జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు మీరు సిద్ధమేనా?

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన వెలువరించింది. ఐటీ, ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మందకొడిగా ఉన్న ఈ రోజుల్లో ఇదో చక్కని అవకాశంగా భావించి అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నెల జీతం రూ.35వేలకు పైగా వచ్చే జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. 18-32 సం||ల వయసులో నాన్‌-గెజిటెడ్‌ పోస్టులో చేరితే రిటైర్‌మెంట్‌ నాటికి గెజిటెడ్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకొనే అవకాశం ఈ పరీక్ష ద్వారా ఉంటుంది.
పరీక్ష తేదీ: రాత పరీక్ష- 25-05-2014
పేపర్‌ 1: ఉదయం 10 గం||ల నుంచి మధ్యాహ్నం 12 గం||ల వరకు
పేపర్‌ 2: మధ్యాహ్నం 2 గం||ల నుంచి సాయంత్రం 4 గం||ల వరకు
దరఖాస్తు చివరి తేదీ: 28-03-2014
ఫీజు వివరాలు:
మహిళలు, SC/STఅభ్యర్థులకు ఉచితం.
పురుషులకు 100/-
అభ్యర్థులు http://ssconline.nic.in లేదా http://ssconline2.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష 3 అంచెలుగా జరగనుంది.
1. పేపర్‌ 1
2. పేపర్‌ 2
3. మౌఖిక పరీక్ష
పేపర్‌ 1: 2 గం||ల పాటు జరిగే పరీక్షలో 200 మార్కులుంటాయి. మొత్తం 3 విభాగాలు. 1, 2 విభాగాలకు చెరో 50 మార్కులు. మూడో విభాగానికి 100 మార్కులు.
పేపర్‌-1లోని ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలకు సమాధానం OMR Sheetపై గుర్తించాల్సివుంటుంది. సరైన సమాధానానికి '1' మార్కు. తప్పు సమాధానానికి '0.25' మార్కు తగ్గిస్తారు.
3 విభాగాలు
1) జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌
2) జనరల్‌ ఎవేర్‌నెస్‌
3) జనరల్‌ ఇంజినీరింగ్‌
ఉదయం పేపర్‌ 1 పరీక్ష రాసిన అభ్యర్థులందరూ మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్‌ 2: ఇంజినీరింగ్‌ పట్టభద్రులు వారి విద్యాసంవత్సరాల్లో చదువుకున్న సిలబస్‌ మీద ప్రశ్నలు ఉంటాయి. 2 గం||ల పాటు జరిగే ఈ పరీక్షకు 300 మార్కులు కేటాయించారు. ఈ పేపర్‌-2 మొత్తం ఆబ్జెక్టివ్‌ టైప్‌ కాకుండా ప్రతి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. పేపర్‌-2లో ఎ, బి, సి అనే 3 విభాగాలుంటాయి.
* సివిల్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన అభ్యర్థులు విభాగం - ఎని ఎంచుకోవాలి.
* ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు విభాగం-బి ఎంచుకోవాలి.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు విభాగం-సి ఎంచుకోవాలి.
పేపర్‌ 1, పేపర్‌ 2లలో అర్హత పొందినవారికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు జరుగుతుంది. పేపర్‌ 1, పేపర్‌ 2, మౌఖిక పరీక్షలు మొత్తం 600 మార్కులకు జరుగుతాయి.
జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌
జూనియర్‌ ఇంజినీర్స్‌ పరీక్ష పేపర్‌-1లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ విభాగం నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో స్టేట్‌మెంట్స్‌ అండ్‌ కన్‌క్లూజన్స్‌, రిలేషన్స్‌, క్యాలెండర్స్‌, క్లాక్స్‌, డైరెక్షన్స్‌ మొదలైనవాటికి తప్ప మిగతా అంశాల ప్రశ్నలకు ప్రత్యేక ఫార్ములా అంటూ ఏమీ ఉండదు. ఇందులో నంబర్స్‌, ఆల్ఫబెట్స్‌, వర్డ్స్‌, ఇమేజెస్‌, నాన్‌ వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలను అభ్యర్థి ఆలోచనా సామర్థ్యం పరీక్షించేలా అడుగుతారు.
