ప్రైవేటు బ్యాంకుల్లోకి ఉద్యోగ మార్గం!

* ప‌లు సంస్థ‌ల్లో ప్ర‌త్యేక కోర్సుల నిర్వ‌హ‌ణ‌
ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో పీవో, క్ల‌రిక‌ల్‌, మేనేజ్‌మెంట్ ట్ర‌యినీ పోస్టుల భ‌ర్తీని ఐబీపీఎస్ ద్వారా చేప‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రి ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు ఎలా భ‌ర్తీ చేస్తారు? వీటిలో ఉద్యోగం సొంతం చేసుకోవ‌డానికి ఏం చేయాలి? తెలుసుకుందాం.
పీఎస్‌బీల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ హోదాతో ప్రారంభ‌మయ్యే ఉద్యోగాల‌కు ఐన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) నిర్వ‌హించే ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్(పీవో)/ మేనేజ్‌మెంట్ ట్ర‌యినీ(ఎంటీ) ప‌రీక్ష‌ను; అదే క్ల‌రిక‌ల్ ఉద్యోగానికి క్ల‌రిక‌ల్ రిట‌న్ ఎగ్జామినేష‌న్ (సీడ‌బ్ల్యుఇ) ప‌రీక్ష‌ల‌ను రాయాలి. ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగానికి ఎస్‌బీఐ నిర్వ‌హించే ప‌రీక్ష‌ను రాయాలి. అదే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్ఎస్‌బీసీ, కొటక్ మ‌హేంద్ర‌, య‌స్ బ్యాంక్‌, క‌రూర్ వైశ్య బ్యాంక్‌...ఇలా ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలో చూద్దాం...
ప్ర‌భుత్వ బ్యాంకుల ఉద్యోగాల నియామ‌కానికి ఐబీపీఎస్ ఉన్న మాదిరిగానే ప్రైవేటు బ్యాంకుల కోస‌మూ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థ‌లు, యూనివ‌ర్సిటీలు ఉన్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో సంస్థ‌తో అవ‌గాహ‌న కుదుర్చుకుంది. ఈ సంస్థ‌ల్లో బ్యాంకు ఉద్యోగానికి అవ‌స‌ర‌మ‌య్యే మెల‌కువ‌ల‌ను ముందే నేర్పిస్తారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందిన‌వాళ్లు రెడీ టు స‌ర్వ్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తారు. కొన్ని సంస్థ‌లు ఎంపిక చేసిన కోర్సుల్లో ప్రైవేటు బ్యాంకుల్లో ఇంట‌ర్న్‌షిప్‌ను కూడా అందిస్తున్నాయి. అభ్య‌ర్థి ఎంపిక చేసుకున్న‌ కోర్సును బ‌ట్టి వ్య‌వ‌ధి 2 నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఇలా ప్రైవేటు బ్యాంకుల‌కు ఉద్యోగుల‌ను అందిస్తున్న సంస్థ‌ల్లో ముఖ్య‌మైనవిగా ఎన్ఐఐటి (నిట్‌)కు చెందిన ఐఎఫ్‌బీఐ, మ‌ణిపాల్ అకాడెమీ, టైమ్స్ ప్రోల‌ను చెప్పుకోవ‌చ్చు. వీటిలో ఎక్క‌డ ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అర్హ‌త‌లు, ఫీజు, అవి ఏ బ్యాంకుల‌తో ఒప్పందాలు చేసుకున్నాయో తెలుసుకుందాం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్‌ (ఐఎఫ్‌బీఐ)
ఒప్పందం వీటితో:
ఈ సంస్థ ఐసీఐసీఐ, యాక్సిస్‌, క‌రూర్ వైశ్య బ్యాంకుల కోసం ప్ర‌త్యేక ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
