సబ్జెక్టులు ఆసాంతం చదివాను!

* ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు

* గేట్- 2014 మైనింగ్ ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకర్ భరత్ రెడ్డి

హైదరాబాద్: ఇటీవల విడుదలైన గేట్- 2014 ఫలితాల్లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌కు చెందిన గోపు భరత్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా భరత్‌ను 'ఈనాడు పలుకరించగా.... ఏ పరీక్షలో అయినా మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రాక్టీస్ బాగుండాలని, ప్రణాళికాబద్ధంగా చదవాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రభుత్వరంగ కంపెనీల్లో స్థిరపడాలనుకుంటున్న భరత్ చెప్పిన విశేషాలు.....
* మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. నా పూర్తి పేరు గోపు భరత్‌రెడ్డి. మా నాన్న పేరు ఇంద్రసేనారెడ్డి. ఆయన బిల్డింగ్ మెటీరియల్ పంపిణీ బిజినెస్ చేస్తారు. అమ్మ లక్ష్మి. గృహిణి. తమ్ముడు భార్గవ్. మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాడు.
* మీ విద్యార్హతలు చెప్పండి?
జ. నేను పదో తరగతి వరకు కరీంనగర్‌లోనే చదివాను. టెన్త్‌లో 552 మార్కులు సాధించాను. ఇంటర్ (ఎంపీసీ) హైదరాబాద్‌లో చదివాను. 946 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో బీటెక్ (మైనింగ్) చివరి సంవత్సరం చదువుతున్నాను.
* మీ జీవిత లక్ష్యం ఏమిటి?
జ. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌లో ఏదైనా మంచి సంస్థలో చేరి ఉన్నత స్థానాన్ని అందుకోవాలనేది నా లక్ష్యం. ప్రస్తుతం దేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అందుకనే నేను గేట్ పరీక్ష రాశాను.
* గేట్‌కు ఎలా సాధన చేశారు?
జ. మొదట సీనియర్లను సంప్రదించాను. వారిచ్చిన సలహాల ఆధారంగా గేట్ గురించి పూర్తి అవగాహన పెంచుకున్నాను. తర్వాత గేట్ నోటిఫికేషన్ రావడానికి 2, 3 నెలల నుంచి గట్టిగా ప్రాక్టీస్ ప్రారంభించాను. మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కుల స్కోర్ కోసం న్యూమరికల్ ఆప్టిట్యూడ్ పేపర్ ప్రశ్నల సరళిని బాగా గమనించి పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అలాగే మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేశాను. ముఖ్యంగా ఆ సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై (బేసిక్స్) పట్టు కోసం ఇంటర్, డిగ్రీ స్టడీ మెటీరియల్ బాగా చదివి ప్రత్యేకంగా నోట్స్ తయారుచేసుకున్నాను. ఒక్కొక్క ఛాప్టర్‌పై ప్రత్యేకంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారో పరిశీలించి ప్రాక్టీస్ కోసం అధిక సమయం కేటాయించాను. నాది మైనింగ్ విభాగం కాబట్టి మైనింగ్ సబ్జెక్ట్ బుక్స్ మొత్తం ఆసాంతం చదివాను. పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. తప్పులు ఎక్కడ చేస్తున్నానో గమనించి తర్వాత పేపర్ సాధన చేసినప్పుడు అలాంటివి రాకుండా జాగ్రత్తపడ్డాను. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి సిలబస్ మెత్తాన్ని పునశ్చరణ చేశాను. ఏ కోచింగ్‌కూ వెళ్లలేదు. సొంతంగానే ప్రాక్టీస్ చేశాను.
* నెగిటివ్ మార్కులు ఉంటాయి కదా? ఎలా జాగ్రత్త పడ్డారు?
జ. చాలామంది విద్యార్థులు నెగిటివ్ మార్కులు ఉంటాయని భయపడతారు. నేను కూడా మొదట కొంచెం భయపడ్డాను. కానీ సిలబస్‌ను బాగా అర్థం చేసుకుని, పాత ప్రశ్నపత్రాలను వీలైనంతగా సాధనచేస్తే నెగిటివ్ మార్కుల భయం దూరమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నకు మనం ఎలా ఆన్సర్ చేస్తున్నామో అర్థమైపోతుంది. తద్వారా జాగ్రత్త పడతాం. అందువల్ల నెగిటివ్ మార్కుల గురించి ఆందోళన పడటం కంటే జాగ్రత్త పడటం ఉత్తమం.
* కొత్తవారికి ఇచ్చే సలహా....
జ. జాతీయ స్థాయి పరీక్ష అనగానే తీవ్రమైన పోటీ ఉంటుందని అన్ని రకాల పుస్తకాలు చదవాలని అనుకోవద్దు. పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకుని, ప్రామాణిక పుస్తకాలు, స్టడీ మెటీరియల్ సంపాదించి సాధన మొదలుపెట్టాలి. మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ పేపర్లలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. ఇక పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, వేగంగా ఎలా చేయాలనే దానికోసం పాత పేపర్లు చదవాలి. ఆ ప్రశ్నలను సాధన చేయాలి. పరీక్ష హాల్లో కూడా ప్రశ్న ఎలా ఉంది? ఏం అడుగుతున్నాడు, కచ్చితమైన సమాధానం ఎలా ఇవ్వాలనే దాని గురించే ఆలోచించాలి. తద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning