సూక్ష్మంగా నెట్‌ పై పట్టు

'నెట్‌'లో భాషా సాహిత్యాలపై ఎంత శ్రద్ధ అవసరమో పాత ప్రశ్నపత్రాలపై అవగాహన కూడా అంతే అవసరం. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు దీని సన్నద్ధతపై ఎలా పట్టు సాధించాలో వివరిస్తున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.
యూజీసీ నెట్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే దాదాపుగా పీజీలో చదివిన విషయాలే 'నెట్‌' సిలబస్‌లోనూ ఉన్నాయి. ఈ పరీక్ష జాతీయస్థాయిలో జరిగే పరీక్ష అని మరచిపోకూడదు. తెలుగులో ఏ పరీక్షకైనా భాషా సాహిత్యాలదే పెద్దపీట. సగానికి సగం ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. ఇవే కాకుండా నెట్‌కి అదనంగా ప్రత్యేకమైనవి-
* జానపద విజ్ఞానం
* కావ్యవిమర్శ
* వ్యాకరణంపై స్థూల అవగాహన
తెలుగు సాహిత్యం
నన్నయ నుంచి నేటి కవితారూపాల వరకు అధ్యయనం చేయాల్సిందే. ఇందులో ప్రముఖ కవులు, చిన్న కవులు అనే భేదం ఉండదు. ఏ కవి గురించైనా, ఏ రచన గురించైనా అడగవచ్చు. అందుకని ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ముఖ్యంగా తెలుగులో ముఖ్యమైనవి, ముఖ్యంకానివి అంటూ ఉండవని గ్రహించాలి. సాహిత్యం అంటే కవిత్వం ఒక్కటే కాదు. కథ, నవల, నాటకం, వ్యాసం, అనువాద రచనలు.. అనే అంశాలపై దృష్టిపెడితే ఏ మూల నుంచి ప్రశ్న ఇచ్చినా సమాధానం గుర్తించగలరు.
సామాన్యంగా-
* కవుల రచయితల రచనలు, బిరుదులు, కవితారీతులు
* ఆయా ప్రక్రియల్లో గల తొలి రచనలు
*
ఉద్యమాలు
* కొటేషన్లు (ముఖ్యమైన పంక్తులు, సూక్తులు, వాక్యాలు)
* కవులు రచయితలపై ఇతరుల అభిప్రాయాలు లేదా ప్రశంసలు
... ఈ విధంగా వింగడించుకుని చదివితే సమాధానాలు బాగా గుర్తించవచ్చు. ఒక్కో కవి/ రచన గురించి చదివే పద్ధతి లోతుగా ఉండాలి. పైపైన నేర్చుకుంటే మంచి ఫలితం ఉండదు.
ఉదాహరణకు-
* అసమర్థుని జీవయాత్ర అనేది.. (4)
1. కావ్యం 2. కథ 3. నాటకం 4. నవల
* గోపీచంద్‌ ఏ రచనను తన తండ్రికి అంకితమిచ్చాడు? (1)
1. అసమర్థుని జీవయాత్ర 2. పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా 3. పిల్లతెమ్మెర 4. ఏదీ కాదు
ఇదే విధంగా..
* గోపీచంద్‌ తొలినవల (పరివర్తన)
* కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపీచంద్‌ నవల (పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా)
* గోపీచంద్‌ రాసిన ఏ నవల మనోవైజ్ఞానిక నవలగా గుర్తింపు పొందింది? (అసమర్థుని జీవయాత్ర)
* అసమర్థుని జీవయాత్రలో సీతారామారావు పాత్ర దేనికి సంబంధించినది? (ఆత్మన్యూనతాభావం)
* గోపీచంద్‌ తండ్రి? (త్రిపురనేని రామస్వామి)
* గోపీచంద్‌ నవలలేవి? (పరివర్తన, పిల్లతెమ్మెర, గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, ప్రేమోపహతులు, శిథిలాలయం)
ఇలా ఒక కవి, రచయిత, ఒక రచన చుట్టూ గల అంశాలన్నింటినీ అవగాహన చేసుకుంటే ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సమాధానం తెలుసుకునే అవకాశం బాగా ఉంటుంది.
తెలుగు సాహిత్యంపై మిగిలిన పోటీ పరీక్షలకూ 'నెట్‌'కూ ఉన్న అతి ముఖ్యమైన భేదం ఏమిటంటే-
* కవుల- రచయితల- రచనల వరుసక్రమం
ఉదాహరణకు: కాలక్రమం బట్టి వరుసక్రమంలో అమర్చండి (2)
1. పురాణం, ఇతిహాసం, ప్రబంధం, నాటకం
2. ఇతిహాసం, పురాణం, ప్రబంధం, నాటకం
3. ప్రబంధం, పురాణం
4. నాటకం, పురాణం, ప్రబంధం
కాబట్టి కవికాలాదులతోపాటు రచనల ముందు వెనుకలు కూడా తెలుసుకోవాలి.
భాషా శాస్త్రంలో...
భాష పుట్టుక, భాషా కుటుంబాలు, ధ్వనిశాస్త్రం వంటి అంశాలు చదువుతూ అర్థపరిణామం, వాక్యభేదాలపై విశేషమైన అధ్యయనం సాగించాలి. ఈ రెండింటి నుంచే ప్రశ్నలు తప్పకుండా వస్తున్నాయి. అర్థపరిణామ భేదాలు ఉదాహరణలతో చదవాలి. మాండలిక పదాలపై కూడా దృష్టి ఉంచాలి. భాషాశాస్త్ర రచనలు, రచయితలపై కూడా అవగాహన ఉండాలి.
ఉదాహరణకు... రచన, రచయితల సరైన క్రమం-
1. ఆంధ్రభాషా వికాసం - జీఎన్‌ రెడ్డి
2. తెలుగులో అర్థపరిణామం - పీఎస్‌ సుబ్రహ్మణ్యం
3. తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి
4. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు - గంటి జోగి సోమయాజి
సమాధానం
1. ఆంధ్రభాషా వికాసం - గంటిజోగి సోమయాజి
2. తెలుగులో అర్థపరిణామం - జీఎన్‌ రెడ్డి
3. తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి
4. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు - పీఎస్‌ సుబ్రహ్మణ్యం
జానపద విజ్ఞానంపై కూడా ప్రశ్నలు బాగానే ఉంటాయి. జానపద వాజ్ఞ్మయ వర్గీకరణ, జానపద కళారూపాలు, జానపద పరిశోధకులు- వారి రచనలు, సామెతలు- జాతీయాలు, పొడుపుకథలు, పండగలు, గిరిజనుల జీవితాలు, ప్రాంతాలు వంటివి బాగా చదవాలి. ఆంగ్లజానపద పరిశోధకులపై అవగాహన ఉండాలి.
ఉదాహరణకు-
* ఈ కింది వారిలో ఇద్దరూ జానపద పరిశోధకులే- (4)
1. బి. రామరాజు, సినారె 2. శ్రీశ్రీ, సినారె 3. తూమాటి దొణప్ప, ఆరుద్ర 4. నేదునూరి గంగాధరం, బి.రామరాజు
ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ముఖ్యమైనవీ, ముఖ్యం కానివీ అంటూ ఉండవు. సాహిత్యం అంటే కవిత్వం ఒక్కటే కాదు. కథ, నవల, నాటకం, వ్యాసం, అనువాద రచనలు.. అనే అంశాలపై దృష్టిపెడితే ఏ మూల నుంచి ప్రశ్న ఇచ్చినా సమాధానం గుర్తించగలరు.
కావ్యవిమర్శ /సాహిత్య విమర్శ
ఈవిభాగం నుంచి అయిదారు ప్రశ్నలకు తక్కువ కాకుండా వస్తాయి. కావ్య నిర్వచనాలు, కావ్యహేతువులు, కావ్యభేదాలు, కావ్య ప్రయోజనాలు అధ్యయనం చేస్తూ విమర్శ భేదాలు, విమర్శన సాహిత్యంపై శ్రద్ధ వహించాలి.
* మమ్మటుడు రాసిన గ్రంథం (కావ్యప్రకాశం)
* మిత్ర సమ్మితాలుగా వేటిని అంటారు? (పురాణాలు)
* కావ్యాత్మ ధ్వని అన్నదెవరు? (ఆనందవర్థనుడు)
* నిర్వేదం, శంక, అసూయ.. ఇవి దేనికి సంబంధించినవి? (సంచారీ భావాలు)
* శమం స్థాయి భావంగా గల రసం? (శాంతరసం)
ఇక్కడ కూడా పట్టిక ద్వారా లేదా వరుస క్రమం ద్వారా కూడా ప్రశ్నలు వస్తాయి. తొలి లక్షణ గ్రంథం, తొలి వీధిరూపకం, తొలి కథానిక, తొలి నాటకం.. వంటివి ఒక పట్టికగా రూపొందించుకోవాలి. ఆధునిక కవుల్లో 'కాదేదీ కవితకనర్హం', 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' వంటి కొటేషన్లు ఎవరివో, ఎందులోవో తెలుసుకోవాలి. కొందరు 'వ్యాకరణం' లేదనే భావనతో ఉంటారు. మరీ లోతుగా కాకపోయినా వ్యాకరణశాస్త్రంపై పరిచయజ్ఞానం అవసరం.
* ప్రౌఢ వ్యాకరణానికి గల వేరొక పేరు? (త్రిలింగ లక్షణ శేషం)
* లింగ వచన విభక్తులు లేనిది? (అవ్యయం)
* మత్తేభానికి యతి స్థానం (14వ అక్షరం) వంటివి తక్కువ వచ్చినా వీటిని 'బోనస్‌' మార్కులుగా పరిగణించాలి.
మొత్తం మీద ఎంఏలోలాగా చదివితే 'నెట్‌'లో కృతార్థులు కాలేరు. అంతకంటే విస్తృతంగా, సూక్ష్మంగా అధ్యయనం చేయాలి. 'నెట్‌' రాసిన అనుభవం జేఎల్‌, డీఎల్‌ పరీక్షలకు బాగా ఉపయోగపడుతుంది.

Posted on 21/10/2015Ushodaya Enterprises Private Limited 2015