హాబీకి ఇస్తారు నజరానా!

తపాలా బిళ్లలను సేకరించే అలవాటు కొందరికి ఉంటుంది. సేకరణతో పాటు వాటి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నమూ చేస్తుంటారు. ఈ అభిరుచి ఉన్న హైస్కూలు విద్యార్థులకు ఉపకార వేతనం (స్కాలర్‌షిప్‌) వచ్చే అవకాశముంది! తపాలా శాఖ అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్‌ వివరాలను తెలుసుకుందామా?

స్టాంపుల అధ్యయనం (ఫిలేటలీ) అంటే స్వల్ప విషయంగా అనిపిస్తుంది కానీ నిజానికి దాని పరిధి పెద్దదే. స్టాంపులు..అవి రూపొందిన కాలానికి సంబంధించిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ప్రతిఫలిస్తాయి. ఇదే ఆసక్తి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అరుదైన స్టాంపులను వెతకటం, కనిపెట్టటం, సంపాదించటం, వాటిని క్రమపద్ధతిలో అమర్చడం, భద్రపరచటం, నిర్వహించటం.. ఇలా ఎన్నో అంశాలతో కూడుకున్న హాబీ ఇది.

విద్యార్థుల్లో ఈ అభిరుచిని ప్రోత్సహించి దానిలో పరిశోధనాసక్తిని పెంచే లక్ష్యంతో తపాలా శాఖ ఉపకార వేతనాలను అందిస్తోంది. ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ (స్కాలర్‌షిప్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ స్టాంప్స్‌ యాజ్‌ ఏ హాబీ) యోజన’ కింద అందించే స్కాలర్‌షిప్‌లకు పోస్టల్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు దీనిలో పాల్గొనొచ్చు. అయితే వీరికి మంచి అకడమిక్‌ పరిజ్ఞానంతోపాటు స్టాంపులను సేకరించడం హాబీగా ఉండాలి.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 920 మందికి స్కాలర్‌షిప్పులను అందిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని సర్కిళ్ళ పరిధిలో 40 చొప్పున స్కాలర్‌షిప్పులు అందజేస్తారు. ప్రతి తరగతి (6-9) నుంచి పదిమంది చొప్పున విద్యార్థులను ఎంపికచేసి, మొత్తం 40 స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు.

అర్హత:
* దేశంలోని గుర్తింపు పొందిన పాఠశాలలో 6-9 చదువుతుండాలి. మంచి అకడమిక్‌ నేపథ్యం ఉండాలి.
* పాఠశాలలోని ఫిలేటలీ క్లబ్‌ సభ్యులై ఉండాలి. ఒకవేళ పాఠశాలలో ఆ విభాగం లేనట్లయితే సొంతంగా ఫిలేటలీ డిపాజిట్‌ అకౌంట్‌ ఉన్నవారినీ అర్హులుగా పరిగణిస్తారు.
* స్కాలర్‌షిప్‌ ఎంపిక పూర్తయ్యేనాటికి విద్యార్థులు పూర్వ తరగతి తుది పరీక్షల్లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ వారికి 5% మార్కుల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తపాలా బిళ్లలకు సంబంధించిన ప్రాజెక్టు వర్క్‌, క్విజ్‌ నిర్వహిస్తారు. వీటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులను పోస్టల్‌ అధికారులు, ప్రముఖ ఫిలేటలిస్టులు పరిశీలించి, మూల్యాంకనం చేస్తారు. ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను సంబంధిత పరిధిలోని శాఖలే నిర్ణయిస్తాయి.

ఏడాదికి రూ. 6,000
* ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్‌షిప్‌ మొత్తం- సంవత్సరానికి రూ.6000. త్రైమాసికానికి రూ.1500 చొప్పున చెల్లిస్తారు.
* ఎంపికైన విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులోగానీ, పోస్ట్‌ఆఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంకులోకానీ ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది.
* ప్రతి పోస్టల్‌ సర్కిల్‌ గెలిచినవారి వివరాలను ఐపీపీబీ/పీఓఎస్‌బీకి పంపుతుంది. వీరు త్రైమాసిక విధానం (క్వార్టర్లీ బేసిస్‌)లో విద్యార్థులకు చెల్లిస్తారు.

దరఖాస్తు ఎలా?
డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తు ఫారాలను దగ్గరలోని పోస్టాఫీసుల్లో సీనియర్‌/ సూపరింటెండెంట్‌లకు సమర్పించాల్సి ఉంటుంది.
చివరితేదీ: 25.08.2018. పూర్తి వివరాలకు www.indiapost.gov.in ను సంప్రదించొచ్చు.

ఈ-మెయిల్‌:
ఆంధ్రప్రదేశ్‌: dpshq.ap@indiapost.gov
తెలంగాణ: sparsh.telangana@gmail.com, dpshqhyd@indiapost.gov.in


posted on 07.08.2018

back

 
© Ushodaya Enterprises Private Limited 2017