పంచాయతీ కార్యదర్శి నియామక రాతపరీక్ష పేపర్‌-2లో 'అకౌంటింగ్‌ మౌలిక అంశాలు' అనే అంశాన్ని చేర్చారు. దీన్ని మొదటిసారి నాన్‌ కామర్స్‌ అభ్యర్థులు ఎదుర్కోబోతున్నారు. వారైనా, కామర్స్‌ అభ్యర్థులైనా గుర్తుంచుకోవాల్సింది- తాము కామర్స్‌ అధ్యాపకుల ఉద్యోగానికి కాకుండా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి పోటీపడుతున్నామని!
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ భేదం గ్రహించటం, స్పష్టతతో దాన్ని అమలు చేయటం కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. అందుకే అకౌంటింగ్‌ పరిజ్ఞానంలో మౌలికాంశాలను మాత్రమే చదవాలనేది గుర్తుంచుకోవాలి. సిలబస్‌ కూడా మిగతా అంశాలకంటే తక్కువే.
సిలబస్‌ను పాఠ్యాంశాల వారీగా పరిశీలించి గణక శాస్త్రం (అకౌంటింగ్‌) నిర్వచనాలు, దాని లక్ష్యాలను ముందుగా విపులంగా తెలుసుకోవాలి. గణక శాస్త్రానికీ, వ్యాపార సంస్థలకూ ఉన్న సంబంధాలు, అది సంస్థకు ఏ విధంగా ఉపయోగపడగలదో అనే అంశాలను గ్రహించవలసి ఉంటుంది.
* బుక్‌- కీపింగ్‌ అంటే వ్యాపార వ్యవహారాలను క్రమ పద్ధతిలో నమోదు చేయడం అనే అంశంతో ప్రారంభించి, దానికీ అకౌంటింగ్‌కూ గల సంబంధం తెలుసుకోవాలి. సంస్థ స్థితిగతులను తెలుసుకోవడానికి అకౌంటింగ్‌ పరిజ్ఞానం అవసరం. ఈ అంశం నుంచి అకౌంటింగ్‌ ఏ వ్యక్తులకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి.
* అకౌంటింగ్‌ చక్రం, అందులోని దశలు ప్రధానం.
* అకౌంటింగ్‌ ధ్యేయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే పుస్తకాలను నిర్వహించడం, అకౌంటింగ్‌ ఏ సమాచారాన్ని అందిస్తుందీ.. మొదలైనవి.
* అకౌంటింగ్‌ విధులను, లాభాలను; అదే సందర్భంలో దాని పరిమితులను గ్రహించాలి. ముఖ్యంగా అకౌంటింగ్‌ ఏ అంశాలను పరిశీలించదో తెలుసుకోవాలి. అంటే నిర్వహణ నైపుణ్యం, మానవ వనరులను నమోదు చేయదు అనేవి ఉదాహరణలతో నేర్చుకోవాలి.
* అకౌంటింగ్‌ శాఖలు అంటే ఆర్థిక, కాస్ట్‌, యాజమాన్య అకౌంటింగ్‌ల గురించి క్లుప్తంగా గ్రహిస్తే మేలు.
* ముఖ్యమైన అకౌంటింగ్‌ పదజాలం ముఖ్యం. ఆస్తులు, అప్పులు, మూలధనం, సొంత వాడకాలు మొదలైనవి.
గమనిక: అకౌంటింగ్‌ భావనలను ఉదాహరణలతో తెలుసుకోవడం మంచిది.
* వ్యాపార అస్తిత్వ భావన, వ్యయభావన అనే అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ఉదా: ప్రతి డెబిట్‌కు క్రెడిట్‌ సమానంగా ఉండాలి అనేది ఏ రకపు భావన అని అడగవచ్చు.
* అకౌంటింగ్‌ సంప్రదాయాలు ఏవో తెలుసుకోవాలి.
* వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే విధానాలైన ఒంటి పద్దు, జంట పద్దు విధానాలు- ముఖ్యంగా జంట పద్దు విధానం లక్షణాలు, లాభాలు, దాని పరిమితులు గ్రహించాలి.
* ఖాతాల వర్గీకరణ అంటే- 1. వాస్తవిక ఖాతా 2. నామమాత్రపు ఖాతా 3. వ్యక్తిగత ఖాతాల సూత్రాలను వాటిని ఏవిధంగా అకౌంటింగ్‌ ప్రక్రియలో ఉపయోగిస్తారో ప్రధానాంశం. ఉదా: వ్యక్తిగత ఖాతాలో సహజ, కృత్రిమ, ప్రాతినిధ్య వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
* చిట్టా అంటే ఏమిటో గ్రహించాలి.
* వ్యాపార వ్యవహారాలను ఏవిధంగా నమోదు చేస్తారో, చిట్టాలో రాసే ప్రక్రియలను ఏమని పిలుస్తారో చదవాలి.
* ఆవర్జా అంటే? చిట్టాకూ, ఆవర్జాకూ సంబంధం, చిట్టా నుంచి ఆవర్జాలోకి వ్యవహారాలను ఎలా నమోదు చేస్తారో అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా రుణగ్రస్తుల ఆవర్జా, రుణదాతల ఆవర్జా మొదలైనవి.
* వర్తకపు డిస్కౌంట్‌, నగదు డిస్కౌంట్‌లపై పరిజ్ఞానం పెంచుకోవాలి.
* సహాయక చిట్టా ఎందుకు ఏర్పాటు చేస్తారు? వాటి ముఖ్యోద్దేశం ఏది? ఎన్ని రకాల సహాయక చిట్టాలను తయారుచేస్తారు? ఇవన్నీ ముఖ్యమే.
* అకౌంటింగ్‌లో మరో ప్రధానాంశం నగదు పుస్తకం, దాని రకాలు. అంటే- ఒకటి, రెండు, మూడు వరుసల, చిల్లర నగదు చిట్టా అంశాలను లోతుగా కాకుండా మౌలిక అంశాలను మాత్రమే గ్రహించాలి. ఉదా: ఎదురు పద్దు- దాని వివరాలు, అదే సందర్భంలో బయానా పద్ధతి గురించి కూడా అడగవచ్చు.
* బ్యాంకు ఓవర్‌ డ్రాఫ్టు; నగదు పుస్తకాలను పాస్‌ పుస్తకంతో ఎలా సమన్వయం చేస్తారో అవగాహన అవసరం.
* వ్యాపారేతర సంస్థలు నిర్వహించే వసూళ్లు, చెల్లింపుల ఖాతా ఆదాయ వ్యయాల ఖాతాల గురించి గ్రహిస్తే మంచిది. ఇందులో మౌలిక అంశాలు మాత్రమే ముఖ్యం.
* తరుగుదల- ఏర్పడే విధానం, పద్ధతుల ప్రాథమిక అంశాలను చదవాలి.
* అంకణా- దానిలోని ముఖ్యోద్దేశాలు, పరిమితులు; అంకణాను ఎన్ని పద్ధతుల ద్వారా తయారు చేయవచ్చో అధ్యయనం చేయాలి. అంకణా సరిసమానం కాకపోతే 'అనామతు' ఖాతాను సృష్టించడం మొదలైన అంశాల పట్ల అవగాహన అవసరం. అంకణా వల్ల బహిర్గతమయ్యే తప్పులు, వాటిని ఏవిధంగా సవరిస్తారో చూడాలి.
* ముగింపు లెక్కలైన వర్తకపు ఖాతాలను ఎందుకు తయారు చేస్తారు? అందులో నమోదయ్యే అంశాలేమిటో తెలుసుకోవాలి. ఉత్పత్తి ఖర్చులు, అనుత్పాదక ఖర్చులు ఏవో గ్రహించాలి. స్థూల లాభం, స్థూల నష్టం గురించిన పరిజ్ఞానం అవసరం.
* లాభనష్టాల ఖాతాను ఎందుకు ఏర్పాటు చేస్తారు? వ్యాపారంలో అభివృద్ధి ఖర్చులు ఎందులో నమోదవుతాయి, ఆ ఖర్చులు ఏవో తెలుసుకుంటే మేలు.
* చివరగా ఆస్తి- అప్పులు పట్టికలో ఆస్తుల నమోదును అప్పుల నమోదును ఎలా నమోదు చేస్తారో గ్రహించాలి.
పైన చెప్పిన అకౌంటింగ్‌ భావనలు, వర్గీకరణ తదితర అంశాలను ఒక క్రమపద్ధతిలో చదివి వాటిపై పట్టు సాధించాలి. అయితే మిగతా అంశాలతో పోల్చుకుంటే అకౌంటింగ్‌ సిలబస్‌ తక్కువే అని గుర్తుంచుకోవాలి. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఫలితాలు సాధించటం సులువు.
కామర్స్‌ చదివినవారు కూడా మౌలిక భావనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే అవి ఇబ్బందులు సృష్టించవచ్చు. అభ్యర్థులకు మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలు/ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అకౌంటింగ్‌ (తెలుగు అకాడమీ) పుస్తకాలు ఉపయోగపడవచ్చు.

Back