ఇవీ కోర్సులు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆప‌రేష‌న్స్ (ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగానికి)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్ (యాక్సిస్ బ్యాంకు ఉద్యోగానికి)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్ (క‌రూర్ వైశ్య బ్యాంకు ఉద్యోగానికి)
ఇవీ అర్హ‌త‌లు:
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆప‌రేష‌న్స్‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దూర‌విద్య‌లో చ‌దివిన‌వాళ్లు అన‌ర్హులు. 25 ఏళ్ల‌లోపు వ‌య‌సువాళ్లే ఈ కోర్సుకి అర్హులు. అభ్య‌ర్థుల‌ను ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక‌చేస్తారు. కోర్సు వ్య‌వ‌ధి
6 నెల‌లు.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్: క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దూర‌విద్య‌లో చ‌దివిన‌వాళ్లు అనర్హులు. వ‌య‌సు 24 ఏళ్ల‌లోపు ఉండాలి. కోర్సు వ్య‌వ‌ధి 4 నెల‌లు.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఏదైనా పీజీ లేదా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. దూర‌విద్య‌, ఓపెన్ యూనివ‌ర్సిటీ ద్వారా చ‌దివిన‌వాళ్లకు అర్హ‌త లేదు. వ‌య‌సు 26 ఏళ్ల‌లోపు ఉండాలి. ఐబీపీఎస్ పీవో ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి, ఐఎఫ్‌బీఐ ఇంట‌ర్వ్యూ, కేవీబీ ఫైన‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను కోర్సుకి ఎంపిక చేస్తారు. కోర్సు వ్య‌వ‌ధి ఒక నెల‌. అనంత‌రం కేవీబీలో స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఎంపిక చేస్తారు. ఈ స‌మ‌యంలో నెల‌కు అన్నీ క‌లిపి రూ.40,000 వ‌ర‌కు వేత‌నం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.ifbi.com

టైమ్స్ ప్రో
ఏ బ్యాంకుల్లో ఉద్యోగాలు: టైమ్స్ ప్రో సంస్థ మోడ‌ర్న్ బ్యాంకర్ ప్రోగ్రాంను హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకుని నిర్వ‌హిస్తుంది. మిగిలిన కోర్సుల్లో చేరిన వారికి ఏవైనా ప్రైవేటు బ్యాంకుల‌తో మూడు ఇంట‌ర్వ్యూలు గ్యారెంటీగా ఏర్పాటు చేస్తాం అని చెప్తోంది. యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐఎన్‌జీ వైశ్య‌, ఇండ‌స్ ల్యాండ్ బ్యాంకుల్లో ఉద్యోగానికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది .
ఇవీ కోర్సులు: ఇందులో పీజీడీబీఎం, మోడ‌ర్న్ బ్యాంకర్‌, పీజీడీఎఫ్ఎ, పీజీడీఎం(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియ‌ల్‌ స‌ర్వీస్‌), ఎంబీఏ(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స‌ర్వీస్‌) ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల వారీ అర్హ‌త‌లు, వ్య‌వ‌ధి ఫీజుల వివ‌రాలు:
పీజీడీబీఎం (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స‌ర్వీస్‌): ఈ కోర్సు వ్య‌వ‌ధి 6 నెల‌లు. ఇంట‌ర్ నుంచి డిగ్రీలో చేరేముందు ఏడాది కంటే ఎక్కువ గ్యాప్ ఉండ‌రాదు. మొద‌టి ప్ర‌య‌త్నంలో ఉత్తీర్ణ‌త సాధించిన‌వాళ్లు మాత్ర‌మే అర్హులు. దూర‌విద్య ద్వారా చ‌దివిన‌వాళ్లు అన‌ర్హులు. వ‌య‌సు 26 ఏళ్ల‌లోపు ఉండాలి.
పీజీడీబీఎం: డిగ్రీలో క‌నీసం 50 శాతం, టెన్త్‌, ఇంట‌ర్‌లో క‌నీసం 45 శాతం మార్కులు పొందాలి. వ‌య‌సు 26 ఏళ్ల‌లోపు ఉండాలి. ప‌దోత‌ర‌గ‌తి నుంచి డిగ్రీకి మ‌ధ్య ఎక్క‌డా గ్యాప్ ఉండ‌కూడ‌దు. ఏ ప‌రీక్ష‌లోనూ ఫెయిల్ కాకుండా తొలి ప్ర‌య‌త్నంలోనే ఉత్తీర్ణ‌త సాధించాలి. ఇంట‌ర్‌, డిగ్రీ మ‌ధ్య ఏడాది వ‌ర‌కు గ్యాప్ ఉన్నా ప‌ర్వాలేదు. దూర‌విద్య‌లో చ‌దివిన‌వాళ్లు అన‌ర్హులు. కోర్సు వ్య‌వ‌ధి 6 నెల‌లు.
మోడ‌ర్న్ బ్యాంక‌ర్ ప్రోగ్రాం: దీన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగానికి రూపొందించారు. ప‌దో త‌ర‌గ‌తి నుంచి డిగ్రీ వ‌ర‌కు ప్ర‌తి త‌ర‌గ‌తిలోనూ క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఎక్క‌డా గ్యాప్ ఉండ‌రాదు. తొలి ప్ర‌య‌త్నంలోనే పాసై ఉండాలి. దూర‌విద్య‌లో చ‌దివిన‌వాళ్లు అన‌ర్హులు. వ‌య‌సు 25 ఏళ్ల‌లోపు ఉండాలి. కోర్సు వ్య‌వ‌ధి 2 నెల‌లు. అభ్య‌ర్థుల‌ను టైమ్స్ ప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తాయి. కోర్సు ఫీజు రూ. 44,944.
పీజీడీఎఫ్ఎ: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ ప్ర‌తి త‌ర‌గ‌తిలోనూ 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త చెంద‌డం త‌ప్ప‌నిస‌రి. విద్యాభ్యాసం స‌మ‌యంలో ఎక్క‌డా గ్యాప్‌లు ఉండ‌రాదు. 26 ఏళ్ల‌లోపు వాళ్లే అర్హులు. కామ‌ర్స్ గ్రాడ్యుయేట్లు మాత్ర‌మే ఈ కోర్సుకి అర్హులు. కోర్సు వ్య‌వ‌ధి 6 నెల‌లు. కోర్సు ఫీజు రూ.85,000.
పీజీడీఎం (బీ అండ్ ఎఫ్ఎస్‌): ఈ కోర్సు కోసం ఏదైనా బీ స్కూల్ టెస్ట్ స్కోర్ (క్యాట్‌, మ్యాట్‌, ఎక్స్ ఏటీ) త‌ప్ప‌నిస‌రి. లేదంటే ఐసెట్ స్కోరైనా ఉండాలి. డిగ్రీలో 50 శాతం, టెన్త్‌, ఇంట‌ర్‌లో క‌నీసం 45 శాతం మార్కులు పొందాలి. టెన్త్ నుంచి డిగ్రీ వ‌ర‌కు మ‌ధ్య‌లో ఎక్క‌డా అక‌డ‌మిక్ గ్యాప్ ఉండ‌రాదు. రెగ్యుల‌ర్ విధానంలో చ‌దివిన‌వాళ్లే అర్హులు. వ‌య‌సు 26 ఏళ్ల‌లోపు ఉండాలి. దీన్ని పిళ్లై హెచ్ఓసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థ‌తో టైమ్స్ ప్రో ఒప్పందం కుదుర్చుకుని నిర్వ‌హిస్తుంది. ఈ కోర్సుకి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. కోర్సు వ్య‌వ‌ధి రెండేళ్లు. మొద‌టి ఏడాది మొత్తం రెసిడెన్షియ‌ల్ విధానంలో పిళ్లై హెచ్ఓసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థ‌లో ఉంటూ చ‌దువుకోవాలి.
రెండో ఏడాది ఎంపికైన బ్యాంకులో త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావాలి. మొద‌టి ఏడాది కోర్సు పూర్తి కాగానే ఏదో ఒక బ్యాంకులో ప్లేస్‌మెంట్ ల‌భిస్తుంది. కోర్సు మొత్తం ఫీజు రూ. 5,56,000. లోన్ సౌక‌ర్యం ల‌భిస్తుంది.
ఎంబీఏ (బీ అండ్ ఎఫ్‌): డిగ్రీలో 50 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రి. వ‌య‌సు 26 ఏళ్ల‌లోపు ఉండాలి. ప‌దోత‌ర‌గ‌తి నుంచి డిగ్రీ వ‌ర‌కు ఎక్క‌డా గ్యాప్ ఉండ‌రాదు. అన్ని ప‌రీక్ష‌లూ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఉత్తీర్ణ‌త సాధించాలి. రెగ్యుల‌ర్ విధానంలోనే చ‌దివుండాలి. కోర్సు వ్య‌వ‌ధి రెండేళ్లు. దీన్ని కేఎల్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుని నిర్వ‌హిస్తున్నారు. మొద‌టి ఏడాది అనంత‌రం ప్లేస్‌మెంట్ ల‌భిస్తుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ప్ర‌వేశం క‌ల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.timespro.com/

‎పై కోర్సుల్లో చేరే ముందు అభ్య‌ర్థులు అన్ని వివ‌రాలూ తెలుసుకోవ‌డం ముఖ్యం. ఆయా సంస్థ‌ల్లో కౌన్సెల‌ర్లు అందుబాటులో ఉంటారు. వెబ్‌సైట్ల‌లోనూ స‌మాచారం అందుబాటులో ఉంటుంది. అన్ని విధాలా విచారించిన త‌ర్వాతే కోర్సులో చేర‌డం శ్రేయ‌స్క‌రం.

మ‌ణిపాల్ అకాడ‌మీ:
మ‌ణిపాల్ అకాడమీతో క‌లిసి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (ప్ర‌భుత్వ రంగ బ్యాంకు) పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కోర్సును నిర్వ‌హిస్తుంది. దీనికోసం ఏటా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంది. బ్యాచ్‌కి 300 మందిని తీసుకుంటారు. రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప‌రీక్ష విధానం, అర్హ‌త‌లు, రిజ‌ర్వేష‌న్లు అన్నీ ఐబీపీఎస్ పీవో మాదిరిగానే ఉంటుంది.
కోర్సుకి ఎంపికైన‌వాళ్లు 9 నెల‌ల పాటు మ‌ణిపాల్ అకాడమీలో చ‌ద‌వుకోవాలి. ఈ స‌మ‌యంలో నెల‌కు రూ.2500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. 3 నెల‌ల పాటు బీఓబీలో ఇంట‌ర్న్‌షిప్ చేయాలి. ఈ స‌మ‌యంలో నెల‌కు రూ.10,000 చెల్లిస్తారు. కోర్సు విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌వాళ్ల‌కు బీఓబీలో పీవోగా తీసుకుంటారు. కోర్సు ఫీజు రూ.3,50,000. అయితే దీన్ని అభ్య‌ర్థి చెల్లించాల్సిన ప‌నిలేదు. కోర్సు అనంత‌రం బ్యాంకులో చేరిన తర్వాత ఈఎంఐ విధానంలో జీతం నుంచి క‌ట్ చేస్తారు. బీవోబీలో ఐదేళ్లు స‌ర్వీస్ పూర్తిచేసుకున్న‌వాళ్ల‌కు ఈ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్‌: http://www.bankofbaroda.co.in/Careers/AboutProgramme.asp
ఇదే విధ‌మైన ఒప్పందాన్ని ఆంధ్రాబ్యాంకు కూడా మ‌ణిపాల్ అకాడమీతో కుదుర్చుకుంది. వివ‌రాల కోసం వెబ్‌సైట్ andhrabank.in/.../File/Final%20Draft%20Advertisement_pgdbf.pdf
‎మ‌ణిపాల్ అకాడమీతో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏడాదిపాటు పీజీడీబీ కోర్సు అనంత‌రం ఐసీఐసీఐలో పీవోలుగా అభ్య‌ర్థులు చేరొచ్చు. వివ‌రాల కోసం వెబ్‌సైట్ http://www.ima.manipal.edu/index.aspx

Ushodaya Enterprises Private Limited 2014