నైపుణ్యాలపై గురి పెట్టండి

పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యలో రాణించిన చాలా మంది వృత్తి జీవితంలో అడుగుపెట్టలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరుల్లోని పలు ఉత్పత్తి, నిర్మాణ, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన 102 చిన్న, పెద్ద సంస్థల్లో ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది ఎంబీయే విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్థుల్లో కమ్యూనికేషన్‌, చొరవ తీసుకోవడం వంటి పలు నైపుణ్యాలు లేకపోవడం వల్లే అవకాశాలు ఇవ్వలేకపోతున్నామని 82 శాతం సంస్థలు ఈ సర్వేలో పేర్కొనడం గమనార్హం.
సంస్థ అభివృద్ధికి తోడ్పడగల తాజా పట్టభద్రులపైనే సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. వృత్తి జీవితంలో అభ్యర్థులు తమ పాత్రను ఎంతమేరకు సమర్థంగా నిర్వర్తించగలరో అనేది క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. చొరవ, పని వాతావరణానికి అలవాటు పడడం వంటి నైపుణ్యాలు అభ్యర్థుల్లో చూస్తున్నారు. ఉన్నత విద్యలో రాణించినంత మాత్రాన అన్ని నైపుణ్యాలు ఉంటాయని రిక్రూటర్లు భావించడం లేదు. విద్యలో అనుభవం ఒక్కటే కాదు ఇతరత్రా నైపుణ్యాలు ఉన్నవారికే సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి.
భావ వ్యక్తీకరణ: మౌఖిక పరీక్ష సమయంలో అభ్యర్థి స్పందించే తీరు రిక్రూటర్లు పరిశీలిస్తారు. భావవ్యక్తీకరణలో మెరుగ్గా ఉన్న వారినే ఎంపిక చేసుకుంటారు. కార్యాలయంలో ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆ భాషలో ప్రావీణ్యంతోపాటు చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పగలుతున్నారా అనేది పరిశీలిస్తారు. కళాశాల స్థాయి నుంచే వ్యాసాలు రాయడం అలవర్చుకోవాలి. క్యాంపస్‌లో జరిగే ఈవెంట్లలో పాల్గొనాలి.
సాంకేతికత: సాంకేతికంగా వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు గమనించకపోతే వృత్తి జీవితంలో ముందుకు దూసుకెళ్లలేరు. కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు, మొబైల్‌యాప్‌లు రావడంతోపాటు అవి వృత్తి జీవితంతో ముడిపడి ఉంటున్నాయి కూడా. తాజా పట్టభద్రులకు తప్పని సరిగా కంప్యూటర్‌పై అవగాహన ఉండాలని రిక్రూటర్లు చెబుతున్నారు. ఈ-మెయిల్‌, బ్లాగులు, వెబ్‌ కాన్ఫరెన్స్‌ల్లో అభ్యర్థి అవగాహనను పరిశీలిస్తున్నారు.
* కంప్యూటర్‌లో ప్రాథమిక నైపుణ్యాలైన ఎంఎస్‌ వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, స్ప్రెడ్‌షీట్‌ నేర్చుకోవాలి
* వ్యక్తిగతంగా ఓ వెబ్‌సైట్‌ రూపొందించుకొని దాన్ని నిర్వహించగలగాలి.
* ఆర్థిక వ్యవహారాల నిమిత్తం స్ప్రెడ్‌షీట్స్‌ ఉపయోగించడం అలవర్చుకోవాలి
వైఖరి: వృత్తిజీవితంలో రాణించడానికి అంకితభావం, నైపుణ్యంతోపాటు అభ్యర్థి వైఖరి కూడా సరిగా ఉండాలి. అప్పగించిన పని ఒక్కటే చేసుకుంటూ ఇతరత్రా సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం తగదు. అదనపు బాధ్యతలు తీసుకోవాలి.
నాయకత్వం: ఎంపిక చేసిన చేసిన అభ్యర్థుల్లో ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది రిక్రూటర్లు చూస్తారు. నలుగురికీ సాయపడుతూ సకాలంలో లక్ష్యాలు చేరుకోవాలన్న అంకితభావం, చేరుకోగలనన్న ఆత్మవిశ్వాసం అభ్యర్థిలో ఉంటే బృందనాయకుడు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. కళాశాల స్థాయిలో క్యాంపస్‌ల్లో నిర్వహించే నాయకత్వ శిక్షణలో పాల్గొనడం ద్వారా మరింత నైపుణ్యం సాధించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning