పంచాయతీ సెక్రటరీ సిలబస్‌లో ఏపీ గ్రామీణాభివృద్ధి అంశాల అధ్యయనానికి ప్రత్యేక పంథా అవసరం. వీటిలో ముఖ్యాంశాలపై సొంత నోట్సు తయారుచేసుకుని చదివితే ఇప్పుడున్న స్వల్పకాలంలో పునశ్చరణ తేలికవుతుంది!
గ్రామీణాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాల చర్యలు; అభివృద్ధి పథకాలు, పేదరికం, నిరుద్యోగం- వాటి కారణాలు, నివారణ పథకాలు, గ్రామీణ జనాభా (2011), వ్యవసాయ అంశాలు, ఆరోగ్య పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ మొదలైనవి చదవాలి. భారత్‌, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి తాజా అంశాల కోసం కేంద్ర, రాష్ట్రాల ఇటీవలి బడ్జెట్లు, సర్వేలు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. గ్రామీణాభివృద్ధి శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు ఇచ్చే వివిధ సమాచార ప్రకటనలు చదవాలి.
పేపర్‌-1లో...
పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ పేపర్లో భాగంగా ఐదో సెక్షన్‌లో 'స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఆర్థికాభివృద్ధి' అనే అంశం ఎకానమీలో భాగంగా ఉంది. దీనిలో చదవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా భారతదేశ ఆర్థికవ్యవస్థ వెనుకబాటుతనం కారణాలు తెలుసుకోవాలి. దానికి బ్రిటిషర్ల పాలన ఎంతవరకు దోహదపడిందో గ్రహించటం ముఖ్యం.
స్వాతంత్య్రానంతరం భారత ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి వంటి అంశాలతోపాటు జాతీయ ఆదాయంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల వాటాలో వచ్చిన మార్పులు, ప్రస్తుత స్థితి, వాటి వృద్ధిరేట్లు అధ్యయనం చేయాలి. భారత తలసరి ఆదాయాలు, పొదుపులు, పెట్టుబడుల రేట్లు, విదేశీ మారక నిల్వల స్థితిగతులు తెలుసుకోవాలి. ఇటీవల ప్రకటించిన జనాభా గణాంకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా, అక్షరాస్యత, స్త్రీ, పురుష నిష్పత్తులు, జనన మరణాలు, శిశు మరణాల రేట్లు అధ్యయనం చేయాలి. వీటి నుంచి 3- 4 ప్రశ్నలు రావచ్చు.
ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థిక సంబంధ నిర్ణయాలు ముఖ్యం. రూపాయి విలువ పతనం, ఆహారభద్రత, నగదు బదిలీ విధానం, మహిళా బ్యాంకు, విదేశీ పెట్టుబడులు, మద్దతు ధరలు, మానవాభివృద్ధి నివేదిక, ఇతర పథకాల అమలుపై దృష్టి సారించాలి. వీటిపై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ విధానంలో అంశాలు తెలుసుకోవాలి.
* వ్యవసాయ రంగానికి సంబంధించి జాతీయాదాయం వాటా, దానిలో పనిచేసే శ్రామికులు, పంటల ఉత్పత్తులు, అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తుల మొత్తం మొదలైనవి చదవాలి. వ్యవసాయ రంగానికి ఇచ్చే వివిధ విత్తసంస్థల వాటాలు తెలుసుకోవాలి. హరితవిప్లవానికి దారితీసిన ఐఏడీపీ, ఐఏఏపీ వంటివి ప్రారంభించిన సంవత్సరాలు ముఖ్యం. నాబార్డ్‌ ప్రారంభించిన ఆర్‌ఐడీఎఫ్‌ గురించి తెలుసుకోవాలి.
* పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాల్లో తీర్మానాలు, 1948, 56తోపాటు 1991లో ప్రారంభించిన నూతన ఆర్థిక సంస్కరణల అమలు, ప్రస్తుత స్థితి, ఆర్థికవ్యవస్థలో సంస్కరణల ప్రభావాలు తెలుసుకోవాలి. విదేశీ పెట్టుబడుల పరిమితి, కుటీర పరిశ్రమల ప్రాధాన్యం, సమస్యలు, జాతీయాదాయంలో వాటి వాటా, వీటి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చదవాలి. ఐడీబీఐ, ఐఎఫ్‌సీఐ, ఐసీఐసీఐ వంటి పారిశ్రామిక విత్తసంస్థలు స్థాపించిన సంవత్సరాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి.
* ప్రణాళికలు పాఠ్యాంశంలో భాగంగా వాటి లక్ష్యాలు, దేశంలో అమలు అయిన ప్రణాళికల విజయాలు, వైఫల్యాలు, పన్నెండో ప్రణాళిక లక్షిత వృద్ధిరేట్లు ముఖ్యమైనవి.
* భారత్‌లో పేదరికం, నిరుద్యోగాల కారణాలు, ప్రభుత్వ నివారణ చర్యలు, వాటి నిర్మూలనకు ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి.
* ద్రవ్య, మనీ మార్కెట్‌ సంబంధిత అంశాలు ముఖ్యంగా ఆర్‌బీఐ స్థాపించిన, జాతీయం చేసిన సంవత్సరాలు, ద్రవ్య/ పరపతి విధానం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆర్థికవ్యవస్థలో వచ్చే మార్పులు చదవాలి. సెబీ, స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోవాలి.
* వివిధ ఆర్థిక సంబంధ అంశాలపై వేసిన కమిటీలు- వాటి చైర్మన్లు, సిఫార్సులు తెలుసుకోవాలి. ఆర్థిక సంఘం సిఫార్సులు, చైర్మన్లు, వాటికి 6 ప్రాతిపదికాంశాల సూచికలు తెలుసుకోవాలి.
* భారత ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌ను తప్పక చదవాలి. వాటి ఆధారంగా ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలు, స్వదేశీ విదేశీ రుణాలు, వాటి వాటాలు, ప్రత్యక్ష- పరోక్ష పన్నులు తెలుసుకోవాలి. ముఖ్యంగా బడ్జెట్‌లోని వివిధ లోటులు తెలుసుకోవాలి. రెవెన్యూ, కోశ, ద్రవ్య, ప్రాథమిక లోట్లు అంటే ఏమిటి? వాటి వాటా మొత్తం జీడీపీలో ఎలా ఉంది? అనే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* ఆర్థిక సంస్కరణలు, సహజ వనరులకు సంబంధించి నదులు, ఖనిజాలు, లభ్యస్థానాలు, దేశంలో ద్రవ్యోల్బణం స్థితిగతులు, కారణాలు తెలుసుకోవాలి.
* దేశంలో అవస్థాపన సౌకర్యాలైన విద్య, వైద్యం, విద్యుత్‌, రోడ్డు, రైల్వే, సమాచార, సాంకేతిక రంగం మొదలైనవి ప్రధానం.
పేపర్‌-2లో...
పంచాయతీ సెక్రటరీ పేపర్‌-2లో ప్రజారోగ్యం, సమకాలీన సమస్యలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, అకౌంటింగ్‌ మొదలైనవి ఉంటాయి. దీనిలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సమస్యలు ముఖ్యంగా ఏపీని దృష్టిలో పెట్టుకుని అడుగుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ అంశాలు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.
* ఏపీకి సంబంధించి గ్రామీణ ఆర్థికవ్యవస్థ, గ్రామీణ సహజవనరులు, మౌలిక వసతులు, వ్యవసాయరంగం, భూకమతాలు, గ్రామీణ పేదరికానికి సంబంధించినవి శ్రద్ధగా చదవాలి.
* గ్రామీణ రుణభారం కారణాలు, నివారణ చర్యలు, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు కూడా ముఖ్యమే.
* ఆంధ్రప్రదేశ్‌లో సహకారరంగ స్థితిగతులు, వ్యవసాయ పరపతి, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన మొదలైనవి చదవాలి. ముఖ్యంగా ఆప్కాబ్‌, సహకార రంగంలో చక్కెర, చేనేత, పాలు, గృహనిర్మాణాల వివిధ అంశాలు! స్వయం సహాయక బృందాలు- వాటి స్థితిగతులు తెలుసుకోవాలి.
* ఏపీ సమాచార సాంకేతిక రంగంలో ప్రభుత్వం అమలుచేస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఏఎన్‌, ఈ-సేవ, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌, ఏపీ ఆన్‌లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ వంటి అంశాలతోపాటు మీసేవ, జేకేసీల గురించి తెలుసుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న భూసంస్కరణలు, చట్టాలు, కోనేరు రంగారావు కమిటీ, రాష్ట్రంలో వివిధ భూపంపిణీ గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయం స్థితిగతులు, పంటలు, నదులు, నీటిపారుదల సౌకర్యాలతోపాటు జలయజ్ఞం పథకం, ఇతర ప్రాజెక్టులు, వాటికి పెట్టిన ప్రముఖుల పేర్లు తెలుసుకోవాలి.
* ఏపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ప్రధానం. సాధారణ బడ్జెట్‌లో నీటిపారుదల, వ్యవసాయరంగ కేటాయింపులు తెలుసుకోవాలి. భూగర్భజలాలు, రోడ్లు, గనులు ఖనిజాలు లభించే ప్రాంతాలు, అటవీ సంపద, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలుంటాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి.
* రాష్ట్రంలోని విద్యుత్‌ సామర్థ్యం, రేవులు, విమానాశ్రయాలు, పర్యాటక రంగ ప్రాధాన్యం, రాష్ట్రంలో వివిధ సెజ్‌లు ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లు (ఎన్‌ఐఎంజెడ్‌) ఎక్కడెక్కడ మంజూరయ్యాయో గ్రహించాలి.
* ఏపీ జనాభా తాజా గణాంకాలు, అక్షరాస్యత, కార్మికులు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి స్త్రీ- పురుషులు, గ్రామీణ ప్రాంతాల వాటా తెలుసుకోవాలి.
* ఇటీవల బడ్జెట్‌, సర్వేలు, వ్యవసాయ బడ్జెట్‌ క్షుణ్ణంగా చదవాలి. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవచ్చు.
* భారత్‌కు సంబంధించిన గ్రామీణాభివృద్ధి పథకాలైన సీడీపీ, ఎన్‌ఆర్‌ఈపీ, ఆర్‌ఐఈజీపీ, జేఆర్‌వై, ఎస్‌జీఆర్‌వై, ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ వంటి పథకాలు ప్రారంభమైన సంవత్సరాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ తాజా పథకాల్లో బంగారుతల్లి, మన బియ్యం, అమ్మహస్తం, వ్యవసాయ బీమా పథకం, సబ్సిడీ బియ్యం, పావలా వడ్డీ, పెన్షన్లు, ఇందిరమ్మ, ఇందిర జలప్రభ, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌, రాజీవ్‌ యువకిరణాలు, ఆహారభద్రతా మిషన్‌, వాటర్‌ షెడ్‌ ప్రోగ్రామ్స్‌, వైఎస్‌ఆర్‌ అభయహస్తం, జీవనధార వంటి పథకాలు ప్రారంభించిన సంవత్సరాలు, లక్ష్యాలు, లబ్ధిదారుల సంఖ్య మొదలైనవి పట్టిక రూపంలో రాసుకుంటే పునశ్చరణ తేలికవుతుంది. పై అన్ని అంశాలపై 30- 40 ప్రశ్నలు రావడానికి అవకాశముంది.
ఈ విధంగా అన్ని అంశాలూ కవర్‌ చేస్తూ ప్రతిరోజూ పునశ్చరణ, నమూనా ప్రశ్నపత్రాలు సాధించడం ద్వారా మీ సామర్థ్యం, అభ్యసన స్థాయి, సన్నద్ధత మెరుగుపరచుకోవచ్చు. అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే కోరుకున్న ఉద్యోగం మీ సొంతం అవుతుంది!

Back