ఆర్జీయూకేటీ విద్యార్థులు 'గ్రేట్‌'

* జాతీయస్థాయిలో బాసర విద్యార్థికి ఎనిమిదో ర్యాంక్‌

* 75లోపు ఆరుగురికి ర్యాంకులు

ఈనాడు - హైదరాబాద్‌ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2014లో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరు జాతీయస్థాయిలో 8వ, 25వ, 30వ, 57వ ర్యాంకులు(ఈసీఈ విభాగం), 20వ ర్యాంకు(మెటలర్జీ విభాగం), 75వ ర్యాంకు (ఎంఎంఈ విభాగం) సాధించారు. గేట్‌-2014 ర్యాంకులను ఖరగ్‌పూర్‌ ఐఐటీ గురువారం రాత్రి విడుదల చేసింది. గేట్‌ ర్యాంకులను అనుసరించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోని ఐఐటీలు, ఇతర ప్రముఖ సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.
నూజివీడుకు నాలుగు
ఆర్జీయూకేటీ ఏర్పడిన తర్వాత బీటెక్‌ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు గేట్‌కు హాజరుకావడం ఇదే ప్రథమం. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో, కృష్ణా జిల్లా నూజివీడులో, కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్‌ఐటీలు నడుస్తున్నాయి. గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులు వీటిలో విద్యనభ్యసిస్తున్నారు. ఈసీఈ విభాగం నుంచి దేశవ్యాప్తంగా 2,16,367 మంది రాయగా, తొలి 57 ర్యాంకుల్లో నాలుగు ఆర్జీయూకేటీ విద్యార్థులు పొందడం విశేషం. బాసర ట్రిపుల్‌ఐటీ నుంచి టి.నవీన్‌ ఈసీఈ విభాగంలో ఎనిమిదో ర్యాంకు; నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చదివే జి.మహేష్‌, జి.శ్రీరాములునాయుడు, నీలిమ ఇదే విభాగంలో వరుసగా 25వ, 30వ, 57వ ర్యాంకులు సాధించినట్లు ఆర్జీయూకేటీ ఉపకులపతి రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి పుష్పలత మెటలర్జీ విభాగంలో 20వ ర్యాంకు, నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చదివే ఎల్‌.కార్తీక్‌ ఎంఎంఈ విభాగంలో 75వ ర్యాంకు తెచ్చుకున్నట్లు చెప్పారు. ట్రిపుల్‌ఐటీల నుంచి సుమారు రెండు వేల మంది గేట్‌ రాసి ఉండొచ్చని భావిస్తున్నారు. విద్యార్థులు గేట్‌ సొంతంగా రాసినందున ఆ వివరాలు ప్రస్తుతం తమ వద్ద పూర్తిస్థాయిలో లేవని, ఎంత మందికి ఉత్తమ ర్యాంకులు వచ్చాయో చెప్పేందుకు సమయం పడుతుందని ఉపకులపతి తెలిపారు.
పక్షం రోజుల్లో గేట్‌ 'కీ'!
గేట్‌-2014 తుది 'కీ' 15 రోజుల్లో విడుదలయ్యే అవకాశముందని గేట్‌ ఛైర్మన్‌ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గేట్‌కు 10,33,625 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 8,89,156 మంది ఆన్‌లైన్‌లో పరీక్ష రాశారని చెప్పారు. వీరిలో 1,49,694 మంది అర్హత సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఎన్‌టీపీసీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, భారత్‌ పెట్రోలియం లాంటి 17 సంస్థలు గేట్‌ ఫలితాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ఖరగ్‌పూర్‌ ఐఐటీతో ఒప్పందం చేసుకున్నాయి.
వరంగల్‌ విద్యార్థికి తొమ్మిదో ర్యాంకు
రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. వరంగల్‌ వాసి ఆర్‌.జయప్రకాశ్‌కు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తొమ్మిదో ర్యాంకు, అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన వినుకొండ మనోజ్‌ కుమార్‌కు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌(ఎక్స్‌ఈ) విభాగంలో పదో ర్యాంకు, హైదరాబాద్‌ వాసి వై.వంశీకృష్ణకు ఈసీఈలో 14వ ర్యాంకు వచ్చాయి. మనోజ్‌ 'ఈనాడు'తో మాట్లాడుతూ- తనకు 10లోపు ర్యాంకే వస్తుందని ఆశించానని చెప్పాడు. ముంబయి ఐఐటీలో ఎంటెక్‌ చేసేందుకు ప్రాధాన్యమిస్తానని తెలిపాడు. అతడు ప్రస్తుతం కర్ణాటకలోని మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు..

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning