పాఠ్యాంశ ప్రణాళికలో మార్పులు అవసరం

* ఏఐసీటీఈ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. మంత

ఈనాడు-విజయవాడ, న్యూస్‌టుడే- మొగల్రాజపురం : ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు లోపిస్తున్నాయని ముఖ్యంగా పరిశ్రమల్లోని అవసరాలపై వారికి అవగాహన ఉండడం లేదని ఈ విధానం మారాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి డాక్టర్‌. ఎస్‌.ఎస్‌.మంత అన్నారు. విద్యార్థులు కూడా కేవలం పాఠ్యాంశాల్లోని అంశాలను తప్ప సృజనాత్మకంగా ఆలోచించడం లేదని ఈ దిశగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దాలని ఆయన ఉద్బోధించారు. మార్చి 18న ఇక్కడి గేట్‌వే హోటల్‌లో (సీఐఐ) భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పలు ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ చదివి బయటకు వస్తున్న వారు లక్షల్లో ఉంటుండగా అందులో కేవలం 25 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని ఇందుకు కారణం నైపుణ్యం, సృజనాత్మకత విద్యార్థుల్లో లోపించడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు పాఠ్యాంశ ప్రణాళికల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. వాస్తవానికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి విద్యాప్రమాణాలకు అనుగుణంగానే పాఠ్యాంశాల ప్రణాళికను రూపొందిస్తుందని వీటిని అనుసరిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించవచ్చన్నారు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉండడంతో వారు సొంతంగా ప్రణాళిక రూపొందించుకోవడంతో తాము ఇచ్చే వాటిని అమలు చేయడంలేదని తెలిపారు.

పరిశ్రమల్లోని అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పలు కంపెనీలతో మాట్లాడి కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైతే ప్రాథమికంగా కొంతవరకు నిధులు తాము సమకూర్చుతామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పోటీప్రపంచంలో రాణించాలంటే కళాశాలలు సైతం వినూత్నంగా ఆలోచిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యస్థాయిని పెంచాలని ఆదిత్య విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి తెలిపారు. కేవలం అధ్యాపకులకు పాఠ్యాంశాలు బోధించడమే కాదు విద్యార్థులు తమ సొంతశక్తితో విషయపరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు.

మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్‌ అనిల్‌ వర్గీస్‌ మాట్లాడుతూ తాము కళాశాలలకు అందిస్తున్న అత్యాధునిక సాఫ్ట్‌వేర్లు వాటి ప్రయోజనాల గురించి వివరించారు. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని వీటిని అందిస్తున్నామన్నారు. కళాశాలలు విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త కంప్యూటర్‌ అంశాలపై అవగాహన కలిగిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సీఐఐ తరఫున తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి విజయవాడ జోన్‌ ఛైర్మన్‌ వి.వి.ఎం కృష్ణ వివరించారు. సమావేశంలో ఎఫ్ట్రానిక్స్‌ అధినేత రామకృష్ణ, ప్రైజ్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈడీ తలశిల మురళి తదితరులు పాల్గొన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning