మేటి భవితకు మలి అడుగు!

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌, ఫార్మ్‌-డి రంగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌ టెక్నాలజీ (ఎం.టెక్‌, ఎం.ఫార్మా, ఎం.ఆర్క్‌, ఫార్మ్‌-డి) కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఉజ్వల భవితకు వీలునిచ్చే ఈ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎలా సంసిద్ధం కావాలి?
ఎంటెక్‌ కోర్సులన్నిటికీ గేట్‌లో ఉత్తీర్ణత ప్రాతిపదిక మీదనో, పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగానో ప్రవేశం కల్పిస్తారు. గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)లో కానీ, పీజీఈసెట్‌లో కానీ అర్హులైనవారు ఎం.ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు.
దరఖాస్తు ఎలా?
పీజీఈసెట్‌కి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి తరఫున ఈ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించబోతోంది.
1. రిజిస్ట్రేషన్‌ రుసుము రూ.500/- (ఎస్‌.సి, ఎస్‌.టి. అభ్యర్థులైతే రూ.250/-) మీ-సేవ కేంద్రంలోకానీ, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలోకానీ చెల్లించవచ్చు.
2. ఒకటికంటే ఎక్కువ విభాగాల్లో దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే విడివిడిగా రిజిస్ట్రేషన్‌ రుసుము కట్టవలసి వుంటుంది.
మీ-సేవ/ ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో కట్టేవారు నిర్ధారించిన ఫీజుతోపాటు పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పదో తరగతి హాల్‌టికెట్‌ సంఖ్య, మొబైల్‌ నంబర్‌, ఏయే పరీక్షలకు దరఖాస్తు చెయ్యదలచుకున్నారు వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
నిర్ణీత రుసుము కట్టిన తరువాత రశీదు తీసుకోవాలి. దాని మీద లావాదేవీకి సంబంధించిన గుర్తింపు సంఖ్య (ట్రాన్సాక్షన్‌ ఐడీ) ఉంటుంది. దీని ఆధారంగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది లేకపోతే లాగిన్‌ అవ్వలేరు.
క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా దరఖాస్తు చెయ్యదలచినవారు తదనుగుణంగా www.appgecet.org/ వెబ్‌సైట్లో ట్యాబ్‌ని నొక్కాలి. అప్పుడు ఫీజు చెల్లించిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు తిరిగి పై వెబ్‌సైట్‌కి మళ్ళే ఏర్పాటు ఉంటుంది.
కులం, తండ్రిపేరు, పుట్టినతేదీ వంటి వివరాలు మార్చడం వీలు పడదని తెలుసుకోవాలి. ఏ కేంద్రంలో పరీక్ష రాయదలచుకున్నారు వంటివి కూడా పూర్తి చేయాలి. దరఖాస్తు నింపాక వివరాలు సరిచూసుకుని- మార్పులేవైనా ఉంటే, సరిదిద్ది- పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో (40 కిలోబైట్లకు మించని జెపెగ్‌ ఫార్మాట్‌లో ఉన్న ఫోటో) నిర్ణీత స్థానంలో అప్‌లోడ్‌ చెయ్యాలి. 30 కేబీకి మించని సంతకాన్ని కూడా అప్‌లోడ్‌ చెయ్యాలి. దరఖాస్తు పై భాగంలోని నంబరును భద్రపర్చుకోవాలి. కోర్సులో ప్రవేశం పూర్తయ్యేంతవరకు దీని అవసరం ఉంటుంది.
ఏ కోర్సు ఎంచుకోవాలి?
భవిష్యత్తు అవసరాలూ, ఆయా రంగాల్లో మార్పులకు అనుగుణంగా సాంకేతికత పెంపొందించే అంశాలను దృష్టిలో ఉంచుకుని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కోర్సులను ప్రవేశపెడతాయి. కాబట్టి అన్ని కోర్సులూ మంచివే. డిగ్రీలో బాగా నచ్చిన, అభిరుచికి తగిన రంగంలో పైచదువులు చదివితే భవిష్యత్తును స్వయంగా నిర్దేశించుకోవచ్చు.
బీటెక్‌ సి.ఎస్‌.ఇ. తరువాత ఎం.టెక్‌, సి.ఎస్‌.ఇ.లో చేస్తే బాగుంటుందా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో చేస్తే బాగుంటుందా అన్న సంశయం కలగొచ్చు. బీటెక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ అనే సబ్జెక్టు మనకు ఎంత శ్రద్ధగా అనిపించిందో అన్నది ముఖ్యం. పోతే కొన్ని కళాశాలలు ముందు ముందు బాగా అవసరమున్న సబ్జెక్టుల్లో ఎం.టెక్‌ కోర్సులను ప్రవేశపెట్టినప్పుడు అటువంటివి ఎన్నుకోవడం ఉత్తమం.
ఉదాహరణకు ఎం.టెక్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ వంటివి బాగా అవకాశమున్న నూతన కోర్సులు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో హైవే ఇంజినీరింగ్‌, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటివి మంచి భవిష్యత్తు ఉన్నవి. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎనర్జీ సిస్టమ్స్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి ఎన్నో ఉత్తమ కోర్సులున్నాయి.
కానీ కావలసిన కోర్సుల్లో ప్రవేశం కావాలనుకుంటే ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. ప్రతి రంగంలోనూ ప్రగతి, నూతన పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి మంచి కళాశాలలో ప్రవేశం పొందడం చాలా ముఖ్యం.
