ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలను చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. పరిమిత సమయం, కొత్త సిలబస్‌ మొదలైన అంశాల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి సన్నద్ధత తీరుతెన్నులు, మెలకువలు ఇవిగో...

పేపర్‌- 1లో రెగ్యులర్‌ జనరల్‌స్టడీస్‌కు భిన్నంగా కొత్త సిలబస్‌ ఇచ్చారు. ఈ తేడాలను గమనించి అభ్యర్థి సన్నద్ధతను ప్రారంభిస్తే సమయం సద్వినియోగమవుతుంది.
ఉద్యోగిగా మారిన తరువాత ఏయే అంశాలైతే విధినిర్వహణలో ఉపయోగపడతాయని భావిస్తున్నారో ఆ అంశాలపై దృష్టిని నిలిపేలా చేయడం ఈ సిలబస్‌లోని కొత్త కోణం. అందువల్ల అటువంటి అనువర్తనాన్ని సన్నద్ధతకు జోడిస్తే ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది.
* 'జాతీయ, అంతర్జాతీయ ప్రధాన సంఘటనల'ను విస్తృత పరిధిలో చూడాలి. కేవలం వర్తమానాంశాలతో ముడిపెడితే సరిపోదు. యూఎన్‌ఓ , భారత్‌- ఇతర దేశాల్లో ప్రధాన సంఘటనలు, సార్క్‌, బ్రిక్స్‌ వంటి వాటిలో అనుసంధానం చేసుకోవాలి. జాతీయస్థాయిలో.. భాషాప్రయుక్త రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల మండలి, పార్లమెంటుపై దాడి, ముఖ్యమైన చట్టాలు వంటివి 63 ఏళ్ళ నేపథ్యంలో సమీక్షించుకోవాలి.
* భౌతికశాస్త్ర సంబంధిత సాంకేతికత, జీవశాస్త్ర సంబంధిత సాంకేతికత అని 2 భాగాలుగా S & T అధ్యయనం చేయాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో సమాచార సాంకేతికత ప్రాధాన్యం పొందవచ్చు. మీ-సేవ, ఈ-గవర్నెన్స్‌, పీఆర్‌ఐఏ వంటవి బిట్స్‌గా మారవచ్చు.
* ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలపై దృష్టి పెడుతూనే ఏపీలో 19, 20 శతాబ్దాల్లో జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజకీయ చారిత్రక అంశాలపై దృష్టి నిలపడం అవసరం.
* విషయ విశ్లేషణ సామర్థ్యం, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నూతన అంశాలూ; పంచాయతీ కార్యదర్శుల విధుల్లో ఉపయోగపడేవి కాబట్టి గణనీయ సంఖ్యలో ప్రశ్నలు అడగవచ్చు. గణాంకాలతో కూడిన పేరాలు ఇచ్చి విషయపర ముగింపులు సాంఖ్యక ముగింపులు అడగవచ్చు. పేరాలు లేకపోయినా 5, 6 లైన్లతో కూడిన సమాచారం ఇచ్చి విశ్లేషణశక్తిని పరిశీలించే ప్రశ్నలు అడగవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఈ తరహా అంశాలు మొదటిసారి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.
* విపత్తు నిర్వహణ గత కొన్ని సంవత్సరాలుగా పోటీ పరీక్షల్లో ప్రాధాన్యం పొందుతూ వస్తోంది. 5- 15 ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల దీనిపై అనువర్తన కోణంలో దృష్టి నిలపాలి. ముఖ్యంగా సీబీఎస్‌ఈ 8, 9 తరగతుల్లోని సమాచారం చదివితే సరిపోతుంది. అనువాద పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. గతంలో చదివిన జనరల్‌స్టడీస్‌ సరిపోతుందిలే అనుకోకుండా నూతన అంశాల్ని ప్రత్యేక దృష్టితో చదవాలి.
పేపర్‌- 2: గ్రామీణాభివృద్ధి, స్థితిగతులు, సమస్యలు
(ఏపీ ప్రత్యేక కోణంలో)
ప్రజారోగ్యంతో మానవ వనరుల అభివృద్ధి తద్వారా గ్రామీణాభివృద్ధి అనే ఆశయం మొదటి విభాగంలో ప్రతిబింబిస్తుంది. అంటువ్యాధులు, కారణాలు, నియంత్రణ, నిరోధక పద్ధతులు అనే కోణంలో చదవాలి. కొంత జనరల్‌సైన్స్‌లోని అనువర్తనభాగం ఈ అంశం తయారీకి ఉపయోగపడుతుంది. ప్రాథమిక పుస్తకాల్లోని పరిశుభ్రతపై ప్రశ్నలు రావచ్చు.
* అణచివేతకు గురైన వర్గాలు (ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళ) ఎదుర్కొంటున్న సమస్యలు రెండో సిలబస్‌ అంశంగా పేర్కొన్నారు. ఆయా వర్గాల నేపథ్యంలో సామాజిక సంఘర్షణలు, ఉద్రిక్తతలు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాల కోణంలో ప్రశ్నలు రావచ్చు. ముఖ్యంగా శాసన సంబంధిత, వ్యవస్థాపన ఏర్పాట్లపై ప్రశ్నలు రావచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు సంబంధించిన జనాభా గణాంకాలు (జిల్లాల వారీగా) అభివృద్ధి పథకాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.
* ప్రజాస్వామిక వ్యవస్థలు, పంచాయతీరాజ్‌, సహకార వ్యవస్థలు పేపర్‌-2లో మూడో సిలబస్‌ అంశంగా పేర్కొన్నారు. 20 నుంచి 25 ప్రశ్నలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఏపీలో పంచాయతీరాజ్‌ పరిణామం, స్థిరీకరించిన విధానం ఎక్కువ ప్రాముఖ్యం పొందవచ్చు. శాసన, ఎన్నికల వ్యవస్థలు, ఇతర రాజ్యాంగ అంశాలపై ప్రశ్నలు అధికంగా రావచ్చు.
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణాభివృద్ధిపై కూడా 30- 35 ప్రశ్నలు అడిగే అవకాశముంది. అభివృద్ధి పథకాలు ప్రధానాంశాలు. 1952 నుంచి తాజా గ్రామీణాభివృద్ధి పథకాలపై ప్రాథమిక భావనలు అవసరం. ఏపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఎక్కువగా రావచ్చు. తాజా పథకాలు కొంత గణాంక సమాచారం ఆధారంగా చదవాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కింద వ్యవసాయం, వ్యవసాయ సంబంధ అంశాలు ప్రశ్నలకు ఆధారంగా ఉంటాయి. ఏపీ ఎకనామిక్‌ సర్వే ఆధారంగా ఈ అంశాలు చదవడం ప్రయోజనకరం. గ్రామీణ నిరుద్యోగం- ప్రత్యామ్నాయ మార్గాలను సైద్ధాంతికంగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అనువర్తనంలో చదవాలి. కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల విస్తరణ, అటవీ వ్యవస్థలకు కూడా ప్రాధాన్యం ఉంది. ఏపీ ఎకనామిక్‌ జాగ్రఫీని అనుసంధానించుకోవడం మేలు.
అకౌంటింగ్‌ మౌలిక అంశాలు- ఐదో విభాగం. 30 ప్రశ్నల వరకు ఖాతాల తయారీ, నిర్వహణపై అడిగే అవకాశముంది. పంచాయతీ కార్యదర్శికి పంచాయతీల ఖాతాల నిర్వహణ బాధ్యత ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ ఖాతాల నిర్వహణపై దృష్టి సారించాలి. పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న పీఆర్‌ఐఏ సాఫ్ట్‌వేర్‌ ప్రాథమిక సమాచారం ఉండాలి.

Back