హార్డ్‌గా ఉంటేనే సాఫ్ట్‌గా రాణింపు

 • * విభిన్న దేశాల ప్రాజెక్టుల్లో పని
  * వృత్తి నైపుణ్యంతోపాటు సాంస్కృతిక దృక్పథం ఉండాలి
  * ఒత్తిడిని తట్టుకోగలిగితేనే మనుగడ

  - టెక్‌ మహీంద్రా చీఫ్‌టెక్నాలజీ అధికారి ఎ.ఎస్‌.మూర్తి
  హైదరాబాద్‌: చదువు పూర్తికాగానే అయిదంకెల జీతం.. వారాంతంలో రెండు రోజుల సెలవు..

  విదేశాలకు వెళ్లే అవకాశం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంపై యువత అమితంగా మోజు చూపేందుకు కారణాలివే. చూసేవారికి ఇలాంటి సుఖాలు కనిపించినా.. సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వృత్తి జీవితంలో తీవ్ర ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయి. విభిన్న దేశాల ప్రాజెక్టుల్లో భిన్న సమయాల్లో పనిచేయాల్సి వస్తోంది. విపణిలో గిరాకీ పెరుగుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు నేర్చుకోకపోతే.. వృత్తి జీవితంలో ఎదగకపోగా, ఉపాధిని కోల్పోయి నైరాశ్యంలో మునిగే పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఒత్తిడిని తట్టుకోగలిగే మనస్తత్వం ఉన్నవారికే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నత స్థానాలకు చేరే అవకాశం ఉంటుందని టెక్‌ మహీంద్రా చీఫ్‌టెక్నాలజీ అధికారి (ఎంటర్‌ ప్రైజెస్‌) ఎ.ఎస్‌.మూర్తి స్పష్టం చేస్తున్నారు. 'ఈనాడు'తో ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పారు. ఆ వివ‌రాలు..
       నూతన నియామకాల్లో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవసరం అవుతారనే భావనతో ప్రాజెక్టులో పనిచేయకున్నా కొంతమందిని అగ్రశ్రేణి సంస్థలు గతంలో కొనసాగించేవి. దాదాపు ఏడాది ముందే విద్యా ప్రాంగణాల్లో నియామకాలు జరిపి వేలమందిని సిద్ధంగా ఉంచుకునేవి. ఎవరు ముందు ప్రాంగణ నియామకాలు జరిపితే, మెరికల్లాంటి విద్యార్థులు తమకు లభిస్తారనే పోటీతత్వం సంస్థలకు ఉండేది. ఇప్పుడు ప్రాజెక్టు వస్తుందని నమ్మకం కుదిరాక (జస్ట్‌ ఇన్‌ హైరింగ్‌) కొత్త వారిని/ అనుభవజ్ఞులను నియమించుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రస్తుత నిపుణులనే కొత్త ప్రాజెక్టులకు రొటేట్‌(బదిలీ) చేస్తున్నారు. భిన్న నగరాల్లో శాఖలున్న సంస్థలు, ఏ ప్రాంతంలోని శాఖకు ఆ ప్రాజెక్టు వస్తే, అక్కడకు సిబ్బందిని బదిలీ చేస్తున్నాయి. సిబ్బంది వినియోగాన్ని(యుటిలైజేషన్‌) పెంచడం ద్వారా లాభదాయకత పెంచుకునేందుకు అన్ని సంస్థలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. వ్యక్తిగతంగా వెళ్లడం ఇష్టం లేకున్నా, వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉపాధి పొందాలనుకే వారు, ఈ రంగంలో పైకి ఎదగాలనుకునేవారు వీటన్నిటికీ సిద్ధపడాల్సిందే.
  ప్రతి నాలుగయిదేళ్లకూ విద్యార్థి జీవితమే
       సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు క్రమం తప్పక పరిశీలిస్తే, ఏ సాంకేతికతపై అధిక ఆదాయం వస్తుందో తెలుస్తుంది. అంటే ఆయా సాంకేతికత వినియోగం అధికంగా ఉందన్నమాట. ప్రతి నాలుగయిదేళ్లకు ఆయా సంస్థల ఆదాయంలో సుమారు 50 శాతం సరికొత్త టెక్నాలజీలపైనే వస్తోంది. దాదాపు 30 ఏళ్ల పాటు వృత్తి జీవితం అంటే.. ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా, కనీసం ఆరేడుసార్లు కొత్త సాంకేతికతపై శిక్షణ పొందాలి. అన్ని విభాగాల్లో మొబిలిటీ ప్రవేశించిన తరుణంలో.. ఆయా విభాగాలను మొబైల్‌తో అనుసంధానించే సాఫ్ట్‌వేర్‌కు అధిక గిరాకీ లభిస్తోంది. మొబైల్‌లో టికెట్‌ బుకింగ్‌, క్రికెట్‌ స్కోర్‌, బ్యాంకు ఖాతాల వీక్షణం, ఆన్‌లైన్‌ చాటింగ్ లాంటి అప్లికేషన్లను ఐటీ గురించి తెలియని వారూ వాడుతున్నారని, వీరికి అనువుగా మరింత మెరుగైన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. సంస్థల ఖర్చులు తగ్గించే క్లౌడ్‌, భద్రతా సాఫ్ట్‌వేర్‌, అనలిటిక్స్‌ విభాగాలకూ ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు బాగుంటుంది. సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలే, కొత్త ప్రాజెక్టులకు తమ నిపుణులు సిద్ధం అయ్యేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఆయా కార్యక్రమాల్లో విద్యార్థిలా నేర్చుకోవడంతో పాటు, తమకు నైపుణ్యం ఉన్న అంశాలపై తోటివారికి శిక్షణ ఇచ్చేందుకూ సిద్ధంగా ఉండాలి. ఒకపక్క రోజువారీ విధులు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... విద్యార్థిలా అధ్యయనం చేయాల్సిందే. ఇవన్నీ శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోను చేస్తాయి.

  40-50 దేశాల్లోని ఖాతాదారులతో వ్యవహరించాలి

  దిగ్గజ ఐటీ సంస్థల ఆదాయంలో 90-95 శాతం విదేశీ ఖాతాదారుల నుంచే వస్తోంది. అమెరికా, బ్రిటన్ లాంటి ఆంగ్ల దేశాల ప్రాజెక్టుల్లో మాత్రమే పనిచేస్తామని భావించే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ఆధారంగా 40-50 దేశాల్లోని ఖాతాదారులతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏ దేశం నుంచి ప్రాజెక్ట్‌ వస్తుందో తెలియదు. ఐరోపా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి అన్ని ఖాండాల, దేశాల్లోని ఖాతాదారుల కోసం పనిచేయాలి. అందరూ ఆంగ్లంలోనే వ్యవహరించరు, ఉన్నా యాస-సంస్కృతి, వారి పని వేళలు వేరుగా ఉంటాయి. అందుకనుగుణంగా ఇక్కడ పనిచేయాలి. స్పానిష్‌, జర్మనీ, ఫ్రెంచ్‌, జపనీస్ లాంటి భాషలూ నేర్చుకోవాల్సి రావచ్చు. ఖాతాదారుల అంచనాలకు మించి పనిచేస్తేనే ప్రశంస లభిస్తుంది. చెప్పిన సమయంలో, నాణ్యంగా ప్రాజెక్టు పూర్తిచేస్తేనే, ఖాతాదారు నుంచి కొత్త ఆర్డర్లు వస్తాయి. గతంలో ఏడాది-రెండేళ్ల పాటు ఒక ప్రాజెక్టు కొనసాగేది. ఇప్పుడు ప్రాజెక్టు కాలపరిమితి ఎంత ఉన్నా, 2-3 నెలలకు ఒకసారి ఆ ప్రాజెక్టులో ఎంత పని జరిగిందనే అంశంపై ఖాతాదారు ఆరా తీస్తున్నారు. ఉద్యోగులపై ఈ ఒత్తిడి అధికంగా ఉంటోంది. ఒక ప్రాజెక్టులో బాగా పనిచేస్తే, మరింత మంచి-క్లిష్టమైన ప్రాజెక్టులో చోటు దక్కుతుంది. 'సాఫ్ట్‌వేర్‌ రంగంలో బాగా పనిచేసినందుకు బహుమతి మరింత పని ఇవ్వడమే'. గతంలో ఎంత బాగా పనిచేసినా.. జరుగుతున్న ప్రాజెక్టులో ఎంత బాగా పనిచేస్తున్నారు అనేదే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు గమనిస్తుంటాయి. ఈ అంశాల్లో టెక్నాలజీతో పాటు భావ వ్యక్తీకరణ కూడా కీలకం. కలసి పనిచేయడం, పనిచేయించడం, ఖాతాదారులతో ఓర్పు, నేర్పుగా వ్యవహరించడంపైనే విజయం ఆధారపడుతుంది

  పని సామర్థ్యం పెరుగుతూనే ఉండాలి
  ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం పైన సిబ్బంది వేతనాలకే అవుతుంది. అందుకే పని సామర్థ్యం పెంచుకోవాలి. ఒకే రకమైన ప్రాజెక్టుల్లో చేస్తున్నప్పుడు, పని త్వరగా జరిగేలా చూస్తే సంస్థకు లాభం. ఒకసారి చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండాలి. వేతన పెంపు తక్కువగానే ఉన్నా, అదీ వారి వ్యక్తగత సామర్థ్యాన్ని గమనించే ఇస్తున్నాయి. సిబ్బంది ఒక ప్రాజెక్టు ఎలా పూర్తిచేశారనే విషయాన్ని సంస్థలు నమోదు చేస్తాయి. మళ్లీ అలాంటి ప్రాజెక్టే వచ్చినప్పుడు కొత్తవారితో చేయిస్తూనే, పాత అనుభవాన్ని వివరిస్తాయి. ఇందుకోసమే కొత్తగా చేరేవారు తమ సీనియర్ల నుంచి ఆయా విషయాలు నేర్చుకోవాలి. తాము పనిచేసిన విధానాన్ని తమ జూనియర్లకు తెలపాలి. గతంలో ఆదాయానికి తగినట్లు సిబ్బంది నియామకాలు జరిపేవారు. ఇప్పుడు ఆదాయం పెరిగినా, సిబ్బందిని పెంచడం లేదు సరికదా.. తగ్గించేందుకు చూస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఖచ్చిత ధర(ఫిక్స్‌డ్‌ కాస్ట్‌), పనిచేసిన సిబ్బంది-సమయం ఆధారంగా వసూలుచేసే మొత్తం (టైమ్‌ అండ్‌ మెటీరియల్‌) చెరి సగం ఉండటమే దీనికి కారణం.

  ఒత్తిడి అధిగమించేందుకు..
  మన ఎదుట లేని, చాలా సందర్భాల్లో వీడియో-టెలీ కాన్ఫరెన్స్‌ పద్ధతిలో మాత్రమే కలుసుకునే ఖాతాదారులతో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ సమయం నుంచీ కొత్త వారితో, ఇతర ప్రాంతీయులతో సంభాషించడం ద్వారా భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. రోజూ 45 నిమిషాలు నడక, జాగింగ్‌ వ్యాయామాలు చేయాలి. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అత్యంత కీలకం. తమ విధులకు తగ్గట్టు పనిచేయాలి. పైస్థాయికి ఎదిగినా, ఇంకా ప్రారంభ స్థాయి పనులే చేయాలనుకోవడం సరికాదు. వృత్తి, వ్యక్తిగత జీవితానికి సరిహద్దు నిర్ణయించుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితేనే విధులను సమర్థంగా నిర్వహించగలరు. కార్యాలయాన్ని వీడి ఇంటికొచ్చినా.. కార్యాలయ మెయిల్స్‌ చూడాలంటూ, మొబైల్‌నే అంటిపెట్టుకుని ఉండటం సరికాదు.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning