ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

ఆంధ్రప్రదేశ్‌ అటవీ విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ బీఎస్‌ఎస్‌ రెడ్డి తో ముఖాముఖి...

ప్రతిభకే ప్రాధాన్యం
రాష్ట్ర అటవీశాఖలో ఇటీవల ప్రకటించిన 2167 పోస్టుల భర్తీకి ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, ఎలాంటి అవినీతికీ చోటు ఉండదని ఆంధ్రప్రదేశ్‌ అటవీ విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ బీఎస్‌ఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 6 నుంచి రాతపరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి...
ప్రశ్న: అటవీశాఖ నుంచి ఇన్ని పోస్టులు వెలువడటానికి ప్రత్యేక కారణాలున్నాయా?
జవాబు: రాష్ట్ర అటవీశాఖలో సిబ్బంది కొరత బాగా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ కొరత తీవ్రంగా ఉంది. దీంతో విధుల నిర్వహణలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకనే మూడేళ్లుగా సిబ్బంది సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ వచ్చాం. దాన్లో భాగంగానే ఈ ప్రకటన!
ప్రశ్న: ఇంకా నోటిఫికేషన్లకు అవకాశముందా?
జవాబు: ఉన్నాయి. 2015-16 మార్చి నాటికి మరో 1200 పోస్టులను ప్రకటించనున్నాం. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు.
ప్రశ్న: గతంలో పోస్టుల భర్తీని అటవీ శాఖే చేపట్టింది. ఈసారి పరీక్ష ఎవరు నిర్వహిస్తున్నారు?
జవాబు: ఈసారి పరీక్ష పేపర్‌ తయారీ, నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)కు అప్పగించాం. ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.
ప్రశ్న: ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ పోస్టుల రాత పరీక్ష భిన్నంగా ఉంది. సాధారణ విద్యార్థులకు ఇబ్బంది కాదా?
జవాబు: ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అర్హతల్లో పేర్కొన్నవిధంగానే పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నపత్రం ఉంటుంది. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌కు డిగ్రీ అర్హతగా పేర్కొన్నా ప్రశ్నపత్రం టెన్త్‌ పరిధిని మించి ఉండదు. కాబట్టి సాధారణ విద్యార్థి అయినా, ప్రతిభావంతుడైనా సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంచుకుంటే చాలు. ఇతర పోటీ పరీక్షలకైనా గట్టిగా చదవాల్సిందే కదా!
ప్రశ్న: వ్యాసరచనను ప్రత్యేకంగా ఒక పేపర్‌గా పెట్టడంలో ఏమైనా కారణాలున్నాయా?
జవాబు: అభ్యర్థి వృత్తిలోకి ప్రవేశించినప్పుడు కేస్‌ హిస్టరీ రాయాల్సి ఉంటుంది. దీనికి జనరల్‌నాలెడ్జ్‌తో పాటు చుట్టూ జరుగుతున్న సంఘటనలపై అవగాహన ఉండాలి. దీనికోసమే వ్యాసరచన పేపర్‌ను పెట్టాం. ఎఫ్‌ఎస్‌వోలకు 500 పదాల్లోనూ; ఎఫ్‌బీవో/ ఏబీవో/ బంగ్లా వాచర్‌/ ఠాణేదార్‌ పోస్టులకు 250 పదాల్లోనూ వ్యాసం రాయాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ రాసినా ప్రయోజనం ఉండదు.
ప్రశ్న: గణితానికి అంత ప్రాధాన్యం ఎందుకు?
జవాబు: అటవీశాఖలో లెక్కలు వేయడం, వృక్షాల కొలతలు తీసుకోవడం, విస్తీర్ణాన్ని కొలవడం, నివేదికలు సిద్ధం చేయడం తదితరాలు చేయాల్సి ఉంటుంది. సర్వీసును దృష్టిలో పెట్టుకునే గణితానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది.
