జీప్యాట్‌కు సిద్ధమేనా?

ఫార్మసీ విద్యార్థుల ఉన్నతాశయాలకు బాట‌లువేసే మార్గం గ్రాడ్యుయేట్ ఫార్మ‌సీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌). ఎందుకంటే ఈ ప‌రీక్ష ద్వారా దేశంలో పేరొందిన ఫార్మ‌సీ విశ్వ‌విధ్యాల‌యాలు, క‌ళాశాల‌ల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశం ల‌భిస్తుంది. అంతేకాకుండా నెల‌కు రూ.8000 చొప్పున రెండేళ్ల పాటు ఉప‌కార వేత‌నం కూడా పొందొచ్చు. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశపరీక్ష ప్రకటన న‌వంబ‌ర్ 13న విడుదలైంది. ఈ నేప‌థ్యంలో జీప్యాట్‌ వివ‌రాల‌ను తెలుసుకుందాం.

ఎం ఫార్మసీలో ప్రవేశానికి విద్యార్థులను ఎంపిక చేయడం కోసం 2010 నుంచి ప్రత్యేక పరీక్ష అయిన జీప్యాట్‌ను అఖిల భార‌త సాంకేతిక విద్యా శాఖ ( ఏఐసీటీఈ) నిర్వహిస్తోంది. 2010కి ముందు ఫార్మసీ చదివినవారు కూడా ఇంజినీరింగ్‌ వారితోపాటుగా 'గేట్‌' రాసేవారు. మొదటి మూడు సంవత్సరాలూ- అంటే 2012 వరకూ జీప్యాట్‌ పేపర్‌- పెన్సిల్‌ విధానంలో జరిగేది. ఈ పరీక్షను ఎంఎస్‌ విశ్వవిద్యాలయం, బరోడా వారితో కలిసి ఏఐసీటీఈ సంయుక్తంగా నిర్వహించేది. 2013 నుంచి జీప్యాట్‌ను కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షగా నిర్వహిస్తున్నారు.
అర్హ‌త‌: బీ ఫార్మసీ పూర్తిచేసిన‌వాళ్లు, ఈ కోర్సు ఆఖరి సంవత్సరం చదువుతున్నవారూ జీప్యాట్‌- 2015 రాయడానికి అర్హులు.
ప‌రీక్ష కేంద్రాలు: దేశంలోని 58 నగరాల్లో జీప్యాట్‌ 2015 పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో 6 పరీక్ష కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, వ‌రంగ‌ల్‌.
పరీక్ష విధానం: 2013 నుంచి నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలో 125 ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. ప‌రీక్ష వ్య‌వ‌ధి 3 గంట‌లు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. (గరిష్ఠంగా 500 మార్కులు). తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సిలబస్‌: ఫార్మాస్యుటిక్స్‌ (ఫోరెన్సిక్‌ ఫార్మసీ, ఫిజికల్‌ ఫార్మసీ, బయో ఫార్మాస్యుటిక్స్‌, యూనిట్‌ ఆపరేషన్‌), ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీ (ఆర్గానిక్‌, ఫిజికల్‌, ఇనార్గానిక్‌, మెడిసినల్‌), బయోకెమిస్ట్రీ, ఫార్మస్యుటికల్‌ ఎనాలిసిస్‌, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. సిలబస్‌ గురించి పూర్తి వివరాలు www.aicte-gpat.inలో పొందవచ్చు.

సుమారు ముప్పైఐదు వేలు
దేశవ్యాప్తంగా ముప్పైఐదు వేల‌ మంది అభ్యర్థులు జీప్యాట్‌- 2015కు హాజ‌రుకావ‌చ్చు. వీరిలో పదివేల మందికిపైగా తెలుగు రాష్ట్రాల‌వారే ఉంటారు. 2013 జీప్యాట్‌లో అర్హత పొందటానికి కటాఫ్‌ మార్కులు 145గా నిర్ణయించారు. ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి ఇది 100 మార్కులుగా ఉంది. జీప్యాట్‌- 2013లో అఖిల భారతస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 361 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకు అభ్యర్థికి 331 మార్కులు; మూడో ర్యాంకుకు 326 మార్కులు ల‌భించాయి. జనరల్‌/ ఓబీసీ కేటగిరిలో 145 మార్కులు సాధించిన ఆఖరి వ్యక్తి పొందిన ర్యాంకు 3740. ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరిలో 100 మార్కులు వచ్చిన 10709 ర్యాంకు అభ్యర్థిని కూడా అర్హులుగా గుర్తించారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో
ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 240 కళాశాలల్లో వివిధ బ్రాంచీల్లో ఎంఫార్మసీ నిర్వహించడానికి ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ క‌ళాశాల‌ల్లో సుమారు 18,000 ఎంఫార్మసీ సీట్లున్నాయి.

ఒక పరీక్ష- ఎన్నో లాభాలు
* ఈ ర్యాంకు సాధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలల్లో చేరిన ప్రతి ఎంఫార్మసీ విద్యార్థికీ నెలకు రూ.8000 ఉపకార వేతనం రెండు సంవత్సరాలపాటు లభిస్తుంది. జీప్యాట్‌ స్కోరు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. కాబట్టి సంవత్సరంలోగా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.

* దీనిలో మంచి ర్యాంకులు సాధించినవారు పంజాబ్‌ విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాల్లోని ఫార్మసీ కళాశాలల్లో ఎం ఫార్మసీ సీటు పొందవచ్చు; తద్వారా మంచి ఉద్యోగావకాశాలకు పునాది వేసుకోవచ్చు.

* నైపర్‌, బిట్స్‌- పిలానీ, ఎలియన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌- హైదరాబాద్‌ వారు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయటానికి జీప్యాట్‌ అర్హులకు అవకాశం ఉంటుంది. ఈ సంస్థల్లో ఎంఎస్‌ చేసినవారికి ఉద్యోగావకాశాలు అధికం.

* మైలాన్‌ వంటి ప్రముఖ బహుళజాతి ఫార్మా కంపెనీలు ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేటపుడు జీప్యాట్‌ ర్యాంకు ఒక ప్రత్యేక అర్హతగా భావిస్తున్నాయి. చాలా ఫార్మా కంపెనీలు ప్రాజెక్టుల కోసం ఎంఫార్మసీ విద్యార్థుల జీప్యాట్‌ ర్యాంకు ఆధారంగా ఎంపిక చేయడం విశేషం.

* ఎం ఫార్మసీ తర్వాత పీహెచ్‌డీ చేయాలంటే యూజీసీ, సీఎస్‌ఐఆర్‌ వంటి సంస్థలు జీప్యాట్‌లో అర్హత పొందినవారిని మాత్రమే ఎంపిక చేసి ఉపకారవేతనాలు మంజూరు చేస్తాయి.

* ఇప్పటికే అనేక ఫార్మసీ కళాశాలలు ఉపాధ్యాయులను ఎంపిక చేసే సందర్భంలో జీప్యాట్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారికి పెద్దపీట వేస్తున్నాయి. ఇన్ని బహుళ ప్రయోజనాలుండటం వల్లనే బీఫార్మసీ చదివిన ప్రతి విద్యార్థీ ఈ ప్రవేశపరీక్ష రాయడానికి మొగ్గు చూపుతున్నారు.

2015 నోటిఫికేష‌న్ వివ‌రాలు:
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్లో చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 12, 2015
ప‌రీక్ష తేదీ: 2015 ఫిబ్ర‌వ‌రి 23, 24 తేదీల్లో నిర్వ‌హిస్తారు.
ప‌రీక్ష స‌మ‌యం: రెండు సెష‌న్ల‌లో ఉంటుంది. ఉద‌యం 9:30, మ‌ధ్యాహ్నం 2:30 వేళ‌ల్లో నిర్వ‌హిస్తారు.
ప‌రీక్ష ఫీజు: రూ.1400 (జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు); ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్య‌ర్థులకు రూ.700
ప‌రీక్ష కేంద్రాలు: అభ్య‌ర్థులు న‌చ్చిన 3 కేంద్రాల‌ను ఎంచుకోవ‌చ్చు. అవ‌కాశాన్ని బ‌ట్టి మొద‌టి ఆప్ష‌న్‌గా ఎంచుకున్న కేంద్రాన్నే కేటాయిస్తారు. ఇది సాధ్యం కాని సంద‌ర్భాల్లో మాత్ర‌మే రెండు, మూడో కేంద్రాల్లో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది.
ఫ‌లితాలు: మార్చి 27, 2015న ప్ర‌క‌టిస్తారు.
వెబ్‌సైట్: www.aicte-gpat.in
హెల్ప్‌లైన్ నంబ‌ర్‌: 022-66258304

జాతీయ స్థాయిలో పేరొందిన కొన్ని ప్ర‌ముఖ ఫార్మ‌సీ క‌ళాశాల‌లు
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ‌సీ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (నైప‌ర్‌), మొహాలీ
వెబ్‌సైట్: http://www.niper.ac.in/

యూనివ‌ర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్‌, పంజాబ్ యూనివ‌ర్సిటీ
వెబ్‌సైట్: http://pharma.puchd.ac.in/

మ‌ణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్‌, మ‌ణిపాల్‌
వెబ్‌సైట్‌: http://manipal.edu/Institutions/Pharmacy/MCOPSManipal/Pages/Welcome.aspx

బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ, ముంబై
వెబ్‌సైట్: http://www.bcpindia.org/about_us.php

జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ, ఊటీ
వెబ్‌సైట్: http://www.jsscpooty.org/

యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ, వ‌రంగ‌ల్‌
ఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ, అహ్మదాబాద్‌
వెబ్‌సైట్: http://lmcp.in/home

డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్‌, డాక్ట‌ర్ హెచ్ఎస్ గౌర్ యూనివ‌ర్సిటీ, సాగ‌ర్‌, ఎంపీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ, ముంబై

ఫార్మ‌సీ గ్రూప్‌, బిట్స్ పిలానీ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్‌, బెణార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, వార‌ణాసి
వెబ్‌సైట్: http://iitbhu.ac.in/phe/

బిట్ మెస్రా, రాంచీ
వెబ్‌సైట్‌: https://www.bitmesra.ac.in/cms.aspx?this=1&mid=34
జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ, మైసూర్‌
వెబ్‌సైట్: http://www.jsspharma.org/
ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌, న్యూఢిల్లీ

అవ‌కాశాలిక్క‌డ‌
దేశంలో పాతిక వేల మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిలో అయిదో వంతు అంటే ఐదువేలు బ‌ల్క్ డ్ర‌గ్ త‌యారీ కేంద్రాలే. వీట‌న్నింటికీ ఫార్మ‌సీ చ‌దివిన‌వాళ్ల అవ‌స‌రం ఉంటుంది. డ్ర‌గ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌, మ్యానుఫ్యాక్చ‌రింగ్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌, మెడిసిన్ మార్కెటింగ్, రెగ్యులేట‌రీ డిపార్ట్‌మెంట్‌, ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ రైట్స్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌, క్లినిక‌ల్ రీసెర్చ్‌, హాస్పిట‌ల్ ఫార్మ‌సిస్ట్‌, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ త‌దిత‌ర అవ‌కాశాలు ఎంఫార్మ‌సీ చదివిన‌వాళ్ల‌కు ఉంటాయి.

Posted on 13/11/2014Ushodaya Enterprises Private Limited 2014