సిద్ధమయ్యే పద్ధతి?
ఉన్న సమయం సుమారు ఒకటిన్నర నెలలు. బాగా తయారవ్వడానికి ఇది ఎక్కువ కాకపోయినా తక్కువేమీ కాదు. బీటెక్‌ రెండు, మూడు సంవత్సరాల్లో చదివిన అన్ని సబ్జెక్టులూ క్షుణ్ణంగా చదివితే మంచి ర్యాంకు సాధించడం కష్టమేమీ కాదు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదవడం చాలా అవసరం. పోటీని ఆషామాషీగా తీసుకోకూడదు. చదివినట్టు కనిపించనివారు కూడా మనకు పోటీదారులే అన్నది మరవకూడదు.
ప్రధానంగా పోటీ పరీక్షల్లో మౌలికాంశ ఆధారిత ప్రశ్నలదే సింహభాగం. కాబట్టి సబ్జెక్టుల్లోని మౌలికాంశాల మీద పట్టు అవసరం. దిశ లేకుండా చదవకూడదు. తరచుగా పునశ్చరణ చేసుకోవాలి. నిర్దేశిత పాఠ్యపుస్తకాలే చదవాలి. మార్కెట్లో దొరికే కొన్ని గైడ్లు మనను పరీక్షించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ కేవలం వాటిమీదనే ఆధారపడకూడదు.
పీజీ తర్వాత పీహెచ్‌డీ చేసే ఉద్దేశముంటే దానికి తగిన కసరత్తు కూడా పీజీలో ఉన్నప్పుడే చెయ్యాలి. బీటెక్‌తో ఉద్యోగం రాలేదు కాబట్టి ఎంటెక్‌ చేస్తామనో, బీటెక్‌లో ప్రథమశ్రేణి రాలేదు కాబట్టి ఎంటెక్‌ చేద్దామనో అనుకుంటే ఈ పీజీ వల్ల కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చక్కని భవిష్యత్తుకు మలి అడుగుగా పీజీని చూడాలి.
ముఖ్యమైన తేదీలు
అపరాధ రుసుము లేకుండా ఆఖరి తేదీ: 20-04-2014
రూ.500/- అపరాధ రుసుముతో: 06-05-2014
రూ.2,000/- అపరాధ రుసుముతో: 14-05-2014
రూ.5000/- అపరాధ రుసుముతో: 20-05-2014
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ : 12-05-2014 నుంచి 24-05-2014
పరీక్ష తేదీలు: 26-05-2014 నుంచి 29-05-2014.
ఏ విశ్వవిద్యాలయాల్లో ఏ కోర్సులు?
ఈ ప్రవేశపరీక్షలోని ప్రతిభ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు నిర్వహించే కోర్సులు-
1. ఆంధ్ర విశ్వవిద్యాలయం: కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, జియో ఇంజనీరింగ్‌, మెరైన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, నానోటెక్నాలజి
2. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, బయోటెక్నాలజీ, ఎం.ఫార్మసీ
3. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం: ప్లానింగ్‌, ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌లలో ఎం.టెక్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటీరియర్‌ డిజైన్‌లలో ఎం.ఆర్క్‌.
4. జె.ఎన్‌.టి.యు. అనంతపురం: సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంట్రోల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కెమికల్‌, ఎనర్జీ సిస్టమ్స్‌, రిలయబిలిటి నానో టెక్నాలజిలలో ఎం.టెక్‌ కోర్సులు, ఎం.ఫార్మసీ.
5. జె.ఎన్‌.టి.యు. హైదరాబాద్‌: సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంట్రోల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కెమికల్‌, ఎనర్జీ సిస్టమ్స్‌, రిలయబిలిటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్పేషియల్‌ ఇన్‌ఫర్మేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేటిక్స్‌, వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ, ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌, నానో టెక్నాలజీల్లో ఎం.టెక్‌ కోర్సులు, ఎం.ఫార్మసీ
6. జె.ఎన్‌.టి.యు. కాకినాడ: సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంట్రోల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కెమికల్‌, ఎనర్జీ సిస్టమ్స్‌, రిలయబిలిటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్పేషియల్‌ ఇన్‌ఫర్మేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేటిక్స్‌, వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ, ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌, నానో టెక్నాలజీ, ఏవియానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, బయో మెడికల్‌, బయో ఇన్‌ఫర్మేటిక్స్‌లలో ఎం.టెక్‌, ఎం.ఫార్మసీ.
7. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, వి.ఎల్‌.ఎస్‌.ఐ. అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌లలో ఎం.టెక్‌, ఇంకా ఎం.ఫార్మసిలో తొమ్మిది కోర్సులు.
8. ఉస్మానియా విశ్వవిద్యాలయం: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ టెక్నాలజి, బయో మెడికల్‌, బయో కెమికల్‌లలో ఎం.టెక్‌ కోర్సులు, ఎం.ఫార్మసీ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌)లో మూడు కోర్సులు.
9. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం: ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ లలో ఎం.టెక్‌ కోర్సులు.
10. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లలో ఎంటెక్‌ కోర్సులు, ఎం.ఫార్మసీ.
11. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌లలో ఎం.టెక్‌ కోర్సులు.
ఇవన్నీ ప్రధానమైనవి. ఈ బ్రాంచిలలో వివిధ ఎంటెక్‌ కోర్సులున్నాయి. పూర్తి వివరాలకు- http://www.appgecet.org/

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning