Articles

Written Test

G.D.

HR Interviews

Resume

 • ఆప్టిట్యూడ్‌.. ఆటిట్యూడ్‌ అంతా అందులోనే!
  ఫలానా కంపెనీ మిమ్మల్ని ఉద్యోగానికి ఎంపిక చేయకపోతే, అందులో మీ తప్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సంస్థకు మీ అవసరం లేదేమో! ... కానీ ఉద్యోగం మీకు అవసరం అయినా కూడా మీరు ఎంపిక అవ్వటంలేదంటే మాత్రం అది మీ లోపమే! మీరింకా ఆ ఎంపిక ప్రక్రియను సరిగ్గా అవగాహన చేసుకోలేదని అర్థం. అందుకే ...క్యాంపస్‌ నియామకాల తీరుతెన్నులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవటం చాలా ముఖ్యం. అదెలాగో చూద్దామా?
  ఎవరైనా ‘‘మీకు ఉద్యోగం వచ్చిందా?’’ అని అడుగుతారు. కానీ ‘‘మీకు ఉద్యోగం ఇచ్చారా’’ అని అడగరు. అంటే ఉద్యోగం అనేది ఎవరూ ఎవరికీ ఇవ్వరు. ఎవరికివారే సంపాదించుకోవాలి. మీకు ఉద్యోగం ఎంత అవసరమో సంస్థకు మీరు అంతకంటే ఎక్కువ అవసరం. మీకు వాళ్ళు నెలకు నలభైవేల రూపాయల జీతం ఇస్తున్నారంటే వాళ్ళకు మీవల్ల నెలకు కనీసం రూ.లక్ష లాభం వస్తుందని అర్థం. చాలామంది సరైన ‘కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ లేకపోవడం వల్లే ఉద్యోగం రాలేదు అంటుంటారు. నిజమే! కానీ కంపెనీకి ఉద్యోగి భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో అవసరం ఏమిటి?
  కమ్యూనికేషన్‌ అంటే ఆంగ్లం కాదు!
  సంస్థలో మీతో పాటు చాలామంది పనిచేస్తుంటారు కదా? వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంటుంది కాబట్టి కంపెనీకి మీ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతో చాలా అవసరం ఉంటుంది. చాలామంది కమ్యూనికేషన్‌ నైపుణ్యాలంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉండటం మాత్రమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
  పెళ్ళికో, ఫంక్షన్‌కో వెళ్ళినపుడు ఎంతోమంది బంధువులూ, పెద్దలూ కలుస్తుంటారు. వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతాం. అయినా చాలాసార్లు పలకరించడానికి ఇబ్బంది పడుతుంటాం. ‘బాగున్నారా?’ అని అడగటానికే మొహమాటపడుతుంటాం. ఏం మాట్లాడితే ఏం అనుకుంటారోనని ఇబ్బందిపడుతుంటాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటానికి కూడా తడబడుతుంటాం. మనకు తెలుగు రాక కాదు కదా? మాతృభాష మీద ఎంత పట్టున్నా వాళ్ళతో మాట్లాడాలంటే తెలియని భయం, సిగ్గు, మొహమాటం, బెరుకు. ఇవన్నీ లేకుండా స్పష్టంగా మాట్లాడగలగడం, ఎదుటివారు చెప్పింది సవ్యంగా అర్థం చేసుకోగలగడం అనేవే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు. కానీ ఒక కంపెనీ విషయానికొస్తే పనిచేసేటప్పుడు ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడాల్సిరావొచ్చు కాబట్టి యూనివర్సల్‌ లాంగ్వేజ్‌ అయిన ఆంగ్లంలో కమ్యూనికేట్‌ చేయాల్సివస్తుంది.
  భావ వ్యక్తీకరణను మెరుగుపరుచుకోవాలంటే నలుగురినీ కలవాలి; మాట్లాడాలి. వాళ్ళ మాటలు వినాలి. బిడియం, బెరుకు, మొహమాటం విడిచిపెట్టాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలనేవాటిపై అవగాహన పెంచుకోవాలి. ఒక్క రోజులోనే అలవరుచుకోవటం కష్టం కానీ, సానపెట్టుకుంటూ పోతే పోనుపోనూ మెరుగుదల దానికదే వస్తుంది.
  లెక్కల్లో నేర్పుంటే చాలా?
  క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో వివిధ సంస్థలు కళాశాలకు వెళ్లి ఆప్టిట్యూడ్‌ పరీక్ష పెడతాయి. నెగ్గినవారికి టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి.
  ఆప్టిట్యూడ్‌ పరీక్షలో అడిగే పర్సంటేజెస్‌, టైం అండ్‌ వర్క్‌, టైం- డిస్టెన్స్‌ లాంటివి చూసి, ఇది గణితానికి సంబంధించినదని అనుకుంటుంటారు. కానీ ‘ఆప్టిట్యూడ్‌’ అంటే సహజ సామర్థ్యం. ఆలోచించండి... కంపెనీకి మీ గణిత నైపుణ్యాలతో అవసరం ఏముంటుంది? ఒకవేళ మ్యాథ్స్‌లో నైపుణ్యాన్ని పరీక్షించాలనుకుంటే, పదోతరగతి మెమో అడిగేవాళ్ళు. అందులో మ్యాథ్స్‌లో 90+ వచ్చినవాళ్ళందరినీ తరువాతి రౌండ్‌కి ఎంపిక చేసేవాళ్ళు. కానీ అలా జరగటంలేదు. 30-40 నిమిషాల ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ పెట్టి అందులోనే చాలామందిని తప్పిస్తున్నారు. అంటే ఈ టెస్ట్‌ ద్వారా ఇంకేదో పరీక్షిస్తున్నారని అర్థం. మరి ఏమిటది?
  నిత్యజీవితంలో భాగమే!
  ఆప్టిట్యూడ్‌ సిలబస్‌లో ఉన్న ప్రతి అంశం మన జీవితంలో ఒక భాగమే. అందరికీ ఉపయోగమే.
  * పర్సంటేజెస్‌ (శాతాలు): మామ కానీ, అత్త కానీ ‘ఈసారి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి?’ అని అడిగితే ‘83% వచ్చింది’ అంటాం. అది విని అవతలి వ్యక్తి అవునా అనో, అంతేనా అనో బదులిస్తారు. అంటే 83% అన్న వెంటనే అవతలి వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని స్పందిస్తున్నారు. అంటే మీరిద్దరూ ఆ శాతాల భాషలో మాట్లాడుకుంటున్నారు అన్నమాట! అంతెందుకు? షాపింగ్‌కి వెళ్లి డిస్కౌంట్‌ అడిగేటప్పుడు సాధారణంగా 10%, 20% డిస్కౌంట్‌ ఇస్తారా అని అడుగుతాం. జీఎస్‌టీ 18% అనీ, అక్షరాస్యత 74% అనీ చదువుతుంటాం. చివరకు క్రికెట్లో స్ట్రైక్స్‌ రేట్‌ని లెక్కించాలన్నా శాతాలనే వాడుకుంటాం. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లాగే పర్సంటేజ్‌ కూడా ఒక కమ్యూనికేషన్‌ అన్నట్టే.
  * ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ (లాభనష్టాలు): చిన్న కిరాణాకొట్టు నుంచి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి పనీ లాభనష్టాలతో ముడిపడి ఉంటుంది. ఒక పని మొదలుపెట్టాలన్నా, ఒకరితో బంధం కలిపేసుకోవాలన్నా ఎంత లాభం అని ఆలోచించుకుంటాం. అంటే ప్రతీ మనిషి ప్రతీ పనిలో లాభనష్టాలను బేరీజు వేసుకునే అడుగులు వేస్తాడు. ఇలా తెలియకుండానే ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ మన జీవితాల్లో భాగమైపోయింది.
  * టైం అండ్‌ వర్క్‌ (కాలం-పని): ఈ ఆర్టికల్‌ చదవడం ‘పని’.. చదవాలంటే కొంత ‘సమయం’ కేటాయించాలి. అదే టైం అండ్‌ వర్క్‌. జీవితంలో ప్రతీ క్షణం వీటితో ముడిపడి ఉంటుంది. మనం సమయానికి విలువనిస్తాం. పని వల్ల ఆ విలువ వస్తుంది.
  * యావరేజెస్‌ (సరాసరి): ఒక సినిమా చూసొచ్చి ఎలా ఉందని ఎవరైనా అడిగితే.. ‘యావరేజ్‌’ అంటుంటాం. ఈ యావరేజ్‌కీ, ఆప్టిట్యూడ్‌లో యావరేజ్‌కీ తేడా లేదు.
  * సింపుల్‌- కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌ (బారువడ్డీ, చక్రవడ్డీ): వడ్డీ కట్టడానికి రకరకాల లెక్కలు వేస్తుంటాం. అర్థం చేసుకుంటే ఒక్క ఫార్ములా కూడా వాడకుండా సొల్యూషన్స్‌ చెప్పేయొచ్చు.
  * పర్‌మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌; ప్రాబబిలిటీ (సంయోగాలు- ప్రస్తారాలు; సంభావ్యత): ఒక డ్రెస్‌ను ఎంచుకోవాలన్నా ఎంతోసేపు ఆలోచిస్తాం. ఎన్నో రంగులు చూస్తాం. సైజు, రేట్‌ అన్నీ చూసుకొని అప్పుడు కొనుక్కుంటాం. ఈ ప్రక్రియే పర్‌మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌. దీని ఫలితాన్ని ప్రాబబిలిటీ అంటాం. ఈరోజు జీవితం ఇంత ఆసక్తికరంగా ఉంది అంటే రేపు ఏం జరుగుతుందో అన్న అనిశ్చితి. అంటే ఒకటి సంభవించటానికీ, సంభవించకపోవటానికీ అవకాశం.
  ఇంకా గడియారాలు, రక్తసంబంధాలు, డైరెక్షన్స్‌ మొదలైనవన్నీ లేకపోతే జీవితం అసాధ్యమవుతుంది. అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం మనలో ఎంతవరకూ ఉందో పరీక్షించేదే- ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. ఇందులో లెక్కల కంటే కామన్‌సెన్స్‌నే ఎక్కువగా పరీక్షిస్తారు.. ఎంత త్వరగా స్పందిస్తున్నారు, అప్పటికప్పుడు ప్రతిచర్యలు ఎలా ఉంటున్నాయి? అనేవి. ఎందుకంటే సంస్థలో చేరాక క్లయింట్లకు ఎదురయ్యే సమస్యలను ఎంతవరకూ దీటుగా నిర్వహించగలరనేది ఈ ఆప్టిట్యూడ్‌ ద్వారా తెలిసిపోతుంది.
  హెచ్‌ఆర్‌లో ఏమేం గమనిస్తారు?
  చివరిదైన హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో భాష కంటే ఎక్కువగా భావవ్యక్తీకరణను గమనిస్తారు. ఈ రౌండ్‌లో కెరియర్‌లో ఎంత సీరియస్‌గా ఉన్నారు, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నది చూస్తారు. ఆలోచనా విధానాన్ని (థాట్‌ ప్రాసెస్‌) పరీక్షిస్తారు. మాట్లాడేటప్పుడు హావభావాలు, శరీర కదలికలు ఎలా ఉన్నాయో గమనిస్తారు. ప్రశ్నను సరిగా వింటున్నారా, అభిరుచుల విషయంలో కానీ, బలాలూ బలహీనతల విషయంలో గానీ ఎంత నిజాయతీగా ఉన్నారు, రేపు సంస్థలో చేరాక ఎంత బాధ్యతగా ఉంటారు అనేవి పరిగణనలోకి తీసుకుంటారు. భావవ్యక్తీకరణ బాగుంటేనే ఈ అన్ని అంశాల్లో ఇంటర్వ్యూ చేసేవారిని మెప్పించే అవకాశం ఉంటుంది.
  హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో ఫ్యాన్సీ లాంగ్వేజ్‌ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని ఇంగ్లిష్‌ నేర్చుకోవడం కష్టమైన పనీ కాదు. ఇప్పటికే ఎన్నో పదాలు వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం పొందటం సాధ్యమే. కాకపోతే అనువైన మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. క్రికెట్‌ అంటే ఇష్టమున్నవాళ్లు ధోని ప్రసంగాలు, హర్షా భోగ్లే కామెంట్రీ విన్నా కూడా చాలా నేర్చుకోవచ్చు. రాజకీయ నాయకుల, సినిమా డైరెక్టర్ల ఇంటర్వ్యూలను చూస్తూ వాళ్ళెలా మాట్లాడుతున్నారు, ఏ పదాలు వాడుతున్నారు, ఎలా ఉచ్చరిస్తున్నారు, ఎక్కడ ఆపుతున్నారు లాంటివి అర్థం చేసుకోవచ్చు. వింటూ అలవాటు చేసుకోవచ్చు.
  కాబట్టి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో మనం మనలానే ఉంటూ ఉన్న నైపుణ్యాలను రోజూ మెరుగుపరుచుకుంటూపోతే 100% ఉద్యోగం సంపాదించవచ్చు. ‘ఉద్యోగం రాదేమో అని భయపడితే రాదు. వస్తుంది అని నమ్మితే తప్పక వస్తుంది.’ ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు "Aptitude and Attitude decides your Altitude".
  అన్వయించుకుంటే సులువే!
  ఒక సంస్థలో ఎంపికవ్వాలి అంటే ఉండాల్సిన ఆప్టిట్యూడ్‌, ఆటిట్యూడ్‌లు అభ్యర్థుల్లో సహజంగానే ఉంటాయి. కానీ ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఆత్మవిశ్వాసం ఉంది అనో, ఆత్మవిశ్వాసం పెరిగింది అనో అంటుంటాం. కానీ ‘ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకున్నాను’ అనడం గమనించారా? లేదు కదా! అచ్చం ఇలాగే ఆప్టిట్యూడ్‌, ఆటిట్యూడ్‌ మనలోనే ఉన్నాయని తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత పెంచుకుంటాం.
  ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ క్లియర్‌ చేయాలంటే అందులో అడిగే ప్రతి కాన్సెప్టునీ జీవితానికి అన్వయించుకోవాలి. టైం అండ్‌ వర్క్‌ అనుకోండి... ప్రాబ్లంలో x, y, z అని ఇచ్చినా మన పని, మన టైం, మనమే చేస్తున్నాం, మనమే డబ్బులు తీసుకుంటున్నాం అనుకోవాలి. టైం అండ్‌ డిస్టెన్స్‌లో మనమే ట్రైన్‌ అనుకోవాలి. మన లెంగ్త్‌ 300 మీ., మనమే ప్లాట్‌ఫాంను క్రాస్‌ చేస్తున్నాం అనుకోవాలి. అలాగే బ్లడ్‌ రిలేషన్స్‌లో మనకు వాళ్ళు ఏం అవుతున్నారనీ ఆలోచించాలి.
  ఇలా ప్రతీ అంశంలో కాన్సెప్టుని బాగా అర్థం చేసుకోవాలి. కాన్సెప్టులు ఇంటికి స్తంభం లాంటివి. గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా నిలబడతాయి. అలాగే కాన్సెప్టును గట్టిగా అర్థం చేసుకుంటే ఎంత కష్టమైన ప్రశ్నకైనా సులువుగా జవాబు పట్టేయొ
  చ్చు.
  కృష్ణ‌చైత‌న్య రెడ్డి, సీఈఓ, క్రియేట్‌ యూ

                                                

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning