Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అర్హత సాధిస్తే అద్భుత భవిత
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌) ప్రకటన వెలువడింది. దీనిలో అర్హత సాధించినవారు సైన్సు సబ్జెక్టుల్లో బోధన, పరిశోధనలకు అర్హత పొందుతారు. కళాశాలల్లో అధ్యాపకుల నియామకాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ పరీక్షలో అర్హతకు ప్రాధాన్యం పెరిగింది. ఈ పరీక్ష స్వరూపం, ఇతర ముఖ్యాంశాలను పరిశీలిద్దాం!

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ప్రపంచంలోనే పెద్దదైన పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి సంస్థ. భారత్‌లో శాస్త్రీయ, సాంకేతిక మానవశక్తి వనరులను అభివృద్ధి చేస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. భారత్‌ మొత్తంలో దీని పరిధిలో 39 ప్రయోగశాలలూ, 80 ఫీల్డ్‌ స్టేషనూ ఉన్నాయి. దేశంలో బయోటెక్నాలజీ రంగం, ఫార్మాస్యూటికల్‌, ఇతర బేసిక్‌ సైన్స్‌ పురోగతికి ఇది కృషి చేస్తోంది.
జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందిన విద్యార్థులు సీఎస్‌ఐఆర్‌ పరిధిలో ఉన్న ప్రయోగశాలలోకానీ, అధిక ప్రాముఖ్యం కలిగిన విశ్వవిద్యాలయాల్లోగానీ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌ అర్హత పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో గానీ, కళాశాలల్లో గానీ యూజీసీ గుర్తింపు పొందిన అధ్యాపకులుగా బోధించవచ్చు.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ సైన్స్‌ విభాగంలో ఈ కింది సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహిస్తుంది.
1. కెమికల్‌ సైన్సెస్‌
2. ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానిటరీ సైన్సెస్‌
3. లైఫ్‌ సైన్సెస్‌
4. మేథమేటికల్‌ సైన్సెస్‌
5. ఫిజికల్‌ సైన్సెస్‌
ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ పరీక్ష పేపర్‌ను తొలగించారు.
అర్హత: ఎంఎస్‌సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీలో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్‌, ఓబీసీ విద్యార్థులు; 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఎంఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా అర్హులే. జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించడానికి జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌, నాన్‌ క్రీమీలేయర్‌ ఓబీసీ, మహిళలకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. లెక్చరర్‌షిప్‌ (ఎల్‌ఎస్‌)కు గరిష్ఠ వయః పరిమితి లేదు.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌) పరీక్ష దేశవ్యాప్తంగా 26 కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, హైదరాబాద్‌ల్లో నిర్వహిస్తారు.
సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పరిశోధన చేసే అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలు ప్రతి నెలా రూ.25,000 చొప్పున స్త్టెపెండ్‌ ఇస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం రూ.20,000 చొప్పున అభ్యర్థి పరిశోధన చేసే సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి కంటిన్‌జెంట్‌ గ్రాంటు కింద ఇస్తారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.28,000 చొప్పున (ఎస్‌ఆర్‌ఎఫ్‌ కింద) స్త్టెపెండ్‌ ఇస్తారు.
మూడు విభాగాలు
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌)లో అన్ని ప్రశ్నలూ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఈ పరీక్షకు గరిష్ఠంగా 200 మార్కులు, 3 గంటల సమయం కేటాయించారు. ఈ పరీక్షలో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
* పార్ట్‌-ఎ: అందరికీ ఒకేలా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన లాజికల్‌ రీజనింగ్‌, గ్రాఫికల్‌ ఎనాలిసిస్‌, ఎనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, సిరీస్‌ ఫార్మేషన్‌, పజిల్స్‌ మొదలైనవాటికి సంబంధించిన 20 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు కేటాయించారు. మొత్తం 200 మార్కుల్లో పార్ట్‌-ఎ కు 30 మార్కులు కేటాయించారు.
* పార్ట్‌-బి: ఈ విభాగంలో అభ్యర్థుల సంబంధిత సబ్జెక్టులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. 20- 35 ప్రశ్నలు అడగవచ్చు. మొత్తం 200 మార్కుల్లో పార్ట్‌-బికు 70 మార్కులు కేటాయించారు.
* పార్ట్‌-సి: ఈ విభాగంలో అభ్యర్థుల సైంటిఫిక్‌ కాన్సెప్టులో అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో లోతైన ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. మొత్తం 200 మార్కుల్లో పార్ట్‌-సికు 100 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ విభాగపు సిలబస్‌ను స్టాండర్ట్‌ రిఫరెన్స్‌ బుక్స్‌, రిసెర్చ్‌ జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి. కాబట్టి సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గుర్తించాలి.
వివిధ సబ్జెక్టుల్లో అడిగిన ప్రశ్నల సంఖ్య, గుర్తించే సమాధానాల సంఖ్య వేర్వేరుగా ఉండవచ్చు.
ఏ అంశాలు ప్రధానం?
ఎంఎస్‌సీ (బోటనీ), ఎంఎస్‌సీ (జువాలజీ) చేసి లైఫ్‌సైన్స్‌ రాసే విద్యార్థులు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, బయోఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపి)ల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
ఆధునిక బయాలజీలో పీజీ చేసిన విద్యార్థులు తమ ఆప్షనల్‌తోపాటు క్లాసికల్‌ బయాలజీ మీద అధిక దృష్టి కేంద్రీకరించాలి. ఇకాలజీ, ఎవెల్యూషన్‌, బయోడైవర్సిటీ మొదలైనవి ముఖ్యమైనవి.
కెమికల్‌ సైన్స్‌ రాసే విద్యార్థులు ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపి, రియోజంట్స్‌, పేరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలను, ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్‌, థర్మో డైనమిక్స్‌ మొదలైనవి చదవాలి. ఇనార్గానిక్‌లో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బనలోహ సమ్మేళనాలు మొదలైనవి అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
ఫిజికల్‌ సైన్స్‌ రాసే విద్యార్థులు మోడర్న్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ అండ్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌ (క్లాసికల్‌, స్టాటిస్టికల్‌), ఎలక్ట్రో మాగ్నెటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్‌, ఆప్టిక్స్‌, మెకానిక్స్‌ సబ్జెక్టులను విపులంగా అధ్యయనం చేయాలి.
గణితంలో స్టాటిస్టిక్స్‌, ఎక్స్‌పోలేటరీ డేటా ఎనాలిసిస్‌, కాంప్లెక్స్‌, డిఫరెన్షియల్‌ ఎనాలిసిస్‌, మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, వెక్టర్‌, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి.
జూన్‌ 2015 పేపర్‌ వెబ్‌సైట్‌లో ఉంది. మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయాలి.
ఇతర పరీక్షలకూ ఉపయోగం
ఒకవేళ సీఎస్‌ఐఆర్‌లో జేఆర్‌ఎఫ్‌ రాకపోయినప్పటికీ సన్నద్ధత వృథాకాదు. అదే సిలబస్‌, సన్నద్ధత ఆధారంగా ఇతర పోటీపరీక్షలు... ఐఐఎస్‌సీ, ఐఐటీ, టీఐఎఫ్‌ఆర్‌, జేఎన్‌, సీఎస్‌ఐఆర్‌, బార్క్‌, హెచ్‌సీయూ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, ఏపీసెట్‌, జేఎల్‌, డీఎల్‌, పేటెంట్‌ అండ్‌ డిజైన్స్‌ మొదలైన పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. సానుకూల దృక్పథంతో కృషి చేస్తే మంచి ఫలితం తథ్యం.
ముఖ్యమైన తేదీలు
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 24.08.2015
ఆన్‌లైన్‌ దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: 25.08.2015
సింగిల్‌ ఎంసీక్యూ పరీక్ష తేదీ: 20.12.2015
వెబ్‌సైట్‌: www.csirhrdg.res.in
* విషయ విశ్లేషణ అవసరం: వై.మహేశ్, రసాయనశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్సారార్
పరీక్ష విధానంపై అవగాహన అవసరం. నిర్ణీత సిలబస్లో పేర్కొన్న విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.. ప్రశ్నకు సమాధానంగా చూసుకుంటే సరిపోదు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఎమ్మెస్సీ సిలబస్ను తర్కంగా ఆలోచిస్తూ అధ్యయనం చేయాలి. ఇనార్గ్గానిక్, ఫిజికల్ అంశాలపై గట్టి పట్టు వస్తే కచ్చితమైన సమాధానాలు గుర్తిస్తారు. చర్యలు కాకుండా చర్య సంవిధానాలను, చర్య మాధ్యమాలను అవగాహన చేసుకోవాలి. అలాగే సమన్వయ సమ్మేళనాలు, జీవ అణువులు, నామకరణ చర్యలు, ఉష్ణగతిక శాస్త్రం, రసాయన గతిశాస్త్రం వంటి టాపిక్స్పై ప్రత్యేక దృష్టి అవసరమని గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 'సి'కి అధిక ప్రాధాన్యం ఇస్తూ చదవడం అవసరం..
* లోతైన అధ్యయనంతో ముందుకు - పి.రాజు, జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్సారార్
పరిశోధనకు అధిక పరిధి ఉన్న లైఫ్ సైన్స్లో సీఎస్ఐఆర్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ఎమ్మెస్సీ బాటనీ, జువాలజీ, మైక్రోబయోలజీ, బయోటెక్నాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీ, జెనిటిక్స్, మాలిక్యూలర్ బయోలజీ వంటి కోర్సులు చదివినవారంతా అర్హలే.. పరీక్షపై అవగాహన రావాలంటే ముందుగా పూర్వ ప్రశ్నపత్రాలను సాధన చేయడం ముఖ్యమైన పని. సీబీఎస్ఈ ప్లస్2 బయోలజి, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాలు సమగ్రంగా చదవాలి. జన్యుశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, జీవన క్రియలు వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. సూక్ష్మజీవశాస్త్రం, ఆవరణశాస్త్రం, అనువర్తిత జీవశాస్త్రాలన్నింటినీ చదవాల్సిందే. జీవుల వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నల సంఖ్య ఎక్కువే. పార్ట్-సిలో అధిక మార్కులు సాధించాలంటే ప్రామాణిక పుస్తకాల్లోని చాప్టర్ చివర ఉండే కీలకాంశాలను పునశ్చరణ చేసుకోవడం కీలకం.
* ఆసక్తి గల అంశాలే కీలకం - కె.రాజేశ్, ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్సారార్
అభ్యర్థులు మొదటగా డిగ్రీ స్థాయి పాఠ్యాంశాల్లోని విషయాన్ని అవపోసనం పట్టాలి.. ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం.. మ్యాథమెటికల్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, స్టాటికల్ మెకానిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ వంటి టాపిక్స్ నుంచి అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం గుర్తించేలా పట్టు పెంచుకోవాలి. పార్టు-సిలో మంచి మార్కుల సాధనకు ముఖ్యమైన టాపిక్స్ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. మొదట పార్టు బి, సి సమాధానాలు గుర్తించాక 'ఏ' ప్రశ్నలకు వెళ్లడమే శ్రేయస్కరం.. ఫిజికల్ సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మందిలో భయం ఎక్కువ. గత ఫలితాలు చూస్తే 50 శాతం మార్కులు వచ్చినా నెట్ సాధించారని గుర్తుంచుకోండి. ప్రతి విద్యార్థికి కొన్ని ఆసక్తికరమైన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటినే బాగా చదవి అందులో నుంచి వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించేలా సిద్ధం కావాలి. గత ప్రశ్న పత్రాలను సాధన చేయడంతో మరవొద్దు.
* ప్రాథమిక భావనలు ప్రధానం - సర్దార్ ఇంద్రజిత్సింగ్, ఈసీఈ హెచ్వోడీ విట్స్
పరీక్ష ఏదైనా ప్రాథమిక భావనలు, సూత్రాలను మొదటగా చదవాలి. అప్పుడే ఉన్నత స్థాయిలో అడిగే కఠిన ప్రశ్నలను సులభంగా సాధించే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ సంబంధిత సబ్జెక్టులో మొదటగా ఎలక్ట్రానిక్స్ డివైసెస్, సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విశ్లేషణ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అప్లికేషన్, మైక్రోప్రాసెసర్, ఇంటర్ఫేస్ వంటి అంశాలను చదవాలి. అత్యధిక ప్రశ్నలు వీటి నుంచే అడుగుతున్నారని గత ప్రశ్నపత్రాలను గమనిస్తే అర్థమవుతుంది.. డిజిటల్ కమ్యూనికేషన్, అనలాగ్ కమ్యూనికేషన్ కూడా కీలకమే. పరీక్షకు సంబంధించిన అనేక అంశాలు అంతర్జాలంలో లభిస్తున్నాయి. వాటిని చదివి స్వయంగా నోట్సు రాసుకుంటే పరీక్ష సులభమవుతుంది. విషయ పరిజ్ఞానం సొంతం చేసుకోవడం, కష్టపడటం అందరికీ తెలిసిందే. అయితే ఆత్మస్త్థెర్యంతో వెళ్తేనే విజయం.. మైనస్ మార్కులు ఉండటంతో సమాధానం గుర్తించే సమయంలో మిమాంసలో పడొద్దు.
* ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. - బి.ప్రభాకర్, గణితం అసిస్టెంట్ ప్రొఫెసర్, జీడీసీ పెద్దపల్లి
పోటీ పరీక్షలు అనగానే మార్కెట్లో అనేకరకాల పుస్తకాలు లభిస్తాయి. ఏవి పడితే అవి చదివితే ప్రయోజనం శూన్యం.. ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవాలి. అందుకు గతంలో జీఆర్ఎఫ్, నెట్ సాధించిన వారి సలహాలు తీసుకోవడం అవసరం. పలు వెబ్సైటుల్లోనూ సమగ్ర సమాచారం లభిస్తోంది. వాటిలో కొన్నింటిని ఎంచుకొని కావాల్సిన విషయాలను గ్రహించాలి. అవకలన సమీకరణాల్లో.. సాధారణ అవకలన సమీకరణాలతో అవకలన సమీకరణాల యొక్క సాధన వ్యవస్థ అవడానికి, ఏకైకం కావడానికి సంబంధించిన సిద్ధాంతాలు, లిప్షీట్జ్ నియామకానికి సంబంధించిన ప్రశ్నల సాధన చేయాలి. సంకీర్ణ సంఖ్యల విశ్లేషణలో రెసిడ్యూ, పోల్స్, అనాటిక్ ప్రమేయం. రేఖీయ బీజ గణితంలో మాత్రికలు, నిర్ధారకం.. ఐగన్ విలువలు, సదిశలు.. సమూహాల్లో సిలో సిద్ధాంతం, వలయాల్లో క్షేత్రాలు, వాస్తవ సంఖ్యల విశ్లేషణ, సమకలన సమీకరణాలు, ఆపరేషన్ రీసెర్చ్, నంబర్ అనలైజ్ను బాగా చదివి.. ప్రాక్టీస్ చేయాలి.

posted on 04-08-2015