ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

అటవీశాఖ పరీక్షకు తుది సన్నద్ధత ఎలా?

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 2167 పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలు మే 11 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఇప్పుడున్న కొద్దిపాటి కాలం చాలా విలువైనది. అభ్యర్థులు ఎంత అభ్యసించారనేదానికంటే వాటిని ఎలా వినియోగిస్తున్నారన్నదే కీలకం. తుది సన్నద్ధతలో పునశ్చరణతోపాటు పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!

వందమార్కుల లెక్కలు

రాత పరీక్ష తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కొంతమందిలో భయం ఏర్పడుతుంది. ముందుగా దాన్ని వీడి 'నేను పోటీ పరీక్షను ఎదుర్కొనగలను' అన్నవిధంగా మానసిక సన్నద్ధత పొందాలి. దీని ద్వారా ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది. ఇది ఉద్యోగార్థికి చాలా అవసరం.
అభ్యర్థులు ఈ సమయానికే సిలబస్‌ అధ్యయనం పూర్తిచేసి ఉంటారు. ప్రతి అంశానికీ షార్ట్‌ నోట్సు తయారుచేసుకొని ఉంటారు. ఈనోట్సు పునశ్చరణకు బాగా ఉపకరిస్తుంది.
ఈ కొద్దిపాటి సమయంలో సిలబస్‌ను అంశాలవారీగా పునశ్చరణ చేయాలి. నిర్దిష్ట విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలలో ప్రశ్నలు ఎలా వచ్చాయో విశ్లేషించాలి.
రాత పరీక్షలో 3వ పేపర్‌గా సాధారణ గణితం (General Mathematcis) ఉంది. దీనికి కేటాయించిన మార్కులు 100. 1 మార్కు చొప్పున 10 ప్రశ్నలు, 2 మార్కుల చొప్పున 20 ప్రశ్నలు, 3 మార్కుల చొప్పున 10 ప్రశ్నలు ఉంటాయి. 1 మార్కు ప్రశ్నలు కొంచెం తేలికగా, 3 మార్కుల ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి. కఠినమైన ప్రశ్నలను లోతైన అధ్యయనం, విశ్లేషణ చేస్తే సులువుగా జవాబులు గుర్తించవచ్చు.
గత పరీక్ష పత్రాలనూ, మాదిరి ప్రశ్న పత్రాలనూ సాధన చేయటం చాలా అవసరం. దీని ద్వారా అభ్యర్థికి ప్రశ్నపత్ర సాధనా సామర్థ్యం పెరుగుతుంది. ప్రశ్నపత్రాల సాధన ద్వారా అభ్యర్థులు ఎవరికి వారు తమ లోపాలు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా వాటిని సరిదిద్దుకోవచ్చు.
సమయపాలన
తుది సన్నద్ధతలో ఉన్న కొద్దిపాటి సమయంలో ప్రతిరోజూ చదవగలిగే సమయాన్ని ఎలా విభజించుకోవాలన్నది కొందరి సమస్య. మూడు సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. గణితంలో మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేసేటపుడు సకాలంలో పూర్తి అయ్యేట్లు చూసుకోవాలి. దీనికోసం ముందుగా తేలిక ప్రశ్నలను సాధించి, తర్వాత కఠినమైన ప్రశ్నలను సాధించాలి. గణితంలో వేగం, కచ్చితత్వాలను పొందాలంటే short cuts (సులభ మార్గాలను) అనుసరించాలి. దీనిద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎక్కువగా ప్రశ్నలు సంఖ్యామానం, నిష్పత్తి, శాతాలు, కాలం- పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘ.ప.లపై ఎక్కువగా ఇచ్చినట్టు గ్రహించవచ్చు. వీటిని కీలకమైన భాగాలుగా గుర్తించాలి. వీటిపై గతంలో వచ్చిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. వైశాల్యాలు, ఘనపరిమాణంపై ప్రతి ప్రశ్నపత్రంలో 25%- 30% దాకా ప్రశ్నలు వచ్చాయి. ఈ అంశం ఎంతో కీలకమైనది. పరీక్షలో నెగ్గాలంటే ఈ అంశంలోని ప్రశ్నలను బాగా సాధన చేయాలి.

