ఆలోచనల హోరు.. ఆవిష్కరణల జోరు !

కాలేజీ విద్యార్థులు క్యాంపస్‌ సరదాలకే పరిమితమా? టీచర్‌ అంటే కేవలం పాఠాలే చెప్పాలా? సరిహద్దులు దాటితే కాసుల వేటతోనే సరా? అవేం కాదు.. క్లాస్‌రూంలో ఎడిసన్‌లా ప్రయోగాలు చేయొచ్చు... క్యాంపస్‌లో ఉంటూనే ఐన్‌స్టీన్‌లా ఫలితాలు రాబట్టొచ్చు... ఏ దేశంలో ఉన్నా సరికొత్త ఆవిష్కరణలతో మువ్వెన్నెల జెండా ఎగరేయొచ్చని నిరూపించారు కొందరు యువతరంగాలు... మేలిమి విజయాలతో అందరి ప్రశంసలు పొందిన ఆ కుర్రకారు వల్లించే విజయ సూత్రాలేంటో చదవండి మరి.
మరయంత్రంతో మరపురాని గెలుపు
ఆవిష్కర్తలు: రాకేష్‌, షెజమాన్‌, రవికిరణ్‌ బొబ్బా, మణికంఠ శ్రీరామ్‌, హరిప్రసాద్‌
ఆవిష్కరణ: లూనార్‌ రోవర్‌
గుర్తింపు: గూగుల్‌ 'ఎక్స్‌' ప్రైజ్‌కి అర్హత
గూగుల్‌ సంస్థ ఏటా లూనార్‌ రోవర్‌ పోటీలు నిర్వహిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న దీనికి అర్హత సాధించడమే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈసారి 'ఎక్స్‌'ప్రైజ్‌ పోటీల్లో సత్తా నిరూపించుకోవాలనుకుంది ఐదుగురు సభ్యుల మిత్రబృందం. వీళ్లంతా ఐఐటీ మద్రాస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బ్రాంచీకి చెందినవాళ్లు. ఈ పోటీ కోసం 'ఎక్స్‌-మెన్‌'గా జట్టుకట్టారు. ఒక్కొక్కరు ఒక్కో విభాగాన్ని ఎంచుకొని పని ప్రారంభించారు. గతంలో ఇస్రో, నాసా పంపిన రోవర్ల నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నెల్లాళ్లు కష్టపడి నిబంధనలకు అనుగుణంగా రోవర్‌ తయారు చేశారు. ఈ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలు తక్కువేం కాదు. మొదట్లో రోవర్‌ చక్రాలు పట్టేశాయి. లోపం సరిదిద్దడానికే నెల పట్టింది. ఆపై మరిన్ని సాంకేతిక అవాంతరాలు. అన్నింటినీ దాటేశారు. ఆపై అచ్చం చంద్రుడిపై ఉండేలా ఎత్తుపల్లాలు, అడ్డంకులు, కఠినమైన ప్రాంతాలతో ఓ కృత్రిమ ఉపరితలం తయారు చేసి రోవర్‌ని పరుగులు పెట్టించారు.
రోవర్‌ ఆరు చక్రాల సాయంతో భూమిని తాకుతూ వెళ్తుంది. ఇందులో అమర్చిన కెమెరా హెచ్‌డీ నాణ్యతతో ఫొటోలు, వీడియోలు తీస్తుంది. కంప్యూటర్‌ ఆదేశాలకు అనుగుణంగా కదలికలు సాగిస్తుంది. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తుంది. ఇవన్నీ పక్కాగా ఉండటంతో మిత్రబృందం అందరికన్నా ఎక్కువగా పాయింట్లు సాధించి విజేతలుగా నిలిచారు. బహుమతిగా లక్షన్నర రూపాయలు గెల్చుకున్నారు. ఈ పోటీలో విజేతగా నిలవడానికి రెండు దశలు దాటింది ఎక్స్‌-మెన్‌ బృందం. ముందు మూడు నగరాల్లో నిర్వహించిన తొలి పోటీకి వివిధ కాలేజీలు, విశ్వవిద్యాలయాల నుంచి 200 జట్లు బరిలో దిగాయి. తాము రూపొందించిన రోవర్‌కు నమూనా, తయారీ ప్రణాళిక, సాంకేతిక అంశాలను నిపుణులైన జడ్జీలకు వివరిస్తూ ప్రజంటేషన్‌ ఇచ్చారు. వడపోతలో 27 జట్లు మాత్రమే తుది దశకు అర్హత సాధించాయి. తర్వాత వీటిలోనూ మేటిగా నిలిచారు. ఈ విజయంతో భారత్‌ చంద్రుడిపైకి పంపబోయే రోవర్‌ రూపకల్పన జట్టు 'టీమ్‌ ఇండస్‌'లో సభ్యులయ్యారు.
పరాయి గడ్డపై విజయకేతనం
ఆవిష్కర్త: ఆలూరి గీతాసాయి, ఆవిష్కరణ: నానో సాంకేతిక సెన్సర్‌
గుర్తింపు: అమెరికా ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మెచ్చుకోలు
ఇంజినీరింగ్‌ టాపర్‌. వేరొకరైతే సాఫ్ట్‌గా దక్కిన కొలువులో చేరేవాళ్లే. వైజాగ్‌ అమ్మాయి ఆలూరి గీతాసాయి వీటిని కాదనుకొని ఎం.ఎస్‌.చేయడానికి అమెరికా ఫ్త్లెటెక్కింది. పీజీ పూర్త్తెనా ఆగిపోకుండా 'నావల్‌ కెమికల్‌ సెన్సర్‌ సిస్టమ్స్‌' అనే అంశంపై పీహెచ్‌డీ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే గ్యాస్‌ సెన్సింగ్‌, నానోవైర్‌ డివైజెస్‌, నానో స్ట్రక్చర్‌ ఇచ్చింగ్‌ అంశాలపై ఆమె రాసిన ఎనిమిది పరిశోధక వ్యాసాలు అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితం అయ్యాయి. సరదాలు, సంతోషాలు పక్కన పెట్టేసి క్షణం తీరిక దొరికినా ప్రయోగశాలలో గడిపేది. పుస్తకాల్లోకి తలదూర్చేది. ఈ అనుభవంతో వాతావరణంలోని వాయువుల శాతాన్ని అతి తక్కువ సమయంలో అత్యంత కచ్చితంగా గుర్తించే పరికరాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడేళ్లు కష్టపడి అనుకున్నది సాధించింది. ఈ పరికరం కేవలం అగ్గిపెట్టె పరిమాణంలో ఉంటుంది. దీన్ని ఆన్‌ చేస్తే పరిమిత ప్రదేశంలో ఏయే వాయువులు ఎంత మొత్తంలో ఉన్నాయో డిస్‌ప్లేపై నమోదవుతాయి. ఒకవేళ అక్కడ ప్రమాదకర వాయువులు ఉంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది కూడా. ఈ పరికరం రసాయన పరిశ్రమల భద్రతకు, భారీ పేలుళ్ల నివారణకు ఉపయుక్తంగా ఉంటుందన్నది గీత మాట. దీనికి 'నానో వైర్‌ నానో క్లస్టర్‌ హైలీ సెన్సిటివ్‌ కెమికల్‌ సెన్సర్‌'గా పేరు పెట్టిందామె. అమెరికా ప్రభుత్వ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ఈ ఆవిష్కరణను పరిశీలించి రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకంగా మారుతుందని మెచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ అధికారులు ఈ పరికరాన్ని 'ఔట్‌స్టాండింగ్‌ ఇన్నోవేషన్‌-2012'గా గుర్తించారు. జార్జి మేసన్‌ విశ్వవిద్యాలయం అధికారులు 'బెస్ట్‌ ఔట్‌స్టాండింగ్‌ గ్రాడ్యుయేట్‌' అవార్డు ఇచ్చారు. దీనిపై పేటెంట్‌కి దరఖాస్తు చేసుకుంది గీత.
ప్రయోగాల టీచర్‌
పేరు: యాటకారి శ్రీకాంత్‌
ఆవిష్కరణ: విద్యార్థులకు ఉపయోగపడే గణిత ప్రయోగాలు
గుర్తింపు: దక్షిణభారతస్థాయి వైజ్ఞానిక పోటీల్లో రెండోస్థానం
ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ యువకుడు యాటకారి శ్రీకాంత్‌. ఏడేళ్ల వయసపుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. షాక్‌తోపాటే ఎందుకిలా జరిగిందనే ఆలోచన మెదిలింది. అది మొదలు. ప్రతి పనికీ ఎందుకు? ఏమిటి? ఎలా? సూత్రం ఫాలో అయ్యేవాడు. విద్యుత్తు సాయంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేవాడు. టీచరుద్యోగంలో చేరాక జోరు మరింత పెరిగింది. ఆ వూపుతోనే బస్సులో అగ్నిప్రమాదం జరిగితే ఆటోమేటిగ్గా కిటికీ అద్దాలు తెరుచుకునే పరికరం రూపొందించాడు. ట్యాంకులోని నీరు వృథా పోకుండా విద్యుత్తు బల్బులు, రాగి తీగలు, బజర్‌తో నీటిమట్టం కొలిచే పరికరం తయారు చేశాడు. చవకైన ప్రొజెక్టర్‌, ద్వి, త్రి పరిమాణ జ్యామితీ పటాలు, బల్బులతో బేసి, సరిసంఖ్యల పట్టికలు ఆవిష్కరించాడు. తక్కువ ఖర్చుతో తయారైన డీవీడీ డిష్‌ ప్రొజెక్టర్‌లు, ఎల్‌ఈడీ అలారం అబాకస్‌లు అతడి చేతిలో రూపుదిద్దుకున్నవే.
శ్రీకాంత్‌కి బాగా పేరు తెచ్చింది భ్రమణ గుణకార పద్ధతి ఆవిష్కరణ. ఇదే అతడ్ని దక్షిణభారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రెండోస్థానంలో నిలిపింది. మద్రాస్‌లో జరిగిన ఈ సదస్సులో ఐదు రాష్ట్రాల నుంచి 65 మంది పోటీ పడ్డారు. నాలుగు పైపులు, మేకులు, చిన్న చెక్కడబ్బాతో ఆ పరికరం ఆవిష్కృతమైంది. పైపులపై ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేశాడు. దీని సాయంతో ఒకటి నుంచి 9999 వరకు గుణకార లెక్కల్ని తేలిగ్గా చేసేయొచ్చు. ఇది అబాకస్‌లాంటిదే. గణిత విద్యార్థులకెంతో ఉపయోగం. సైజు, మాడిఫికేషన్స్‌తో రాబోయే రోజుల్లో దీన్ని ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకొస్తానంటున్నాడు శ్రీకాంత్‌. చవకైన ప్రొజెక్టర్‌పై పేటెంట్‌ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning