డాక్టర్ కోర్సులకు జాతీయ వేదిక- ఎయిమ్స్

డాక్టర్ కోర్సులో చేరాలనుకునే వారికి రాష్ట్రంలో ఎంసెట్, ఇతర రాష్ట్రాల్లో అక్కడి విద్యా సంస్థలు ప్రవేశ రీక్షల ద్వారా అవకాశం కల్పిస్తుంటే జాతీయ స్థాయిలో ఎయిమ్స్, జిప్‌మర్ వంటి సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఎంబీబీఎస్ కోర్సుల నిర్వహణలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది.
దేశంలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య రంగంలో డిగ్రీ, పీజీ కోర్సులను అందించాలనే లక్ష్యంతో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా 1956లో ఎయిమ్స్‌ను నెలకొల్పారు. తొలిదశలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించి 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. కాలక్రమంలో ఈ సీట్ల సంఖ్య 72కు చేరింది. మెడికల్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా ఆరు పట్టణాల్లో ఎయిమ్స్ నెలకొల్పటానికి సిద్ధమైంది. భోపాల్, పాట్నా, జోధ్‌పూర్, రుషీకేష్, రాయ్‌పూర్, భువనేశ్వర్‌లలో కొత్తగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్ సంస్థలు 2014 ఆగస్టు నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్క దాన్లో 100 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో ప్రవేశానికి ఎయిమ్స్(ఢిల్లీ) మాదిరే ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరీక్ష వివరాలను, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
* సంస్థలు: ఎయిమ్స్ (న్యూఢిల్లీ, భోపాల్, పాట్నా, జోధ్‌పూర్, రాయ్‌పూర్, రుషికేష్, భువనేశ్వర్).
* మొత్తం సీట్లు: ఎయిమ్స్- డిల్లీ- 72.
* మిగిలిన ఆరింటిలో ఒక్కొక్క దాన్లో- 100 : మొత్తం 672.
* రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో 7.5 శాతం ఎస్టీలకు, 15 శాతం ఎస్సీలకు, 27 శాతం ఓబీసీలకు, 3 శాతం వికలాంగులకు కేటాయిస్తారు.
* కోర్సు: - ఎంబీబీఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచ్‌లర్ ఆఫ్ సర్జరీ). కాల పరిధి 5 1/2 సంవత్సరాలు.
ఈ కోర్సులో చేరేందుకు సగటున 60 శాతం మార్కులతో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు ప్రకటనలో పేర్కొన్న తేదీనాటికి 17 సంవత్సరాలు ఉండాలి.
* పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జమ్మూ, జోధ్‌పూర్, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబయి, పాట్నా, రాయ్‌పూర్.
* పరీక్ష విధానం: పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్ స్థాయిలో ప్రశ్నపత్రం రూపొందుతుంది.

సబ్జెక్టులు ప్రశ్నలు మార్కులు
1) ఫిజిక్స్ 60 60 మార్కులు.
2) కెమిస్ట్రీ 60 60 మార్కులు.
3) బయాలజీ (బోటనీ అండ్ జువాలజీ)- 60 60 మార్కులు.
4) జనరల్ నాలెడ్జ్ 20 20 మార్కులు.
మొత్తం : 200 ప్రశ్నలు 200 మార్కులు.

* తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు తీసివేస్తారు.
* కటాఫ్ మార్కులు: జనరల్, ఓపీహెచ్ అభ్యర్థులకు 50 శాతం, ఓబీసీ కేటగిరీలకు 45 శాతం, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు 40 శాతం మార్కులు రావాలి.

జనరల్ నాలెడ్జ్: విభాగానికి సిద్ధం కావడం కొంచెం క్లిష్టం అనిపించినా ప్రశ్నలు ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి ఆందోళన అవసరంలేదు. ఈ విభాగం కింద భారతదేశం విద్యా, వైజ్ఞానిక రంగాల్లో సాధించిన ప్రగతి, భారత రాజ్యాంగం, జాతీయ చిహ్నాలు, క్రీడలు, బిరుదులు, రచయితలు, పరిశోధన సంస్థలు, నదులు, డ్యాములు, ప్రసిద్ధ కట్టడాలు, మొదటి వ్యక్తులు, భారతదేశ చరిత్ర, విశ్వం, భూమి,. ఖండాలిఉ, మహాసముద్రాలు తదితర అంశాలు ఉంటాయి. వీటి గురించి ప్రామాణిక పుస్తకాలను ఒక క్రమపద్ధతిలో చదవాలి. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సంభవించే సంఘటనలపై కూడా ప్రశ్నలు ఇస్తారు కాబట్టి, ఏదో ఒక జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికను చదువుతూ ముఖ్యమైన అంశాలపై నోట్స్ తయారుచేసుకోవాలి. పాత ప్రశ్నపత్నాలు చదువుతూ ఈ విభాగానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.
ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం): విద్యార్థులకు ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) సంబంధించి అన్ని అధ్యాయాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి. లెక్కల రూపంలో ఉండే ప్రశ్నలను కంఠస్థం చేయకుండా అభ్యాసం చేయడం చాలా మంచిది. ఫిజిక్స్‌లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించగలిగితే పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు స్కోర్ చేయవచ్చు.
బయాలజీ : బయాలజీ (బోటనీ, జువాలజీ)లో ఎక్కువ మార్కుల కోసం ఇంటర్ సిలబస్ మొత్తాన్ని పదేపదే రివిజన్ చేయాలి. అధ్యాయాల వారీగా మాదిరి పరీక్షలు పూర్తిచేసుకుని అధిక సంఖ్యలో గ్రాండ్ టెస్టులు చేయాలి. మోడల్ పేపర్లలో చేసిన పొరపాట్ల గురించి లెక్చరర్లతో, స్నేహితులతో చర్చిస్తూ సరైన సమాధానాలను తెలుసుకోవాలి. దీనివల్ల జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒక ప్రశ్నకు నాలుగు ఛాయిస్‌లు ఉంటాయి. ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించడంతో ఆ ప్రశ్న పూర్తికాదు. మిగిలిన మూడు ఛాయిస్‌లు ఎలాంటి ప్రశ్నలకు సమాధానం అవుతాయో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా త్వరగా సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. కఠినమైన పాఠ్యాంశాల విషయంలో అధ్యాపకులు చెప్పే చిట్కాలు పాటించడం మంచిది.
కెమిస్ట్రీ : బైపీసీ విద్యార్థులు బయాలజీ తర్వాత ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగింది కెమిస్ట్రీయే. దీన్లో భౌతిక, కర్బన, అకర్బన రసాయన శాస్త్రాల్లో ఒక్కో విభాగం నుంచి వచ్చే ప్రశ్నలతోపాటు ఇతర విభాగాల్లోంచి ఇచ్చే ప్రశ్నల్లో సిద్ధాంతపరమైనవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి సీబీఎస్ఈ పుస్తకాలు చదవాలి. లెక్కలు ప్రాథమికంగానే ఉంటాయి. దీనికోసం కూడా ఇంటర్ పుస్తకాల్లోని సమస్యలను బాగా సాధన చేయగలగాలి.
గ్రాండ్ టెస్టుల సాధన
పోటీ పరీక్షలో నెగ్గుకు రావాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఇది ఏర్పడాలంటే సబ్జెక్టులను పై అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహన ఏర్పడిందో లేదో గ్రాండ్ టెస్టులను సాధన చేసి తెలుసుకోవచ్చు. అందుకే వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేస్తుండాలి. దీని ద్వారా అభ్యర్థికి తన లోపాలను తెలుసుకునే అవగాహన కలుగుతుంది. తన సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో అర్థమవుతుంది.

చివరగా...
ఎయిమ్స్ ఎంబీబీఎస్ పరీక్ష ఇంటర్ సిలబస్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి ఇంటర్ పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్‌సీఈఆర్‌టీ, పదకొండు, పన్నెండు తరగతుల తరగతుల పుస్తకాలను కూడా చదవాలి. వాటిలో ఉన్న అన్ని ప్రశ్నల జవాబులూ గుర్తించే విధంగా అధ్యయనం చేయాలి.
* ఒక్కొక్క అభ్యాసానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఆధారంగా తీసుకోవడం చేయకూడదు. ఆ విధంగా చేస్తే సమయం వృధా కావడమేకాదు పరీక్షలో నష్టపోయే ప్రమాదమూ ఉంది. వీలైనంతవరకు ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమై దాన్లో ప్రశ్నలను రివిజన్ చేస్తే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.
* వ్యక్తిగత అభ్యాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తే చాలా లాభం ఉంటుంది. ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పర్చుకోవడానికి అధ్యాపకుడి సహాయం తీసుకోవాలిగానీ ప్రశ్నల సాధనలో ఏ విద్యార్థి అయినా తనంతట తానే సాధించే దిశగా కృషి చేయాలి. అప్పుడు సబ్జెక్టుపై అవగాహన పెరిగి పరీక్ష సమయంలో సరైన జవాబులను వేగంగా గుర్తించగల సామర్థ్యం వస్తుంది.

టిప్స్
* పరీక్ష మోడల్ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నల సరళిని గమనించి వాటికి షార్ట్‌కట్ మెథడ్స్‌ను తెలుసుకోవాలి.
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను బాగా అధ్యయనం చేసి ముఖ్యాంశాలపై నోట్స్ తయారుచేసుకోవాలి.
* పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున సమాధానాన్ని ఊహించి రాయడం లాంటివి చేయకూడదు.
* ఫిజిక్స్, మ్యాథ్స్ పేపర్లపై పట్టు సాధించేందుకు ప్రాక్టీస్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి.
* పరీక్షకు మూడు నెలల ముందునుంచి రోజుకు కనీసం 5 గంటలపాటు చదవడం మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి.

రిఫరెన్స్ పుస్తకాలు
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
* ఫిజిక్స్- సీబీఎస్ఈ పీఎంటీ సెట్ (3 వాల్యూమ్‌లు)
* ఏబీసీ కెమిస్ట్రీ.
* అరిహంత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ.
* ట్రూమెన్స్ బయాలజీ.
* బోటనీ (ఏసీ దత్తా- ఆక్స్‌ఫర్డ్ పబ్లికేషన్).
* ఫిజిక్స్ (హెచ్‌సీ వర్మ).