ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పుర‌స్కారం

పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి ఆర్థికంగా ప్రోత్సహించడానికి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ) ఎదురుచూస్తోంది. ఈ ఉప‌కార‌వేత‌నానికి ఎంపికైన‌వాళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇంటర్ నుంచి పీజీ వరకు సాఫీగా చదువుకోవచ్చు. అయితే దీనికోసం రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. దేశవ్యాప్తంగా వెయ్యి మందిని ఎంపికచేస్తారు. అర్హత సాధించిన విద్యార్థుల‌కు ఇంటర్ రెండేళ్లు నెలకు రూ. 1250; డిగ్రీ, పీజీలో నెల‌కు రూ.2000 అందిస్తారు. పీహెచ్ డీలో చేరిన‌వారికి యూజీసీ నిబంధనల ప్రకారం ఉపకారవేతనం వస్తుంది. ఎన్ టీ ఎస్ ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం..

ఎంపిక విధానం:
ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది స్టేజ్ -1. ఇది రాష్ట్ర స్థాయి పరీక్ష. విద్యార్థులు తాము పదో తరగతి చదువుతున్న రాష్ట్రంలో నిర్దేశించిన కేంద్రంలో పరీక్షకు హాజరు కావచ్చు. ఈ దశలో అర్హత సాధించిన వారికి స్టేజ్ -2 (జాతీయ స్థాయి) పరీక్ష నిర్వహిస్తారు.

స్టేజ్ -1 పరీక్ష విధానం
స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. ఇందులో రెండు విభాగాలుంటాయి. అవి...మెంటల్ ఎబిలిటీ టెస్ట్, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్.

సిలబస్:
మెంటల్ ఎబిలిటీలో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సోష‌ల్, సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఎస్ సీ ఈ ఆర్ టీ సిల‌బ‌స్ నుంచి అడుగుతారు.

పరీక్ష విధానం:
పరీక్షలో రెండు పేప‌ర్లు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పేప‌ర్‌-1లో మెంటల్ ఎబిలిటి టెస్ట్- వంద ప్రశ్నలు, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 100 (సోషల్ సైన్సెస్-40, సైన్సెస్-40, మ్యాథమెటిక్స్-20) ప్రశ్నలు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 4 ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక్కో పేప‌ర్ వ్య‌వ‌ధి రెండు గంట‌లు. అర్హ‌త సాధించడానికి జనరల్ అభ్యర్థులైతే ప్రతి పేపర్లోనూ 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 32 శాతం మార్కులు తప్పనిసరి. అర్హుల జాబితా నుంచి మెరిట్ లిస్ట్ త‌యారుచేస్తారు. స్టేజ్-1 ఫలితాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగాలు వెల్ల‌డిస్తాయి. ఎంపికైన‌వారికి దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలు పంపుతారు.

స్టేజ్‌-2
స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్ టీ ఎస్ ఈ) రాసే అవకాశం లభిస్తుంది. ఈ ప‌రీక్ష‌ను మే 12, 2019 (ఆదివారం) నిర్వ‌హిస్తారు. స్టేజ్ -2 ప్ర‌శ్న‌ప‌త్రం కూడా స్టేజ్ -1 మాదిరిగానే ఉంటుంది. అయితే క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ఎన్ సీ ఈ ఆర్ టీ రూపొందిస్తుంది. రుణాత్మ‌క మార్కులు ఉండ‌వు. ఇందులోనూ ఆయా పేప‌ర్ల‌వారీ క‌నీస అర్హ‌త మార్కులు సాధించ‌డం త‌ప్ప‌నిస‌రి. అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న వెయ్యి మందిని స్కాల‌ర్ షిప్పుకి ఎంపిక చేస్తారు. మొత్తం పుర‌స్కారాల్లో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 4 శాతం దివ్యాంగులు, 27 శాతం ఓబీసీల‌కు మంజూరు చేస్తారు. ఎంపికైన‌వారికి ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడు నెల‌కు రూ.1250 చొప్పున చెల్లిస్తారు. డిగ్రీ, పీజీ కోర్సులు చ‌దువుతున్న‌ప్పుడు నెల‌కు రూ.2000 చొప్పున అందుతుంది. పీహెచ్ డీలో చేరిన‌వారికి యూజీసీ నిబంధన‌ల ప్ర‌కారం స్కాల‌ర్‌షిప్పు ఉంటుంది.

అర్హత: ఏపీ/ తెలంగాణలో గుర్తింపుపొందిన అన్ని పాఠశాలకు చెందిన పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్ విద్యార్థులూ అర్హులే.
చ‌లానా రూపంలో పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: తెలంగాణలో ఆగస్టు 28, ఏపీలో సెప్టెంబ‌రు 28
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: తెలంగాణలో ఆగస్టు 29, ఏపీలో సెప్టెంబరు 27
పరీక్ష తేది: 04.11.2018 (పేప‌ర్ -1 ఉద‌యం , పేప‌ర్ -2 మ‌ధ్యాహ్నం ఉంటాయి)
ప‌రీక్ష కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
వెబ్ సైట్లు: http://bse.telangana.gov.in, http://main.bseap.org/NTSE.aspx

posted on 25.08.2018

back

Ushodaya Enterprises Private Limited 2018