గ్రాడ్యుయేట్ల‌కు 82,000 పుర‌స్కారాలు

మీరు బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఏజీబీఎస్సీ లేదా మ‌రేదైనా డిగ్రీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులా? అయితే మీ కోస‌మే డిపార్ట్ మెంట్ ఆఫ్ హయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ విభాగంలోని 82,000 స్కాల‌ర్‌షిప్పులు ఎదురుచూస్తున్నాయి. ప్ర‌తిభ ఉన్న విద్యార్థుల‌ను ప్రోత్సహించడానికి 'సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్‌'ను ఏర్పాటు చేశారు. సీనియర్ సెకెండరీ/ఇంటర్మీడియట్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పుర‌స్కారాలు అందిస్తారు.

ప్ర‌స్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం కోర్సుల్లో చేరిన‌వారు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 82,000 స్కాలర్‌షిప్పుల్లో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు. ప్ర‌తిభావంతుల‌కు రోజువారీ అవ‌స‌రాల‌ను తీర్చే ల‌క్ష్యంతో వీటిని ఏర్పాటుచేశారు. యూజీ నుంచి పీజీ వ‌ర‌కు అయిదేళ్ల‌పాటు ఈ పుర‌స్కారాలు అందుతాయి. బీటెక్ లాంటి ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దువుతున్న‌వారికి నాలుగేళ్ల వ‌ర‌కు చెల్లిస్తారు. సాధార‌ణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ పీజీలు చ‌దువుతున్న‌వారికి ఏడాదికి రూ.10,000 చొప్పున మొద‌టి మూడేళ్లు చెల్లిస్తారు. పీజీలో చేరిన‌ప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు.

అర్హ‌త‌: ఇంట‌ర్ లేదా ప్ల‌స్‌2 లో 80 ప‌ర్సంటైల్ కంటే ఎక్కువ‌ మార్కులు సాధించాలి. రెగ్యుల‌ర్ విధానంలో చ‌దివిన‌వాళ్లే అర్హులు. డిప్లొమా విద్యార్థుల‌కు అవ‌కాశం లేదు. అలాగే త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్ష‌ల లోపు ఉండాలి. ఇత‌ర ఏ స్కాల‌ర్‌షిప్పుల‌నూ పొంద‌నివారే దీనికి అర్హులు. ఫీజు రీ ఇంబ‌ర్స్ మెంట్ వ‌ర్తించిన‌వాళ్లు ఈ స్కాల‌ర్‌షిప్పుకి అన‌ర్హులు. స్కాల‌ర్‌షిప్పుల‌కు ఎంపికైన‌వాళ్లు త‌ర్వాత ఏడాదిలోనూ పొంద‌డానికి ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో క‌నీస హాజ‌రు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం త‌ప్ప‌నిస‌రి.

రాష్ట్రాల వారీ స్కాలర్‌షిప్పుల విభజన
ఆయా రాష్ట్రాల్లో ఉన్న 18-25 ఏళ్ల వయసు జనాభా ఆధారంగా రాష్ట్రాల వారీ స్కాలర్‌షిప్పులను కేటాయిస్తారు. రాష్ట్రాల వారీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. సీబీఎస్ ఈ ద్వారా ప్ల‌స్ 2 చ‌దివిన‌వారికి 5413, ఐసీఎస్ ఈ విద్యార్థుల‌కు 577 స్కాల‌ర్ షిప్పులు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ద్వారా చ‌దువుకున్న విద్యార్థుల‌కు 3527, తెలంగాణ ఇంట‌ర్ బోర్డు విద్యార్థుల‌కు 2570 స్కాల‌ర్ షిప్పులు కేటాయించారు. ఆ రాష్ట్రానికి కేటాయించిన స్కాల‌ర్‌షిప్పుల్లో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు.

రిజర్వేషన్: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగుల‌కు 5 శాతం స్కాల‌ర్‌షిప్పులు కేటాయించారు.

ద‌ర‌ఖాస్తులు: https://scholarships.gov.in/లో డిపార్ట్ మెంట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ పై క్లిక్ చేసి వివ‌రాలు న‌మోదుచేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబ‌రు 31

posted on 25.08.2018

back

Ushodaya Enterprises Private Limited 2018