ప్రతిభ, పరిశోధనలకు... 'నెట్‌'

జాతీయస్థాయిలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించే అర్హత పరీక్ష 'నెట్‌' ప్రాముఖ్యం ఏమిటి? దీనికి ప్రభావశీలంగా సంసిద్ధమవటానికి ఏయే మెలకువలు పాటించాలి?
యూజీసీ, సీఎస్‌ఐఆర్‌ల ద్వారా ఏటా జూన్‌, డిసెంబర్‌లలో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) అనే అర్హత పరీక్షను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రజ్ఞపాటవాలూ, పరిశోధనాభిరుచీ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయాన్నందించడం, ప్రతిభావంతులైన అధ్యాపకుల నియామకాలకు తోడ్పడటం ఈ పరీక్ష ముఖ్యోద్దేశం. దీనిలో ఉత్తీర్ణులై, అర్హత సంపాదించుకున్నవారు పీహెచ్‌డీలో ప్రవేశం పొందాక గరిష్ఠంగా ఐదేళ్లవరకు ప్రతినెలా ఉపకార వేతనం అందుతుంది. విజ్ఞాన, సాంకేతిక రంగానికి చెందినవారికి నిర్వహించే పరీక్షలను 'సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌' అనీ, ఇతర సబ్జెక్టుల అభ్యర్థులకు జరిపే పరీక్షలను 'యూజీసీ నెట్‌' అనీ వ్యవహరిస్తారు. తొంబైకి పైగా సబ్జెక్టుల్లో ఏడాదిలో రెండుసార్లు ఈ పరీక్షలను వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
అర్హతలు
ఈ పరీక్షల నిర్వహణలోని ముఖ్యోద్దేశం ప్రమాణాలతో కూడుకున్న విద్యాబోధన పద్ధతుల క్రమబద్ధీకరణ, విద్యార్థులు ఆర్థిక సమస్యల్లేకుండా పరిశోధనలు చేసుకుని డాక్టర్‌ పట్టా పొందగలగడం. కనీసం 55% మార్కులతో పోస్టుగ్రాడ్యుయేట్‌ చేసినవారు ఈ పరీక్షలు రాయటానికి అర్హులు. పరిశోధన కోసం ఉపకార వేతనం ఆశించే విద్యార్థులకు అర్హత ప్రమాణాలను బట్టి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ఇస్తారు. దీనికి అభ్యర్థులు 28 సంవత్సరాల వయసు మించి ఉండకూడదు. వివిధ రిజర్వేషన్లున్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
అయితే లెక్చరర్ల పరీక్షకు ఎటువంటి వయః పరిమితీ లేదు. ఈ లెక్చరర్‌షిప్‌లో అర్హులైన అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో/ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు తాము పీజీలో చదివిన సబ్జెక్టులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 2002 తరువాత పీహెచ్‌డీ చేసినవారు కూడా నెట్లో అర్హులైతేనే అధ్యాపకుల ఉద్యోగానికి అర్హులు.
జూన్‌ 2002 సంవత్సరం తరువాత ఏదైనా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం యూజీసీ తరపున నిర్వహించిన స్లెట్‌ (స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో అర్హులైన అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఉద్యోగానికి అర్హులు. వారి అర్హతకు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉండదు. అఖిలభారత స్థాయిలో గుర్తింపు ఉండాలంటే 'నెట్‌' తప్పనిసరి.
జనరల్‌ కేటగిరి వారికి పరీక్ష రుసుము రూ.400. ఈ పరీక్షల ఫలితాలు అక్టోబర్‌, ఏప్రిల్‌ నెలల్లో విడుదలవుతాయి. వీటిని యూజీసీ నెట్‌ వెబ్‌సైట్లో www.ugc.ac.in ఉంచుతారు.
పరీక్ష విధానం
ఈ పరీక్షలో మూడు పేపర్లుంటాయి. ప్రతి పేపర్‌లో కూడా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి.
మొదటి పేపర్‌: 1.15 గంటలపాటు జరిగే ఈ పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలుంటాయి. వీటిలో ఏవేని 50 ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వాలి. ఒకవేళ ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సమాధానాలున్న మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో అభ్యర్థి పరిశోధన, బోధన అభిరుచులకు సంబంధించిన సాధారణ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు.
రెండో పేపర్‌: మొదటి పేపర్‌ పూర్తయినవెంటనే ఈ పేపర్‌కు సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా 1.15 గంటల పాటు జరిగే పరీక్ష. ఇందులో అభ్యర్థి ఎన్నుకున్న సబ్జెక్టుకు సంబంధించి 50 ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేపర్‌లో కూడా ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు.
మూడో పేపర్‌: 75 ప్రశ్నలుండే ఈ పేపర్లో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సి ఉంటుంది. కాలవ్యవధి రెండున్నర గంటలు. తప్పు సమాధానాలకు మార్కుల్లో ఎటువంటి కోతా ఉండదు.

ఎంపిక విధానం
ప్రతి పేపర్‌లోనూ కనీస మార్కులు వచ్చినవారి జాబితా నుంచి మొదటి 15% మందిని అర్హులుగా ప్రకటిస్తారు. వీరు అధ్యాపకుల ఉద్యోగాలకు అర్హులు. ప్రతిభ ఆధారంగా ఇంకొక జాబితా తయారు చేస్తారు. వీరిని జేఆర్‌ఎఫ్‌కు అర్హులుగా ప్రకటిస్తారు. వీరు అధ్యాపక ఉద్యోగాలకు కూడా అర్హులే. నియమ నిబంధనల మేరకు ఉపకారవేతనానికి కూడా వీరు అర్హులవుతారు. నెట్‌లో అర్హత మొదటి మెట్టు మాత్రమే. ఉద్యోగాల భర్తీ ఆయా రాష్ట్రాల, విశ్వవిద్యాలయాల నిబంధనలకు లోబడి నియామకాలు జరుగుతాయి.
అర్హత పరిధి
సెట్‌/ స్లెట్లో అర్హులైనవారు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. నెట్‌లో అర్హులైనవారు అఖిల భారత స్థాయిలో అన్ని కళాశాలల ఉద్యోగాలకూ అర్హులే. జేఆర్‌ఎఫ్‌లో అర్హత సంపాదించినవారు అధ్యాపక ఉద్యోగాలకు కూడా అర్హత సాధిస్తారు. నెట్‌లో పొందిన అర్హత రెండు సంవత్సరాల పర్యంతం ఉపయోగపడుతుంది. అంటే ఒక సంవత్సరంలో అర్హత సంపాదించి, ఆపై సంవత్సరంలో కూడా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. ప్రభుత్వరంగ సంస్థలు కూడా నెట్‌లో అర్హులైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా నియామకాలు జరుపుకోవాలనే యోచనలో ఉన్నాయి. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌కి ప్రతినెలా రూ. 12,000 ఉంటుంది. రెండేళ్ల తరువాత అభ్యర్థి పురోగతిని బట్టి ప్రతినెలా రూ.14,000, వార్షిక ఆపత్కాల, అవసర మంజూరీ కింద రూ.20,000 ఇస్తారు.
ఎలా తయారవ్వాలి?
ఏ పరీక్షలోనైనా సఫలమవ్వాలంటే పకడ్బందీ ప్రణాళిక, దాని నిర్దిష్టమైన అమలు, వనరుల సమతుల్యమైన ఉపయోగం చాలా అవసరం. ఈ పరీక్షలు ఏ ఒక్క కోర్సుకు సంబంధించిన సిలబస్‌ ప్రకారం ఉండకపోవచ్చు. ఉదాహరణకు బీటెక్‌ (ఈసీఈ) చేసిన అభ్యర్థులు తమ బీటెక్‌లోని సబ్జెక్టులేకాక ఎంఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌)లోని కొన్ని పాఠ్యాంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. బీటెక్‌ (సీఎస్‌ఈ) చేసినవారు ఎంబీఏలోని కొన్ని సబ్జెక్టులు చదవాల్సివుంటుంది. పరీక్షలో ప్రశ్నలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వాటి సమగ్ర సారాంశం మీద ఆధారపడి ఉంటాయి.
స్థూలంగా ఈ కింది పద్ధతిని అనుసరిస్తే ఫలితం ఉంటుంది.
* సిలబస్‌ ప్రకారం మంచి పుస్తకాలు, అమలు పరచగలిగిన ప్రణాళిక చేసుకోవాలి.
* చదివేటపుడు ముఖ్యమైనవీ, ప్రాముఖ్యం లేనివీ అనే ప్రాతిపదికను అనుసరించవద్దు. ప్రతిభకు ఎల్లలు ఉండకూడదనే విషయాన్ని మరవకూడదు.
* నెట్‌లో సిలబస్‌ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బాగా తయారవ్వాలి. నోట్సు తప్పకుండా తయారుచేసుకోవాలి.
* డిగ్రీ చదివిన సబ్జెక్టులను కూడా తిరిగి చదవాలి.
* ఎప్పటికప్పుడు పరీక్ష విధానంలోని మార్పులు తెలుసుకుంటూ ఉండాలి. దీనికోసం తరచుగా యూజీసీ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి.
* ఏ ప్రశ్నపత్రానికి ఎంత సమయం అన్నది ఆకళింపు చేసుకుని ఉండాలి.
* మొదటి ప్రశ్నపత్రానికి కావాల్సిన వనరులను సరిగా సమకూర్చుకోవాలి. దీనికోసం కొన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధించాలి. గత సంవత్సరపు ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్లో లభ్య మవుతాయి.
* పుస్తకాలలో ఉన్న పరిధిని దాటి ఒక మెట్టు పైనే పరీక్షల కోసం తయారవాలి.
* కనీసం వారానికొక మాదిరి ప్రశ్నపత్రం సాధించాలి.
* చివరి నిమిషంలో తయారవ్వొచ్చనే అపోహ వదులుకుంటే చాలా మంచిది. కేవలం పరీక్షలో ఉత్తీర్ణులైతే సరిపోదు. ఆపైన 15% విద్యార్థుల జాబితాలోకి వెళ్లగలగాలి. ఈ పరీక్షల్లో రాణించడానికి చాలామంది దాదాపు ఏడాది వరకు సమయం తీసుకుని తయారవుతారనే విషయం గుర్తుంచుకోవాలి.
* శిక్షణ తీసుకుంటున్నవారు తమకెలాగూ వస్తుందనే ధీమాతో ఉండకూడదు. ఏ కోచింగ్‌ సంస్థ కూడా మొత్తం కోర్సును చెప్పలేదు. అక్కడ కొన్ని మెలకువలు మాత్రమే నేర్చుకుంటారు. అసలు సన్నద్ధత అభ్యర్థులు ఎవరికి వారు చేసుకోవాలని మరవకూడదు.
* ఒకవేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకకపోతే సమయం వృథా చేయకుండా ఆ తరువాతి ప్రశ్నపై దృష్టి పెట్టడం ఉత్తమం. చివర్లో సమయం మిగుల్చుకుని రాని ప్రశ్నలకు సమయం కేటాయించవచ్చు.
* ఒకే పాఠ్యాంశానికి ఎన్నో రకాల నోట్సును తయారుచేసుకోవటం లాంటివి విలువైన సమయం వృథా చేయటమే. అలాకాకుండా మౌలికాంశాలమీద శ్రద్ధవహించి నేర్చుకుంటే ఎంతో ఉపయోగం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning