సాంకేతిక సెమినార్‌ సంగతేమిటి?

ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో సాంకేతిక సెమినార్‌ ఉంటుంది. దీనికి కేటాయించిన 50 మార్కులు ఎక్కువా? తక్కువా? ఇది విద్యార్థుల మార్కుల శాతాన్ని ప్రభావితం చేస్తుందా?
సాంకేతిక (టెక్నికల్‌) సెమినార్‌ అనగానే చాలామందికి గుర్తుకువచ్చేవి వృత్తివిద్యా కళాశాలల్లో విద్యార్థులు పాల్గొనే రాష్ట్ర, జాతీయస్థాయి కార్యక్రమాలు. సాధారణంగా ఇటువంటి ఉత్సవాలు ఎన్నో విద్యాసంస్థలు నిర్వహిస్తుంటాయి. ఈ పేపర్‌ ప్రెజెంటేషన్‌ కార్యక్రమాల్లో చాలావరకూ విద్యార్థులే పోటీ పడుతుంటారు. ప్రతిభా ప్రదర్శనకు వారికి బహుమతులు కూడా లభిస్తుంటాయి.
వీటిలో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బెరుకు దూరమవుతుంది. కానీ ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని, ఎదగాలనే చొరవ గ్రామీణ ప్రాంతాలవారికీ, తెలుగు మాధ్యమంలో చదివినవారికీ సాధారణంగా ఉండదు. వీరిలో ఆత్మన్యూనతా భావం, బెదురు, బెరుకు వంటివి వీరిని ఒంటరితనం వైపునకు మళ్ళిస్తాయి. ఈ మానసికమైన ఆందోళనలను దూరం చెయ్యగలిగితే, వీరు కూడా ఇతరులతో సమానంగా ఈ పోటీ ప్రపంచాన్ని ధైర్యంతో ఎదుర్కోగలరు.
ఇది సజావుగా జరగాలంటే బీటెక్‌ కోర్సులోనే ఈ కార్యక్రమం అంతర్భాగమవ్వాలి. ఈ లక్ష్యంతోనే- విద్యార్థులకు బహువిధాల ప్రయోజనకారి అయ్యేలా సాంకేతిక సెమినార్‌ను ప్రవేశపెట్టారు.
బీటెక్‌ విద్యార్థి చివరి సంవత్సరంలో తన రంగానికి సంబంధించిన/ ఇతర బ్రాంచిలలోని అభివృద్ధి వల్ల తన రంగంలో జరిగే ప్రభావాలకు (ఇంటర్‌ డిసిప్లినరీ) సంబంధించిన అంశం తీసుకోవచ్చు. సాంకేతిక మ్యాగజీన్లలో/ వార్తాపత్రికల్లో ప్రచురితమైన అంశం అయితే మంచిది.
ఈ సెమినార్‌ను బీటెక్‌ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో అనేక విశ్వవిద్యాలయాలు ఒక అంశంగా ప్రవేశపెట్టాయి. జె.ఎన్‌.టి.యు.హెచ్‌. పరిధిలో 2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లో ఉంది. దీనికి 50 మార్కుల మూల్యాంకనం ఉంటుంది.
ఎన్నో ఉపయోగాలు
టెక్నికల్‌ సెమినార్‌ వల్ల విద్యార్థులకూ, కళాశాలలకూ కూడా ఎన్నో లాభాలున్నాయి.
* విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* తన రంగానికి సంబంధించిన విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.
* పుస్తకాలలోని పాఠ్యాంశాలకీ, ప్రస్తుతం ఆ రంగంలో జరుగుతున్న అభివృద్ధికీ మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది.
* దీంతో తన రంగంలో ఎలా ముందుకువెళ్లాలో తెలుస్తుంది.
* పదిమందిలో నిస్సంకోచంగా, ఎదుటివారికి ఆమోదయోగ్యమైన పద్ధతిలో భావాలను వ్యక్తపరిచే గుణం అలవడుతుంది.
* సమకాలీన పరిశోధనల స్థితిగతుల గురించి అవగాహన ఏర్పడుతుంది.
ఇవన్నీ కాకుండా తక్షణ లాభంగా కొన్ని మార్కులు వస్తాయి. తద్వారా బీటెక్‌లో మార్కుల శాతం పెంచుకునే అవకాశం లభిస్తుంది.
ఎటువంటి అంశం బాగుంటుంది
సెమినార్‌ ఇచ్చే అంశం సమకాలీనమైనదై ఉండాలి. విద్యార్థి చదివే బ్రాంచికి సంబంధించినదై ఉండాలి. కేవలం మార్కులకోసం కాకుండా తెలుసుకున్న కొత్త విషయం మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఉండాలి. విద్యార్థి సెమినార్‌ ఇస్తున్నప్పుడు అధ్యాపకులు, విభాగాధిపతి ఉంటారు కాబట్టి వారికి కూడా ఆసక్తి కలిగించేదై ఉండాలి. విద్యార్థి తన బ్రాంచికి సంబంధించిన మేగజీన్లలో వ్యాసాలను పరిశీలించి టెక్నాలజీ మీద రాసిన అవగాహనా అంశంలో సెమినార్‌ ఇస్తే బాగుంటుంది.
అధ్యాపకుల పాత్ర
విద్యార్థులు సమర్థంగా సెమినార్‌ ఇచ్చేలా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులదే. ప్రతి అధ్యాపకుడూ కొందరు విద్యార్థులను తన పర్యవేక్షణలో ఉంచుకుని, వారు సరైన అంశం ఎంచుకోవడానికి సహాయ సహకారాలందించాలి. ఆ అంశం విద్యార్ధి శక్తిసామర్థ్యాలెరిగి ఇవ్వాలి. ఒకవేళ విద్యార్థి తన శక్తికి మించిన అంశంమీద ఆసక్తి కనబరిస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన మౌలికమైన విషయసేకరణ ఎలా చేసుకోవాలో చెప్పాలి. ఎంచుకున్న అంశం మీద విద్యార్థి సమగ్రమైన నివేదిక తయారుచేసేందుకు మార్గనిర్దేశనం చేయ్యాలి.
ఈ నివేదిక కనీసం 20 పేజీలుండాలి. దీనిలో విద్యార్ధి తీసుకున్న అంశం ప్రాముఖ్యం, అందులోని సమస్య, ఆ సమస్యకు రచయిత ఇచ్చిన సమాధానం, అందులోని లోపాలు విడమర్చి రాయగలగాలి. ఈ నివేదిక... విభాగం విధించిన పద్ధతిలోనే ఉండేటట్టు చూడాలి. ఇంతేకాకుండా, విద్యార్ధి తాను నేర్చుకున్న విషయాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తయారుచేసుకునేటట్టు చూడాలి. ఈ ప్రెజెంటేషన్‌ ఒక అధ్యాపక బృందానికి ఇచ్చేందుకు విద్యార్థికి తోడ్పడాలి. విభాగాధిపతి ప్రతి విద్యార్థికోసం ఒక కమిటీని నియమించాలి. ఈ కమిటీలో తాను తప్పనిసరిగా ఒక సభ్యుడై ఉండాలి. తన పర్యవేక్షణలోనే విద్యార్థికి ఎటువంటి అన్యాయం జరగకుండా మూల్యాంకనం జరిగేటట్టు చూడాలి. వీలైతే ఇతర విభాగాల అధ్యాపకులనూ ఆహ్వానించాలి.
విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఫలితాలను ప్రకటించే అధికారం విశ్వవిద్యాలయానిదే అన్న విషయాన్ని మరవకూడదు. అయితే మూల్యాంకనం జరిగే పద్థతి తెలుసుకోవడం విద్యార్థి హక్కు కనుక మూల్యాంకనం ప్రాతిపదిక తెలియజెప్పడం కాలేజి, అధిపతి, అధ్యాపకుల ప్రథమ బాధ్యత.
మూల్యాంకన విధానం
టెక్నికల్‌ సెమినార్‌లో ప్రతిభా ప్రదర్శనకు విశ్వవిద్యాలయం 50 మార్కులు కేటాయించింది. కానీ ఈ మార్కులు ఏ ప్రాతిపదికన చెయ్యాలి? ఈ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలనూ ఇవ్వలేదు. అందువల్ల కాలేజి అకడమిక్‌ కమిటీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది. ఈ కింది విధంగా 50 మార్కులను విభజిస్తే బాగుంటుంది.
* విషయ సేకరణ, నివేదిక: 20 మార్కులు
* సబ్జెక్టుకి మధ్య సంబంధ స్పష్టీకరణ: 5 మార్కులు
* పవర్‌ పాయింట్‌ నాణ్యత: 5 మార్కులు
* భావప్రకటన సామర్థ్యం: 5 మార్కులు
* బాడీ లాంగ్వేజ్‌: 5 మార్కులు
* ప్రశ్నోత్తరాల సామర్థ్యం: 10 మార్కులు
తీసుకోవలసిన జాగ్రత్తలు
* సెమినార్‌ అంశాన్ని ఎన్నకునేటప్పుడు తాము చెప్పగలిగిన, తాము సొంతంగా విషయ సేకరణ చేయగలిగిన అంశాలనే తీసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది.
* నివేదిక తయారీలో ఎటువంటి తప్పులూ జరగకుండా చూసుకోవాలి.
* వీలైతే రిసెర్చి చేస్తున్న అధ్యాపకులనడిగి సెమినార్‌ అంశాన్ని కేటాయింపజేసుకోవాలి.
* అసలు ప్రెజెంటేషన్‌కి ముందు రెండు మూడుసార్లయినా స్నేహితులకు నమూనా ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి.
* 50 మార్కులు తక్కువ కావని తెలుసుకోవాలి. దాదాపు ఇది బీటెక్‌లోని విద్యార్థి మార్కుల శాతాన్ని 1% వరకూ ప్రభావితం చేస్తుంది.
* ఎటువంటి ఒత్తిడికీ లోనుకాకుండా ఉండాలి.
అధ్యాపకులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. వారు విద్యార్థికి కావలసిన అన్ని సహాయ సహకారాలూ అందించాలి. ఒకవేళ విద్యార్థి వెతికిన అంశం బాగుంటే, తాము అందులో రిసెర్చి చేసే అవకాశం కూడా ఉంటుందని గుర్తించాలి. సెమినార్లు జరుగుతున్నప్పుడు ఆ తరగతికి చెందిన ఇతర విద్యార్థులను కూడా తప్పనిసరిగా కూర్చోబెట్టాలి. దీనివల్ల అందరు విద్యార్థులకు లబ్ధి చేకూరడమేకాక, సెమినార్‌ ఇస్తున్న విద్యార్థికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేరే విద్యార్థులకు సెమినార్‌ ఎలా ఇవ్వాలో ప్రత్యక్షంగా తెలుస్తుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning