ఎస్‌సీఆర్ఏ...ఉచితంగా బీటెక్‌+రైల్వేలో క్లాస్ వ‌న్ ఇంజినీర్ కొలువు

యూపీఎస్‌సీ ఏటా నిర్వ‌హించే స్పెష‌ల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్ఏ) ప‌రీక్ష‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థుల‌కున్న అద్భుత అవ‌కాశాల్లో ఎస్‌సీఆర్ఏ ప‌రీక్ష ఒక‌ట‌ని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఈ ప‌రీక్ష‌లో ఎంపికైన‌వాళ్లు పైసా ఖ‌ర్చులేకుండా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీని ప్ర‌తిష్టాత్మ‌క బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (బిట్‌) నుంచి అందుకోవ‌చ్చు. అంతేకాదు కోర్సు చ‌దువుతున్న‌ప్పుడే నెల‌కు రూ.9000కుపైగా స్టైపెండ్‌గా పొందొచ్చు. అనంత‌రం భార‌తీయ రైల్వేలో క్లాస్ వ‌న్ ఇంజినీర్‌గా సేవ‌లందిచ్చొచ్చు. ఉద్యోగంలోకి చేరిన త‌ర్వాత నెల‌కు రూ.40,000కు పైగా ఆరంభ వేత‌నంతో కెరీర్ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఎస్‌సీఆర్ఏ పరీక్ష విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ప్రిప‌రేష‌న్‌ తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
అర్హతలు:
అభ్యర్థి భారతీయుడై, ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌తో (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సెకండ్‌క్లాస్ లేదా ఆపైన అర్హత ఉండాలి. ప్రకటనలో పేర్కొనే తేదీ నాటికి అభ్యర్థికి 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. డిగ్రీ చేసి ఉంటే డిగ్రీలో మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చదివి ఉండాలి. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు తప్ప మిగిలిన వారంతా యూపీఎస్సీ సూచించిన నిర్ణీత ఫీజును తమ సమీప ఎస్‌బీఐలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపికలో రెండు దశలుంటాయి. మొదటి దశ (పార్ట్ -1)లో రాత పరీక్ష, రెండో దశలో పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి.
* పార్ట్-1 రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి (ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది).
నోట్: తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. (ఎన్ని మార్కులు తీసి వేయాలో అధికారులు పరీక్ష సమయంలో నిర్ణయిస్తారు).
సిలబస్ - ప్రిపరేషన్ విధానం
ఇంటర్ విద్యార్హత ఆధారంగానే అభ్యర్థులను తీసుకుంటున్నారు కాబట్టి ప్రశ్నపత్రం కూడా ఇంటర్ స్థాయిలో ఉండే విధంగా రూపొందిస్తారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్ సిలబస్‌లపై పట్టు సాధిస్తే ఈ పరీక్షలో నెగ్గుకురావచ్చు.
పేపర్ -1: జనరల్ ఎబిలిటీ (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, సైకలాజికల్ టెస్ట్)
సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అభ్యర్థికి ఎంతమేరకు అవగాహన ఉందో పరిశీలించడమే ఈ విభాగం ఉద్దేశం. దీన్లోని అంశాలు...
ఎ) ఇంగ్లిష్: అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై ఎంత అవగాహన ఉన్నదో తెలుసుకోవడానికి ఈ విభాగాన్ని నిర్దేశించారు. దీన్లో ఇంగ్లిష్ ప్రాథమిక గ్రామర్ పాయింట్లు, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్సెస్, కాంప్రహెన్షన్ మొదలైనవి ఉంటాయి.
బి) జనరల్‌నాలెడ్జ్: దీన్లో హిస్టరీ, పాలిటిక్స్, భారత రాజ్యాంగం, సాంకేతిక ప్రగతి, జనాభా నియంత్రణ, కులవృత్తులు, పేదరికం, పేదరిక నిర్మూలన, వెనుకబడిన కులాల సంక్షేమం, మానవ శరీర నిర్మాణం, కణాలు, ఆహార సమతౌల్యం, సహజ వ్యాధులు, వాతావరణ కాలుష్యం, ఎరువులు, పంటల పరిరక్షణ, మొక్కల జీవావరణ వ్యవస్థ, సోలార్ సిస్టమ్, భూమి, ప్రకృతి విపత్తులు, మొదలైనవి ఉంటాయి.
వీటితోపాటు భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక ప్రగతి, ప్రణాళికలు, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ది, ద్రవోల్బణం, పన్నులు, ధరల స్థిరీకరణ, జాతీయ ఆదాయం, వనరుల పంపిణీ సమస్యలు తదితర అంశాలుంటాయి.
¤ సైకలాజికల్ టెస్ట్: మెకానికల్, ఇంటెలిజెన్స్ అంశాల్లో అభ్యర్థికి ఉన్న ప్రాథమిక అవగాహనను పరిశీలించేందుకు దీన్లో ప్రశ్నలు ఇస్తారు.
ప్రిపరేషన్:
¤ జనరల్ఎబిలిటీ విభాగా సిలబస్ చాలా ఎక్కువ. దీనిపై పట్టు సాధించాలంటే మొదట స్థిరమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా సిలబస్‌ను విభజించుకోవాలి. తర్వాత ప్రామాణిక మెటీరియల్‌తోపాటు 6 నుంచి ఇంటర్ వరకు సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్య పుస్తకాలను బాగా చదవాలి. కరెంట్ ఈవెంట్స్‌లో జాతీయ అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చేపట్టిన నూతన పథకాలు, ప్రయోగాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి దినపత్రికలు చదవాల్సి ఉంటుంది. పరీక్షకు 6 నెలల ముందు నుంచి ప్రధాన దినపత్రికలు (తెలుగు, ఇంగ్లిష్) చదవాలి. ముఖ్యమైన పాయింట్లను విడిగా నోట్ చేసుకోవాలి. పరీక్ష తేదీ దగ్గరపడేకొద్దీ వీటిని మననం చేసుకుంటే సరిపోతుంది.
¤ ఐక్య రాజ్య సమితి, భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు తదితర అంశాల సాధనకోసం 6 నుంచి ఇంటర్ వరకు ఉన్న సోషల్ స్టడీస్ పుస్తకాలను బాగా చదవాలి. ముఖ్యమైన పాయింట్లను విడిగా నోట్ చేసుకోవాలి.
¤ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ టాపిక్‌లు కూడా చిన్న నాటి నుంచి ఇప్పటిదాకా చదివే ఉంటారు కాబట్టి ఆ సబ్జెక్టులపై పూర్తిగా అవగాహ ఏర్పర్చుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచ్చే ముఖ్యమైన ఈక్వేషన్లను పదేపదే మననం చేసుకోవడం అవసరం.
¤ ఇంగ్లిష్‌లో మంచి మార్కుల కోసం ఇంగ్లిష్ గ్రామర్ మీద పట్టు సాధించాలి. టెన్త్, ఇంటర్‌లలో చదివిన ఇంగ్లిష్ గ్రామర్‌ను మొత్తం పునశ్చరణ చేయాలి. ముఖ్యంగా టెన్సెస్, వెర్బ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్‌పై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌లను రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్ సైన్స్ అభ్యర్థులకు జనరల్ ఎబిలిటీ విభాగం కొంత కొత్తగా ఉంటుంది. దీన్లో వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎంత సమయం కేటాయించాలి? వంటి అనుమానాలు తలెత్తుతాయి. వీటి నివారణకు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల అభ్యర్థికి ప్రశ్నల సరళి అర్థమవుతుంది. సందేహాలు కూడా నివృత్తి అవుతాయి.
2) పేపర్ - 2 ఫిజికల్ సైన్సెస్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ)
అభ్యర్థి ఇంటర్ వరకు చదివిన ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి... స్క్రూ గేజ్, టైమ్ అండ్ మాస్ మెజర్‌మెంట్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, పాస్కల్స్ లా, ప్రిన్సిపుల్ ఆఫ్ ఆర్కిమెడిస్, టెంపరేచర్ మెజర్‌మెంట్, వేవ్ మోషన్, మైక్రోస్కోప్స్ అండ్ టెలిస్కోప్స్, మాగ్నటిక్ మూవ్‌మెంట్, ఎలక్ట్రిక్ చార్జ్, కొలంబస్ లా తదితరాలు ఉంటాయి.
ఎ) కెమిస్ట్రీ (ఫిజికల్‌కెమిస్ట్రీ): దీన్లో ఆటమిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆక్సిడేషన్, నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ మొదలైనవి ఉంటాయి.
బి) ఇనార్గానిక్ కెమిస్ట్రీ: దీన్లో ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, మెటలర్జికల్‌ప్రాసెస్, మెటల్స్, గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి.
సి) ఆర్గానిక్ కెమిస్ట్రీ: దీన్లో టెట్రాహెడ్రల్ నేచర్ ఆఫ్ కార్టన్, జనరల్ మెథడ్స్ ఆఫ్‌ప్రిపరేషన్, నైట్రో కాంపౌండ్స్ ఎమినీస్, కార్బాగ్జాలిక్ యాసిడ్, ఆల్డీహైడ్స్ అండ్ కీటోన్స్, ఈస్టర్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, పాలిమర్స్ మొదలైనవి ఉంటాయి.
పేపర్ - 3: మ్యాథమెటిక్స్
దీన్లో ఆల్జీబ్రా (సెట్స్, బైనరీ ఆపరేషన్, మ్యాట్రిక్స్ మొదలైనవి), ట్రిగనామెట్రీ (అడిషన్ అండ్‌సబ్‌ట్రాక్షన్ ఫార్ములా, రేంజెస్ అండ్ గ్రాఫిక్స్ తదితరాలు), ఎనలిటికల్ జామెట్రీ (టూ డైమెన్షన్ - కో ఆర్డినేషన్ సిస్టమ్, స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ పారబోలా తదితరాలు), డిఫరెన్షియల్‌క్యాలిక్యులస్ (రియల్ వాల్యూ ఫంక్షన్ కాన్సెప్ట్స్ మొదలైనవి), ఇంటెగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్స్ అప్లికేషన్స్, స్టాటిస్టిక్స్ అండ్‌ప్రాబబిలిటీ (ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, హిస్టోగ్రామ్ మొదలైనవి) ఉంటాయి.
ప్రిపరేషన్:
ఈ సబ్జెక్టుకు వేగం ముఖ్యం. దీనిపై పూర్తి పట్టు సాధించడానికి ముఖ్యమైన సూత్రాలను బాగా అర్థం చేసుకోవడంతోపాటు పలు బిట్ బ్యాంక్‌లను ప్రాక్టీస్ చేయాలి. 6 నుంచి ఇంటర్ వరకు చదివిన మ్యాథ్స్ సబ్జెక్టుకు చెందిన ప్రతి ముఖ్యమైన చాప్టర్‌లోని ప్రాథమిక సూత్రాలను ఒక ప్రత్యేక నోట్సులో రాసుకుని ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటిని ఉపయోగించాలి. మ్యాథ్స్ సబ్జెక్టులు చేసేటప్పుడు లెక్కకు సంబంధించిన సూత్రాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలనే వాస్తవాన్ని మరిచిపోకూడదు. ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కుల కోసం ఆందోళన చెందకూడదు. చాప్టర్ల వారీగా ప్రశ్నలను సాధన చేస్తే అన్ని టాపిక్‌లపై పూర్తి పట్టు వస్తుంది.
మోడల్ పేపర్ల సాధన:
సీట్లు తక్కువ పోటీ ఎక్కువగా ఉండే పరీక్ష ఈ పరీక్షలో నెగ్గుకు రావాలంటే సాధనలో వేగం చాలా అవసరం. దీనికోసం మోడల్ పేపర్లు, పాత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్టుల వారీగా బిట్ బ్యాంక్‌లు ప్రాక్టీస్ చేసి పరీక్ష తేదీకి నెల ముందు నుంచి పాత పేపర్లు, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల సబ్జెక్టులపై అభ్యర్థికున్న అవగాహన, లోటుపాట్లు తెలుస్తాయి. తప్పులు ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయో చెక్ చేసుకుంటే పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయవచ్చు.
గుర్తుంచుకోండి!
¤ పాఠ్య పుస్తకాలను బాగా అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రధానమైన సూత్రాలపై నోట్స్ తయారు చేసుకోవాలి.
¤ ఆబ్జెక్టివ్ బిట్ బ్యాంక్ తీసుకుని పేపర్‌కు తగిన సమయాన్ని కేటాయిస్తూ ప్రాక్టీస్ చేయాలి.
¤ ఏ విభాగాల్లో తక్కువ మార్కులు వస్తున్నాయో గుర్తించి వాటిని మళ్లీ మళ్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
¤ ఈ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది. పోటీ చాలా ఎక్కువ. కాబట్టి కచ్చితత్వం, వేగం రెండూ ముఖ్యం. దీనికి ఒకే ఒక మార్గం - ప్రశ్నను అర్థం చేసుకుంటూ ఎక్కువ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.
¤ గణిత ప్రశ్నలకు షార్ట్‌కట్ మెథడ్‌లను అనుసరించడం మంచిది.
మౌఖిక ప‌రీక్ష‌:
రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. సాధారణంగా కేట‌గిరీ బ‌ట్టి ఒక్కో ఖాళీకి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఎంపికైతే...
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటిస్‌ కాల వ్యవధి మొత్తం నాలుగేళ్లు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన అంశాల‌ను బోధిస్తారు. శిక్ష‌ణ మొత్తం సంబంధిత రైల్వే వ‌ర్క్‌షాప్‌లో ఉంటుంది. కోర్సును విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ అభ్యర్థులు ప్రఖ్యాత బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌)-మెర్సా నుంచి బీటెక్‌ డిగ్రీ అందుకోవ‌చ్చు. కోర్సు ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. అభ్య‌ర్థులు అన్ని సబ్జెక్టుల్లో సగటున 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు రైల్వే వర్క్‌షాప్‌లో నిర్వహించే అప్రెంటిస్‌ ట్రైనింగ్‌లో 60 శాతం మార్కులు సాధిస్తేనే.. రైల్వేలో ఇంజినీర్ కొలువు ఖాయ‌మ‌వుతుంది.
స్టైపెండ్‌
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటిస్‌గా ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల శిక్షణలో మొదటి రెండేళ్లు రూ. 9,100; మూడో ఏడాది రూ. 9,400; నాలుగో ఏడాది మొదటి ఆరు నెలలు రూ. 9,700; చివరి ఆరు నెలలు రూ. 9,700 చొప్పున నెలవారీ స్టైపెండ్‌ అందజేస్తారు.
ప్రొబేషన్‌
బీటెక్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌లో 18 నెలల పాటు ప్రొబేషన్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌హించాలి. దీన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్న‌వాళ్లు రైల్వే శాఖలో శాశ్వత ప్రాతిపదికన మెకానికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఆరంభ‌వేత‌నం రూ.40,000కు పైగా ల‌భిస్తుంది. ఈ ఏడాది ప‌రీక్ష‌లో ఎంపికైన‌వాళ్లు నాలుగేళ్ల కోర్సు అనంత‌రం ఉద్యోగంలో చేరుతారు కాబ‌ట్టి జీతం మ‌రింత పెరుగుతుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల పే రివిజ‌న్ త్వ‌ర‌లో చేప‌డ‌తారు కాబ‌ట్టి ఎంపికైన‌వాళ్ల‌కు జీతం రూ.60,000 వ‌ర‌కు ల‌భించే అవ‌కాశాలున్నాయి.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్లో రెండు భాగాలుంటాయి. అప్లికేషన్ పూర్తి చేయడానికి ముందే ఫీజు కట్టాలి. తర్వాత అభ్యర్థి తన ఫొటో, సంతకాన్ని స్కాన్ చేయాలి. ఇప్పుడు ఆన్‌లైన్లో అప్లికేషన్ పూర్తి చేసి దాన్లో సూచించిన విధంగా ఫొటో, సంతకాన్ని నమోదు చేయాలి. అంతేకాదు దీన్లో ప్రస్తుతం తాను ఉపయోగిస్తున్న ఇ-మెయిల్ ఐడీని పేర్కొనాలి.
పరీక్ష జరిగి ఫలితాలు వచ్చేంత వరకు అభ్యర్థికి ఇ-మెయిల్ ద్వారానే సమాచారాన్ని పంపుతుంటారు కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హార్డ్ కాపీని కమిషన్‌కు పంపాల్సిన అవసరంలేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల తర్వాత అర్హులైన జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు మాత్రమే కమిషన్ పేర్కొన్న సర్టిఫికెట్ కాపీలను అటెస్ట్ చేయించి పంపాలి.
జ‌త‌చేయాల్సిన‌వి...
¤ వయస్సును తెలిపే ధ్రువీకరణ పత్రం.
¤ విద్యార్హతలు, డివిజన్‌ను తెలిపే పత్రం.
¤ ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే కుల ధ్రువీకరణ పత్రం.
¤ వికలాంగులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రం.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 11, 2014
చివరితేది: నవంబరు 7, 2014
రాత పరీక్ష: జనవరి 18, 2015
ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
నోటిఫికేష‌న్‌:
ఆన్‌లైన్ అప్లికేష‌న్‌:
పాత ప్ర‌శ్న‌ప‌త్రాలు:

posted on 11-10-14
Ushodaya Enterprises Private Limited 2014