విదేశీ భాష‌లతో విస్తృత అవ‌కాశాలు

స‌ర‌దాగా నేర్చుకునే విదేశీ భాషే భ‌విష్య‌త్తులో ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌వ‌ల్లి కావ‌చ్చు. ప్ర‌పంచం కుగ్రామంగా రూపాంత‌రం చెందే క్ర‌మంలో భాషాప‌ర‌మైన అవ‌కాశాలు విస్తృత‌మ‌వుతున్నాయి. ఆదాయ వ‌న‌రులు పెర‌గ‌డం కార‌ణంగా ప‌ర్యాట‌క‌రంగం విస్త‌రిస్తోంది. విదేశీ వాణిజ్యంలో వృద్ధి కార‌ణంగా ప్ర‌ముఖ కంపెనీలు అన్ని దేశాల్లోనూ శాఖ‌లు తెరుస్తున్నాయి. బ‌హ‌ళ జాతి కంపెనీలన్నీ ప్రాంతాల‌వారీ విస్త‌రిస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌, బీపీవో, కేపీవో, ఎల్‌పీవో, మెడిక‌ల్ ట్రాన్స్‌క్రిప్ష‌న్‌...ఇలా అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాష‌లు వ‌చ్చిన‌వాళ్ల అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకే ఆస‌క్తి ఉంటే జ‌ర్మ‌న్‌, స్పానిష్‌, ఫ్రెంచ్, ఇటాలియ‌న్‌, ప‌ర్షియ‌న్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాష‌లో నైపుణ్యం పెంచుకుని సుస్థిర కొలువును సొంతం చేసుకోవ‌చ్చు.ప్రావీణ్యం పొందితే ఆన్‌లైన్‌ను వేదిక‌గా చేసుకుని ఇంట్లో ఉంటూనే వేల రూపాయ‌ల్లో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. విదేశీ భాష‌లు నేర్చుకోవ‌డం కోసం కాలేజీల్లో ఫుల్ టైం కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే ఏదైనా సంస్థ‌లో చేరి పార్ట్‌టైంలో నేర్చుకోవ‌చ్చు.ప‌లు యూనివ‌ర్సిటీల‌తోపాటు ప్రైవేటు సంస్థ‌లు కూడా విదేశీ భాష‌ల‌ను అందిస్తున్నాయి. బేసిక్ లేదా ఫౌండేష‌న్‌తో మొద‌లైన ఈ కోర్సులు స‌ర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ వ‌ర‌కు విస్త‌రించాయి. విదేశీ భాష‌లు క‌ల్పిస్తున్న అవ‌కాశాలు, కోర్సుల‌ను అందించే సంస్థ‌ల వివ‌రాలు తెలుసుకుందాం...
అవకాశాలిలా...
ప్ర‌పంచంలో ఒక్కో దేశం ఒక్కో భాష‌లో మాట్లాడుతోంది. ప్ర‌తి దేశానికీ ఇంకో దేశంతో వ‌ర్త‌క‌, వాణిజ్య అవ‌స‌రాలు ఉంటాయి. ఆయా దేశాల్లో ఒకే భాష మాట్లాడితే స‌రే.. లేని సంద‌ర్భంలో? అక్క‌డి భాష వ‌చ్చిన వాళ్లు ఈ దేశంలో ఉండాలి. అలాగే ఈ దేశ భాష తెలిసిన‌వాళ్లు ఆదేశంలో ఉండాలి. వీరు ఆ రెండు దేశాల కంపెనీల మ‌ధ్య సంధాన‌క‌ర్త‌లగా వ్య‌వ‌హరిస్తారు.
ప‌ర్యాట‌క రంగం ఎంత‌గానో విస్త‌రిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తాజ్‌మ‌హ‌ల్‌, అజంతాగుహ‌లు...లాంటి వాటిని చూడ‌డానికి విదేశాల నుంచి ఎంద‌రో వ‌స్తుంటారు. జ‌ర్మ‌నీ నుంచి వ‌చ్చిన అతిథికి వీటి గొప్ప‌ద‌నాన్ని వివ‌రించాలంటే జ‌ర్మ‌న్ భాష‌ తెలిసిన‌వాళ్లతోనే సాధ్య‌మ‌వుతుంది. ఇలా ప‌లు దేశాల నుంచి వ‌చ్చిన అతిథుల‌కు గైడ్‌గా వ్య‌వ‌హ‌రించాలంటే వాళ్ల‌భాష మ‌న‌కు రావాలి. ఇలా ప‌ర్యాట‌క రంగం విదేశీ అవ‌కాశాల‌కు బాటలు వేస్తోంది.
ప్ర‌ముఖ సంస్థ‌ల‌న్నింటికీ విదేశాల్లో కార్యాల‌యాలున్నాయి. అలాగే దాదాపు అన్ని పెద్ద సంస్థ‌ల‌కూ విదేశాల్లో ఖాతాదారులు, వినియోగ‌దారులు (క్లైంట్స్‌) ఉంటారు. వీరంద‌రూ మాట్లాడే భాష ఒక‌టి కాదు. ఒక్కొక్క‌రూ ఒక్కో భాష‌లో మాట్లాడతారు. ఇలాంట‌ప్పుడు ఆ భాష తెలిసిన‌వారుంటే స‌మస్య ఉండ‌దు.
సాఫ్ట్‌వేర్ లేదా ఇత‌ర బ‌హుళ‌జాతి సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు కొన్నిసార్లు క్లైంట్ వ‌ద్ద ప‌నిచేయాల్సి రావొచ్చు. ఇలాంట‌ప్పుడు క్లైంట్ భాష తెలిసిన‌వాళ్ల‌కే విదేశాల‌కు వెళ్లే అవ‌కాశాలు ల‌భిస్తాయి.
ప్ర‌భుత్వాల‌కు చెందిన విదేశీ కార్యాల‌యాలు, రాయ‌బార కార్యాల‌యాలు, విదేశీ మంత్రిత్వ శాఖ‌, ఐక్య‌రాజ్య‌స‌మితి విభాగాలు, వివిధ సంస్థ‌ల కేంద్రాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంటాయి. ఇలాంటి చోట ప‌నిచేయాలంటే అక్క‌డి స్థానిక భాష తెలియ‌డం అనివార్యం.
ప్ర‌ముఖ పుస్త‌కాలు, కీల‌క స‌మాచారం, అంత‌ర్జాతీయ స్థాయి నిర్ణ‌యాలు...లాంటివ‌న్నీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఆయా స్థానిక‌ భాష‌ల ద్వారానే సాధ్యం అందుకే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి త‌ర్జుమా చేసేవాళ్లు కూడా పెద్ద‌మొత్తంలో సంపాదిస్తున్నారు. సెల్‌ఫోన్లు, టీవీలు...లాంటివాటికి సంబంధించి యూజ‌ర్ మాన్యువ‌ల్ వినియోగ‌దారుడి స్థానిక భాష‌లో ఉండాలి. ఇలా ప్ర‌తి ఉత్ప‌త్తి కంపెనీలోనూ విదేశీ భాషా నిపుణుల‌కు అవ‌కాశాలుంటాయి.
చాలా వ‌ర‌కు ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో సిల‌బ‌స్ తో సంబంధం లేకుండా ఏదో ఒక విదేశీ భాష‌ను విద్యార్థుల‌కు నేర్పుతున్నారు. ఇలాంటి చోట అవ‌కాశం ల‌భిస్తుంది. అలాగే ఫారిన్ లాంగ్వేజ్‌లు నేర్పే కోచింగ్ సెంట‌ర్ల‌లోనూ ఫ్యాక‌ల్టీగా ప‌నిచేయ‌వ‌చ్చు. ప్ర‌ముఖ విశ్వ‌విద్యాల‌యాల‌న్నింట్లోనూ ఏదో ఒక విదేశీ భాష‌ అందుబాటులో ఉంది. ఇలాంటి చోట్ల ఫ్యాక‌ల్టీగా ప‌నిచేయ‌వ‌చ్చు.
ప్ర‌చారం, వినోదం, మీడియా, ఆతిథ్యం, విమాన‌యానం, విద్య‌, శిక్ష‌ణ‌, మాన‌వ సంబంధాలు...ఇలా ప‌లు విభాగాల్లో విదేశీ భాష‌లు వ‌చ్చిన‌వారికి అవ‌కాశాలుంటాయి.
వేత‌నాలూ ఎక్కువే...
ఇంట‌ర్‌ప్రిట‌ర్ల‌గా వ్య‌వ‌హ‌రించేవాళ్లు గంట‌కు రూ.వెయ్యి చొప్పున సంపాదించ‌వ‌చ్చు. అలాగే ట్రాన్స్‌లేష‌న్ ప‌నిచేసేవాళ్లు భాష‌ను బ‌ట్టి ప‌దానికి 60 పైస‌ల నుంచి రూ.5 రూపాయ‌ల వ‌ర‌కు తీసుకుంటారు. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కేపీవో)లో ప‌నిచేసేవాళ్లు నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదించ‌డం క‌ష్ట‌మైన ప‌నేమీ కాదు. స‌ర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్ల‌యితే రోజుకి రెండు మూడు వేల రూపాయ‌లు సంపాదించ‌డం కూడా సాధ్య‌మే. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు స‌రిపోయినంత‌మంది విదేశీ భాషలు వ‌చ్చిన‌వాళ్లు లేర‌ని ఈ రంగంలో స్థిర‌ప‌డిన నిపుణుల మాట‌. కాబ‌ట్టి ఈ భాష‌ల్లో ప్రావీణ్యం పొందిన వెంట‌నే ఉపాధి సొంతం చేసుకోవ‌చ్చు.
ఇవీ భాష‌లు...
ఫ్రెంచ్, స్పానిష్‌, జ‌ర్మ‌న్‌, ఇటాలియ‌న్‌, కొరియ‌న్‌, చైనీస్‌, ప‌ర్షియ‌న్‌, అర‌బిక్‌, జ‌ప‌నీస్‌, ర‌ష్య‌న్ భాష‌ల్లో ప్ర‌స్తుతం అవ‌కాశాలున్నాయి. ఈ భాషాప‌ర‌మైన‌ అవ‌కాశాలు మ‌న‌దేశం ఏయే దేశాల‌తో ఎక్కువ‌గా వాణిజ్యాన్ని కొన‌సాగిస్తోంది, ఏ దేశాల శాఖ‌లు భార‌త్‌లో ఎక్కువ‌గా ఉన్నాయి, భార‌త్‌కు ఏయే దేశాల నుంచి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తున్నారు...త‌దిత‌ర అంశాల‌పైన ఆధార‌ప‌డి ఉంటాయి.
ప్రావీణ్యం పొందాలంటే...
మ‌న దేశంలో ఇంగ్లిష్ ఆధారంగా చేసుకుని విదేశీ భాష‌ల‌ను నేర్పుతున్నారు. కాబ‌ట్టి ఆంగ్లంపై ప‌ట్టుండాలి.
ఏ భాష నేర్చుకోవాల‌న్నా కేవ‌లం పుస్త‌కాల ద్వారా సాధ్యం కాద‌ని గుర్తుంచుకోవాలి. వీలైన‌న్ని సంద‌ర్భాల్లో ఆ భాష‌లో మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అవ‌కాశం ల‌భిస్తే ఆ భాష‌లో ప్రావీణ్యం ఉన్న స్థానికుల‌తో ఎక్కువ‌గా మాట్లాడాలి. ఇలాచేస్తే కేవ‌లం కొన్ని నెల‌ల్లోనే సంబంధిత భాష‌లో ప్రావీణ్యం పొందొచ్చు.
సంబంధిత భాష‌లో వీలైన‌న్ని ఉప‌న్యాసాలు వినాలి. సినిమాలు చూడాలి. యూట్యూబ్లో అన్ని భాష‌ల వీడియోలూ అందుబాటులో ఉన్నాయి. దీన్నివిదేశీ భాష‌లు నేర్చుకోవ‌డానికి వేదిక‌గా చేసుకోవ‌చ్చు.
కొంత ప్రావీణ్యం పొందిన త‌ర్వాత ఆ భాష‌కు సంబంధించిన వార్తా ప‌త్రిక‌లు, మ్యాగ‌జీన్లు, న‌వ‌ల‌లు...ఇలా వేటినైనా బాగా చ‌ద‌వాలి.
పై విధానాల‌ను అనుస‌రించ‌డం ద్వారా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే సంబంధిత భాష‌లో నిష్ణాతులుగా మారొచ్చు.
ఇవీ సంస్థ‌లు:
విదేశీ భాష‌లు నేర్ప‌డానికి దేశంలోనే పేరొందిన విశ్వ‌విద్యాల‌యాలెన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్య‌మైన సంస్థ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ(ఇఫ్లూ), హైద‌రాబాద్‌. ఇది కేవ‌లం విదేశీ భాష‌ల కోస‌మే ఆవిర్భ‌వించింది. ల‌క్నో, షిల్లాంగ్‌ల్లోనూ ఇఫ్లూ క్యాంప‌స్‌లు ఉన్నాయి. దీంతోపాటు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ, న్యూఢిల్లీ, ఢిల్లీ యూనివ‌ర్సిటీ, న్యూఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివ‌ర్సిటీ, న్యూఢిల్లీ దేశంలో పేరొందిన సంస్థ‌లు. అలాగే హైద‌రాబాద్‌లోని రామ‌కృష్ణ మ‌ఠం, ఉస్మానియా యూనివ‌ర్సిటీలు కూడా విదేశీ భాషలు నేర్ప‌డంలో ఖ్యాతి గ‌డించాయి. సంస్థ‌ను బ‌ట్టి స‌ర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ త‌దిత‌ర విదేశీ భాషా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సంస్థ‌ల వారీ అందుబాటులో ఉన్న కోర్సులు
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ), హైద‌రాబాద్‌
బీఏ ఆన‌ర్స్‌: అర‌బిక్‌, ఫ్రెంచ్, జ‌ర్మ‌న్‌, ర‌ష్య‌న్‌, స్పానిష్‌
అర్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా ప్ర‌వేశం క‌ల్పిస్తారు. స్పానిష్‌లో 24 సీట్లు, మిగిలిన ఒక్కో భాష‌లో 16 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్య‌వ‌ధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్ట‌ర్లు.
ఎంఏ: అర‌బిక్‌, ఫ్రెంచ్, జ‌ర్మ‌న్‌, జ‌ప‌నీస్‌, ర‌ష్య‌న్‌, స్పానిష్‌
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత భాష‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పూర్తిచేసిన‌వాళ్లు ఈ కోర్సుల్లో ప్ర‌వేశానికి అర్హులు. రాత ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశం ల‌భిస్తుంది. అర‌బిక్ లో 24; ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, జ‌ప‌నీస్ ఒక్కో దాంట్లో 16 చొప్పున‌; ర‌ష్య‌న్‌, స్పానిష్ ఒక్కోదాంట్లో 8 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పీహెచ్‌డీ: అర‌బిక్ లిట‌రేచ‌ర్‌, ఫ్రెంచ్‌, ర‌ష్య‌న్ భాష‌లు
అర్హ‌త‌: సంబంధిత భాష‌లో పీజీ ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రి. అర‌బిక్ లిట‌రేచ‌ర్‌, ఫ్రెంచ్ ఒక్కోదాంట్లో 8 సీట్లు చొప్పున ఉన్నాయి. ర‌ష్య‌న్‌లో 2 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in
ఉస్మానియా యూనివ‌ర్సిటీ
అర‌బిక్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, జ‌ప‌నీస్‌, ప‌ర్షియ‌న్‌, ర‌ష్య‌న్ కోర్సుల‌ను వివిధ స్థాయుల్లో బోధిస్తోంది.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ
వివిధ స్థాయుల్లో అర‌బిక్‌, ఫ్రెంచ్‌, స్పానిస్‌, జ‌ర్మ‌న్‌, జ‌ప‌నీస్‌, కొరియ‌న్‌, మంగోలియ‌న్‌, ర‌ష్య‌న్‌, చైనీస్ భాష‌ల‌ను ఈ యూనివ‌ర్సిటీ అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.jnu.ac.in
ఢిల్లీ యూనివ‌ర్సిటీ
అర‌బిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జ‌ర్మ‌న్‌, ఇటాలియ‌న్‌, పోర్చుగీసు, రోమానియ‌న్‌, జ‌ప‌నీస్‌, చైనీస్‌, కొరియ‌న్ భాష‌ల్లో వివిద స్థాయుల్లో కోర్సులు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.du.ac.in
జామియా మిల్లియా ఇస్లామియా
అర‌బిక్, ఫ్రెంచ్, స్పానిష్‌, ఇటాలియ‌న్‌, పోర్చుగీస్‌, ట‌ర్కిస్‌, ప‌ర్షియ‌న్‌...త‌దిత‌ర కోర్సుల‌ను వివిధ స్థాయుల్లో నిర్వ‌హిస్తోంది.
వెబ్‌సైట్‌: http://jmi.ac.in
రామ‌కృష్ణ మ‌ఠం, హైద‌రాబాద్‌
విద్యార్థుల‌కు నామ‌మాత్ర‌పు ఫీజుతో ఆంగ్లంతోపాటు వ్య‌క్తిత్వ వికాసం, విదేశీ భాష‌లు ఇక్క‌డ నేర్పుతారు. అనుభ‌వ‌జ్ఞులైన బోధ‌నా సిబ్బంది, క్ర‌మశిక్ష‌ణ‌తో కూడిన విద్య‌ను అందించ‌డం వ‌ల్ల రామ‌కృష్ణ మ‌ఠంలోని కోర్సుల‌కు డిమాండ్ ఏర్ప‌డింది.
నేర్పే విదేశీ భాష‌లు: జ‌ర్మ‌న్‌, ఫ్రెంచ్‌, జ‌ప‌నీస్‌, స్పానిష్‌
ఎన్ని ద‌శ‌ల్లో: జ‌ర్మ‌న్‌, ఫ్రెంచ్‌, జ‌ప‌నీస్‌, స్పానిష్ భాష‌ల‌ను నాలుగు ద‌శ‌ల్లో పూర్తిగా నేర్పుతారు. వీటిని ఫ‌స్ట్ జూనియ‌ర్‌, సెకెండ్ జూనియ‌ర్‌, ఫ‌స్ట్ సీనియ‌ర్‌, సెకెండ్ సీనియ‌ర్ పేర్ల‌తో నిర్వ‌హిస్తారు. జ‌ర్మ‌న్‌, ఫ్రెంచ్లో మాత్రం అద‌నంగా రెండు ద‌శ‌ల్లో అడిష‌న‌ల్ డిప్లొమా కోర్సు ఉంటుంది. జ‌ప‌నీస్‌లో అద‌నంగా ఒక ద‌శ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు ఉంటుంది. ఒక ద‌శ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేస్తేనే రెండో ద‌శ‌కు అనుమ‌తి ల‌భిస్తుంది.
అడ్మిష‌న్లు: ఏడాదికి మూడు సార్లు కోర్సుల్లో ప్ర‌వేశం ల‌భిస్తుంది. జ‌న‌వ‌రి, జూన్‌, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి.
వ్య‌వ‌ధి: ఒక్కో ద‌శ మూడు నెల‌ల్లో పూర్త‌వుతుంది. ఈ వ్య‌వ‌ధిలో 36 త‌ర‌గ‌తులు ఉంటాయి.
కోర్సు ఫీజు: ఏ భాష‌ను ఎంచుకున్న‌ప్ప‌టికి ఒక్కో లెవెల్‌కు రూ.1200 చెల్లించాలి. ఒక్కో లెవెల్‌లో నాలుగు కంటే ఎక్కువ సెల‌వులుంటే త‌ర‌గ‌తుల‌కు అనుమ‌తించ‌రు.
వెబ్‌సైట్‌: http://www.rkmath.org

* posted on 21-10-2014Ushodaya Enterprises Private Limited 2014