గతంలో జరిగిన S.S.C. ప్రశ్నపత్రాల ఆధారంగా జనరల్‌ ఇంటిలిజన్స్‌- రీజనింగ్‌లో సిరీస్‌, అరేంజ్‌మెంట్‌, ఇమేజెస్‌, మిస్‌లేనియస్‌, నాన్‌ వెర్బల్‌ నుంచి ప్రశ్నలు అడిగారు. సిరీస్‌లో 26 - 30 ప్రశ్నలు; కోడింగ్‌లో 7 - 11 ప్రశ్నలు; అరేంజ్‌మెంట్‌లో 5 - 7 ప్రశ్నలు; లాజిక్‌లో 4 - 6 ప్రశ్నలు, మిస్‌లేనియస్‌ 2 - 3 ప్రశ్నలు, నాన్‌ వెర్బల్‌లో 4 - 5 ప్రశ్నలు అడుగుతారు.
మిగతా పోటీ పరీక్షలతో పోలిస్తే S.S.C. పరీక్షల్లో రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలు పేరాగ్రాఫ్‌ నిడివి కాకుండా ఒక లైను నిడివి ఉంటాయి. దీంతో ప్రశ్నపై తక్కువ సమయం కేటాయించి త్వరగా సమాధానం గుర్తించే అవకాశం ఉంది.
జనరల్‌ అవేర్‌నెస్‌ ఎలా?
జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఇవి వర్తమాన అంశాలు, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం, భౌగోళిక శాస్త్రం, జనరల్‌ సైన్స్‌ మొదలైన అంశాలకు సంబంధించినవి. ఎక్కువ మార్కులు సాధించాలంటే ఈ అంశాలపై దృష్టి సారించాలి.
* జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు
* చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర (1857-1947)
* ఆర్థిక వ్యవస్థలో పన్నుల విధానం-మౌలిక అంశాలు, ప్రణాళికలు, బడ్జెట్‌, ఆర్థిక సర్వే
* భౌగోళిక శాస్త్రంలో రుతుపవనాలు, పంటలు, నేలలు, నదులు, ఆనకట్టలు, తుపానుల పేర్లు
* రాజ్యాంగంలో పరిపాలనా సంబంధమైన సమకాలీన అంశాలు
* జనరల్‌ సైన్స్‌లో మౌలిక అంశాల అవగాహన
* రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ అడుగుతారు.
ఇందుకోసం NCERTపుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు సామాన్య, సాంఘిక శాస్త్రాల పాఠ్యపుస్తకాలు, Manorama Year Book చదవాలి. చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానించాలి. కేవలం గుర్తుంచుకునేవిధంగా కాకుండా విశ్లేషణా ధోరణిలో చదవాలి. వర్తమాన అంశాల గురించి దినపత్రికలను చదవడం, పూర్తి సమాచారాన్ని సేకరించి అవగాహన పెంచుకోవడం అవసరం. ఎక్కువ ప్రశ్నలు అభ్యర్థి పరిశీలనా శక్తిని పరీక్షించేలా అడుగుతున్నారు.
కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వచ్చే ప్రశ్నలను సమకాలీన ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై అడగడం గమనించాలి. కేవలం బట్టీపట్టే ధోరణిలో కాకుండా ఆలోచిస్తూ, విశ్లేషణాత్మకంగా సిద్ధమవటం ముఖ్యం.
జనరల్‌ ఇంజినీరింగ్‌ ఇలా
జనరల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎ, బి, సి అనే విభాగాలుంటాయి.
* జూనియర్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, జూనియర్‌ క్వాంటిటి సర్వేయింగ్‌ & కాంట్రాక్ట్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు పోటీపడేవారు విభాగం ఎ ఎంచుకోవాలి.
* జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు విభాగం బి ఎంచుకోవాలి.
* జూనియర్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుకు పోటీ పడేవారు విభాగం సి ఎంచుకోవాలి.
