టు అప్పగించారు. ప్రాజెక్టులో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఆకాష్ ట్యాబ్లెట్‌లు ఇచ్చారు. విద్యార్థులకు నిత్యజీవితంలో, వారికి అన్ని విధాలా ఉపయోగపడే ప్రోగ్రాం రూపొందించాలనేది షరతు. ఆకాష్ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మాత్రమే సపోర్టు చేస్తుంది. శేరిగూడలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీహర్ష, పునీత్, సుబ్రమణ్యశర్మ, అనురాగ్, సుశాంత్ దీన్ని సవాలుగా తీసుకున్నారు. కళాశాల ఛైర్మన్ పాండురంగారెడ్డి, డైరెక్టర్ సమీర్‌ఖాన్, హెచ్‌వోడీ సుబ్బారావు విద్యార్థులను ప్రోత్సహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యార్థులు సమష్టిగా కొత్త అప్లికేషన్ రూపొందించడంలో లీనమయ్యారు. జావా భాషలో ఉండే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను నెల రోజుల వ్యవధిలో రూపొందించారు. దాని పేరే ఫ్లెమింగో. జావా భాషలో ఉండే డిక్షనరీ ఉపయోగించి దీనిని కనిపెట్టారు. ఇది విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లా ఉపయోగపడుతుంది.
250లో ద్వితీయ స్థానం
ఆకాష్-4 ట్యాబ్లెట్‌లో నూతన అప్లికేషన్‌ను రూపొందించడం కోసం దేశవ్యాప్తంగా ఆయా ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు 250 ప్రాజెక్టులను రూపొందించారు. వీటిలో ఢిల్లీలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన అప్టిట్యూడ్ చెక్ దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రోగ్రాం విద్యార్థులకు క్విజ్‌లా ఉపయోగపడుతుంది. శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు రూపొందించిన ఫ్లెమింగో ప్రోగ్రాం ద్వితీయ బహుమతి సాధించింది. ఇందుకు సంబందించి ఐఐటీ బాంబే వాళ్లు నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నట్లు కళాశాల ఛైర్మన్ పాండురంగారెడ్డి, డైరెక్టర్ సమీర్‌ఖాన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి రూ. 4 లక్షల వేతనంతో ఉద్యోగాలకు ఎంపికవడం గమనార్హం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning