Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home‘నెట్‌’పై పట్టు సాధించేద్దాం!

అధ్యాపక వృత్తి, పరిశోధన రంగాలపట్ల ఆసక్తితో వాటిలో ప్రవేశించాలనుకొనేవారికి అర్హత నిర్ణయించే ‘జాతీయ అర్హత పరీక్ష’ (National Eligibility Test-NET) నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 2017 నుంచి ఈ పరీక్ష స్వరూపం మారే అవకాశాల దృష్ట్యా ఈసారి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది!
హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌లకు సంబంధించిన 84 సబ్జెక్టుల్లో దేశవ్యాప్తంగా 90 నగరాలలో ‘నెట్‌’ జనవరి 22, 2017న జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోరిక మేరకు తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లో కూడా ఈసారి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యథావిధిగా గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాలు ఈ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొదటిగా అధికారిక వెబ్‌సైట్‌ www.cbsenet.nic.in లో దరఖాస్తును నింపాలి. తర్వాత సూచించిన ఫీజును చెల్లించటానికి క్రెడిట్‌కార్డు/ డెబిట్‌ కార్డు లేదా ఈ-చలానా మార్గాలు ఉపయోగించవచ్చు.
అర్హత: అభ్యర్థి తాను రాయదలచుకున్న సబ్జెక్టులో 55% మార్కులతో (ఓబీసీ/ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్లు్యడీలకు 50% మార్కులు) మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అభ్యర్థించే వారికి 01-01-2017 నాటికి 28 సం॥రాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్లు్యడీ/ మహిళా అభ్యర్థులకు 5 సం॥రాల సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: 17 అక్టోబర్‌ 2016
* దరఖాస్తులు సమర్పించటానికి చివరి తేదీ: 16 నవంబర్‌ 2016
* ఈ-చలానా లేదా క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17 నవంబర్‌ 2016
* పరీక్ష తేదీ: 22 జనవరి 2017

పరీక్ష స్వరూపం: ప్రతి అభ్యర్థినీ మొత్తం మూడు పేపర్లలో పరీక్షిస్తారు. ఈ మూడు పేపర్లలోని ప్రశ్నలు బహుళైచ్ఛిక రూపంలో ఉంటాయి. పేపర్‌-1 (టీచింగ్‌ అండ్‌ రిసర్చ్‌ ఆప్టిట్యూడ్‌) అందరికీ జనరల్‌ పేపర్‌గా ఉంటుంది. పేపర్‌-2, 3లు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఇస్తారు.

సన్నద్ధమయ్యేదెలా?
పేపర్‌1: మొత్తం 100 మార్కులకు (50 ప్రశ్నలు x2 మార్కులు) నిర్వహిస్తారు. అయితే ప్రశ్నపత్రంలో 60 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గుర్తించాలి. ఒకవేళ 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే 1 నుంచి 50 వరకు గల ప్రశ్నలకు మాత్రమే మూల్యాంకనం చేస్తారు. తద్వారా 51 నుంచి 60 వరకు ప్రశ్నలకు అభ్యర్థి సరైన సమాధానాలు గుర్తించినా ఆ మార్కులను విద్యార్థి కోల్పోవాల్సిందే. కాబట్టి కచ్చితంగా తెలిసిన లేదా దాదాపు కచ్చితమైన సమాధానాలుగా భావించిన ఏవేని 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం మేలు. పేపర్‌-1ను మిగతా రెండింటితో సమానమైన శ్రద్ధ పెట్టి చదవాల్సిందే.
పేపర్‌ 2: దీనిలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. మొత్తం 100 మార్కులు (50 ప్రశ్నలు × 2 మార్కులు). సబ్జెక్టుకు సంబంధించిన భావనలు, వాస్తవాలు, భావనల మధ్య అంతస్సంబంధాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ప్రాథమిక భావనలకు సంబంధించిన పరిజ్ఞానం, అవగాహనను పరీక్షించడమే లక్ష్యంగా ప్రశ్నలను తయారు చేస్తారు.
పేపర్‌ 3: దీనిలో కూడా అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతారు. అన్నింటికీ జవాబులు గుర్తించాలి. 150 మార్కులకు (75 ప్రశ్నలు × 2 మార్కులు) నిర్వహిస్తారు.
ప్రశ్నల సరళి: పేపర్‌ 2తో పోలిస్తే పేపర్‌-3లోని ప్రశ్నల కఠినతా స్థాయి పెరుగుతుంది. అభ్యర్థి విశ్లేషణ, సంశ్లేషణ, అనుప్రయుక్త శక్తులను అంచనా వేయడం లక్ష్యంగా ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్టుల్లో లోతైన విశ్లేషణతో రాసిన పుస్తకాలను సేకరించుకొని చదువుకోవాలి.

ఇలా చేస్తే.. ఇట్టే అర్హత
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరికీ కొంత సానుకూలత ఉందని చెప్పవచ్చు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో SET జరిగింది. తెలంగాణా SET నోటిఫికేషన్‌ నవంబర్‌లో ప్రకటిస్తామన్నారు. నెట్‌, సెట్‌ల సిలబస్‌, పరీక్ష విధానం ఒకటే. కాబట్టి ఇప్పటికే పరీక్ష రాసినవారు సెట్‌లో చేసిన తప్పులను సవరించుకోవాలి. తెలంగాణాలో సెట్‌ రాయబోయేవారు రెండు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తమ సన్నద్ధతను రూపొందించుకోవాలి.
1. పరీక్షకు దాదాపు 3 నెలల సమయం ఉంది. అందుకని రోజువారీగా చదవాల్సిన అంశాలతో కూడిన ప్రణాళికను రచించుకొని సన్నద్ధతకు ఉపక్రమించడం మంచిది.
2. మెటీరియల్‌ సేకరణ, ఆంగ్లమాధ్యమ సమస్యలను అధిగమించటంలో ప్రొఫెసర్ల, ఇతర సీనియర్ల సలహాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
3. గతంలోని ప్రశ్నల సరళికీ, ప్రస్తుత ప్రశ్నల సరళికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి పరీక్ష విధానం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంది కదా అని బట్టీ పట్టటమో, బిట్‌బ్యాంకుల సాధన ద్వారానో అర్హత సాధించడం అసంభవం. కొంతకాలంగా ప్రశ్నలు అడిగే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వివిధ భావనల అవగాహనతో పాటు, వాటి అనుప్రయుక్తం, విశ్లేషణతో కూడిన సన్నద్ధత విజయానికి ముఖ్యం.
4. చాలామంది తమ సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టి అందరికీ కామన్‌ అయిన మొదటి పేపర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి కారణం... పేపర్‌-1లో కనీస అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కాని, మారిన విధానం ప్రకారం అభ్యర్థికి అర్హత నిర్ణయించడంలో మూడు పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకని పేపర్‌-2, 3లతో సమానంగా పేపర్‌-1ను చదవాల్సిందే. వేరే మాటల్లో చెప్పాలంటే ఆ రెండు పేపర్లూ అభ్యర్థి సొంత సబ్జెక్టుకు సంబంధించినవి. ఈ పేపర్‌ మాత్రం గతంలో పరిచయం ఉండనిది. అందుకని అవసరమైతే కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిరావొచ్చు.
5. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది కాబట్టి ఆంగ్లమాధ్యమం విషయంలో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మాధ్యమంలోని ప్రామాణిక పుస్తకాల ద్వారా సన్నద్ధత కొనసాగించి కీలక భావనల ఆంగ్ల పదాలను తెలుసుకొని పరీక్షలో అర్హత సాధిస్తున్నవారు చాలామందే ఉంటున్నారు.
6. నిర్దేశిత పుస్తకాలకే పరిమితం కాకుండా... సబ్జెక్టులకు సంబంధించిన వర్తమాన విషయాలు, నూతన పరిణామాలు, ఆవిష్కరణలు తెలుసుకుంటూ చదివితేనే స్కోరింగ్‌ చేయగలమని గుర్తించాలి.
7. పూర్వ ప్రశ్నలను సాధన చేయడం చాలా ముఖ్యం. దాదాపు ప్రతిసారీ 3-5% వరకు పూర్వ ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. అందుకని గతంలో జరిగిన నెట్‌, సెట్‌ ప్రశ్నపత్రాలను సేకరించుకొని సాధన చేస్తే తక్కువ కష్టంతో మార్కులను గుప్పిట్లో పెట్టుకోవచ్చు!

Posted on 17-10-2016