ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌

ఉన్నత చదువులు చదవాలనే అభిలాష ఉన్నప్పటికీ ఆర్థికంగా స్థోమత లేనివారికి ఎల్‌ఐసీ సంస్థ ఉపకార వేతనాలు అందిస్తోంది. విద్యాపరంగా ప్రతిభ, తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ‘ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌’పేరిట ఏటా అందించే ఈ స్కాలర్‌షిప్పులకు సెప్టెంబ‌రులో ప్రకటన విడుదల కానుంది.

ఆర్థికంగా వెనుకబడినవారికి ఉన్నతవిద్య పరంగా ప్రోత్సాహమందించి, ఉద్యోగావకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఏటా గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల/ యూనివర్సిటీల్లో ఉన్నతవిద్యను చదివేవారికి దీన్ని అందజేస్తారు.

ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు/ సెంటర్లలో గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో టెక్నికల్, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థలు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీటీ) గుర్తింపు పొందినవై ఉండాలి.

అర్హత: 2017-18 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్‌ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారై ఉండాలి. ఉన్నతవిద్యలో మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదేని డిగ్రీ, ఏదేని రంగంలో డిప్లొమా కోర్సు/ తత్సమాన విద్య చదవాలనుకునేవారు అర్హులు. వీరికి ఇంటర్‌లో కనీసం 60% మార్కులు వచ్చుండాలి. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించకూడదు. ప్రస్తుతం ఏదైనా ఒకేషనల్‌ కోర్సు లేదా ఐటీఐ చదువుతున్నవారైతే 2017-18 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించకూడదు.

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తారు.

దరఖాస్తు: ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి.

ఎంపిక ఎలా?: అకడమిక్‌ మెరిట్, కుటుంబ ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపికచేస్తారు. కుటుంబంలో ఒక్కరికే చెల్లిస్తారు. కోర్సు పూర్తికాలం స్కాలర్‌షిప్‌ అందుతుంది. అయితే చేరిన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో 55%, డిగ్రీ కోర్సుల్లో 50% సాధించినవారికే తరువాతి సంవత్సరం స్కాలర్‌షిప్‌ అందుతుంది.

త్వరలో ప్రకటించనున్న ఈ స్కాలర్‌షిప్‌ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

వెబ్‌సైట్‌: www.licindia.in

posted on 29-08-2018

Back

 
© Ushodaya Enterprises Private Limited 2016