అర్థశాస్త్ర సన్నద్ధత ఇలా...

సిలబస్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేయటం, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించటం- ఏ పరీక్షకైనా పాటించాల్సిన పద్ధతి. నెట్‌, సెట్‌ల ప్రకటనలు విడుదలైన నేపథ్యంలో అర్థశాస్త్రానికి ఏ తీరులో తయారవాలో తెలుసుకుందాం!
నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌) ప్రకటనలు ఒకేసారి రావడంతో అభ్యర్థులు ఆనందంగా ఉన్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్‌, పరీక్ష విధానం ఒకే తీరు. సెట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నెట్‌ ఆంగ్లమాధ్యమమనే భయం వీడి ప్రాథమింకాంశాలపై పట్టు సాధిస్తే 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లు రెంటికీ అర్హత పొందవచ్చు.
సెట్‌ను ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. కాబట్టి సెట్‌కు, నెట్‌కు ఒకేసారి సన్నద్ధత కొనసాగించడం ఉత్తమం. తెలుగు మీడియం అభ్యర్థులు సెట్‌పై అధిక దృష్టిని కేంద్రీకరిస్తున్నారని చెప్పవచ్చు. సెట్‌ను రాష్ట్రం పరిధిలో నిర్వహించడం, ప్రశ్నలు మాతృభాష తెలుగులో ఉండడం, ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉండడం, నెట్‌తో పోలిస్తే పోటీ తీవ్రత, స్థాయి తక్కువగా ఉండడం వల్ల సెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు.
పరీక్ష విధానం
నెట్‌, సెట్‌లో 3 పేపర్లుంటాయి. అన్ని కూడా బహుళైచ్ఛిక ప్రశ్నల (మల్టిపుల్‌ చాయిస్‌) రూపంలో ఉంటాయి. వీటిలో పేపర్‌-1 అందరికీ కామన్‌గా ఉండగా 2, 3 పేపర్లు అభ్యర్థుల సబ్జెక్టులకు చెందినవి ఉంటాయి.
పేపర్‌-2, 3లలో ఆప్షనల్‌ (అర్థశాస్త్రం)కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్‌-2 కన్నా 3లో ప్రశ్నల కాఠిన్యతాస్థాయి ఎక్కువ. కాబట్టి సన్నద్ధత స్థాయి పెంచుకుంటూ వెళ్లాలి. గత అన్ని ప్రశ్నపత్రాలూ అధ్యయనం చేయాలి.
సన్నద్ధమయ్యే పద్ధతి
అర్థశాస్త్రానికి సంబంధించి ముందుగా నెట్‌, సెట్‌ సిలబస్‌లు అధ్యయనం చేయాలి. అంతేకాక ముందుగా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దాని కోసం ప్రామాణిక పుస్తకాల ఆధారంగా విశ్లేషణాత్మకంగా చదవాలి. చదివిన సిద్ధాంతాలు, వాటి ముఖ్యాంశాల్ని అనువర్తితం (అప్లికేషన్‌) చేసుకుంటూ అభ్యసనం కొనసాగించాలి.
* ఈ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు బట్టీపట్టి అర్హత సాధించడం అంత సులభం కాదు. డిస్క్రిప్టివ్‌ విధానంలో చదవడం వల్ల ప్రశ్న ఏ కోణంలో అడిగినా జవాబు ఇచ్చేటట్లు సన్నద్ధం కావచ్చు. కాబట్టి ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి విస్తృతంగా అధ్యయనం చేస్తే తప్ప లోతైన ప్రశ్నలకు జవాబు గుర్తించడం సాధ్యం కాదు.
దీనికోసం ప్రత్యేకంగా అర్థశాస్త్రానికి సన్నద్ధత కావాలి. ముఖ్యంగా..
* అర్థశాస్త్రం సిలబస్‌ అధ్యయనం చేసి ప్రామాణిక పుస్తకాల ఆధారంగా సన్నద్ధత ప్రారంభించడం కీలకమైన ప్రారంభ దశగా చెప్పవచ్చు.
* పాత ప్రశ్నపత్రాల ఆధారంగా కీలకమైన అధ్యాయాలు గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని బట్టి సన్నద్ధత కొనసాగించాలి. అలా ఒక్కో అధ్యాయం పూర్తిచేసి వాటిపై పట్టు సాధించాలి.
* అలా పూర్తయిన విభాగాల్ని అన్నింటినీ వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం ప్రధానమైన మరో ముఖ్యాంశం.
* తర్వాతి దశలో గత మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. తద్వారా సమాధానం గుర్తించడంలో వేగం, కచ్చితత్వం పెంచుకోవచ్చు.
* గతంలో వచ్చిన ప్రశ్నల సంబంధిత అంశాలపై ఎక్కువ దృష్టిని నిలపడం ద్వారా ప్రశ్న ఎన్ని కోణాల్లో అడిగినా సమాధానం గుర్తించవచ్చు.
ఉదాహరణకు: యూజీసీ- నెట్‌ గతంలో అడిగిన ప్రశ్నను చూడండి.
* ఈ కింది వాటిలో ఆర్‌బీఐ పరిమాణాత్మక చర్య కానిది ఏది?
1. రెపో రేటు 2. బ్యాంకు రేటు 3. రివర్స్‌ రెపో 4. మార్జిన్లు
జవాబు (4)
పై ప్రశ్న నుంచి మనం అనేక అంశాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు- ఎ) ఆర్‌బీఐ చేసే పరపతి విధానం బి) దానికి చర్యలు సి) పరిమాణాత్మక చర్యలు అంటే ఏమిటి, వాటిలో ఏ అంశాలుంటాయి, (రెపో, రివర్స్‌ రెపో, బ్యాంక్‌ రేటు, సీఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌లు), వాటి నిర్వచనాలు, ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ కాలంలో తెచ్చే మార్పులు, ప్రస్తుతం వాటి శాతాలు, డి) గుణాత్మక చర్యలు ఇ) వాటిలోని అంశాలు ఎఫ్‌) ఈ అంశాల ఆధారంగా ద్రవ్య సరఫరా మార్పులు జి) ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మొదలైన అనేక అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి ఇలా అన్ని అంశాలపై పట్టు సాధించడం వల్ల ప్రశ్నలు ఏ కోణంలో అడిగినా జవాబులు తేలికగా గుర్తించవచ్చు.
కచ్చితంగా చదవాల్సినవి
పై అన్ని ప్రధాన సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలు పట్టిక రూపంలో రాసుకుని చదివితే పునశ్చరణ తేలికవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సిద్ధాంతాలు- ఆర్థిక వేత్తలు, అభివృద్ధి సిద్ధాంతాలు, రూపకర్తలు, ద్రవ్యం, జాతీయాదాయం, బడ్జెట్లు, నిర్వచనాలు, రకాలు, ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, రూపకర్తలు, భారీ పరిశ్రమలు- స్థాపించిన సంవత్సరాలు, వాటి ప్రదేశాలు, అభివృద్ధి పథకాలు- సంవత్సరాలు, ద్రవ్యంలోని M1, M2, M3, M4 వంటి అంశాలు, ఆర్థిక సంఘాల చైర్మన్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేసిన సంవత్సరాలు, అవి ఉండే ప్రదేశాలు, ఆర్థిక రంగానికి సంబంధించిన వివిధ కమిటీలు- చైర్మన్‌లు మొదలైనవి తప్పనిసరిగా చదవాలి.
ఆ రకంగా వాటి భావనలు, సిద్ధాంతాలు, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి చదివితే విజయం మీదే!
సబ్జెక్టు వారీ విశ్లేషణ
* సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ: సూక్ష్మ అర్థశాస్త్రంలో భాగంగా డిమాండ్‌ నిర్ణయించే అంశాలు, నిర్వచనాలు, వాటిని నిర్ణయించే అంశాలు, సగటు, ఉపాంత వ్యయాలు, లాభాలు, ప్రయోజనాలు, వాటి కారణాలు, గుణించే పద్ధతులు తెలుసుకోవాలి. ఉదాసీనతా వక్రరేఖల లక్షణాలు, వాటి రేఖల లక్షణాలు తెలుసుకోవాలి. మార్కెట్ల రకాలు, వాటి లక్షణాలు, ఏకస్వామ్య మార్కెట్‌ వంటి వాటిల్లో ధరల నిర్ణయ విధానాలు అధ్యయనం చేయాలి. సంక్షేమ శాస్త్రంలో భాగంగా కాల్డర్‌-హిక్స్‌, పారిటో అభిలషణీయత సూత్రాలు తెలుసుకోవాలి.
* స్థూల అర్థశాస్త్రం: దీనిలో వినియోగం, పెట్టుబడి, ఉద్యోగిత, ద్రవ్యడిమాండ్‌ నిర్ణయించే అంశాలు చదవాలి. ముఖ్యంగా ఫిలిప్స్‌ రేఖ ఆకారం, బౌమల్‌- టాబిన్‌ల సిద్ధాంతాలు, వాటి తేడాలు. వ్యాపార చక్రాల కారణాలు, నివారణ చర్యలు, వాటి దశలు క్రమ విధానంలో తెలుసుకోవాలి.
* అభివృద్ధి ప్రణాళిక: ఆర్థికవృద్ధి, అభివృద్ధిని నిర్ణయించే అంశాలు, వాటిని కొలిచే వివిధ సూచికలు, మానవాభివృద్ధి నివేదిక తయారీకి ఉపయోగించే అంశాలు, హెచ్‌డీఆర్‌- 2014లో భారత్‌ హెచ్‌డీఐ విలువ, స్థానం తెలుసుకోవాలి. హరడ్‌, డోమర్‌ సిద్ధాంతాల మధ్య తేడా గుర్తించాలి. ఆర్థర్‌ లూయిస్‌, హర్షమన్‌, లెబాన్‌స్టెయిన్‌ తెలిపిన సిద్ధాంతాల వివరణలు తెలుసుకోవాలి. ప్రణాళికలు లక్ష్యాలు, రకాలు విశ్లేషణాత్మకంగా చదవాలి.
* ప్రభుత్వ విత్తం: ఈ విభాగంలో బడ్జెట్‌ లోట్లు, కేటాయింపులు, ఇటీవలి బడ్జెట్‌ ముఖ్యాంశాలు చదవాలి. పన్నుల రకాలు, వాటి వాటాలు, ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, వాటి ప్రభావాలు, ఆర్థిక సంఘాల చైర్మన్‌లు, ఆర్థిక సంఘం సిఫార్సులు ఆదాయ పంపిణీకి ప్రతిపాదికలు, వాటి శాతాలు తెలుసుకోవాలి.
* అంతర్జాతీయ అర్థశాస్త్రం: అంతర్జాతీయ వ్యాపారం నిర్ణయించే సాంప్రదాయ సిద్ధాంతాలైన నిరపేక్ష, తులనాత్మక సిద్ధాంతాలు, ఆధునికమెన హిక్సర్‌- బహ్లిన్‌ సిద్ధాంతం, లియాంటిప్‌ వైపరీత్యం, విదేశీ చెల్లింపు శేషంలోని వివిధ ఖాతాలు, వివిధ రకాల వర్తక నిబంధనలు, విదేశీ మారకం రేటు రకాలు, వాటి లాభనష్టాలు అధ్యయనం చేయాలి.
* భారత ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం ప్రాధాన్య అంశాలు, వ్యవసాయ విప్లవం ప్రాధాన్యం, నూతన ఆర్థిక సంస్కరణలు, వివిధ పారిశ్రామిక తీర్మానాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానం అమలుకు రెపో, సీఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌లు మార్పు చేసే విధానం, ద్రవ్యం, ద్రవ్యోల్బణ కారణాలు, నివారణ చర్యలు, దేశంలో ప్రధాన సామాజిక ఆర్థిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, జనాభా- 2011 సంబంధించిన అంశాలు, అమలులో ఉన్న వివిధ అభివృద్ధి పథకాలు చదవాలి.
* స్టాటిస్టిక్స్‌: ఈ గణాంక శాస్త్రంలో భాగంగా సగటులు, కేంద్ర విస్తరణ మాపనాలు, నమూనాలు, సహసంబంధ అంశాలు మొదలైన అంశాల నుంచి సుమారు 5 లోపు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది.

Posted on 03/11/2014Ushodaya Enterprises Private Limited 2014