కళాశాల స్థాయిని బట్టి సీట్ల కేటాయింపు

* జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రసాదరాజు

పశ్చిమ గోదావరి,భీమవరం : ఇంజినీరింగ్‌ విద్యార్థులు రాసిన పరీక్ష సమాధాన పత్రాలు స్కానింగ్‌ చేసి భద్రపరిచేందుకు యూనివర్శిటీలో ఇ-స్కానింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జేఎన్‌టీయూ(కె) రిజిస్ట్రార్‌ జి.ప్రసాదరాజు తెలిపారు. భీమవరంలోని విష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో మార్చి 10న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కోస్తాంధ్రాలోని ఎనిమిది జిల్లాల్లో 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు జేఎన్‌టీయూ(కె) పరిధిలోకి వస్తాయని, వీటిలో 15 మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. మహిళా కళాశాలలో స్వయం ప్రతిపత్తి(అటానమస్‌) హోదా పొందిన కళాశాల భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్‌ ఒక్కటి మాత్రమేనన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా పొందేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులే కారణమన్నారు.

గత రెండేళ్ల కాలంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు అధిక సంఖ్యలో నెలకొల్పారని, సీట్లు భర్తీకాక, అధ్యాపకులకు జీతాలు చెల్లించుకోలేక కళాశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. గత రెండేళ్ల కాలంలో 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్న సంఖ్య 267కు తగ్గిందన్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కళాశాల స్థాయిని బట్టి సీట్లు కేటాయించేలా ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఆయా యూనివర్శిటీలకు అనుమతి లభించిందన్నారు.

జేఎన్‌టీయూలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు రూ.1.50 కోట్లతో ఇ-స్టూడియో ఏర్పాటు చేశామన్నారు. దీంతో యూనివర్శిటీ పరిధిలో చెందిన ఏ కళాశాలకైనా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు వీడియో రూపంలో మాట్లాడే అవకాశముందన్నారు. విష్ణు విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.రవిచంద్రన్‌ మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి హోదాతో పరిశ్రమలకు అనుకూలంగా పాఠ్యాంశాలు మార్చుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వీఐటీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ దశిక సూర్యనారాయణ పాల్గొన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning