చదువుకునేటప్పుడే అవకాశాలు కల్పిస్తాం!

ఎంటెక్‌, బీటెక్‌ ఏం చదివితే ఏం లాభం.. నైపుణ్యాలుండటం ప్రధానం! క్లాస్‌పుస్తకాలు ఆ స్కిల్స్‌ని ఇవ్వకపోవచ్చు కానీ ఈ రకం శిక్షణ ఇచ్చే కంపెనీలున్నాయని ఎంతమందికి తెలుసు? చదువుకొంటూనే నచ్చిన రంగాల్లో పనిచేస్తూ ఉద్యోగ నైపుణ్యాలనీ, ఆదాయాన్ని సంపాదించిపెట్టే అవకాశాలని 'ఇంటర్న్‌ఫీవర్‌' ద్వారా అందిస్తున్నారు అర్పిత బృందం.
ఏడాదికి లక్షలమంది గ్రాడ్యుయేట్లు మనదేశంలో బయటకు వస్తున్నారు. కానీ వాళ్లందరికీ వెంటనే ఉద్యోగాలు రావడం లేదు. ఇలా డిగ్రీ అవగానే అలా సంస్థల్లో పనిచేసే నైపుణ్యాలూ, సామర్థ్యం చాలా తక్కువమందికి ఉండటమే కారణం. అదే చదువుకుంటూ పనిచేస్తే కనుక చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగానుభవంతో పాటూ నైపుణ్యాలు కూడా అబ్బుతాయి. ముఖ్యంగా యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణ డిగ్రీ పూర్తిచేసే నాటికి ఒక ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేస్తారు. పీజీ అయ్యేసరికి రెండుసార్లు కచ్చితంగా అయిపోతాయి. దాని వల్ల ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెడతారు. ఈ విధానాన్నీ మనకూ పరిచయం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నా స్నేహితురాళ్లు కృష్ణప్రియ, స్నేహలతో కలిసి ఇంటర్న్‌ఫీవర్‌ సంస్థను ప్రారంభించా.
ఇష్టం లేకున్నా ఇంజినీరింగ్‌ చదివాను...
నేను సీబీఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌, తరవాత యూఎస్‌లోని సిన్సినాటీలో పీజీ పూర్తి చేశాను. ఏడాదిపాటు యూఎస్‌లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకి పైప్‌లైన్‌ డిజైనింగ్‌ చేశా. కానీ నాకెక్కడా సంతృప్తి అనిపించలేదు. కృష్ణ ప్రియ, స్నేహలిద్దరూ ఎంబీఏ చేశారు. వాళ్లిద్దరూ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా బీమా పాలసీలు అమ్మేవారు. అది వాళ్లకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. ఇవన్నీ గమనించాక చదువుకుంటూనే ఆదాయన్నిచ్చే ఇంటర్న్‌షిప్‌ అందేలా చేయాలనిపించింది. అలా ఇంటర్న్‌ఫీవర్‌ ప్రారంభించాం.
శిక్షణ మొదలుకొని ఉద్యోగంలో చేరేవరకూ...
ఏ సంస్థల్లో విద్యార్థులు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉందో తెలుసుకొని ఆ వివరాలను కాలేజీలకూ, విద్యార్థులకు అందిస్తాం. మా వెబ్‌సైట్‌లోనూ ఉంచుతాం. అందులో నచ్చిన పనిని ఎంపిక చేసుకొని విద్యార్థులు ఈ మెయిల్‌ ద్వారా మాకు దరఖాస్తు చేసుకుంటారు. వారి అర్హతలకు తగినట్లుగా సంస్థలకు వివరాలు అందిస్తాం. అయితే అక్కడితో మా పని అయిపోదు. ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలో తర్ఫీదునిస్తాం. ఈమెయిల్‌ మర్యాద, కంప్యూటర్‌పై అవగాహన, ఎమ్‌ఎస్‌ వర్డ్‌, ఎక్స్‌ఎల్‌, ప్రోగ్రామింగ్‌, లాంగ్వేజ్‌ వంటివీ నేర్పిస్తాం. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ కోరుకొనే వారికి సీ, సీప్లస్‌, జావా నేర్పిస్తాం. తర్వాత విద్యార్థుల్ని సంస్థకు పనిచేస్తాం. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాం. ఇప్పటివరకూ బీటెక్‌, ఎమ్‌టెక్‌, బీఎస్సీ, బీఏ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, కంటెంట్‌ రైటింగ్‌, వెబ్‌డిజైనింగ్‌, వెబ్‌డెవలప్‌మెంట్‌, ఎంబీయే రంగాల్లో వారికి శిక్షణనందించాం.
రెండు వేల రూపాయల నుంచీ..
చిన్న సంస్థలకి ఏడాదిలో కొన్ని నెలలే పని ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ వేతనానికి విద్యార్థుల చేత పనిచేయించుకోవడానికి ఇష్టపడతాయి. అటువంటప్పుడూ విద్యార్థుల అవసరం ఉంటుంది. దీని వల్ల సంస్థలకు ఖర్చు తగ్గుతుంది. విద్యార్థులకు ఉద్యోగానుభవంతోపాటూ ఆదాయం అందుతుంది. విద్యార్థులకు ఇలాంటి అవకాశాలనూ కల్పిస్తాం. ఇక డిగ్రీ విద్యార్థులు అయితే మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి మూడో ఏడాది వరకూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీటెక్‌ వాళ్లకు ఆఖరి సెమ్‌లో.. అలా మేం నియమించిన వాళ్లలో రెండు వేల నుంచి పదిహేను వేల వరకూ వేతనం అందుకొంటున్నవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ రంగం ఎంచుకొన్నవారికి 5000 నుంచి 10000 రూపాయలు అందుతోంది.
ఎంత మందితో పనిచేస్తున్నాం...
దేశవ్యాప్తంగా ఆరువందల సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. నూటయాభై కాలేజీలకు సంబంధించిన విద్యార్థులకు సమాచారం అందిస్తున్నాం. చెన్నై, బెంగళూరు, వైజాగ్‌లోని కాలేజీలూ మా సేవలని వినియోగించుకొంటున్నాయి. ఇప్పటివరకూ మేం 2000 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం అందించాం. అందులో వెయ్యి మంది వరకూ పూర్తి ఉచితంగా ఈ సేవలు అందుకొన్నారు. తక్కినవారికి మాత్రం శిక్షణ ఇచ్చినందుకు కొంత రుసుము తీసుకుంటున్నాం. ఇలా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసిన వాళ్లలో కొంతమంది శాస్వత ఉద్యోగాలని పొందారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్లకి సాయం అందించేందుకు 90 మంది విద్యార్థి రాయబారుల్ని మేం ఏర్పాటు చేశాం.
అమ్మాయిలకే డిమాండ్‌....
అవకాశాలు అమ్మాయిలకు ఇవ్వాలా.. అబ్బాయిలకు ఇవ్వాలా అని ఆలోచించినప్పుడు అమ్మాయిలకే అంటున్నాయి సంస్థలు. ఎందుకంటే అమ్మాయిలు మల్టీటాస్కర్లు. చదువుకొంటూ ఓపిగ్గా ఉద్యోగం చేయడంలో వాళ్లకు వాళ్లే సాటి మంచి ఫలితాలు రాబడతారనేది సంస్థల అభిప్రాయం. త్వరలో గ్రామీణ విద్యార్థులకు కూడా మా సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning