అధిక నైపుణ్యం ఉంటేనే ఐటీ ఉద్యోగాలు

- నాస్‌కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్

అధిక నైపుణ్యం ఉన్న వారికే ఐటీ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని, దాదాపు 31 లక్షల మందికి ప్రతక్ష్యంగా (ఇందులో 10 లక్షల మంది మహిళలు) ఉపాధి కల్పిస్తున్న ఐటీ పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 1.66 లక్షల మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ అన్నారు. ఐటీ రంగంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు ఉన్న అవకాశాలపై ఇట్స్ఏపీ (ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ పాల్గొని ఐటీ రంగ పరిస్థితిని విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో 108 బిలియన్ డాలర్ల మేర దేశీయ ఐటీ, బీపీఎం రంగాల్లో బిజినెస్ జరిగిందన్నారు. ఐటీ సంస్థల ఆదాయంలో 13 శాతం వృద్ధి లభిస్తే, ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించకూడదన్నారు. అధిక నైపుణ్యం కలిగిన వారికే ఐటీ రంగంలో అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల నూతన నియామకాల్లో వృద్ధి తగ్గుతుందని అన్నారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య కొరత, అమెరికా ఇమిగ్రేషన్ బిల్లు వంటివి ఐటీ పరిశ్రమకు సవాళ్లుగా మారాయన్నారు. ఇంజినీర్లే కాకుండా, ఐటీ నేపథ్యం ఉన్న ఇతర కోర్సుల విద్యార్థుల్లోనూ నైపుణ్యం వృద్ధి చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning