పంచాయతీ సెక్రటరీ పరీక్ష కోసం పేపర్‌ -I సిలబస్‌ ఏడు అంశాల్లో 'సైన్స్‌, టెక్నాలజీ- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీల్లో వస్తున్న ఆధునిక మార్పులు (అభివృద్ధి)- ఒక అంశం. ఇంతవరకూ ఏపీపీఎస్‌సీ జనరల్‌స్టడీస్‌లో నిత్యజీవితంతో ముడిపడి ఉండే విజ్ఞానశాస్త్ర అంశాలను మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు సైన్సు- సాంకేతికత, ఐటీ అంశాలపై 20 -30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
ఆధునికతను కోరుకొనే అభ్యర్థులు ముఖ్యంగా యువత ఆధునికతకు కారణమైన సాంకేతిక రంగంపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. పంచాయతీ సెక్రటరీ పరీక్షతో ప్రారంభించిన S&T ప్రస్థానాన్ని ముందు ముందు ఏపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
* క్రమానుగత పరిశీలనల ఆధారంగా తేల్చిన నిజాల సమాహారం సైన్సు అయితే దాని ఫలాలను అనువర్తనాల రూపంలో మానవాళికి అందించేది టెక్నాలజీ.
* టెక్నాలజీ మానవుడి జీవన విధానాన్ని మార్చివేయడమే కాక సుఖమయం చేసింది. సైన్స్‌ వూహించని, నమ్మలేని రంగాల్లోకి టెక్నాలజీ చొచ్చుకొనిపోయింది; ఇంకా ముందుకు పోతోంది.
* ప్రాథమిక ప్రకృతి మార్పులూ ధర్మాలను సైన్స్‌ అర్థం చేసుకొని వివరించే ప్రయత్నం చేస్తే, టెక్నాలజీ... విశ్వం అంచుల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
* నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు తదితర అంశాలనే సైన్స్‌ స్పృశిస్తే- టెక్నాలజీ ఇలాంటి ఖగోళ విశేషాలను చేరుకొనటాన్నే సాధ్యం చేసింది.
* జీవి జననం, ఎదుగుదల తదితర అంశాలకే సైన్స్‌ పరిమితం అయితే టెక్నాలజీ... క్లోనింగ్‌ లాంటి ప్రతిసృష్టికి కారణం అయింది.
సిద్ధమయ్యేదెలా?
టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ... రెండింటికీ సైన్స్‌ మాతృక కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టు బిగించటానికి సైన్స్‌లోని వివిధ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు రాకెట్‌ లాంటి అంతరిక్ష రంగ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు పలాయన వేగం, కక్ష్యావేగం, గురుత్వాకర్షణ తదితర శాస్త్ర అంశాలను తెలుసుకొనుండాలి. సైన్సును స్థూలంగా ఫిజికల్‌, బయలాజికల్‌గా విడగొట్టినందువల్ల S&T అంశాలను కూడా ఇదేవిధంగా రెండు అంశాలుగా విడగొట్టవచ్చు. భారతదేశం పేదదేశమే అయినప్పటికీ స్వాతంత్య్రానంతరం చేపట్టిన వివిధ S&T ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
S&T లోని వివిధ అంశాలు, వాటిలోని Sub Topicsని పట్టికలో చూడగలరు.
         
S&T ని సైన్సు, వర్తమాన అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉంది.
సంస్థలు- అవార్డులు- సదస్సులు
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి అంకితమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థల గురించి అవగాహన ఉండాలి. ఆ సంస్థల పూర్తిపేర్లు (అబ్రివేషన్స్‌ వివరణ), కేంద్ర కార్యాలయాలుండే ప్రదేశం, అవి చేస్తున్న కృషిని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఉదాహరణకు ISRO, NASA, DRDO, HAL, CCMB, BARC, IISc, TIFR, CERN మొదలైనవి.
టెక్నాలజీకి ప్రాతిపదిక అయిన సైన్స్‌ పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇచ్చే నోబెల్‌ బహుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో సీఎస్‌ఐఆర్‌ ఇచ్చే శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుల సమాచారం తెలుసుకోవాలి.
సైన్స్‌, టెక్నాలజీ, పర్యావరణంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సదస్సులపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు రియోడీజెనరోలో జరిగిన ధరిత్రీ సదస్సు, ప్రతి సంవత్సరం భారత్‌లో జరిగే ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మొదలైనవి.
ప్రణాళిక ఇలా...
పట్టికలో పేర్కొన్న వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో అంతగా అందుబాటులో లేవనే చెప్పవచ్చు. ఉన్నా ఆంగ్లమాధ్యమంలో సివిల్స్‌ దృష్టితో రాసినవే ఎక్కువ. ఇప్పుడున్న సమయంలో ఎక్కువ లబ్ధిని పొందేందుకు అభ్యర్థులు సైన్స్‌- టెక్నాలజీ (S&T) అంశాలను వర్తమాన అంశాలతో జోడించి చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌లో వచ్చే S&T అంశాల పూర్వాపరాలను పుస్తకాల నుంచి- లేదంటే అంతర్జాలం నుంచి సేకరించి నోట్సు రాసుకోవాలి. ఆర్ట్స్‌ అభ్యర్థులు S&T ని చదవడానికి ముందు 8 నుంచి 10వ తరగతి సైన్స్‌ పుస్తకాలను తిరగేయడం శ్రేయస్కరం.
శాస్త్ర సాంకేతికతలో భారత్‌
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో రాకెట్‌ ప్రయోగాలు, వివిధ ఉపగ్రహాల సమాచారం, స్వదేశీ క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజన్‌తో ఫలప్రదంగా ప్రయోగించిన జీశాట్‌-14, అంగారక ప్రయోగం మంగళ్‌యాన్‌, చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-I లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. శత్రుదేశాలపైకి అణ్వస్త్రాలతో దాడిచేయగల బ్రహ్మోస్‌, అగ్ని, పృథ్వి తదితర క్షిపణులు, అరిహంత్‌ అణు జలాంతర్గామి వంటి రక్షణ అంశాలను, భారత్‌ చేసిన అణుపరీక్షలను, దేశంలో అణుశక్తిని ఉత్పత్తిచేసే రియాక్టర్ల సమాచారాన్ని సేకరించాలి. దేశీయంగా తయారుచేసిన సూపర్‌ కంప్యూటర్లను తెలుసుకోవాలి.
కర్నాల్‌లోని నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్లోనింగ్‌ ద్వారా, ఐవీఎఫ్‌ పద్ధతుల ద్వారా చేసిన గేదె దూడల ఉత్పత్తి, కాశ్మీర్‌లోని యూనివర్సిటీ ఉత్పత్తి చేసిన రెండో జంతువు నూరీ గురించిన సమాచారం గ్రహించాలి. వీటన్నిటితో పాటు భారత్‌లో చేపట్టిన వివిధ పర్యావరణ, వైద్య, ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాలపై దృష్టి సారిస్తే విజయం మీదే!

Back