Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొలువుల తీరానికి పరిశోధనల ఫెలోషిప్‌
 

ఉన్నత విద్యలో భాగంగా పరిశోధనల్లో భాగస్వాములై.. కోరుకున్న కొలువుల తీరానికి చేరుకోడానికి ఫెలోషిప్‌లు చక్కటి మార్గాలు. వీటికి ఎంపికైతే నలుగురితో కలిసి నచ్చిన రంగంలో సేవలు చేసుకుంటూ .. చదువుకుంటూ ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. కాలవ్యవధి పూర్తికాగానే ఉద్యోగ సాధనలో ప్రాధాన్యాన్నీ పొందవచ్చు. ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లకు పలు సంస్థలు ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌
విద్యారంగంలో గణనీయ మార్పులు తీసుకురావడానికి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సేవలందిస్తోంది. బోధనపై మక్కువ ఉన్నవారికి ఏడాది వ్యవధితో ఫెలోషిప్పులు అందిస్తోంది. ఇందుకోసం దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ప్రతినెలా రూ.35,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫెలోషిప్‌ పూర్తయిన తర్వాత ప్రేమ్‌ జీ ఫౌండేషన్‌లో కొనసాగడానికి అవకాశం లభిస్తుంది.
దరఖాస్తులు: జూన్‌, 2020లో స్వీకరిస్తారు.
https://azimpremjifoundation.org

ఇండియా ఫెలో లీడర్‌షిప్‌
భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దడానికి ఇండియా ఫెలో లీడర్‌షిప్‌ ప్రోగ్రాం ఆవిర్భవించింది. వీరు మూలాల నుంచి పనిచేసి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. కొత్త ఆలోచనలతో సంస్థలకు తోడ్పాటు అందిస్తారు. ఇందుకోసం వీరికి శిక్షణ అందించి, మెంటర్లను ఏర్పాటుచేస్తారు. పనిచేస్తూ తెలుసుకునేలా చూస్తారు. ఈ ఫెలోషిప్‌ వ్యవధి 13 నెలలు. దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి, ఏ ప్రాంతం నుంచైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఫెలోషిప్‌ వ్యవధిలో ప్రతి నెలా రూ.16,000 స్టైపెండ్‌ అందుతుంది.
ఎంపిక విధానం: నాలుగంచెల్లో ఉంటుంది. ముందుగా అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అవకాశం దక్కించుకున్నవారు తమకు ఇష్టమున్న అంశంలో వెయ్యి పదాలతో వ్యాసాన్ని రాసి పంపాలి. ఇలా వచ్చిన వ్యాసాల్లో ప్రభావవంతంగా ఉన్నవాటిని ఎంపిక చేసి అసెస్‌మెంట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 21 -27 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 1 నుంచి మొదలవుతాయి
www.indiafellow.org/

గాంధీ ఫెలోషిప్‌
ఇందులో చేరినవారు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. స్కూల్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాం పేరుతో ఫెలోషిప్‌లు అందిస్తున్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, విద్యలో మార్పుల కోసం స్థానిక సిబ్బందితో కలిసి వీరు పనిచేస్తారు. ఇది రెండేళ్ల రెసిడెన్షియల్‌ కోర్సు. ఫెలోషిప్‌ నెలకు రూ.14,000 చెల్లిస్తారు. ఉచితంగా వసతి కల్పిస్తారు. ఫెలోషిప్‌ మొత్తంలో నెలకు రూ.7000 ఖర్చులకు ఇస్తారు. మిగిలినది కోర్సు పూర్తయిన తర్వాత చెల్లిస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 26 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు గడువు: మార్చి 31, 2020
https://gandhifellowship.org/

టీచ్‌ ఫర్‌ ఇండియా
పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారికి నాణ్యమైన విద్య అందించడానికి టీచ్‌ ఫర్‌ ఇండియా కృషి చేస్తోంది. విద్య ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడం ఈ ఫెలోషిప్‌ లక్ష్యం. వ్యవధి రెండేళ్లు. బోధనపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు రెండు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో బోధించాలి. ముంబయి, పుణె, దిల్లీ, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని కొన్ని పాఠశాలల్లో ఈ సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా రూ.20,412, హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. వ్యవధి తర్వాత పలు బహుళజాతి కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్‌లో గంట వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైతే ఫోన్‌ ఇంటర్వ్యూ 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈ దశను దాటిన వారిని అసెస్‌మెంట్‌ సెంటర్‌కు ఆహ్వానిస్తారు. 5 నిమిషాలు బోధించాలి. గ్రూప్‌ డిస్కషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ యాక్టివిటీ నిర్వహిస్తారు. అనంతరం గంటపాటు ముఖాముఖి ఉంటుంది. అన్ని దశల్లోనూ సంతృప్తికరంగా ఉంటే ఫెలోషిప్‌లోకి తీసుకుంటారు.
దరఖాస్తులకు గడువు: డిసెంబరు 15
www.teachforindia.org

యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌లు
వీటిని అశోకా యూనివర్సిటీ అందిస్తోంది. ఈ సంస్థ హరియాణలోని సోనాపేట్‌లో ఉంది. లిబరల్‌ ఆర్ట్స్‌ చదువుల్లో దేశంలో పేరున్న వాటిలో ఇదొకటి. యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌లో చేరినవారు కోర్సు అనంతరం తాము కోరుకున్న విభాగం (డిసిప్లిన్‌) నుంచి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ లిబరల్‌ స్టడీస్‌ డిగ్రీ అందుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. దేశవ్యాప్తంగా 300 మందికి అవకాశం కల్పిస్తారు. సమస్యలను పరిష్కరించి, సమాజంపై ప్రభావం కలిగించడంలో కార్యరూపం దాల్చగలిగే ఆలోచనలను ఆహ్వానిస్తారు. కోర్సు, వసతి నిమిత్తం ఏడాదికి రూ.9.45 లక్షలు చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి పూర్తిగా ఫీజు మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది.

ఎంపిక విధానం: దరఖాస్తుదారుల అకడమిక్‌ నేపథ్యం, ఆలోచనలు, అభిరుచులు గమనిస్తారు. వడపోతలో ఎంపికైనవారికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సాధారణంగా ఇది 20 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో ఎంపికైనవారిని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఇంటర్వ్యూ రోజే కాంప్రహెన్షన్‌ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ముఖాముఖి జరిపి కోర్సులోకి తీసుకుంటారు.
అర్హత: యూజీ లేదా పీజీ పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి విద్యానేపథ్యం కలిగి ఉండాలి. ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం ఉంటుంది. రిటన్‌, వెర్బల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగుండాలి.
వయసు: జులై 15, 2020 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తులకు గడువు: రౌండ్‌ 2 ప్రవేశాలకు ఫిబ్రవరి 2, రౌండ్‌ 3 ప్రవేశాలకు మార్చి 31, 2020
https://ashoka.edu.in/yif

Posted on 26-11-2019