ప్రశ్న: రాత పరీక్ష, సిలబస్‌, వాకింగ్‌ పరీక్షల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా?
జవాబు: ఏమీ లేవు. వాకింగ్‌ విషయంలో మాత్రం అభ్యర్థులు కొత్త షూస్‌ వాడకూడదు. ప్రస్తుతం వాడుతున్న స్పోర్ట్స్‌ షూ/ కాన్వాస్‌ షూ వేసుకుంటే చాలు. ఏమీ వేసుకోకుండా కూడా పరీక్షకు రాకూడదు. అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశంతో పరుగెత్తడానికి కూడా ప్రయత్నించకూడదు. దీనివల్ల కొంత సమయం గడిచేసరికి అలసి పోతారు. తర్వాత మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అభ్యర్థుల ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేం ఈ పరీక్షను ఉదయం 6 నుంచి 10.30 గంటల మధ్యే నిర్వహిస్తాం. పరీక్ష సమయంలో లెమన్‌ వాటర్‌, గ్లూకోజ్‌ సిద్ధంగానే ఉంటాయి.
ప్రశ్న: నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తిచేస్తారు?
జవాబు: ఈ ఏడాది మే మొదటి వారానికి పరీక్షలన్నీ నిర్వహిస్తాం. మిగిలిన కార్యక్రమాలను మే చివరి నాటికి పూర్తిచేస్తాం. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున జూన్‌లో ఫలితాలు ఇచ్చి జులై చివరి నాటికి అపాయింట్‌మెంట్లు ముగిస్తాం.
ప్రశ్న: ఎంపికైనవారికి శిక్షణ సంగతి..?
జవాబు: అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ (ఏబీవో)కు గతంలో శిక్షణ ఉండేది కాదు. దీనివల్ల విధుల్లోకి చేరిన తర్వాత కొంతమంది మధ్యలోనే వెళ్లిపోయేవారు. దీన్ని నివారించేందుకు వారికీ శిక్షణ ఏర్పాట్లు చేశాం. అటవీశాఖలోకి వచ్చేవారికి ఉద్యోగ వాతావరణం గురించి మొదట ప్రాథమికంగానైనా తెలియాలనే ఉద్దేశంతో 3-4 వారాల శిక్షణ ఇవ్వదలిచాం. విధుల్లోకి చేరిన తర్వాత మొదట ఈ కోర్సుకు పంపుతాం. దీన్ని ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తాం.
ఇప్పటిదాకా ఒకే రాష్ట్రం ఉంది కాబట్టి ఉద్యోగంలోకి చేరినవారికి దూలపల్లి కేంద్రంలో శిక్షణ ఇచ్చేవాళ్లం. ఇకపై రెండు రాష్ట్రాలు కాబట్టి రాజమండ్రి/ తిరుపతిలో మరో అకాడమీకి సన్నాహాలు చేస్తున్నాం. తుది నిర్ణయం రావాల్సి ఉంది.
ప్రశ్న: ఏ పోస్టుకు ఎంపికైతే ఎలాంటి బాధ్యతలు ఉంటాయో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఎందుకని?
జవాబు: అటవీశాఖలో చేరేవారు తమకు కేటాయించిన అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆఫీసర్‌ పోస్టులు అనగానే చాలామంది కార్యాలయంలో కూర్చుని చేసే ఉద్యోగం అనుకుంటున్నారు. అన్ని పరీక్షలూ పూర్తిచేసుకుని విధుల్లోకి చేరాల్సి వచ్చేసరికి బాధ్యతలను తెలుసుకుని వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల వారి సమయమే కాకుండా డబ్బు కూడా వృధా అవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ముందస్తుగానే తెలియజేస్తున్నాం.
ప్రశ్న: అభ్యర్థులకు మీ సలహాలూ, సూచనలూ...
జవాబు: సిలబస్‌, మోడల్‌ పేపర్‌ బాగా గమనించాలి. బాగా సాధన చేయాలి. లేనిపోని అపోహలు, వదంతులు నమ్మవద్దు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుంది తప్ప అవకతవకలకు ఆస్కారం ఉండదు. కృషినే నమ్ముకోవాలి!

back