నోట్‌: అభ్యర్థులు తమకు కావలసిన స్లయిడ్‌ రూల్‌, అల్‌గారిథమ్‌ టేబుల్‌, స్టీమ్‌ టేబుల్‌, సాధారణ కాలిక్యులేటర్‌ను పేపర్‌ 2 రాసే సమయంలో తీసుకువెళ్ళవచ్చు. పేపర్‌ 1 రాసేటప్పుడు వీటిని తీసుకువెళ్ళరాదు.
జనరల్‌ ఇంజినీరింగ్‌ ప్రశ్నలన్నీ అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో చదువుకున్న అంశాల మీద మాత్రమే అడుగుతారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పేపర్‌ 1:
పార్ట్‌ ఎ: సివిల్‌ ఇంజినీరింగ్‌ అంశాలైన బిల్డింగ్‌ మెటీరియల్‌, ఎస్టిమేషన్‌, బిల్డింగ్‌ కాస్టింగ్‌, వాల్యుయేషన్‌, సర్వేయింగ్‌, సాయిల్‌ మెకానిజమ్‌, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లోని కాంక్రీట్‌ టెక్నాలజీ, స్టీల్‌ డిజైన మీద ప్రశ్నలు అడుగుతారు.
పార్ట్‌ బి: మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అంశాలైన Theory of Machines, Machine Design, Engineering Mechanics , Strength of Materials మీద ప్రశ్నలు అడుగుతారు. ఎలక్ట్రికల్‌ ఎనర్జీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌ మీద పూర్తి అవగాహన ఉండాలి.
పార్ట్‌ సి: థర్మోడైనమిక్స్‌ లాస్‌ మీద ప్రశ్నలు అడుగుతారు. I.C.మెషీన్స్‌, రిఫ్రిజిరేషన్‌ ప్లాంట్‌ వంటి వాటి మీద అవగాహన సాధించాలి. ఫ్లూయిడ్స్‌కు సంబంధించిన ప్రాపర్టీస్‌, క్లాసిఫికేషన్‌, మెజర్‌మెంట్‌ ప్రజర్‌, కైనటిక్స్‌, డైనమిక్స్‌ వంటి అంశాల మీద పట్టు సాధించటం అవసరం.
పేపర్‌ 2: లిఖితపూర్వక పరీక్ష కాబట్టి ఎన్ని ఎక్కువ పేజీలు రాశాం అని కాకుండా, అడిగిన ప్రశ్నకు సూటిగా విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం చూడగానే ఒక్కో ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో అవగాహనకు రావాలి. ఒకే ప్రశ్నకు మరీ ఎక్కువ సమయం వెచ్చించకుండా సమయ నిర్వహణ పాటించాలి.
సంబంధిత పుస్తకాలను సేకరించుకొని సరైన ప్రణాళిక రచించుకొని సన్నద్ధమైతే ఈ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను పొందటం కష్టమేమీ కాదు.
అభ్యర్థులకు కలిసివచ్చేవి
* ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్షకు విభాగం వారీ కటాఫ్‌ మార్కులు ఉండవు.
* సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో నెలకు రూ.25,000 వస్తుండగా, ఈ పోస్టులకు 35,000 పైగా జీతం వస్తుండటం.
* ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా పోస్టింగ్‌ రావటం.
వీటిలో జాగ్రత్తలు తీసుకోవాలి
* నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంది కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం గుర్తించాలి.
* గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులే ఈ పరీక్షకు అర్హులు. చివరి సం|| చదువుతున్న అభ్యర్థులు అర్హులు కారు.
* ప్రశ్నపత్రం ఇంగ్లిషు, హిందీ భాషలలో మాత్రమే ఉంటుంది.
తక్కువమంది పోటీపడే ఈ పరీక్షకు సరైన ప్రణాళిక రూపొందించుకొని చదివితే మెరుగైన మార్కులు సాధించి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలు కాబట్టి వీటిలో చేరినవారికి సౌకర్యాలతోపాటు మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారు పరీక్ష మెటీరియల్‌, నమూనా పరీక్ష పేపర్లను www.eenaduprtibha.net ద్వారా పొందవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning