ప్రయోగం.. ప్రయోజనం

* ప్రతిభకు కొలమానంగా నిలుస్తున్న నమూనా ప్రదర్శనలు

* మంథని జేఎన్టీయూ యంత్రవిద్యలో ఆవిష్కృత్-14 సంరంభం

న్యూస్‌టుడే, పెద్దపల్లి, సెంటినరీకాలనీ : యువ లోకం ప్రయోగబాట పట్టింది.. ప్రజోపయోగకర అంశాలను సామాన్యులకు చేరవేసేలా తమ పరిశోధనలుండేలా ఆవిష్కరణలు చేపడుతోంది. తరగతి గదుల్లో నేర్చుకొన్న పాఠాలను ప్రయోగ విద్యతో అద్భుతాలను సృష్టించేలా యంత్ర విద్య విద్యార్థిలోకం ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థుల ఆలోచనలు ప్రయోగరూపం దాల్చి భవిష్యత్తు ప్రతిభకు వేదికగా సదస్సులు ఉపకరిస్తున్నాయి.
మంథని జేఎన్టీయూ యంత్ర విద్య కళాశాల ఆవిష్కృత్-14 పేరిట నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సాంకేతిక సదస్సును జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయం అకాడమిక్ విభాగం డైరెక్టర్ జి.కె.విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'పారిశ్రామిక రంగం అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకొన్న విద్యార్థులకే భవిష్యత్తు ఉంటుంది' అని పేర్కొన్నారు. సింగరేణి ఆర్జీ-2 జీఎం సుభానీ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా నైతిక విలువలను పాటించాలని సూచించారు. కళాశాల ప్రధానాచార్యులు బాలునాయక్ మాట్లాడుతూ మారుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొంటూ తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. ఉపప్రధానాచార్యులు ఉదయ్‌కుమార్,ఆవిష్కృత్ కన్వీనర్లు సాహూచత్రపతి, ప్రసన్నలక్ష్మి ప్రసంగించారు.. జిల్లాలోని పలు యంత్రవిద్య కళాశాలల నుంచి పలువురు విద్యార్థులు 125 ప్రదర్శనలను రూపొందించి ప్రదర్శించారు.
గాలిపీడనంతో హైడ్రాలిక్ యంత్రం
ప్రదర్శనాంశం: నీరు, గాలి పీడనంతో హైడ్రాలిక్ పొక్త్లెన్
తయారు చేసిన విద్యార్థులు: ఎ. అశోక్, పి. వేణుగోపాల్, పి. జ్యోస్నల, ఒ.మౌనిక, సిహెచ్. భవాని, బీటెక్, తృతీయ మెకానికల్ విభాగం
పనిచేసే విధానం: సాధారణం హైడ్రాలిక్ యంత్రాలు ఆయిల్ ఆధారంతో పని చేస్తాయి. ఆయిల్ పీడనం ద్వారా భారీ యంత్రాలు, పొక్త్లెన్, జేసీబీలు పనిచేస్తాయి. అయితే ఆయిల్‌కు బదులు, నీరు, గాలి పీడనంతో హైడ్రాలిక్ యంత్రాలు పనిచేసే విధంగా విద్యార్థులు నమునాను తయారు చేశారు. దీనివల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. యంత్రం పనితీరు బాగుంటుంది.
భారీ యంత్రాలను సులువుగా తరలించవచ్చు
ప్రదర్శనాంశం: బరువులు మోయడంలో మేటి
విద్యార్థులు: గౌతం, సుప్రభాత్, అశోక్, ఖాజా జరార్అహ్మద్ (మెకానికల్ విభాగం)
విధానం: రోబోటిక్ ఆర్మ్ రోవర్ భారీ యంత్రాలను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించేందుకు ఉపయోగపడుతుంది. ఈయంత్రాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే విదానాన్ని విద్యార్థులు రూపొందించారు. భూగర్భ గనులు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో మనుషుల్లేకుండా రిమోట్ ద్వారా ఈ యంత్రాలను నియంత్రించడం వీలవుతుంది. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసిన రోబో పనితీరును ప్రదర్శించారు.
ఏ బుర్జ్ హమారా
ప్రదర్శనాంశం: ఏ-బుర్జ్-హమారా అరబ్‌కు నమూనా
విద్యార్థులు: సాయినాథ్, అభిరాం, రాకేష్, రవి, స్రవంతి, అనూష, సివిల్ విభాగం విద్యార్థులువిషయం: అరబ్ దేశాలకు తలమానికంగా మారిని ఏ-బుర్జ్-అరబ్‌కు నమూనాను ఈ విద్యార్థులు తయారుచేశారు. పూర్తిగా సముద్రంలో నిర్మించిన ఈభవనం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అనేక పాఠాలను చెబుతుంది. 'థామస్ విల్ రైట్' అనే అర్కిటెక్చర్ దీన్ని మొదట డిజైనింగ్ చేశారు. విద్యార్థులు చేసిన ఈనమునా అందరిని ఆకట్టుకుంది. ఒరిజినల్ బుర్జ్ మాదిరిగానే చేసిన వీరు నిర్మాణం చేసేందుకు నెల రోజులు శ్రమించారు
కాంక్రీట్ వనంలో కాంతి ప్రసరణ
ప్రదర్శనాంశం: కాంతిని ఇంట్లోకి ప్రసరింపజేయడం
విద్యార్థులు: పి. హర్షిత్‌కుమార్, సాయి వంశీ, ఎన్. మహేష్, వి. సాయికుమార్, సివిల్ విభాగం
విషయం: బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో పట్టణాలు కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయి. దీంతో ఇళ్లల్లోకి కాంతి ప్రసారం తగ్గిపోయి పగలు కూడా విద్యుద్దీపాలు వెలిగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు విద్యార్థులు ప్రత్యేకమైన కాంక్రీట్ ఇటుకను తయారు చేశారు. ఇందులో 95 శాతం కాంక్రీట్, సిమెంట్, అయిదు శాతం ఆప్టికల్ ఫైబర్‌ను వినియోగించారు. వీటిలోని ప్రత్యేక లక్షణం ద్వారా ఇటుక అవతలి వైపు కాంతి ప్రసారమవుతే లోపలికి వెలుగు వెదజల్లుతుంది. వీటితో ఇంటిని నిర్మిస్తే పటిష్టమైన రక్షణతోపాటు కాంతి పరావర్తనంతో విద్యుత్తు ఆదా అవుతుంది.
యుద్ధాల్లో రోబో సహాయం
ప్రదర్శనాంశం: రోబోటిక్ ప్రయోగంతో ప్రయోజనం
విద్యార్థులు: అనూషతేజ్, మానస, సాహిత్య, ప్రబంధ, మెకానికల్ విభాగం
విషయం: మనుషులు చేయలేని పనులను రోబోల సహాయంతో చేయించడం సహజం. అయితే తయారు చేసిన రోబోల పని తీరును తెలుసుకోవడం వాటి సామర్ధ్యం పెంచేందుకు ఈప్రయోగం ఉపకరిస్తుంది. యుద్ధాల్లో సైనిక అవసరాలు తీర్చేందుకు సైతం ఈ రోబోలు ఉపకరిస్తాయి. వస్తువులను గుర్తించడం, వాటిని మరో చోటికి తరలించేందుకు రోబోలు సహకరిస్తాయి. వీటి అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రోగ్రామింగ్ చేస్తే రోబోలు అనుకూలంగా పని చేస్తాయి. రోబోల సామర్ధ్యం తెలుసుకునేందుకు విద్యార్థులు ఈప్రయోగ నమునాను ఆవిష్కరించారు.
నీటిపై రహదారి నిర్మాణం
ప్రదర్శనాంశం: నీటిలోపల రోడ్డు నిర్మాణం
విద్యార్థులు: జి. అభిలాష్, డి. సంపత్, ఇ. అరుణ్, బి. సాయికుమార్, టి. విద్య, కె. కోటేశ్వర్, పర్శరాం, లక్ష్మీసాయిదుర్గ సివిల్ విద్యార్థులు, విట్స్ కళాశాల, కరీంనగర్
విషయం: స్వీడన్, డెన్కార్క్ మధ్యలో సముద్ర మార్గం ద్వారా నిర్మించిన ఆరిజాన్ టన్నెల్ ప్రేరణతో ఈ విద్యార్థులు ఫైబర్‌తో టన్నెల్ రోడ్డుకు అంకురార్పణ చేశారు. పూర్తిగా ఆఫ్టికల్ ఫైబర్‌తో రెండు భూభాగాలను కలుపుతూ సముద్రమార్గం గుండా తక్కువ నీటిమట్టం ఉన్న భూమిపై నుంచి తాకుతూ నిర్మాణం ఉంటుంది. దీనిద్వారా సముద్ర జలాలను చూసూత వాహనంలో ప్రయాణిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning