కాలేజీలోనే కలలు సాధించింది!

'అబ్బబ్బ.. ఎన్ని సబ్జెక్టులో.. ఎన్ని ప్రాజెక్టులో! ఏమైనా చేద్దాం అంటే అస్సలు టైం సరిపోవడం లేదు!' అంటుంటారు చాలామంది అమ్మాయిలు. కాని ఈ అమ్మాయి పంట పొలాల్లో సౌర విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేయొచ్చో నిరూపించి అంతర్జాతీయంగా 'ఔరా' అనిపిస్తోంది.. వెంకట వాసవి.
అహ్మదాబాద్‌. గుజరాత్‌కి గుండెకాయలాంటి నగరం. అక్కడ అడుగుపెట్టడం అదే తొలిసారి. ఎక్కడా స్తంభాలకు విద్యుత్తు తీగలు కన్పించలేదు. మరమ్మతుల పేరుతో రహదారులను తవ్వడమూ కనిపించలేదు. 'మరి విద్యుత్తెలా?' అని ఆశ్చర్యపోయా. ఆ నగరంలో పూర్తిగా సౌర విద్యుత్తే వినియోగిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. ఒక్కసారి మన రాజధాని కళ్ల ముందు మెదిలింది. ఎక్కడ చూసినా భయంకరంగా వేలాడే విద్యుత్తు తీగలు! పైగా కరెంటు సమస్య! విద్యుత్తు లోటుకు సౌరశక్తిని వాడుకోవడం సరైన పరిష్కారమని చెప్పేందుకు గుజరాత్‌ ఓ నిదర్శనం! ఇంతకీ నేను అహ్మదాబాద్‌ నగరం ఎందుకు వెళ్లానని అనుకుంటున్నారు? చెబుతా వినండి..
ముగ్గురిలో ఒక్కర్ని: నేను కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థినిని. బీబీనగర్‌లోని మేధా కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదువుతున్నా. అమ్మ గృహిణి. నాన్న ఓ ప్రైవేటు కళాశాలలో బోర్డ్‌ ఇన్‌ఛార్జి. ఫైనలియర్‌ కావడంతో ఇంటర్న్‌షిప్‌ చాలా మంచిచోట చేయాలని భావించా. గుజరాత్‌ ఇంధన పరిశోధన నిర్వహణ సంస్థ (జెర్మీ) గురించి తెలిసింది. వెంటనే దరఖాస్తు చేశా. దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలూ, ఎన్‌ఐటీలూ, వందలాది ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి 760 దరఖాస్తులొస్తే 15 మందిని ఎంపిక చేశారు. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో నాకు సౌర విద్యుత్తు ప్రాజెక్టు అప్పగించారు. అది పూర్తిగా కొత్త అంశం. జెర్మీ.. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉంది. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కి 30 కిలోమీటర్లే. అలా ఓ వారాంతంలో విహారానికెళ్లాం. అప్పుడే సౌర విద్యుత్తు మహత్తేమిటో తెలుసుకున్నాను. నా ప్రాజెక్టుకున్న ప్రాధాన్యమూ అక్కడే అర్థమైంది.
పూర్తిగా కొత్త: జెర్మీలో నాకు రెండు ప్రాజెక్ట్‌లను అప్పగించారు. హైవేపై సౌర విద్యుత్తు అందులో ఒకటి. దాన్ని విజయవంతంగా పూర్తిచేశా. రెండోది... పంటలు పండిస్తూనే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎలా అన్నది! ఇది చాలా క్లిష్టమైన అంశం. ఇంతవరకూ పరిశోధనలు చేసిన వారంతా సౌర విద్యుత్తు ద్వారా ఏర్పడే రేడియేషన్‌, సౌర పలకల నీడ కారణంగా పంటలకు నష్టం ఉంటుందనే భావిస్తూ వచ్చారు. నేను అలా కాదని నిరూపించాలనుకున్నా. కంప్యూటర్‌ 'సిమ్యులేషన్‌'లో... అంటే, మనకు ఎదురుగా కనిపించే వాతావరణాన్ని వర్చువల్‌గా సృష్టించి.. దాంతో ప్రయోగాలు మొదలుపెట్టాలనుకున్నా. ఇందుకోసం పీవీ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌, హోమర్‌ సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకున్నా. ఆ తర్వాతే సిమ్యులేషన్‌ రూపకల్పనకు దిగా. వర్చువల్‌గా భూవాతావరణం సృష్టించేందుకు గ్లోబల్‌ రేడియేషన్‌, రాష్ట్రాల ఉష్ణోగ్రతల వివరాలు సేకరించా. పంట వాతావరణంలో పలకలను ఎంత ఏటవాలుగా ఉంచాలో ఓ నిర్థరణకు వచ్చా. నా పరిశోధనల్లో ఇదే కీలక మలుపు. ఆ తరవాత పంటపై పలకల నీడ ప్రభావంపై ప్రయోగాలు చేశా. ఎట్టకేలకు సౌర విద్యుత్తు పలకలను ఓ చదరంగ పటంలా ఏర్పాటు చేస్తే వాటి నీడ వల్ల పంటలకు సమస్య ఉండదని నిరూపించాను. మధ్యాహ్న వేళల్లో అతి నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గి.. దిగుబడులూ పెరుగుతాయని వివరించాను.
ఆలస్యమైంది: నా పరిశోధన వివరాల్ని 'స్మార్ట్‌ గ్రిడ్‌ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ' అంతర్జాతీయ జర్నల్‌కు పంపాం. దాన్ని ప్రచురణకు తీసుకున్నట్లు జనవరి 13న ప్రకటించారు. నా కష్టానికి ఇంత గొప్ప గుర్తింపు వస్తుందని కలలో కూడా వూహించలేదు. నేను కంప్యూటర్‌ సిమ్యులేషన్‌లో చేసిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలనుకుంటే నేను అందులో భాగస్వామిని కావాలని కోరుకుంటున్నా. నా ప్రాజెక్టుతో రైతులకు అవసమైన విద్యుత్తు వారి పొలంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. పంపిణీ నష్టాలు ఉండవు. దేశానికి ఇదో కీలక మలుపు అవుతుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning