Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అర్హత పొందితే...బంగారు భవిత!
పీజీ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ద్వారా బాట వేసుకోవచ్చు. జూనియర్‌ రిసర్చ్‌ ఫెలోషిప్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలో ఉన్న ప్రయోగశాలలో గానీ, ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లోగానీ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌ అర్హత పొందినవారు విశ్వవిద్యాలయాల్లో/ కళాశాలల్లో యూజీసీ గుర్తింపు పొందిన అధ్యాపకులుగా బోధించవచ్చు.
దేశంలో శాస్త్రీయ, సాంకేతిక మానవవనరులను అభివృద్ధి చేస్తున్న అతిపెద్ద సంస్థ సీఎస్‌ఐఆర్‌. 39 ప్రయోగశాలలూ, 80 ఫీల్డ్‌ స్టేషన్లూ ఉన్నాయి. భారత్‌లో బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌, ఇతర ప్రాథమిక విజ్ఞానశాస్త్ర రంగాలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న సంస్థ ఇది.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఈ కింది సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహిస్తుంది.
* కెమికల్‌ సైన్సెస్‌
* ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌-ప్లానటరీ సైన్సెస్‌
* లైఫ్‌ సైన్సెస్‌
* మేథమేటికల్‌ సైన్సెస్‌
* ఫిజికల్‌ సైన్సెస్‌
గత సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ పరీక్ష పేపరును తొలగించారు.
అర్హత: ఎంపీసీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీలో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్‌, ఓబీసీ విద్యార్థులు; 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ విద్యార్థులు అర్హులు.
* ఎంఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ తుది సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు.
* జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించడానికి జనరల్‌ కేటగిరీవారికి గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌, నాన్‌ క్రిమిలేయర్‌ ఓబీసీ, మహిళలకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
* లెక్చరర్‌షిప్‌కు (ఎల్‌ఎస్‌)కు గరిష్ఠ వయః పరిమితి లేదు.
పరీక్ష విధానం
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌)లో అన్ని ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. మార్కులు గరిష్ఠంగా 200, 3 గంటల సమయం కేటాయించారు. ఈ పరీక్షలో 3 విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
పార్ట్‌-ఎ: అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన లాజికల్‌ రీజనింగ్‌, గ్రాఫికల్‌ అనాలిసిస్‌, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, సిరీస్‌ ఫార్మేషన్‌, పజిల్స్‌ మొదలైన వాటికి సంబంధించిన 20 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. మొత్తం 200 మార్కుల్లో పార్ట్‌-ఎకు 30 మార్కులు కేటాయించారు.
పార్ట్‌-బి: ఈ విభాగంలో అభ్యర్థుల సంబంధిత సబ్జెక్టులో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. 20 నుంచి 35 ప్రశ్నలు అడగవచ్చు. దీనికి 70 మార్కులు కేటాయించారు.
పార్ట్‌-సి: అభ్యర్థుల సైంటిఫిక్‌ కాన్సెప్టుల్లో అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ఉన్నతమైన ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఈ విభాగానికి 100 మార్కులను కేటాయించారు.
ఈ ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ విభాగానికి సంబంధించిన సిలబస్‌నూ, ప్రామాణిక రెఫరెన్స్‌ పుస్తకాలు, రీసర్చ్‌ జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
* రుణాత్మక మార్కులు ఉంటాయి. కాబట్టి, తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గుర్తించాలి.
* వివిధ సబ్జెక్టుల్లో అడిగే ప్రశ్నల సంఖ్య, గుర్తించే సమాధానాల సంఖ్య వేర్వేరుగా ఉండవచ్చు.
ఎలా చదవాలి?
ఎంఎస్‌సీ- బోటనీ, జువాలజీ చేసి లైఫ్‌ సైన్స్‌ రాసే విద్యార్థులు ఆధునిక బయాలజీ (మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, బయోఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపీ)ల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు తమ ఆప్షనల్‌తో పాటు క్లాసికల్‌ బయాలజీ మీద శ్రద్ధ చూపాలి. ఇకాలజీ, ఎవెల్యూషన్‌, బయోడైవర్సిటీ మొదలైనవి చదవాలి.కెమికల్‌ సైన్స్‌ రాసేవారు ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపి, రియోజెంట్స్‌, పేరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలను, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
ఫిజికల్‌ సైన్స్‌ రాసేవారు మోడరన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌- పార్టికల్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌ (క్లాసికల్‌, స్టాటికల్‌), ఎలక్ట్రోమాగ్నటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్‌- ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్‌, ఆప్టిక్స్‌, మెకానిక్స్‌ సబ్జెక్టులను విపులంగా అధ్యయనం చేయాలి.
మేథమేటిక్స్‌లో స్టాటిస్టిక్స్‌, ఎక్స్‌పోలేటరీ డేటా అనాలిసిస్‌, కాంప్లెక్స్‌- డిఫరెన్షియల్‌ అనాలిసిస్‌, మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, వెక్టర్‌, త్రికోణమితి, జామెట్రీలను క్షుణ్ణంగా చదవాలి.
ఇతర పరీక్షలకూ ఉపయోగం
ఒకవేళ సీఎస్‌ఐఆర్‌లో జేఆర్‌ఎఫ్‌ రాకపోయినప్పటికీ సన్నద్ధత వృథా కాదు. అదే సిలబస్‌, సన్నద్ధత ఆధారంగా ఇతర పోటీపరీక్షలు ఐఐఎస్‌సీ, ఐఐటీ, టీఐఎఫ్‌ఆర్‌, జేఎన్‌, సీఎస్‌ఐఆర్‌, బార్క్‌, హెచ్‌సీయూ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, ఏపీసెట్‌, టీఎస్‌సెట్‌, డీఎల్‌, పేటెంట్‌- డిజైన్స్‌ మొదలైన పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.
సానుకూల దృక్పథంతో కృషి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధనచేస్తే మేలు. జూన్‌ 2015, డిసెంబర్‌ 2015, జూన్‌ 2016 పేపర్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ను దేశవ్యాప్తంగా 27 కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, గుంటూరుల్లో నిర్వహిస్తారు.
సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైన పరిశోధన చేసే అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలు ప్రతి నెలా రూ.25,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. ప్రతి సంవత్సరం రూ.20,000 చొప్పున అభ్యర్థి పనిచేసే సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి కాంటిన్‌జెంట్‌ గ్రాంట్‌ కింద ఇస్తారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.28,000 చొప్పున స్టైపెండ్‌ లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు, చలానా ద్వారా ఫీజు డిపాజిట్‌ ప్రారంభం: 16.8.2016
* ఫీజు డిపాజిట్‌ ఆఖరు తేదీ: 8.9.2016
* ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించడానికి గడువు: 9.9.2016
* ఆన్‌లైన్‌ దరఖాస్తు హార్డ్‌కాపీ పంపడానికి గడువు: 16.9.2016
* పరీక్ష తేదీ: 18.12.2016
ఉపయోగపడే పుస్తకాలు
రసాయన శాస్త్రం
* Organic Chemistry: Clayden, Carey Sundberg, William Kemp, Nasi Puri, Carruthers,Smith.
* Physical Chemistry: P.W.Atkins, K.L.Kapoor, Mc.Quarie.
* Inorganic Chemistry: J.D. Lee, Shriver & Atkins, Cotton & Wilkinson.
బయాలజీ
* Biochemistry: Voet & Voet, Albert Lehninger
* Microbiology: Prescott Cellbiology: Alberts, Lodish
* Molecular Biology: Weaver
* Immunology: Kuby
* Genetics: Griffith, Suzuki
* Animal Physiology: Nielsen
* Plant Physiology: Teiz and Zeiger
గణితశాస్త్రం
* Algebra: Bhattacharya, Devid C Lay
* Calculus: M.J.Strauss, H.Anton
* Real Analysis: Shanti Narayan, Richard R Goldberg
* Differential Equations: Sastri SS, Collins P.J.
* Complex Numbers: Murry R Spiegel
* Probability of Statistics: C.E.Weatherban, Das Gupta, Ray & Sharma
భౌతికశాస్త్రం
* Mechanics: D S Mathur, Daniel Waves and Optics: D R Brown, N K Bajaj
* Electricity & Magnetism: D C Tayal, Edward M Purcell
* Kinetic Theory & Thermodynamics: D John, Charles E Hecht
* Modern Physics: D.C. Pandey, B L Theraja
* Solid State Physics: S.P. Singh, D.K. Bhattacharya

posted on 30-08-2015