జీకేకి మెరుగులు

అభ్యర్థులు రోజులో వీలైనంత ఎక్కువ సమయం సన్నద్ధతకు కేటాయించాలి. రోజుకు ఒక మోడల్‌ పేపర్‌ సాధన చెయ్యాలి. అటవీ శాఖ రాతపరీక్షలో పార్ట్‌-II లో జనరల్‌ నాలెడ్జ్‌ ఉంది. అయితే ఇది పూర్తిగా జీకే కాదు. దీనిలో హిస్టరీ, జనరల్‌ సైన్స్‌, జాగ్రఫీ, ఇండియన్‌ పాలిటీ లాంటి విభాగాలున్నాయి. అభ్యర్థులు వీటిని సబ్జెక్టు సంబంధ కోణంలో కాకుండా జీకే కోణంలో చదవాలి. ఈ విభాగాలలో ప్రాథమికాంశాలను ఎక్కువగా పునశ్చరణ చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
మిగిలివున్న ఈ కొద్ది సమయంలో అభ్యర్థులు కింది వాటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
జనరల్‌ సైన్సులో విటమిన్‌లు, వ్యాధులు, రక్తవర్గాలు, రసాయనాలు వాటి సాధారణ నామాలు వంటివి. చరిత్రలో రాజవంశాలు, వారి రాజధానులు, కవులు, రచించిన గ్రంథాలు. జాగ్రఫీలో అటవీ సంపద, నదులు, ఆనకట్టలు, దేశ భౌగోళిక సమాచారం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పాలిటీలో పార్లమెంటు, రాష్ట్రపతి, గవర్నర్‌, ఆర్టికల్స్‌ వంటివి పునశ్చరణ చేయాలి. వీటితోపాటు అన్ని విభాగాల్లోని స్టాక్‌ జి.కె.ని చివరగా ఎక్కువగా చదివితే మంచిది.
వర్తమాన అంశాలూ ముఖ్యమే
జీకేలో భాగంగా వర్తమాన అంశాలను కూడా అడిగే అవకాశం ఎక్కువుంది. కాబట్టి 2013 జనవరి నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఉన్న ముఖ్యమైన కరెంట్‌ ఎఫైర్స్‌ను గమనించాలి. క్రీడలు, అవార్డులు, అంతరిక్ష రంగం, రక్షణ రంగం, జాతీయ అంతర్జాతీయ ప్రముఖ సంఘటనలు వీటిలో ముఖ్యమైనవి. వీటి నుంచి జీకే కోణంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
జనరల్‌ ఎస్సే
ఈ ప్రశ్నలు అభ్యర్థి జ్ఞానాన్నీ, సామర్ధ్యాన్నీ పరీక్షించేలా ఉంటాయి గానీ సబ్జెక్టు సంబంధిత విషయాలను పరీక్షించేలా ఉండవు. గతంలో నిర్వహించిన అటవీశాఖ పరీక్షల్లో 'మీ పాఠశాలలో జరిపే స్వాతంత్య్ర దినోత్సవాల గురించి రాయండి, వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి రాయండి, మన జాతీయ జెండా గురించి రాయండి' అనే ప్రశ్నలను వ్యాసం ఇచ్చారు. ప్రశ్నలు సరళంగా ఉన్నాయని సన్నద్ధతను తేలికగా తీసుకోకూడదు.
వ్యాసం రాసేటప్పుడు ఛాయిస్‌ ప్రశ్నలలో తాను బాగా రాయగలను అనే ప్రశ్నను ఎన్నుకోవాలి. పాయింట్లనూ, సైడ్‌ హెడ్డింగ్‌లనూ ఒకసారి పక్కన చిత్తుగా రాసుకోవచ్చు.
పాటించాల్సిన జాగ్రత్తలు
* ప్రశ్న స్వరూపాన్ని బట్టి జవాబు రాయాలి. ఒక అంశంపై వ్యక్తిగత అభిప్రాయం రాసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ప్రభుత్వాలపై, వ్యక్తులపై, మత సంబంధ అంశాలపై తీవ్ర విమర్శలు చేయకూడదు.
* అభ్యర్థులు తమకు పట్టు ఉన్న భాషలోనే సమాధానం రాయాలి. కొన్ని పదాలు ఆంగ్లంలో, మరికొన్ని తెలుగులో రాయడం చేయకూడదు.
* పరీక్షకు కొద్దిరోజుల ముందు కొత్త అంశాలను చదవడం కంటే అభ్యర్థికి ఇప్పటికే నేర్చుకొని ఉన్న వ్యాసరూప ప్రశ్నలను పునశ్చరణ చేసి అభ్యాసం చెయ్యడం మంచిది.
* కొట్టివేతలు, పదాలను దిద్దడం వంటివి లేకుండా చూసుకోవాలి.
* భాషాపరంగా అర్థంకాని పదాలు, స్థానిక వ్యావహారిక పదాలు రాయకూడదు.
* అంశానికి సంబంధించిన వర్తమాన అంశాలను జోడించి రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది.
* ప్రశ్నకు తగ్గట్టే జవాబు ఉండాలి కానీ తెలిసినదంతా రాయకూడదు.

back